స్త్రీ ఔన్నత్యాన్ని ఆవిష్కరించిన రాయప్రోలు
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:33 AM
మాతృ హృదయంతో పురుష రూపంలో జన్మించిన మొట్టమొదటి విమర్శకుడు, కవి ఎవరూ? అంటే ఈ శతాబ్దంలో రాయప్రోలు సుబ్బారావు గారనే చెప్పాలి! కవిత్వంలోను సాహిత్య విమర్శలోను ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలకు భూమిక ‘స్త్రీ’....

మాతృ హృదయంతో పురుష రూపంలో జన్మించిన మొట్టమొదటి విమర్శకుడు, కవి ఎవరూ? అంటే ఈ శతాబ్దంలో రాయప్రోలు సుబ్బారావు గారనే చెప్పాలి! కవిత్వంలోను సాహిత్య విమర్శలోను ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలకు భూమిక ‘స్త్రీ’. కవిగా తృణకంకణాది కావ్యాలతోపాటు విమర్శకుడిగా స్త్రీవాద భావనను ఆలంబనగా చేసికొని రమ్యాలోకాది విమర్శ గ్రంథాలను రాశాడు. తన కాలంలోను, తన కాలానికి ముందున్న సాహిత్యం లోను స్త్రీ వర్ణన రాయప్రోలు మనసు కలచివేసింది. స్త్రీని భోగ, విలాస వస్తువుగా చూసే ఈ సమాజానికి తరుణోపాయం కనిపెట్టాలని తపించాడు. చిన్నతనంలో పిన్నమ్మ రామడుగు నరసమ్మ వద్ద పొందిన సంస్కారం ఈ తపనకు ప్రాణం పోసింది.
ఒకనాడు రాయప్రోలు ‘అనసూయ చరిత్ర’ చదువుతుండగా విన్న పిన్నమ్మ, ‘‘నాన్నా చూచావురా! త్రిమూర్తులు కూడా ఎలా తల్లికంటితో చూస్తే చంటిపిల్లలయినారో! ఇలాంటి భావం మన కథా కలాపాలలో ఇంకా అధికంగా ఉంటే ప్రేమభాండం తొణికేదా! ఏ గ్రంథంలో విన్నా ఆడవాళ్ళను గురించి ఏమేమో రాస్తారు మగవాళ్ళు,’’ అని అన్నది. కవిగా విమర్శకుడిగా రాయప్రోలుకు ప్రేరణను ఇచ్చిన ఈ మాటలు తక్షణ కర్తవ్య బోధకాలై సాహిత్య విమర్శలోను, కవితా రచనలోను ఒక అభినవ ఆదర్శాన్ని, దర్శనాన్ని కలిగించినవి. పిన్నమ్మ నరసమ్మ మాటలే రాయప్రోలు సాహిత్య విమర్శలో మూడు గ్రంథాలుగా రూపుదిద్దుకున్నవి. అవి: ‘రమ్యాలోకం’, ‘మాధురీ దర్శనం’, ‘రూపనవనీతం’. ఈ మూడు విమర్శ గ్రంథాలు స్త్రీ ఔన్నత్వాన్నీ, స్త్రీ శక్తినీ, స్త్రీ వ్యక్తిత్వాన్నీ విస్తృత ప్రాతిపదికపై చర్చించి విశ్లేషించినవి. సామాజిక సాంస్కృతిక సంబంధాల దృష్టితో కుటుంబ నిర్వహణలో పురుషుని కంటే స్త్రీ ఉన్నతమైన భూమికను ధరిస్తున్నదని రాయప్రోలు ఈ గ్రంథాలలో నిరూపించినాడు.
ఆధునిక విద్యా సౌకర్యాల వలన స్త్రీ పురుషులు కలిసి చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం మొదలైన సామాజిక అవసర నేపథ్యంలో మగవాడి మోసానికి బలైపోతున్న స్త్రీల జీవితాలను, ఆత్మత్యాగాలను చూసిన రాయప్రోలు వాటికి పరిష్కార మార్గంగా అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినాడు. ‘తృణకంకణ’ కావ్య పీఠికలో– సంభోగపరిణామం పొందని కేవల భావాత్మకమైన స్నేహయోగంగా నవీన ప్రేమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించానని చెప్పాడు రాయప్రోలు. ఆ రోజుల్లో తెలుగు కవిత్వానికి ఇది ఒక నూతన లక్ష్యంగా గుర్తింపబడింది.
‘రమ్యాలోకమ్’, ‘మాధురీదర్శనమ్’ గ్రంథాలలో రాయప్రోలు స్త్రీ దృష్టితో వ్యాఖ్యానించిన అంశం ‘నరనారీ సంబంధం’. మానవులందరూ స్త్రీ పురుష భేదం చేత మౌలికంగా రెండే రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల పరస్పర సంబంధం మీదనే మానవ జీవితం, మానవ సమాజం అభివృద్ధి మార్గంలో విస్తరిస్తున్నది. రాయప్రోలు ఈ సంబంధాలను నాలుగు రూపాలుగా స్త్రీ యందు ఇట్లు చూపినాడు: ‘‘నరనారీ సంబంధము/ పరిభావింపుము దిశా విభాగము వరుసన్/ ధర జననీ, భగినీ, సహ/చరీ కుమారీ క్రమము నిజంబగుట సుధీ!’’ అన్నాడు. జననీ, భగినీ, సహచరీ, కుమారీ అని నాలుగు రూపాలలో స్త్రీ పురుషుని జీవితాన్ని నాలుగు దిక్కులుగా, ఆవరించి ఉంటుందని దీని తాత్పర్యం. పురుషునికి జన్మించిన వెంటనే ఒక్క స్త్రీతో కలిగే మొట్టమొదటి సంబంధం జనని, ఆ తరువాత అతని పెరుగుదలలో స్త్రీతో కలిగే తరువాత సంబంధం -భగిని (సోదరి), యౌవన దశకు వచ్చేసరికి స్త్రీతో ఏర్పడే సంబంధం సహచరి, ఆ తరువాతది కుమారి. ఈ విధంగా పురుషుని జీవితంలో స్త్రీ నాలుగు రూపాలతో ఆవరించి ఉంటుందని రాయప్రోలు వ్యాఖ్యానించడం -మానవ జీవితంలో స్త్రీ ప్రాముఖ్యాన్ని వెల్లడించడమే!
రాయప్రోలు తన ‘నవకవిత’ వ్యాసంలో స్త్రీ పురుషుల సంబంధాన్ని విశ్లేషిస్తూ రామాయణకాలం కంటే ముందు స్త్రీ పురుషుల సంబంధం పశుపక్ష్యాదులలో వలె అవ్యవస్థితంగా ఉండేది అంటూ సత్యకామ జాబాలి కథను ఉదాహరిస్తాడు. దశరథుడికి ముగ్గురు భార్యలు ఉండటం కూడా ఈ అవ్యవస్థకి ఉదాహరణ అనీ, అందుకే వాల్మీకి రామాయణాన్ని రాసి సీతారాముల ద్వారా ఒక్క స్త్రీకి ఒక్క పురుషుడు, ఒక్క పురుషుడికి ఒకే స్త్రీ అని సమాజ ధర్మంగా ప్రకటించినాడని అంటాడు. సూత్రభాష్యం రాసి తత్త్వోపదేశం చేసిన శంకరాచార్యులు సారసత్వాన్ని దేవీస్తన్యంగా వర్ణించడం స్త్రీ భావనలోని విశిష్టతగా పేర్కొంటాడు.
‘‘నా అమలిన శృంగార విషయంలో శబ్ధౌచిత్యమును పాటించాను. చక్రస్తనీ, రంభోరూ, లలనా ఇత్యాదులు కేవల స్త్రీ వాచకములుగా వాడక జాగ్రత్తపడ్డాను’’ -అంటూ తన కావ్యాలలో వీలైనంతవరకు ఎక్కడా స్త్రీని తక్కువ దృష్టితో చూసే పదాలను రాయప్రోలు ఉపయోగించలేదు. దాదాపు స్త్రీని సంబోధిస్తూ వాడిన పదాలన్నీ లలితా సహస్రనామాలలోనో, లేక మరే స్తోత్రంలోనో దేవీపరంగా ఉన్నటువంటివే కావడం రాయప్రోలు స్త్రీభావనా దృక్పథంలోని విశిష్టతను వెల్లడిస్తుంది. ఈ విధంగా ‘స్త్రీ భావన’ కేంద్రంగా సాగిన రాయప్రోలు సాహిత్య విమర్శ గత శతాబ్దంలో ఆధునిక కవులకు ఒక సిద్ధాంతంగా ఒక తత్త్వోపదేశంగా ఎంతో ఉపకరించింది.
ఆచార్య కె. యాదగిరి
పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమి
(నేడు రాయప్రోలు సుబ్బారావు జయంతి)
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
For AndhraPradesh News And Telugu News