Share News

Daggubati Purandeswari: ప్రపంచ దేశాలకు భారత స్వరం

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:35 AM

అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలకు భారత స్వరాన్ని వినిపించే అరుదైన అవకాశం మన తెలుగు బిడ్డ, మాజీ కేంద్రమంత్రి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి...

Daggubati Purandeswari: ప్రపంచ దేశాలకు భారత స్వరం

అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలకు భారత స్వరాన్ని వినిపించే అరుదైన అవకాశం మన తెలుగు బిడ్డ, మాజీ కేంద్రమంత్రి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి దక్కటం విశేషం. ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనే 16 మంది పార్లమెంటు సభ్యుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ‘‘Peace and security to human rights development and international cooperation’’ అనే అంశంపై పురందేశ్వరి ప్రధాన ప్రసంగం చేయడం తెలుగు వారికి గర్వకారణం. 1991 డిసెంబర్ 3న నాటి బాపట్ల ఎంపీ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇదే ఐరాస వేదికపై ‘జాతి వివక్ష’ అంశం గురించి ప్రసంగించారు. ఒకే అంతర్జాతీయ వేదికపై భార్యాభర్తలు ఇద్దరూ భారతదేశం తరఫున ప్రసంగించడం అరుదైన విశేషం.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పురందేశ్వరి... పార్లమెంటులో మహిళా బిల్లు, విద్యా బిల్లు, వ్యవసాయ రంగం వంటి వాటికి సంబంధించిన అనేక సమస్యలపై అనర్గళంగా మాట్లాడి పలువురి ప్రశంసలు పొందారు. 2005లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. కేంద్రంలో మాజీ మంత్రిగా, విదేశీ వ్యవహారాలపై ఆమెకున్న లోతైన అవగాహన, అంతర్జాతీయ వేదికలపై చూపిన అసమాన ప్రతిభ, ప్రాతినిధ్యం ఆమె గొప్పతనానికి నిదర్శనం. లారా బుష్ ఆహ్వానం మేరకు అమెరికాలోని వైట్‌హౌస్‌లో ‘‘అడ్వాన్సింగ్ గ్లోబల్ లిటరసీ’’ అనే అంశంపై ప్రసంగించిన తొలి మహిళగా పురందేశ్వరి రికార్డుకెక్కారు.

ఉగ్రవాదంపై భారతదేశ వైఖరి, ‘ఆపరేషన్ సిందూర్’కు దారి తీసిన పరిస్థితులు, దేశ భద్రతకు తాము తీసుకుంటున్న చర్యలను ప్రపంచానికి తెలియజేయడానికి ఈ ఏడాది మే 25న ఎనిమిది మందితో కూడిన అఖిలపక్ష బృందం పలు దేశాల్లో పర్యటించింది. ఈ బృందంలో పురందేశ్వరి సభ్యురాలిగా ఉన్నారు. ఈ పర్యటనలలో యూరప్‌లోని జర్మనీ, బెల్జియం, యునైటెడ్ కింగ్డమ్, డెన్మార్క్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలలోని అధ్యక్షులు, ప్రవాస భారతీయ సంఘాలతో ఆమె సమావేశమయ్యారు. పాకిస్థాన్ పోషిస్తున్న ఉగ్రవాదం వల్ల భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను, దేశంలోని ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని విపులంగా వివరించారు.


విదేశాలలో అక్టోబర్ 5 నుంచి 12 వరకు జరిగిన కామన్వెల్త్ సదస్సుల్లో... కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ‘ఇండియా రీజియన్ ఎగ్జిక్యూటివ్ స్టీరింగ్ కమిటీ’ సభ్యురాలిగా, మహిళా పార్లమెంటేరియన్ల స్టీరింగ్ కమిటీ అధ్యక్షురాలిగా భారతదేశం తరఫున పురందేశ్వరి ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన, సహకారం ద్వారా మహిళా సాధికారతను ప్రోత్సహించటం, సురక్షితమైన వాతావరణం సృష్టించటం, శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించారు. బహమాస్‌లో ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో ‘మహిళా సాధికారత’పై జరిగిన అర్థవంతమైన చర్చల్లో ఆమె చురుకుగా పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికలపై పురందేశ్వరి భారతీయ ప్రతినిధిగా వ్యవహరించిన తీరు, ముఖ్యంగా ఉగ్రవాదం వంటి సున్నితమైన అంశాలపై ఆమె ప్రసంగించిన విధానం దేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పార్టీని సమర్థంగా నడిపించడం, 2024లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో పురందేశ్వరి కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవడం ఆమెలోని నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. ఆమె కేవలం ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం వైఖరిని, శక్తిని, మహిళా సాధికారతను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ వేదికలపై కృషి చేస్తున్నారు. ఆమె అనుభవం, నిబద్ధత, అంకితభావం కారణంగా, తెలుగు రాజకీయాల్లోనే కాక, భారత రాజకీయాల్లోనూ గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతున్నారు.

సందిరెడ్డి కొండలరావు

ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

For More AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 12:35 AM