RSS Century of Service to Mother Bharat: తల్లి భారతి సేవలో వందేళ్లు
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:57 AM
‘హిందూ సంస్కృతి నశిస్తే హిందూ సమాజమే ఉండదు. కేవలం మట్టి వల్లే ఒక దేశం ఏర్పడదు. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ప్రతి హిందువు కర్తవ్యం’ అంటూ డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ వంద సంవత్సరాల...
‘హిందూ సంస్కృతి నశిస్తే హిందూ సమాజమే ఉండదు. కేవలం మట్టి వల్లే ఒక దేశం ఏర్పడదు. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ప్రతి హిందువు కర్తవ్యం’ అంటూ డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ వంద సంవత్సరాల క్రితం స్థాపించిన ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ నేడు భారతదేశ చరిత్రను పునర్లిఖించే క్రమంలో ఉన్నది. కొద్దిమంది భావసారూప్యతగల యువకులతో 1925 విజయదశమి రోజున నాగపూర్‌లో హెడ్గేవార్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమై కోట్లాది భారతీయుల ఆలోచనలను నేడు ప్రభావితం చేస్తున్నదంటే సామాన్యమైన విషయం కాదు.
ఈ మార్పునకు దోహదం చేసిన హెడ్గేవార్ తెలుగువారు కావడం, ఆయన స్థాపించిన ఆరెస్సెస్ 60 లక్షలమందికి పైగా సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద సంస్థగా రూపొందడం గర్వించదగ్గ విశేషం. ఆరెస్సెస్ ప్రేరణతో శ్యాం ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో 1951 అక్టోబర్ 21న ‘భారతీయ జనసంఘ్’ ఏర్పడడం, అది 1977లో జనతాపార్టీగా, 1980 ఏప్రిల్ 16న ‘భారతీయ జనతా పార్టీ’గా రూపాంతరం చెందడం చారిత్రక పరిణామంలో భాగం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ సారథ్యంలో నేడు భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
‘దేశం కోసం మనం’ ఇది ఆరెస్సెస్ ఆశయం, ‘నమస్తే సదా వత్సలే మాతృభూమే’ ఇది ఆ సంఘ్ ప్రాణగీతం. సంఘ్ కేతనంలోని కాషాయ రంగు భారతీయ సంస్కృతిలోని ‘త్యాగం, శౌర్యం, ఆత్మనిబద్ధత’కు నిదర్శనం. హిందువులంతా కలిసి తల్లి భరతమాతను ఈ ప్రపంచానికే విశ్వగురువుగా నిలబెట్టాలన్నది ఆరెస్సెస్ ఏకైక లక్ష్యం. అందుకోసం ప్రతి భారతీయుడినీ, ముఖ్యంగా యువతను దేశ నిర్మాణంలో పాలు పంచుకునేలా చేయాలన్నదే ధ్యేయం. ఆరెస్సెస్ ఓ మహా వృక్షమైతే ‘స్వదేశీ జాగరణ మంచ్, సేవాభారతి, విద్యాభారతి, ఏబీవీపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, భారతీయ కిసాన్‌సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, న్యాయవాద పరిషత్, వనవాసి కల్యాణ పరిషత్, సంస్కార భారతి’ వంటివి దాని శాఖలు. ఇవేగాక, మనదేశంలోని ముస్లింల కోసం ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్, మహిళల కోసం ‘రాష్ట్ర సేవికా సమితి’ వంటివి సంఘ్‌కు అనుబంధంగా పనిచేస్తున్నాయి.
స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాలుపంచుకోలేదనేది చరిత్ర తెలియని దేశ వ్యతిరేకుల ఆరోపణ. స్వాతంత్ర్యం కోసమే దేశ భక్తులను సంఘ్ తయారు చేసింది. హెడ్గేవార్ 1921, 1931లో జైలు నిర్బంధానికి గురయ్యారు. కలకత్తాలో మెడిసిన్ చదువుతున్నప్పుడు ఆయన ‘అనుశీలన సమితి’ అనే విప్లవ సంస్థలో పాల్గొన్నారు.
వార్ధాలో హెడ్గేవార్‌ను కలుసుకున్న గాంధీజీ సంఘ్ క్రమశిక్షణను ప్రశంసించిన విషయం చరిత్ర పుటల్లో నమోదైంది. ఆరెస్సెస్ సుశిక్షితులైన కార్యకర్తల సంస్థ. ప్రాథమిక, ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్ష పేరుతో సంఘ్ ప్రచారక్‌లకు నాలుగు రకాలుగా శిక్షణ ఇస్తున్నది. వాజపేయి, ఆడ్వాణీ నుంచి నరేంద్రమోదీ వరకూ ఈ శిక్షణ పొందినవారే.
దేశం పెను ప్రమాదాలు, విపత్తులు ఎదుర్కొన్నప్పుడు స్వయం సేవకులు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజలకు సేవలందించారు. పాక్, చైనాలతో భారత్ యుద్ధం చేసిన సమయంలో భారత సైన్యానికి అండగా నిలబడ్డారు. దేశ విభజన, పంజాబ్, బెంగాల్ ప్రాంతాల్లోని హింస, దోపిడీ, అత్యాచారాలను నిలువరించడం, వలస వచ్చిన శరణార్థులకు శిబిరాల ఏర్పాటు, కరువు సమయంలో నిత్యావసర వస్తువులను అందించడం వంటి చర్యల ద్వారా సంఘ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. 1947 అక్టోబర్‌లో జమ్మూ పట్టణ దిగ్బంధాన్ని స్వయం సేవకులు అడ్డుకుని, శ్రీనగర్‌ను కాపాడుకున్నారని ఎంతమందికి తెలుసు? 1977 నాటి దివిసీమ ఉప్పెనకు బలైన 20వేల మంది మృతదేహాలను ఖననం చేయడానికి సైనికులు సైతం వెనుకంజ వేసినప్పుడు.. స్వయం సేవకులే రంగంలోకి దిగి ఆయా మృతదేహాలను, పశువుల కళేబరాలనూ ఖననం చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన లక్షా 30 వేల మందిలో దాదాపు లక్షమంది వరకూ స్వయం సేవకులు ఉన్నారు.
హిందూధర్మం అనంతవాహినిగా ప్రవహించే గంగ లాంటింది. ఆరెస్సెస్ శక్తికి కాలమే సాక్షి, కాలమే పరీక్ష. డాక్టర్ హెడ్గేవార్, గురూజీ మొదలుకొని మోహన్ భగవత్ వరకు ఆరెస్సెస్ ఒక అఖండ ధార, ఒక ప్రవాహం. సంఘ్‌ను అర్థం చేసుకోవడానికి, అనుభూతి చెందడానికి గొప్ప సంస్కారం, పరిణతి కావాలి. ఆరెస్సెస్ ‘శతాబ్ద ప్రస్థానం’ కేవలం ఒక చారిత్రక జ్ఞాపకం కాదు. అది మన కర్తవ్యాన్ని గుర్తుచేసే విశిష్ట చరిత్ర.
సత్యకుమార్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖామాత్యులు
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News