Language Politics: ప్రాంతాల ఆధిపత్యాలు.. ఆగ్రహాలు!
ABN , Publish Date - Mar 08 , 2025 | 06:55 AM
విద్యావిధానం అమలుకు కేంద్రం చేపడుతున్న చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న విమర్శలు వివాదాస్పద గతాన్ని గుర్తుకు తెస్తున్నాయి.
ఉత్తరాది ఆధిపత్యం... హిందీ సామ్రాజ్యవాదం... ఒకప్పుడు దక్షిణాదిన ప్రముఖంగా వినపడేవి. ఇప్పుడు మళ్లీ ఆ మాటలకూ ఆ భావాలకూ ప్రాచుర్యం వస్తోంది! వచ్చే ఏడాది చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలతో పాటు నూతన విద్యావిధానం అమలుకు కేంద్రం చేపడుతున్న చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న విమర్శలు వివాదాస్పద గతాన్ని గుర్తుకు తెస్తున్నాయి. అందులో మంచీచెడూ ఉండొచ్చు. చూసేచూపును బట్టే అది ఉంటుంది. ఉత్తరాది ఆధిపత్య భావన వెనుక ఎంతో చరిత్ర ఉంది.
రాజ్యాంగ రూపకల్పనప్పుడు జరిగిన చర్చల్లోనే హిందీ అమలుపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. దక్షిణాది నేతల అభిప్రాయాలకు తగిన విలువ ఇవ్వకుండా హిందీని జాతీయభాషగా అమలుచేయటానికి ఉత్తరాది నేతలు గట్టిగానే ప్రయత్నించారు. హిందీని వ్యతిరేకించేవారు జాతీయవాదులే కారనీ ఘాటుగానూ విమర్శించారు. జాతీయ భాషనే ఎంపిక చేసుకోలేకపోతే స్వాతంత్ర్యానికి అర్థం ఏముంటుందన్న ప్రశ్నా తలెత్తింది. దక్షిణాది నాయకులను సమాధానపరచటానికి రాజీసూత్రాన్ని కనుక్కొని 15 ఏళ్లపాటు హిందీ అమలును వాయిదా వేశారు. అప్పటివరకూ కేంద్ర ప్రభుత్వ అధికారభాషగా ఇంగ్లిషు కొనసాగుతుందనీ 1965 జనవరి 26 నుంచి హిందీ జాతీయ భాషగా అమలయ్యేలా రాజ్యాంగ నిబంధనను రూపొందించారు. హిందీ అమలును రాజ్యాంగంలో పొందుపరచటం దక్షిణాది నేతలకు ఇష్టం లేకపోయినా ఉత్తరాది నేతల సంఖ్యాబలం వల్ల ఆమోదించక తప్పలేదు. అందుకే ఆ నిబంధనపై విమర్శలు ఆగలేదు. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా అప్పటికే తీవ్ర ఉద్యమాలు జరిగాయి. 1937 లోనే రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో హిందీ అమలు కోసం ఉత్తర్వులు జారీచేయటం పెను వివాదానికి దారితీసింది.
పెరియార్ రామస్వామి నాయకర్ సారథ్యంలో ఆత్మగౌరవ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతో జస్టిస్‌పార్టీ 1920ల్లోనే అధికారంలోకి వచ్చింది. ఆర్యులు వలసవాదులనీ బ్రాహ్మణులు ఆర్య సంస్కృతికి ఆద్యులనీ ఆ సంస్కృతిలోనే ఇతర కులాల అణచివేత ఉందనీ ద్రావిడులే భారత ప్రాచీన నాగరికతకు అసలు నిర్మాతలనీ ఉత్తరాది నుంచి వారిని తరిమివేశారనీ.. అంటూ పెరియార్ చేసిన వాదనలు చదువరులను బాగా ప్రభావితం చేశాయి. సంస్కృత సాహిత్యాన్నీ పురాణాలనూ ఆయన తీవ్రంగా విమర్శించారు. మతగ్రంథాలను తగలపెట్టించారు. హిందీ సామ్రాజ్యవాదం అనే భావన అప్పుడే ప్రాచుర్యం పొందింది. తమిళం నుంచి సంస్కృత పదాలను తొలగించే ప్రయత్నమూ ప్రారంభమైంది. మరుగునపడిన తమిళ పదాలను మళ్లీ వాడుకలోకి తీసుకువచ్చారు. తమిళ భాషే కొత్తరూపు సంతరించుకుంది. అట్లా ద్రవిడ ఉద్యమంలో హిందీ వ్యతిరేకత, ఉత్తరాది ఆధిపత్యాన్ని నిలువరించే భావనలు ఊపిరిపోసుకున్నాయి. దక్షిణాది ద్రావిడుల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేయాలనే డిమాండును రామస్వామి చేశారు. పాకిస్థాన్ ఏర్పడినట్లే ద్రవిడస్థాన్ ఆవిర్భవించాలనీ కోరారు. ద్రవిడస్థాన్‌కు మద్దతు ఇవ్వాలని జిన్నాకు విజ్ఞప్తి కూడా చేశారు. జిన్నా దాన్ని తిరస్కరించారు. ఆర్యుల దండయాత్రలు, ద్రవిడుల స్థితిగతులు, కులవ్యవస్థ పుట్టుపూర్వోత్తరాల గురించి రామస్వామి నాయకర్‌తో పాటు 19వ శతాబ్దిలో బ్రిటిషు అధికారులు– చరిత్రకారులు–భాషా శాస్త్రవేత్తలు వెల్లడించిన అభిప్రాయాలను ఇప్పటి సామాజిక శాస్త్రాల దృష్టితో అంగీకరించటం కష్టం. అయినప్పటికీ వాటి ఆధారంగా తలెత్తిన రాజకీయ ఉద్యమాలను ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పుకొనే నేతలు మాత్రం పాత భావాలు పరమసత్యాలన్నట్లే వ్యవహరిస్తున్నారు. సిద్ధాంత భూమికలు లోపభూయిష్టమని తెలిసినా రాజకీయ అవసరాలు ఆ పనిని చేయనివ్వవు.
ద్రవిడస్థాన్ డిమాండును పక్కనబెట్టి చూస్తే ఆత్మగౌరవ ఉద్యమం తమిళ సమాజ ముఖచిత్రాన్ని చాలా మార్చివేసింది. మధ్యస్థాయి కులాలకు రాజకీయ ప్రాధాన్యాన్ని కల్పించింది. కింది కులాల్లో రాజకీయ చైతన్యాన్ని తెచ్చింది. పట్టణ పేదల్లో కొత్త ఆశలను చిగురింపచేసింది. తమిళభాష ఆధారంగా ప్రాంతీయ జాతీయవాదాన్ని అభివృద్ధి చేసింది. సంక్షేమ పథకాలను ప్రభుత్వ విధానాల్లో కీలకం చేసింది. విద్యా, ఉద్యోగాల్లో ఏకకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించి రిజర్వేషన్ల కల్పనకు గట్టి భూమికను ఏర్పాటు చేసింది. ద్రవిడ ఉద్యమంపై పరిశోధన చేసిన ‘రాబర్ట్ ఎల్ హార్డ్‌గ్రేవ్’ వీటిపై వివరంగానే రాశారు.
తమిళనాడులో ఒకప్పటి హిందీ వ్యతిరేకత ఇప్పుడెంత ఉందో స్పష్టంగా చెప్పలేం. అక్కడి ప్రైవేటు పాఠశాలల్లో కూడా హిందీ, సంస్కృతాలను తృతీయ భాషలుగా తీసుకోవటం సర్వసాధారణమైంది. ఇతర ద్రవిడ భాషల పట్ల తమిళనాడులో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనటానికి దాఖలాల్లేవు. తెలుగు మాతృభాషగా ఉన్నవారు 2011 జనాభా లెక్కల నాటికి 42,34,302 మంది ఉన్నారు. తెలుగు బోధనను తమిళనాడు ప్రభుత్వం లెక్కచేయటం లేదనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఒక్క తమిళనాడే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రా ల్లోనూ మూడో భాషగా హిందీ, సంస్కృతాలకే ప్రాధాన్యం పెరుగుతోంది. హిందీ రాష్ట్రాల్లోనైతే దక్షిణాది భాషలకు అక్కడి ప్రభుత్వాలు నామమాత్రపు ప్రాధాన్యాన్ని కూడా ఇవ్వలేదు. నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే త్రిభాషా సూత్రం (మాతృభాష–ఇంగ్లిషు–మరో రాష్ట్ర భాష) విఫలమైంది.
విషయగ్రహణ సామర్థ్యం పెంచకుండా మార్పులు చేర్పులతో ఎన్ని త్రిభాషా సూత్రాలు పెట్టినా ఫలితం ఉండదు. త్రిభాషా సూత్రాన్ని పెట్టింది జాతీయ సమైక్యత కోసమే తప్ప గ్రహణ సామర్థ్యాలతో దానికి ఎలాంటి సంబంధం లేదు. నూతన విద్యావిధానంలో హిందీని బలవంతంగా నేర్చుకోవాలనే నిబంధన ఏదీలేదనీ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. హిందీని తప్పనిసరిగా ఒక అంశంగా నేర్పాలని మొదటి ముసాయిదాలో పెట్టి విమర్శలు రావటంతో తర్వాత తొలగించారు.
ఏకభాష ద్వారా రాజకీయ ఐక్యతను, జాతీయభావాన్ని పెంపొందించాలన్న ఆదర్శం స్వాతంత్ర్యోద్యమ కాలంలో బలంగా ఉండేది. ఒకే భాష, ఒకే జాతి అన్నది యూరపు దేశాల్లోని జాతీయవాదానికి ఆధారం. ఏక భాషను అలవర్చి భావసమైక్యతను సాధించటం భారత్‌లో అంత తేలికగా సాధ్యం కాదు. ప్రధాన ప్రాంతీయ భాషలకు సమాన సామర్థ్యముండి, శతాబ్దాల సాహిత్య చరిత్ర కలిగిన పరిస్థితి మనలాగా మరోచోట ఉందని చెప్పలేం! ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా ఒక మతం, ఒక భాష ఆధారంగా ప్రజలందరినీ ఐక్యం చేద్దామని అనుకోవటం అత్యాశే అవుతుంది. ఈ అత్యాశ పెరిగినప్పుడల్లా మన ప్రజాస్వామ్యం గాడి తప్పుతోంది.
నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనపై ఆందోళనలు మొదలైన నేపథ్యంలో ఉత్తరాది ఆధిపత్యం గురించి అంబేడ్కర్ తన చివరిరోజుల్లో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ చాలా ప్రాధాన్యత ఉంది.. భాషాప్రయుక్త రాష్ట్రాలపై కొన్ని ఆలోచనల పేరుతో ఆయన రాసిన చిన్న పుస్తకంలో 1955 నాటికే నెలకొన్న ఆందోళనల గురించి ప్రస్తావించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం(ఎస్‌ఆర్‌సీ)లో సభ్యుడైన కె.ఎం.ఫణిక్కర్ తన అసమ్మతి పత్రంలో ఉత్తరాది ఆధిక్యత దేశ ఐక్యతకు ఎలా భంగకరంగా పరిణమిస్తుందో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలను అంబేడ్కర్ ఉదహరించారు. ఒక రాష్ట్ర జనాభా ఎంత ఉన్నా ఫర్వాలేదనే ధోరణిలో ఎస్‌ఆర్‌సీ సిఫార్సులు ఉన్నాయనీ దీనివల్ల కలిగే విపత్తు గురించి కనీస ఆలోచన చేయలేదనీ అంబేడ్కర్ విమర్శించారు. ఎస్‌ఆర్‌సీ చేసిన ఘోరతప్పిదం అదేనని కూడా వ్యాఖ్యానించారు. ఆ తప్పిదాన్ని సరిదిద్దకపోతే దేశానికి తీవ్రనష్టం వాటిల్లుతుందనీ హెచ్చరించారు. ఉత్తరాదినీ దక్షిణాదినీ సమదృష్టితో చూడకపోవటం దేశ ఐక్యతకు గొడ్డలిపెట్టుగా మారుతుందని కూడా చెప్పారు. ఒకే భాష ఉన్నప్పటికీ పెద్ద రాష్ట్రాలను విభజించాలనీ సూచించారు. సాధ్యమైనంతవరకూ జనాభాపరంగా రాష్ట్రాలు ఒక స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోకపోతే వచ్చే అనర్థాలు చాలానే ఉంటాయనీ హెచ్చరించారు. ఎస్‌ఆర్‌సీ సిఫార్సులతో రాష్ట్రాల మధ్య వ్యత్యాసమే కాదు.. ఉత్తరాది–దక్షిణాది అనే భేదభావం ఏర్పడిందనీ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఎగువ, దిగువ సభలకు సమాన అధికారాలు ఉన్నాయనీ, ఆర్థిక బిల్లులకు ఎగువసభ అయిన సెనేట్ ఆమోదం తప్పనిసరి అనీ అట్లా రాష్ట్రాల మధ్య సమతూకం ఏర్పడటం వల్లే అక్కడ నిజమైన సమాఖ్య వ్యవస్థ ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.
హిందీని జాతీయభాషగా ఆమోదించటానికి ఉద్దేశించిన రాజ్యాంగ ముసాయిదాలోని 115 అధికరణ వివాదస్పదమైనంతగా మరేదీ కాలేదనీ సుదీర్ఘ చర్చల తర్వాత ఆ సమస్యపై ఓటింగు పెట్టినప్పుడు 78 ఓట్లు అనుకూలంగా వస్తే ప్రతికూలంగానూ అన్ని ఓట్లే వచ్చాయని అంబేడ్కర్ గుర్తుచేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఒక ఓటు ఆధిక్యతతో హిందీ (అనుకూల ఓట్లు 78, వ్యతిరేక ఓట్లు 77) జాతీయభాషా స్థానాన్ని గెలుచుకుందనీ ప్రస్తావించారు.విచిత్రం ఏమిటంటే అంబేడ్కర్ కూడా హిందీని జాతీయభాషగా సమర్థించారు. దానితో ఏకీభవించనివారు అప్పుడూ ఇప్పుడూ ఉన్నారు. రాజాజీ అయితే దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది అనే రెండు ఫెడరేషన్లుగా ఏర్పాటుచేసి, ఆ రెండు కలిసి ఒక కాన్‌ఫెడరేషన్‌గా మారాలనీ సూచించారు. ఆ కాన్‌ఫెడరేషన్‌కు కూడా మూడు అంశాలపై మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉండాలనీ ఉత్తర, దక్షిణాది సమాఖ్యలకు సమాన ఓటింగ్ హక్కులు ఉండాలనీ ప్రతిపాదించారు.
70–75 ఏళ్లనాడు రాజాజీ, అంబేడ్కర్ వ్యక్తంచేసిన అభిప్రాయాలు ఇప్పుడు విచిత్రంగా అనిపించొచ్చు. 1971 నాటి జనాభాలెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరపాలన్న స్టాలిన్ డిమాండ్‌కు ఆమోదం లభించినా, మొత్తంగా పునర్విభజన ప్రక్రియనే కేంద్రం వాయిదా వేసినా పరిస్థితిలో పెద్దమార్పు రాదు. సీట్లపరంగా ఇప్పటికే ఉన్న అసమానత్వం అలాగే కొనసాగుతుంది. ఇక జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాల ఏర్పాటును ఎల్లకాలం వాయిదా వేయలేరు. ఒక ఓటుకు ఒకే విలువ ఎల్లకాలం కాదనలేరు. పార్లమెంటు ఉభయ సభలకు సమానాధికారాలు కల్పించి, ఎగువసభలో ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వటం ద్వారా జటిలమైన ఈ సమస్యకు అంబేడ్కర్ సూచించినట్లుగా పరిష్కారం దొరకొచ్చు. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగసవరణలు తీసుకురావటానికి చూపించే ఉత్సాహం రాష్ట్రాలకు సమానహక్కులు కల్పించటంలోనూ ప్రదర్శించటమే ప్రాప్తకాలజ్ఞత కావొచ్చు! రాష్ట్రాల మధ్య సమానత్వం నెలకొంటే ప్రాంతీయవాదాలు బలహీనం అవుతాయి. నిజమైన జాతీయవాదం బలోపేతమూ అవుతుంది.
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)