Democracy Undermined: ఇది సరికాదు
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:13 AM
ప్రజాస్వామ్యంలో రాజకీయం పోటాపోటీగా ఉంటుంది. వాగ్యుద్ధాలకు అంతూపొంతూ ఉండదు. అధికార, విపక్షాల మధ్య ఘర్షణ చట్టసభల్లోనూ ఆరుబయటా నిత్యం సాగుతూంటుంది. ఆరోపణలూ ప్రత్యారోపణలు...
ప్రజాస్వామ్యంలో రాజకీయం పోటాపోటీగా ఉంటుంది. వాగ్యుద్ధాలకు అంతూపొంతూ ఉండదు. అధికార, విపక్షాల మధ్య ఘర్షణ చట్టసభల్లోనూ ఆరుబయటా నిత్యం సాగుతూంటుంది. ఆరోపణలూ ప్రత్యారోపణలు, నిందలూ నిష్టూరాలు, అవమానాలూ ఎత్తిపొడుపులూ అబ్బో చాలా ఉంటాయి. తనను ప్రభావితం చేయడానికి నాయకులు మా చెడ్డ ఇదైపోతున్నారని ఓటరుకు కూడా తెలుసు. అయితే, ఇదంతా రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు కారు అన్న స్పృహతో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో సరిహద్దుల్లోపల కొనసాగాల్సిన వ్యవహారం. దేశం ముందు తామూ, తమ పార్టీలు స్వల్పమైనవని, హద్దులు దాటిన ప్రవర్తనతో, చర్యలూ చేష్టలతో దేశం పరువు తీయకూడదని నాయకులు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, విపక్షనేత ఇత్యాదులంతా రాజ్యాంగ వ్యవస్థలో భాగమేనని, దాని ఆశయానికీ, స్ఫూర్తికీ భిన్నంగా వ్యవహరించకూడదని పాలకులకు తెలియదనుకోలేం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చిన విందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీనీ, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున్ ఖర్గేనూ ఆహ్వానించకుండా తగినశాస్తి చేశామని, అవమానించామని అధికారపక్షం కనుక భావించివుంటే, సరికాదు.
పైపెచ్చు, అస్మదీయ శశిథరూర్‌ను పిలిచి, కాంగ్రెస్‌ను మానసికంగా మరింత దెబ్బతీశామని కూడా బీజేపీ నాయకులు అనుకున్నారేమో. విపక్షనేతను ఎందుకు పిలవలేదో, తనను ఎందుకు పిలిచారో తనకు తెలియదని అంటూనే ఈయన ఆ విందుకు హాజరవడం వేరే సంగతి. అందుకు ఆయనకు గల అర్హతల గురించి కూడా ఇక్కడ అప్రస్తుతం. విదేశీ అతిథులతో భేటీలకు విపక్షనేతలకు అవకాశం కల్పించే సంప్రదాయం నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చే ముందువరకూ అమలు జరిగిందని రాహుల్‌గాంధీ ఎంతో ముందుగానే ప్రభుత్వానికి గుర్తుచేశారు. ఆహ్వానం ఉండి కూడా ఇదే రాహుల్‌గాంధీ ఉపరాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారాలకు ఎందుకు రాలేదని అధికారపార్టీ నాయకులు ఏవో ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు కానీ, ఒక దేశాధ్యక్షుడి గౌరవార్థం మన దేశాధ్యక్షులు ఇచ్చిన విందుకు విపక్షనేతలను ఆహ్వానించకపోవడం దుష్టసంప్రదాయం, తీవ్రమైన తప్పిదం. ఇది రాహుల్‌గాంధీకి సంబంధించిన అంశమో, ఆయనకు జరిగిన అవమానమో కాదు. ఈ చర్య ద్వారా ఒక రాజ్యాంగబద్ధపదవిని పాలకులు తేలికపరచారు, అగౌరవించారు. విపక్షనేత వెనుక ఒక పార్టీ ఉంది, ఆయన సారథ్యం వహిస్తున్న అనేక పార్టీల కూటమి ఉంది, వాటన్నింటి వెనుకా కోట్లాదిఓటర్లూ ఉన్నారు.
2014 డిసెంబరులో పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో సోనియాగాంధీతో భేటీకావడం ఆటుంచితే, దీనికిముందు పదేళ్ళ యూపీఏ పాలనలో అమెరికా, చైనా సహా వివిధ దేశాధినేతలు, దౌత్యప్రతినిధులతో అప్పటి విపక్షనేత 162సార్లు భేటీలు జరిపారని రికార్డులు చెబుతున్నాయి. విందు ఆహ్వానాలు లేకపోవడం సరే, కనీసం విదేశీ అతిథులతో మర్యాదపూర్వక భేటీలకు కూడా 2014 తరువాత విదేశాంగశాఖ విపక్షనేతలను అనుమతించడం మానేసింది. దీనిని సమర్థించుకోవడానికి ప్రభుత్వం దగ్గర చాలా కారణాలు ఉంటాయి కూడా. భారతరాష్ట్రపతి ఇచ్చిన విందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం రాహుల్‌గాంధీని ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించలేదన్న విషయం వ్లాదిమిర్ పుతిన్‌కు తెలియకుండా పోదు. భారతదేశంతో సోవియట్ యూనియన్ ప్రాణస్నేహానికి, సర్వరంగాల్లో సహకారానికీ, రక్షణబంధానికీ బలమైన పునాదులు వేసిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల వారసుడిని తనకు కనిపించకుండా చేశారని పుతిన్ అనుకొని ఉండవచ్చు. గతంలో బీజేపీ మూలపురుషులు, పెద్దలు భారత్–సోవియట్ స్నేహాన్ని తప్పుబట్టి, అమెరికాకు సన్నిహితం కానందుకు కాంగ్రెస్‌ను విమర్శించినవారే. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ చేయివదలకుండా రష్యా ఇప్పటికీ తోడుగా అండగా ఉన్నదంటే అది కాంగ్రెస్ వేసిన పునాది బలం. అమెరికా తన నగ్న స్వరూపాన్ని ప్రదర్శించినప్పుడల్లా పరుగునపోయి రష్యా అధినేతను ఆలింగనం చేసుకుంటున్న ప్రస్తుత పాలకులకు ఈ చరిత్ర తెలియదనుకోలేం. మూడోపర్యాయం అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ విదేశీ నేతల పర్యటనల సందర్భంలో కురుచగా వ్యవహరించాల్సిన అవసరం ఏమీ లేదు. వచ్చినవారితో భేటీకి ఇక్కడి పార్టీల పెద్దలకు దారులు తెరిచి ఉన్నతంగా, ఉదాత్తంగా ఉండవచ్చు. ఆపరేషన్ సిందూర్ మీద ప్రపంచదేశాలకు తమవాదన వినిపించడానికి విపక్షాన్ని ఎంచక్కావాడుకున్నవారు, అవసరం తీరాక ఇలా అవమానించడం సరికాదు.
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest AP News And Telugu News