Social Welfare Board: సామాజిక సంక్షేమ బోర్డుకు ప్రాణం
ABN , Publish Date - Dec 12 , 2025 | 02:49 AM
దేశ చిత్రపటాన్ని సంక్షేమ పథకాలు లేకుండా ఊహించలేం. అందులోనూ సామాజిక అంశాలను స్పృశించకుండా ఉండలేం. పరిపాలనలో సామాజిక సంక్షేమం అన్నది చాలా కీలకమైన భాగస్వామ్యం....
దేశ చిత్రపటాన్ని సంక్షేమ పథకాలు లేకుండా ఊహించలేం. అందులోనూ సామాజిక అంశాలను స్పృశించకుండా ఉండలేం. పరిపాలనలో సామాజిక సంక్షేమం అన్నది చాలా కీలకమైన భాగస్వామ్యం. అత్యవసరం కూడా. ఈ ఆవశ్యకతల నేపథ్యంలోనే 1953, ఆగస్టు 12న కేంద్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసింది. తొలుత డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. కేంద్రం బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల పరిధిలోనూ సామాజిక కులాల సంక్షేమం కోసం బోర్డులను ఏర్పాటు చేసి, కేంద్ర రాష్ట్రాల వాటా నిధుల నిష్పత్తి, మార్గదర్శకాలు, పర్యవేక్షణలను రూపొందించారు. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అశేష ప్రజలకు సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ పలువురు బోర్డు చైర్మన్లుగా నియమితులయ్యారు.
మారుతున్న రాజకీయ పరిస్థితులు, కొత్త కొత్త పథకాల ఆవిర్భావంతో సంక్షేమానికి సంబంధించిన సామాజిక మాతృసంస్థ ఉనికి ప్రశ్నగా మిగిలిపోయింది. కేంద్రం నిధుల వాటా క్రమేపీ తగ్గిపోయింది. ఇలాంటి బోర్డు ఒకటి ఉందన్న సంగతి ఆయా సామాజిక కులాలు కూడా మర్చిపోయాయి. కొన్ని రాష్ట్రాలు వారి ఆర్థిక స్థితితో ఆ సామాజిక సంక్షేమ బోర్డును ఉనికిలో ఉంచాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో బోర్డు మనుగడ బాధాకరంగా మారింది. గత ప్రభుత్వం 2021 జూలై 29న వెల్ఫేర్ బోర్డు చైర్మన్‌గా కడపకు చెందిన వ్యక్తిని నియమించింది. 2023 మార్చి 16న కేంద్రం వాటా నిధులు రావటం లేదని బోర్డును నిలుపుదల చేశారు. సంబంధిత ఐదుగురు ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేశారు. మళ్ళీ 2023 జూన్ 27న ఇచ్చిన జీవో ద్వారా బోర్డును ఆగస్టు నాలుగు వరకు కొనసాగించారు. అంటే కేవలం మూడు నెలల వరకే బోర్డు ఉండేలా ఉనికి కల్పించారు. ఇక నవంబర్ 11న బోర్డును పూర్తిగా మూసివేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ రంకెలు వేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సామాజిక సంక్షేమ బోర్డును మరణశయ్యపై పడుకోబెట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 12న సామాజిక బోర్డుకు ప్రాణం పోసేందుకు నడుం కట్టారు. బోర్డు చైర్మన్‌ని నియమించారు. బోర్డును ఉనికిలోకి తెచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. నూతన మార్గదర్శకాలను రూపొందించారు. గతంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలో ఉన్న బోర్డును, సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చారు. ఈ ఏడాది నవంబర్ 25న సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుసంధానం చేస్తూ నూతనంగా సామాజిక సంక్షేమ బోర్డుకు ప్రాణం పోశారు. కొత్త మార్గదర్శకాలతో దిశానిర్దేశం చేసారు. దేవుని గుడి ఉంటే, పూజారి ఉంటాడు. పూజలు, ధూప, దీప నైవేద్యాలు జరుగుతాయి. భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటారు. వారి కోరికలను విన్నవించుకుంటారు. పూజారిని లేకుండా చేసినా, అసలు గుడే లేకపోయినా ఒక్క భక్తుడు అటువైపు రాడు. ఎట్టకేలకు రాష్ట్రంలో బడుగుల ‘సామాజిక న్యాయ’ ఆలయ నిర్మాణం జరగటం సామాజిక సంక్షేమ పిపాసకులకు, అంబేడ్కరిస్టులకు శుభవార్త.
పోతుల బాలకోటయ్య
ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు
ఈ వార్తలు కూడా చదవండి..
సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..
మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు
Read Latest AP News and National News