Share News

Legacy of Shivarama Reddy: మా అనంతపురం సోక్రటీసు

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:56 AM

‘అడవిలో ఒక పేరు లేని పూవు అయి రాలిపోతాను’ అని శ్రీశ్రీ గారి ఖడ్గసృష్టిలో చదివిన గుర్తు. మంచిరెడ్డి శివరామ్ రెడ్డి అస్తమించిన వార్త వినినప్పుడు నాకు ఈ కవితావాక్యమే గుర్తుకువచ్చింది. అతడు ప్రముఖ విద్యావేత్త. సామాజిక తత్వవేత్త...

Legacy of Shivarama Reddy: మా అనంతపురం సోక్రటీసు

‘అడవిలో ఒక పేరు లేని పూవు అయి రాలిపోతాను’ అని శ్రీశ్రీ గారి ఖడ్గసృష్టిలో చదివిన గుర్తు. మంచిరెడ్డి శివరామ్ రెడ్డి అస్తమించిన వార్త వినినప్పుడు నాకు ఈ కవితావాక్యమే గుర్తుకువచ్చింది. అతడు ప్రముఖ విద్యావేత్త. సామాజిక తత్వవేత్త. STEP ఉద్యమ నిర్మాత. యాభై ఏండ్ల క్రితం ఒకటి రెండు తరాలకు తప్ప అతడు ఎవరికీ తెలియదు. కానీ అనంతపురం జిల్లా గ్రంథాలయానికి తెలుసు. ఆ గ్రంథాలయం ఆవరణలోని వేపచెట్టుకు తెలుసు. శిరీష వృక్షానికి తెలుసు. లలితకళాపరిషత్‌కు తెలుసు. క్లాక్ టవర్‌కు తెలుసు. అనంతపురం భౌతిక వాతావరణం నిండా సూదీదారంలా అల్లుకుపోయినవాడు. చెప్పులు లేని పాదాలతో, మాసిన గడ్డంతో, అడ్డపంచ పైన పొడుగాటి ముతక లాల్చీతో గబగబా నడుస్తూ తారసపడేవాడు. మిత్రుల భుజాలమీద ఆప్యాయంగా చేయి వేసేవాడు. లేదా వారి రెండు చేతులూ దోసిట్లోకి తీసుకుని, సంతోషంతో ఒత్తుతూ వుండేవాడు. సోక్రటీసు; సంతలో తాత్విక చర్చలు జరిపినట్లు ఏదో ఒక కాకా హోటల్లో కూర్చుని, మిత్రులతో సంభాషించేవాడు. జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి వంటి వారు చర్చకు వచ్చేవారు. ఉన్నట్లుండీ ‘‘వేర్ రిలెటివిటీ స్టాప్స్, దేర్ అద్వైత బిగిన్స్’’ వంటి మాటలు దొరలి, వాతావరణాన్ని ఉత్తేజపరిచేవి. మిత్రులు ఎవరు ఏ పుస్తకాలు కొత్తగా చదివినారో విచారించేవాడు. కొత్తగా ఏ కవిత్వం, ఏ కథ రాసినారో తెలుసుకుని, వినిపించమని కోరేవాడు. ‘‘కాసరమా వికారముల్ రాల్చకు’’ అంటూ వెర్రి కాదిది, సర్రియలిజం సోదరా.. అని బోధించేవాడు. స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్‌నెస్ పలవరించేవాడు. స్నేహితుడు దక్షిణామూర్తిది వెన్నెల క్లినిక్ వుండేది. ఒకరోజు రాత్రి క్లినిక్‌లో కూర్చోబెట్టి పేపరు, పెన్ను చేతికి ఇచ్చి, ‘‘బుర్రలోకి వచ్చిన ఆలోచనలన్నీ రాయి!’’ అన్నాడు. పది నిమిషాల తర్వాత నా ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసినాడు.


రాసినది ఎట్లుందోయేమోకానీ, ఏదో థెరపీ ఇచ్చినట్లు నా మనసంతా నిశ్శబ్దం ఆవరించి, ధ్యానానుభూతి కలిగింది. వేయిపడగలులో పసరిక గురించి, మాలపల్లిలో తక్కెళ్ల జగ్గడు గురించి ప్రస్తావించేవాడు. ఆయన సమక్షం తాత్విక సాహిత్య చర్చలతో విద్యున్మయమై ఆవరించేది. అప్పటికి మా మిత్రులమంతా ఆయనకంటే ఒక తరం చిన్నవాళ్లం. ఆయన చెప్పే సంగతులన్నీ చాలా సీరియస్‌గా వినేవాళ్లం. గ్రంథాలయ ఆవరణలో వేపచెట్టు కింద అతడి చుట్టూ చేరినవారిలో కవులు, రచయితలు వుండేవారు. రాయుడు, బద్వేలి రమేష్, కైలాస్, మల్లెల నరసింహమూర్తి, ఎక్కలూరి శ్రీరాములు, చిలుకూరి దేవపుత్ర, బండి నారాయణ స్వామి, రమణ జీవి, ఖాదర్ బాషా, పద్మనాభయ్య, దక్షిణామూర్తి, బోసు, రఘుబాబు వంటి పదీ పదిహేను మంది చేరేవారు. డెబ్భయ్యవ దశకంలో అనంతపురం సాంస్కృతిక వాతావరణం అంతా పద్యమయమే. పండితులు వచనకవిత్వ ప్రక్రియను వెక్కిరిస్తున్న రోజులు. కుందుర్తి; వచనకవిత్వాన్ని భుజాలకెత్తుకున్న రోజులు. ‘‘కుక్కలు దొంతలు పడగొట్టగలవు గానీ, పేర్చగలవా?’’ అని పండితోత్తములు మర్మగర్భంగా మాట్లాడుతున్న మాటలు. ఒక దినం పద్యానికీ, వచనానికీ మధ్య యుద్ధానికి అన్నట్లుగా వేదిక కూడా తయారయింది. అంతకు రెండు రోజుల ముందు తన యువ కవుల సైన్యంతో శివరామ్ సారు శిక్షణా శిబిరాన్ని నిర్వహించినాడు – ‘‘గ్రీకులు ఉపన్యాసాన్ని డైలాగ్ అంటారు. ఆ కళను ఎట్ల సాధింపవలె? గొణుగుతున్నట్లు చదివితే అది కవిత్వమా? చేతిలో పేపరు లేకుండా కవిత్వాన్ని గానం చేయండి. కవిత్వాన్ని భాషించండి,’’ అన్నాడు. ఆ దినం లలితకళాపరిషత్ బయలులో ఇసుక వేస్తే రాలనంత జనం. అష్టావధానాలు, వారికి దండలు, శాలువాలు, సన్మానాలు ముగిసినాయి. ఆ తరువాత యువకవులు చెలరేగిపోయినారు. ప్రేక్షకుల చప్పట్లు, ఈలల మధ్య వచన కవిత్వాన్ని గద్దెనెక్కించినారు. స్వాంతంత్ర్యానంతరం మొలుచుకొచ్చిన కొత్త తరం కవుల సందోహం ఒక మహావృక్షమై, తెలుగు సాహిత్యాన్ని పరిపాలించబోతున్న సంకేతం అది. ఇదంతా చూసి, పెద్దాయన తిరుమల రామచంద్ర (హంపీ నుండి హరప్పాదాక) ముగ్ధులైన ఘడియ కూడా అది.


‘‘మేము చేయవలసిన పని మీరు చేసినారు. ఇది చరిత్ర. అనంతపురం సాంస్కృతిక వాతావరణంలో ఒక పెద్ద కుదుపు’’ అన్నారు కమ్యూనిస్టు మిత్రులు. ఈ సాహిత్య సందర్భాన్ని మొత్తం భుజానవేసుకుని నడిపించినవాడు శివరామ్ సారు. అతడు అనంతపురంలో మొట్టమొదటి లిటరరీ యాక్టివిస్టు. కొలకలూరి ఇనాక్, శింగమనేని నారాయణ గార్లకంటే ముందు అనంతపురం వాతావరణంలో ఆధునిక సాహిత్యానికి దారులు ఏర్పరిచినవాడు. యువకవుల ప్రతిభను ఛానలైజ్ చేసినవాడు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వైపు మిత్రులను ఉన్ముఖీకరణ చేసినవాడు. సమాజంలో దుష్టవిలువలను దండించిన వాడు. చలం జీవితాన్ని శ్లాఘించినవాడు. ఫాల్స్ ప్రిస్టేజ్‌ను అధిగమించినవాడు. ఉత్తరాంధ్రలో సాయుధపోరాటం జరుగుతున్న రోజులవి. పంచాది నిర్మల గురించి చెప్పేవాడు. సుబ్బారావు పాణిగ్రాహి కట్టిన పాటలను గుండెకు హత్తుకునేవాడు. ఈ సాయుధపోరాటం మా భూమి సినిమాగా రిలీజ్ అయింది. బయట నుండి తన వంతుగా ఏదో ఒకటి చేయకుండా వుండలేకపోయినాడు. ‘‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా...’’ అని పాటల రికార్డు మోగుతుండగా ‘మా భూమి’ సినిమా బండి బజారులో వస్తూవుంది. శివరామ్ సారు, బండి ముందు గుంపులో కలిసిపోయి ఆ సినిమా pamphlets పంచడం మొదలుపెట్టినాడు. ‘‘సమాజం మన మైండును కండీషన్ చేస్తుంది. బీ కేర్‌ఫుల్’’ అని హెచ్చరించేవాడు. ‘‘సీ సర్, సీ.. మీ మైండ్ ఏమి ఆలోచిస్తోందో గమనించండి’’ అనేవాడు. ‘‘నేను, నా మైండు.. అంటూ రెండు నేనులు వున్నాయా?’’ ‘‘చూసేవాడు, చూడబడేది రెండూ ఒకటే సర్’’ అనేవాడు. జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, అరబిందోలను అనంతపురం సాంస్కృతిక వాతావరణానికి దగ్గర చేసినవాడు. బయలు తత్వం, అచలయోగం.. అంటూ అధ్యాత్మికానికి జానపదుల గొంతును తొడిగేవాడు. పక్షులు, పువ్వులు, పసిపాపల మధ్య జీవనకళ వెదుక్కునేవాడు. కొబ్బరాకులు వెన్నెలను చెరిగినట్లు.. అన్న కవితాత్మక వాక్యాలతో అతడి వచన రచనలు నిండిపోయేవి. ఒక్కొక్క రచననూ మిత్రులకు చదివి వినిపించి, ఆ తర్వాత వాటిని చించి చెత్తబుట్టలో పడవేసేవాడు. అతడు కవి, రచయిత.


‘‘రాసిన తరువాత అది మనది కాదు’’ అనేవాడు. రాసినదాన్ని దేనినీ ఓన్ చేసుకునేవాడు కాడు. ఆయన మిత్రుల మధ్య ఎంత సౌమ్యుడో, సత్యాన్వేషణలో అంత నిర్మొహమాటి. తాను మాట్లాడవలసినది మాట్లాడతాడు. ఎదిరించవలసిన చోట ఎదిరిస్తాడు. సభ అనికూడా లెక్కచేయడు. నిలదీస్తాడు, అరుస్తాడు, కేకలు వేస్తాడు. ఎంత పద్ధతిగా వుండగలడో, అంత అరాచకంగానూ వుండగలడు. ఆయన్ను గురువుగా సంబోధించినవాడు బతికిబట్టకట్టేనా? శివనామ్ సారు గుర్తుకువచ్చినప్పుడల్లా అనంతపురం స్నేహితులు; ‘‘నో గురు.. నో టీచర్...’’ అని వార్నింగులు ఇచ్చు కుంటారు. అతడిని అనంతపురం మరువదు. శివరామ్ సారు ఇక లేరు. భారతి పత్రిక ఆగిపోతే, ఆ ఆగిపోయిన పత్రికకు సంస్మరణ సభ జరిపింది ఎవరు? గ్రంథాలయ ఆవరణలో వంద సంవత్సరాల వయసు గల ఆ శిరీష వృక్షాన్ని నరికివేసినప్పుడు దానికి సంతాపసభ జరిపింది ఎవరు? ఆ జీవన నాట్యం ఇప్పుడు లేదు. ఆ జీవనోత్తేజం ఇప్పుడు లేదు. ఆ జీవనకళ ఇప్పుడు లేదు. మా శివరామ్ సారు ఇక లేరు.

బండి నారాయణ స్వామి

88865 40990

ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 12:56 AM