పీఎం కిసాన్ మార్గదర్శకాలు సవరించాలి
ABN , Publish Date - Jun 19 , 2025 | 04:19 AM
దేశంలోని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం ప్రారంభంలో ఎంతో ఆశాజనకంగా కనిపించింది. అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏటా...
దేశంలోని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం ప్రారంభంలో ఎంతో ఆశాజనకంగా కనిపించింది. అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏటా రూ. 6,000 నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే విధంగా రూపొందిన ఈ పథకం, రైతులకు సీజనల్ ఖర్చులకు కొంత ఉపశమనం కలిగించేది.
ఈ పథకం తొలి నిబంధనల ప్రకారం, 2019 ఫిబ్రవరి 1 నాటికి ఎవరి పేరున భూమి ఉందో వారే ఈ పథకానికి అర్హులు. అయితే, తర్వాత భూమిని కొనుగోలు చేసినవారు, గిఫ్ట్ డీడ్, పార్టీషన్ లేదా వారసత్వంగా భూమి పొందిన రైతులు పథకానికి అనర్హులుగా ప్రకటించారు. ఈ మార్గదర్శకాలు 2020 మార్చి 29న కేంద్రం జారీ చేసి, ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది. దీంతో వేలాది చిన్న, సన్నకారు రైతులకు న్యాయం జరగడం లేదు.
ఈ ‘కట్–ఆఫ్’ నిబంధన వాస్తవిక పరిస్థితులకు పూర్తిగా విరుద్ధం. భూమి కొనడం, అమ్మడం, పంచుకోవడం ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. 2019 తర్వాత భూమిని సొంతం చేసుకున్న రైతు కూడా అదే విధంగా సాగు చేస్తుంటే, అలాంటి వారికి పథకం అమలు చేయకపోవడం అన్యాయం కాదా? ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునః సమీక్షించి, మార్గదర్శకాలను రైతు ప్రయోజనాలకు అనుగుణంగా సవరించాలి. ప్రస్తుతం ఎవరి పేరు మీద భూమి ఉంది, ఎవరు సాగు చేస్తున్నారు అనే అంశాల ఆధారంగా ఎప్పటికప్పుడు అర్హతలను నిర్ధారించాలి. ఇది కేవలం నిబంధనల సమస్య కాదు, రైతుల జీవితాలపై నేరుగా ప్రభావం చూపే మానవీయ సమస్య.
ఇదే తరుణంలో ఈ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయం మొత్తాన్ని పెంచడం అవసరం. ఈ పథకం ప్రారంభమైనప్పుడు, ఏడాదికి రూ.6,000 ఇవ్వడం రైతులకు కొంత ఉపశమనం కలిగించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎరువుల ధరలు, విత్తనాలు, కూలీల ఖర్చు పెరిగింది. పైగా వాతావరణ మార్పులతో పంటలకు నష్టాలు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి సమయంలో ఒక రైతు కుటుంబానికి ఏడాదికి కేవలం రూ.6,000 ఇవ్వడం ద్వారా ఎలాంటి ఉపశమనం కలుగుతుంది? నెలకు 500 రూపాయలు మాత్రమే వస్తున్నాయంటే, అది సాగు అవసరాలే కాదు, నిత్యవసరాల కోసం కూడా సరిపోదు. కనీసం ఈ పథకం ద్వారా అందే మొత్తాన్ని రూ.10,000కి పెంచేలా కేంద్రం పునరాలోచించాలి. దానిని మూడు విడతల్లో రూ.3,333 చొప్పున ఇవ్వడం ద్వారా రైతుకు కొంత భద్రత కలిగించవచ్చు.
ఈ మొత్తాన్ని పెంచడం వల్ల ప్రభుత్వంపై కొంత భారం పడవచ్చు. కానీ దీన్ని వ్యయంగా కాక, పెట్టుబడిగా చూడాలి. రైతు చేతిలో డబ్బు ఉంటేనే అతడు ఖర్చు చేస్తాడు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కదులుతుంది. కూలీలకు, వ్యవసాయ ఉపకరణాల విక్రేతలకు, చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూర్చుతుంది. అంటే ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థకే లాభదాయకంగా మారుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా ఇందులో ముఖ్యమైనది. రాష్ట్ర రెవెన్యూ శాఖ, భూ నమోదిత శాఖ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయంతో రైతుల వివరాలు, సాగు స్థితి వంటి సమాచారం కేంద్రానికి అందేలా వ్యవస్థను రూపొందించాలి. అలాగే గ్రామీణ స్థాయిలో పథకం వివరాలపై అవగాహన కల్పించి, అర్హత కలిగిన ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా చూడాలి. ఈ విషయాలన్నింటిపై కేంద్రం తక్షణ నిర్ణయం తీసుకుని పీఎం కిసాన్ పథకం రూపురేఖలు మార్చాలి. లక్షలాది రైతులను నిబంధనల పేరుతో పక్కన పెట్టకుండా, వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని పెంచి అందించాలి.
అప్పన్న గొనప, విశాఖపట్నం
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News