Indian Economy: ప్రజల్ని విడిచి పెట్టుబడికి వత్తాసు
ABN , Publish Date - Nov 19 , 2025 | 02:11 AM
నేడు మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తి 4.19 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని, దేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద మార్కెట్ ఎకనామీగా అవతరించింది. కానీ దేశ పీడిత ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచి...
నేడు మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తి 4.19 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని, దేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద మార్కెట్ ఎకనామీగా అవతరించింది. కానీ దేశ పీడిత ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచి నేటి వరకు కూడా భారత దేశ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. దేశ భూభాగంలో 60శాతం భూమి ఉన్నది (దాదాపు 140 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమి). అందులో 44శాతం భూమి నేటికీ 2 లక్షల భూస్వాముల, 3 లక్షల నయా భూస్వాముల (బడా పెట్టుబడిదారులు, బహుళ జాతి సంస్థల) చేతుల్లో ఉన్నది. మిగతా 56శాతం భూమి దేశంలోని 93.03 మిలియన్ల పెద్ద, మధ్య తరగతి, చిన్న, సన్నకారు రైతుల చేతుల్లో ఉంది.
భారతదేశంలోని 6,40,932 గ్రామాల్లో, 7,933 పట్టణాల్లో, 4,000 నగరాల్లో 140.63 కోట్ల జనాభా జీవిస్తున్నది. ఇందులో 72.2శాతం జనాభా గ్రామాల్లో జీవిస్తుండగా, 27.8శాతం జనాభా పట్టణాల్లోను, నగరాల్లోను జీవిస్తున్నది. దేశ రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూల్‌లోని 14 రాష్ట్రాల్లో 705 గిరిజన తెగలు సుమారు 10 కోట్ల 40 లక్షలు జీవిస్తున్నాయి. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ. వీరు దేశ జనాభాలో 8.6శాతం ఉన్నారు. దేశ వ్యాప్తంగా దళిత జనాభా 20 కోట్ల 14 లక్షలు కాగా, దేశ జనాభాలో వీరిది దాదాపు 16.6శాతం. దేశంలో ముస్లిం ప్రజలు దాదాపు 20 కోట్లుండగా, ఇది దేశ జనాభాలో 14శాతం. నేటికీ దేశంలో దాదాపు 49.25 కోట్ల అసంఘటిత–సంఘటిత కార్మికులుండగా ఇందులో సంఘటిత కార్మికులు కేవలం 2 కోట్ల 60 లక్షలు మాత్రమే. మిగతా 46 కోట్ల 40 లక్షల కార్మికులు అసంఘటిత కార్మిక రంగానికి చెందినవారే. ఇందులో భూమిలేని వ్యవసాయ కూలీలు 14 కోట్ల 40 లక్షలున్నారు. ఈ వ్యవసాయ కూలీలు గ్రామాల్లోనే జీవిస్తున్నారు.
సరిగ్గా 34 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రపంచీకరణ–సరళీకరణ–ప్రయివేటీకరణలను ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ దేశ కార్మిక రంగం తమ రక్త మాంసాలను ధారపోసి పోగుచేసిన 331 ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన దాదాపు 20 లక్షల కోట్ల ఆస్తులను కేవలం రూ.3,47,439 కోట్లకే దేశీయ బడా పెట్టుబడిదారులకు, బహుళ జాతి సంస్థలకు అమ్మివేసింది. ఫలితంగా గత మూడున్నర దశాబ్దాలుగా దేశ సంఘటిత కార్మిక రంగానికి చెందిన కోట్లాది కార్మికులు రోడ్డునపడ్డారు. దేశ పీడిత ప్రజలకు చెందిన ఈ ప్రభుత్వ ఆస్తులు బడా పెట్టుబడిదారుల, బహుళ జాతి సంస్థల వశమయ్యాయి. ఫలితంగా దేశీయ బడా పెట్టుబడిదారులు ముకేశ్ అంబానీ, అదానీ, టాటా గ్రూప్, రుస్తుంజీ తదితరుల ఆస్తులు దాదాపు రూ.20 లక్షల కోట్లకు చేరుకోగా, దేశంలోని 298 బడా పెట్టుబడిదారుల ఆస్తులు రూ.98 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఈ 75 ఏళ్ళుగా స్వాతంత్ర ఉద్యమ ఫలితాలు ఈ దేశ 80శాతం ప్రజలకు అందలేదు. రోజురోజుకు ప్రభుత్వాల పని విధానం పేదలు, మరింత పేదలుగాను, ధనవంతులు మరింత కుబేరులుగాను మారేందుకు ఉపయోగపడుతున్నది. దేశ ప్రజల సకల సంపదను ప్రభుత్వాలు దేశీయ బడా పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు అప్పచెప్పాయి. ఇప్పుడు ఈ పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు దేశంలోని అడవి మీద, అడవిలోని ఖనిజ సంపద మీద కన్ను వేశాయి. దాన్ని దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. వీరికి ఆ వీలు కల్పిస్తూ ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలపై అణచివేతను కొనసాగిస్తున్నాయి.
భారతదేశంలోని ఉత్పత్తి సాధనాలు ఉత్పత్తి శక్తులకు దక్కి, నిజమైన ప్రజాస్వామికస్ఫూర్తితో ‘‘సమ సమాజం’’ ఏర్పడాలన్న లక్ష్యంతో మార్క్సిజాన్ని ఆధారం చేసుకుని ఏప్రిల్ 22, 1981న ఉద్భవించిన పీపుల్స్‌వార్ పార్టీ, కాలక్రమేణా సీపీఐ (మావోయిస్టు) పార్టీగా మారి, దేశ ప్రజలకు తానున్నానని కొంత భరోసా ఇచ్చింది. కానీ 2004 నుండి ఆ పార్టీ నిత్య నిర్బంధాన్ని అనుభవిస్తూ దేశంలోని అయిదవ షెడ్యూల్‌కు మాత్రమే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మొదట గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహర్, ఆపరేషన్ సమాధాన్‌లతో మావోయిస్టు పార్టీని నిర్మూలించే ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వలన, రెండు సంవత్సరాల నుండి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో చుట్టివేత కార్యక్రమం మొదలైంది. అయిదవ షెడ్యూలులోని ఆదివాసీ ప్రాంతాలకు, అడవికి పరిమితమైన ఆ పార్టీ నాయకత్వాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యూహం వలన అమాయక ఆదివాసులు, వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ గత 45 సంవత్సరాలుగా మునుపెన్నడూ నష్టపోనివిధంగా నష్టపోతున్నది. ఈ అమానుష దారుణ మారణకాండ వలన దేశ పీడిత ప్రజల ‘‘సమ సమాజ ఏర్పాటు’’ కల చెదిరిపోతున్నది.
ఇంకొకవైపు ఈ అసాధారణ పరిస్థితుల్లో నిత్య దుర్భర జీవితాలు వెళ్ళదీస్తున్న దేశ మెజారిటీ పీడిత ప్రజలను ప్రస్తుత ప్రభుత్వం మతోన్మాదంతో నిట్టనిలువుగా చీల్చాలని చూస్తున్నది. చట్టబద్ధ పాలనకు చరమగీతం పాడి దేశాన్ని మధ్య యుగాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ మొత్తం దుర్మార్గాన్ని న్యాయ వ్యవస్థ కళ్లప్పగించి చూస్తున్నది కానీ నివారించడంలేదు. దేశంలో పాలక పార్టీలకు దీటుగా గత 75 ఏళ్ళుగా దేశ అశేష ప్రజల ఆకాంక్షలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే లౌకిక ప్రజాస్వామ్య పార్టీ కానీ, వామపక్ష పార్టీ కానీ ఏర్పడకపోవటం పెద్ద లోటు. కనీసం వామపక్ష, లౌకిక ప్రజాస్వామ్య బలమైన ఐక్య సంఘటన కూడ దేశంలో లేకపోవడం వలన దేశ పీడిత ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అయితే గతితార్కిక నియమాల ప్రకారం సమాజం నిరంతరం చలనంలో ఉంటూ మార్పు చెందుతూ పాతది నశిస్తూ కొత్తది ఉద్భవిస్తుందనేది చారిత్రక వాస్తవం. బలమైన విప్లవ, ప్రజాస్వామిక పార్టీలు లేకుండానే మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేపాల్ ప్రజలు ఉద్యమించి, తమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించారు. రేపు భారతదేశం అందుకు అతీతం కాదు. కాలం ప్రశ్నలకు కాలమే సమాధానం చెపుతుంది.
చిక్కుడు ప్రభాకర్
హైకోర్టు న్యాయవాది
కన్వీనర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News