Share News

జర్మనీలో మార్పు

ABN , Publish Date - Feb 26 , 2025 | 06:00 AM

జర్మనీ ఓటర్లు మితవాదులను గెలిపించారు. వలసలు, మందగించిన ఆర్థికాభివృద్ధి, ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రధాన అంశాలుగా ఆదివారంనాడు బండేస్టాగ్‌ (పార్లమెంటు)కు జరిగిన ఎన్నికలలో మితవాద...

జర్మనీలో మార్పు

జర్మనీ ఓటర్లు మితవాదులను గెలిపించారు. వలసలు, మందగించిన ఆర్థికాభివృద్ధి, ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రధాన అంశాలుగా ఆదివారంనాడు బండేస్టాగ్‌ (పార్లమెంటు)కు జరిగిన ఎన్నికలలో మితవాద పక్షాలు అయిన సిడియు–సిఎస్‌యులకు 29 శాతం ఓట్లు రాగా కరడుగట్టిన మితవాద పక్షం ఎఎఫ్‌డి 21 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నది. ఎన్నికలకు ముందు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న ఒలాఫ్‌ షోల్జ్‌ నాయకత్వంలోని సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీకి కేవలం 16 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. క్రిస్టియన్‌ డెమొక్రాటిక్‌ పార్టీ–క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ కూటమి నాయకుడు ఫ్రీడిష్‌ మెర్జ్‌ ఎస్‌డిపి భాగస్వామ్యంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమున్నది. ‘యూరోపియన్‌ దేశాలు అమెరికాపై ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగేలా చేయడమే తన లక్ష్యమని’ ఫలితాలు వెలువడిన అనంతరం మెర్జ్‌ ప్రకటించారు.


నయా నాజీ మూలాలు ఉన్న ఎఎఫ్‌డి, ఉదారవాద పార్టీ గ్రీన్స్‌, బిఎస్‌డబ్ల్యు, వామపక్ష పార్టీ డి లింకె లకు గతంలో కంటే ఓట్ల శాతం పెరుగుదల ప్రధానస్రవంతి క్రిస్టియన్‌, సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీల పట్ల ఓటర్ల అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌లో తమ భవిష్యత్తు విషయమై తూర్పు, పశ్చిమ జర్మనీ ప్రజల మధ్య, పేదలు– సంపన్నుల మధ్య పట్టణ–గ్రామీణ ప్రాంతాల ఓటర్ల దృక్పథాల మధ్య తేడాలు ఎంతగా ఉన్నాయో ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.

సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎఎఫ్‌డి సహకారాన్ని తీసుకోవడానికి మెర్జ్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. ఓట్ల నిష్పత్తి ప్రకారం సిడియు–సిఎస్‌యు–ఎస్డిపిలకు బండేస్టాగ్‌లో 328 సీట్లు మాత్రమే లభిస్తాయి. 630 సీట్లుగల పార్లమెంటులో ఇది స్వల్ప మెజారిటీ మాత్రమే. సంకీర్ణ ప్రభుత్వ పార్టీలు తమ వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసిరావచ్చు. అటువంటి పరిస్థితులనే ఎఎఫ్‌డి ఆశిస్తున్నది. జర్మనీ చరిత్రలోని నాజీ గతాన్ని సమర్థించే ఈ పార్టీని 2013లో సిడియు విధానాలతో విభేదించిన ఆ పార్టీ ప్రముఖులు కొంతమంది ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ పార్టీకి ప్రపంచ కుబేరుడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ సన్నిహితుడు ఎలాన్‌ మస్క్‌ బహిరంగంగా మద్దతునివ్వడం, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ఎలీస్‌ వీడెల్‌తో సమావేశమై మద్దతునివ్వడం ఈ ఎన్నికలలో ఎఎఫ్‌డి ఓట్ల శాతం పెరుగుదలకు దోహదం చేశాయి. ఈ పార్టీకి ప్రధానంగా యువ వోటర్ల మద్దతు లభించడమే పరిశీలకులను కలవరపరుస్తోంది. తదుపరి పార్లమెంటరీ ఎన్నికలలో ఎఎఫ్‌డి ప్రథమ స్థానంలో నిలిస్తే జర్మనీ రాజకీయాలు పెనుమార్పులకు లోనవుతాయి. ‘అవ్యవస్థకు నిగూఢ మార్గాలు జర్మన్లకు సుపరిచితమైనవ’ని తాత్త్వికుడు ఫ్రెడరిఖ్‌ నీషే అన్న మాటను ఎఎఫ్‌డి ఉత్థానం మరోసారి రుజువు చేస్తుందేమో?!


వలసకారులను నిరోధించేందుకు జర్మనీ సరిహద్దులను మూసివేయాలని, యూరోపియన్‌ యూనియన్ నుంచి వైదొలగాలని వాదించే ఎఎఫ్‌డి లాంటి పార్టీ ప్రాబల్యం పెరగడం ఈయూ భవిష్యత్తుకు మేలు చేయదనే ఆందోళన జర్మనీలో బాగా వ్యక్తమవుతున్నది. అయినప్పటికీ పార్లమెంటరీ ఎన్నికలలో ఆ పార్టీ తన ఓట్ల శాతాన్ని అంతకంతకూ పెంచుకోవడం, అమెరికా పాలకులు ఆ పార్టీకి మద్దతునివ్వడం ఈయూకు తీవ్ర సవాళ్లను సృష్టించనున్నది.

‘ఐరోపా హృదయం’గా ఫ్రెంచ్‌వారు సైతం గౌరవించే జర్మనీ వాతావరణ మార్పుపై పోరు, స్వచ్ఛ ఇంధనానికి పరివర్తన వ్యవహారాలలో ప్రపంచ నాయకురాలు. 2030 నాటికి హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని 65 శాతం మేరకు తగ్గించుకోవడంలో గణనీయమైన పురోగతి సాధించిన దేశం జర్మనీ. అయితే ఈ ఆదర్శప్రాయమైన కార్యాచరణ ‘క్లైమేట్‌ ఛాన్సలర్‌గా పేరు పొందిన ఏంజెలా మెర్కెల్‌ హయాం అనంతరం మందగించింది. ఇటీవలి ఎన్నికలలో వాతావరణ మార్పునిరోధం అంశం పెద్దగా ప్రాధాన్యం పొందలేదు. ప్రజల అభిప్రాయాలలో మార్పును గమనించిన రాజకీయ పక్షాలు పర్యావరణ భద్రతను ఉపేక్షిస్తున్నాయి. ఎఎఫ్‌డి అయితే డొనాల్డ్‌ ట్రంప్‌ వలే వాతావరణ మార్పును ఒక మిథ్యగా భావిస్తోంది. అమెరికా మాదిరిగానే జర్మనీ కూడా పారిస్‌ ఒడంబడిక నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తోంది. వాతావరణ మార్పుపై పోరుకు పేద దేశాలకు 100 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయన్ని అందిస్తానన్న జర్మనీ మిగతా యూరోపియన్‌, ఇతర సంపన్న దేశాల వలే ఆ వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చనేలేదు. నిధుల కొరతతో పాటు ప్రజల నుంచి వస్తోన్న వ్యతిరేకత కారణంగానే పర్యావరణ భద్రతను జర్మనీ ఉపేక్షిస్తోంది.


ఇవి కూడా చదవండి...

మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!

ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 06:00 AM