Supreme Court Ruling: తారుమారైన న్యాయం
ABN , Publish Date - Nov 21 , 2025 | 01:11 AM
ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. వనశక్తి తీర్పుతో ప్రభుత్వం కుట్రలను సుప్రీంకోర్టు వమ్ముచేసిందని ఆర్నెల్లక్రితం ఆనందించినవారికి ప్రస్తుత నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. పర్యావరణచట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ...
ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. వనశక్తి తీర్పుతో ప్రభుత్వం కుట్రలను సుప్రీంకోర్టు వమ్ముచేసిందని ఆర్నెల్లక్రితం ఆనందించినవారికి ప్రస్తుత నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. పర్యావరణచట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీతో అనుమతులు ఇచ్చుకొనే విధానం చట్టపరంగా, నైతికంగా సరికాదన్న వనశక్తి తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం ఉపసంహరించుకుంది. అప్పట్లో వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన నిర్థారణలకు పూర్తిభిన్నంగా నేడు సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించడం ఆశ్చర్యం.
మే 16నాటి వనశక్తి తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఒకరైన ఉజ్జల్ భుయాన్‌ను ప్రస్తుత త్రిసభ్యధర్మాసనంలో కొనసాగిస్తూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, మరో న్యాయమూర్తి వినోద్ చంద్రన్‌లు ఈ ఉపసంహరణకు సిద్ధపడ్డారు. అప్పటి తీర్పును సమీక్షించాలనీ, కొట్టిపారేయాలని నలభైకి పైగా దరఖాస్తులు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రజల పేరిట కట్టే భారీ ప్రాజెక్టుల వెనుక ఏయే శక్తులుంటాయో, కనిపించని చేతులు ఎన్నివుంటాయో తెలియనిదేమీ కాదు. నిర్మాణంలో ఉన్న, పూర్తయిన ప్రాజెక్టు్లకు గతంనుంచి పర్యావరణ అనుమతిని వర్తింపచేయడమేమిటో అర్థంకాదు. అటువంటి భావన చట్టవిరుద్ధమన్న అప్పటిమాటకే భుయాన్ ఇప్పుడూ కట్టుబడి, ఉపసంహరణ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించినా, మిగతా ఇద్దరు జడ్జీల సానుకూల ఓటుతో అప్పటి తీర్పు వమ్ము అయిపోయింది. ప్రాజెక్టు కట్టేసి, ఆ తరువాత ‘గ్రీన్’ సిగ్నల్ పొందడంలో కనిపించని కుట్రలు ఎన్నో ఉన్నాయనీ, ఉంటాయనీ కోర్టుకు తెలుసు కనుకనే గతంలో ఆ ప్రక్రియను కాదన్నది. ముందు మీరు చేయదల్చుకున్న చేయండి, ఆ తరువాత అనుమతులు పొందండి అని పరోక్షంగా, నర్మగర్భంగా చెబుతున్న 2017నాటి వివాదాస్పద నోటిఫికేషన్‌ను, 2021నాటి ఆఫీస్ మెమోరాండంను కొట్టివేసింది. ఇవి ఒక అడ్డదారిని అధికారికంగా అనుమతించి, ప్రోత్సహిస్తున్నాయి కనుకనే కోర్టు కొట్టివేసింది. పర్యావరణహానిని నివారించేందుకు, మానవాళిని రక్షించేందుకు ఉద్దేశించిన చట్టాలతో ఇలా ఆడుకోవడం విషాదం.
ఈ పోస్ట్‌ఫ్యాక్టో అనుమతి విధానాన్ని నమ్ముకొని లబ్ధిపొందుతున్న శక్తులన్నీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కడం సహజం. ఆ తీర్పుదెబ్బతో ఎన్నో ప్రాజెక్టులు కూలుతాయని, కష్టపడికట్టినవాటిని చేజేతులా నాశనం చేయడం సరికాదనీ, వేలాదికోట్ల ఆర్థిక నష్టాన్నే కాదు, ఏ పర్యావరణం కోసమైతే బాధపడుతున్నామో అదే పర్యావరణానికి మళ్ళీ కీడు జరుగుతుందని కూడా వీరంతా వాదించడం సహజమే. అయితే, ప్రస్తుత ధర్మాసనం ఈ వింతవాదనలన్నీ పరిగణనలోకి తీసుకుంది. పోస్ట్‌ఫ్యాక్టో అనుమతులను ప్రశ్నించని గత తీర్పులను ఉటంకిస్తూ ఇద్దరు సభ్యుల ధర్మాసనం వీటిని దృష్టిలోపెట్టుకోనందుకు తప్పుబడుతోంది. ఆర్నెల్లనాటి తీర్పు ఉనికిలో ఉన్న పక్షంలో 20వేల కోట్ల ప్రాజెక్టులను కూల్చవలసివస్తుందని తానూ బాధపడుతోంది. ఐదేళ్ళక్రితం సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఒక కేసులో ఈ పోస్ట్‌ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల విధానం సరికాదని అంటూనే, అప్పటికే ఇచ్చిన అనుమతిని రద్దుచేయకుండా జరిమానాతో సరిపెట్టిందని కూడా ప్రస్తుత ధర్మాసనం గుర్తుచేస్తోంది. అసాధారణ సందర్భాల్లో ఈ తరహా అనుమతులు ఇవ్వొచ్చన్న తీర్పులనూ ప్రస్తావించింది. ఆర్నెల్లనాటి వనశక్తి కేసులో సైతం ద్విసభ్యధర్మాసనం భవిష్యత్తు ప్రాజెక్టులకు ఈ విధానాన్ని అమలుచేయవద్దని అన్నది తప్ప, ఇప్పటికే ఈ తరహా అనుమతులు పొందినవాటిని నేలమట్టం చేయాలని ఆదేశించలేదు. కానీ, ఆ ఉత్తర్వులతో, సాంకేతిక కారణాలతో అనుమతులు పొందలేకపోయినవాటిని కాపాడేపేరిట ప్రస్తుత బెంచ్ మొత్తం తీర్పునే ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఇకపై తప్పుడుతోవలో పోవద్దు అని విస్పష్టంగా చెప్పిన గత తీర్పును ప్రస్తుత ధర్మాసనం నిలబెడుతూనే, ఏయే ప్రాజెక్టులకు అసాధారణ సందర్భాలూ, అత్యవసర పరిస్థితులు వర్తిస్తాయో నిగ్గుతేల్చి వాటికే మినహాయింపులు ఇస్తే సరిపోయేది. చట్టవిరుద్ధమనీ, అక్రమమనీ అనుకున్నదానిని జరిమానాలతోనూ, మినహాయింపులతోనూ సక్రమం చేయడం సరికాకపోగా, మరింత అక్రమమే అవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest TG News And Telugu News