Share News

Telugu poetry: వాక్యం ఒక విత్తనాల మూట

ABN , Publish Date - Jul 07 , 2025 | 05:41 AM

ఎవరు రాసిన వాక్యాలో? అద్భుతమైన శక్తివంతమైన వాక్యాలు, ఎక్కడ ఎవరు రాస్తే మాత్రం? ఏ సిరాతో రాస్తే మాత్రం? వరుసలు వరుసలుగా కవాతు చేసే వాక్యాలు...

Telugu poetry: వాక్యం ఒక విత్తనాల మూట

ఎవరు రాసిన వాక్యాలో?

అద్భుతమైన శక్తివంతమైన వాక్యాలు,

ఎక్కడ ఎవరు రాస్తే మాత్రం?

ఏ సిరాతో రాస్తే మాత్రం?

వరుసలు వరుసలుగా కవాతు చేసే వాక్యాలు,

అడుగుల్లో పిడుగులు ధ్వనించే అరుదైన వాక్యాలు,

పగిలిన పాదాల కింద మెత్తని

పచ్చగడ్డి పరుపుల్లాటి వాక్యాలు,

పిల్లగాలి లాలిపాటలకు అలలు‌ అలలుగా

ప్రవహించే నారుమళ్ళలాటి వాక్యాలు,

వానాకాలపు వరదలప్పుడు ఎగిసిపడే

నాగావళి కెరటాల్లాటి వాక్యాలు,

ఎప్పుడు ఏ కలంతో రాస్తే మాత్రం?

ఏ గుండెల్లో ఐతేనేం? ఏ బండల్లో ఐతేనేం?

అక్షరాల పుట్టుక కుట్ర కాదు

పదాలు ప్రాణగీతాలు కావడం కుట్ర కాదు,

అక్షరాలు పదాల్లో వొదగడమూ కుట్ర కాదు,

పదాలు వాక్యాలు వాక్యాలుగా ప్రవహించడం

కుట్ర కానే కాదు,

వాక్యరహిత సమాజాన్ని ఊహించడమే‌ అసలు కుట్ర.

చీకటి గుండెల్లో మండే సూర్యుడై ప్రకాశించాలనే

తపన పడుతుంది ప్రతిసిరాచుక్కా,

పదంలో పదం కలిపి కదంతొక్కి

నినాదమైన వాక్యాన్ని ప్రేమించనిదెవరు?

అమితమైన విద్వేషాన్ని గుండెలో నింపుకున్నవాడు తప్ప.

ఎత్తుపల్లాల్ని సరిచేసి హృదయకేదారాల్లో

పాటల పంటలు పండించాలనుకునే వాక్యాల్ని

ముక్కలు ముక్కలుగా నరికి, ఉక్కుపాదాల కింద నలిపి,

వికటాట్టహాసం చేసే కుట్రదారులెప్పుడూ ఉంటారు,

అక్షరాలెక్కడైనా మిగిలివుంటే అవి

ప్రశ్నలకొడవళ్ళై కళ్ళముందు వేలాడుతాయని

వాటిని చీకటిగుహల గోడలకు వేలాడదీసి

ఆనందిస్తుంటారు,

అక్షరాల్లేని కాలాన్ని కలగంటుంటారు.

ప్రశ్నలై కళ్ళకడ్డంపడే వాక్యాల్ని తునాతునకలు చేసి,

ఏకఛత్రచ్ఛాయలో నిశ్చింతగా నిద్రపోవాలని

కొందరి ఆశ కావొచ్చు,

అక్షరరహిత సమాజాన్ని స్వప్నిస్తూ

వాక్యాల్ని చుట్టచుట్టి నేలపొరల్లోకి నెట్టేస్తూ

సాధించిన దానికి సంబరపడొచ్చు,

కెరటాలై ఎగిసిపడే వాక్యప్రవాహాల్ని ఎవరైనా

ఏ ఎడారుల్లో ఇంకింప జేయగలరు?

వాక్యాల్ని నిషేధించి అదృశ్యమైపోయినవారే గానీ

చిగుళ్ళు చిక్కినా, వేళ్ళు తెగనరికినా

వాక్యాలు మాత్రం చిగురిస్తూనే ఉంటాయి,

రాలిపడిన అక్షరం వాక్యాలుగా మొలకెత్తడం

సహజాతిసహజం.

అక్షరమంటే జీవం తొణికిసలాడే విత్తనం,

వాక్యం నిలవచేసిన విత్తనాల మూట

వాక్యం ఒక ముగింపు లేని పాట.

n లాంగుల్య

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

మదుపరులూ పారాహుషార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jul 07 , 2025 | 05:58 AM