Protecting Human Rights: మానవ హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:38 AM
మనందరం పుట్టుకతోనే కలిగి ఉన్న మానవ హక్కుల గురించి తప్పక తెలుసుకోవాలి. వాటిని పరిరక్షించుకోవాలి. వాటికి భంగం కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం...
మనందరం పుట్టుకతోనే కలిగి ఉన్న మానవ హక్కుల గురించి తప్పక తెలుసుకోవాలి. వాటిని పరిరక్షించుకోవాలి. వాటికి భంగం కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది. ప్రపంచ శాంతి ఒప్పందాలకు అనుగుణంగా ఏర్పడిన ఐక్యరాజ్యసమితి, 1948 డిసెంబర్ 10ని ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’గా ప్రకటించింది. మారుతున్న కాలంతో పాటుగా రాజ్యాంగబద్ధ హక్కుల ముఖ్యోద్దేశ్యమైన పౌర స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సహజసిద్ధ గౌరవం వంటివి సమాజంలో తగ్గిపోతుండడం విచారకరం. అయితే జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదాలకు అతీతంగా ప్రజలు హక్కులు కలిగి ఉన్నారు. వివక్షకు గురికాని క్రూరత్వం నుంచి వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి వాటి నుంచి విముక్తి పొంది, పౌరులు స్వేచ్ఛగా వారి ఇష్టానుసారంగా జీవించే, ఏ ప్రాంతంలోనైనా పర్యటించే, జీవించే హక్కులు ప్రజలకున్నాయి. వీటిని నిరోధించడం, లేదా నిర్బంధించడం, వ్యతిరేకించడం వంటివి చట్టవ్యతిరేక చర్యలుగా పరిగణించవచ్చు.
అయితే కాలం మారినా కొన్ని ప్రాంతాల్లో ఈ హక్కులకు అంతరాయం కల్గిస్తూ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తూ, కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తూ సొంత కుటుంబీకులే అమానుష చర్యలకు పాల్పడడం, తద్వారా హింసాత్మక చర్యలకు దారితీయడం బాధాకరం. కొందరు తమకున్న హక్కులను తెలుసుకోలేకపోవడానికి అవిద్య, అజ్ఞానం కారణాలైతే మరికొన్ని చోట్ల అసూయ, రాగద్వేషాలు, కుల, మత విభేదాలు, గొప్ప–బీద వంటి తారతమ్యాలు కూడా కారణాలుగా కనబడతాయి. అందుకే ఈ హక్కులకు భంగం కలిగినప్పుడు బాధిత వ్యక్తుల రక్షణ కోసం 1993లో ‘మానవ హక్కుల పరిరక్షణ చట్టం’ ఏర్పాటు చేశారు.
ప్రతి వ్యక్తికీ పుట్టుకతో వచ్చిన స్వేచ్ఛ, సమానత్వంతో పాటూ ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి వాటికి కూడా నోచుకోలేని వారు కొందరు ఉన్నారు. గ్రామీణుల నుంచి నగరవాసుల వరకూ చాలా ప్రాంతాల వారికి మానవహక్కులపై అవగాహన, ఆయా హక్కుల ప్రాముఖ్యం తెలియదు. ఇటువంటి వారికి అన్ని విధాలా భద్రత, పౌష్టికాహారం, మెరుగైన వైద్యం వంటివి కల్పించవలసిన బాధ్యత, మానవహక్కుల గురించి తెలియజేయాల్సిన బాధ్యత, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
రాజ్యాంగం ప్రకారం UDHR (Universal Declaration of Human Rights) ప్రకారం... ఆర్టికల్ 1) స్వేచ్ఛ, గౌరవం, 2) జీవించే హక్కు, 3) హింస, దౌర్జన్యం నుంచి రక్షణ, 5) పీడిత బాధ నుంచి విముక్తి, 9) పౌరులను అక్రమంగా అరెస్టు చేయరాదు. 18) మత స్వేచ్ఛ, 19) వాక్ స్వాతంత్ర్యం, 20) విద్యా హక్కు, 30) హక్కులను ఉల్లంఘించరాదు. వంటి వాటితో పాటు ఆర్టికల్ 14 నుంచి 32 వరకూ ఉన్న హక్కులకు భంగం కలిగించరాదు. ఒకవేళ ఆయా హక్కులకు భంగం కలిగితే cr.nhrc@nic.in అనే మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయవచ్చు. లేదా పౌరులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’కు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయవచ్చు. నేరాలను అరికట్టాలంటే సమాజంలోని ప్రతి వ్యక్తీ బాధ్యతతో మెలగాలి. మనం మానవ హక్కులను కాపాడుకోవడంతోపాటు ఇతరుల హక్కులనూ గౌరవించాలి. అప్పుడే మనం సమాజంలో ప్రజాస్వామ్యం, శాంతి భద్రతలు కాపాడినట్లు.
ఎస్. బాలాత్రిపురసుందరి
అడ్వకేట్
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ప్రత్యేకతలు..
ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎప్పుడంటే..?
For More TG News And Telugu News