Pappuri Ramacharyulu: రాయలసీమ గుండెచప్పుడు
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:34 AM
ఉజ్వలమైన సామాజిక పూర్వరంగంతోనే పప్పూరు రామాచార్యులు (1896– 1972) స్వాతంత్ర్య యోధుడిగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, కళాకారుడుగా పరిణమించారు....
ఉజ్వలమైన సామాజిక పూర్వరంగంతోనే పప్పూరు రామాచార్యులు (1896– 1972) స్వాతంత్ర్య యోధుడిగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, కళాకారుడుగా పరిణమించారు. పప్పూరి వారి ఐదు దశాబ్దాల పాత్రికేయ జీవితంలో మొదటి మూడున్నరేళ్లు ‘పినాకిని’ పత్రికను నడిపినా, రెండవదైన ‘శ్రీసాధన పత్రిక’ను రాయలసీమ ప్రాంతపు గుండెచప్పుడుగా 1926 నుంచి నాలుగున్నర దశాబ్దాలకు పైబడి నిర్వహించారు. తొలి పత్రిక నామకరణంలో ప్రాంతీయ అస్తిత్వం ప్రతిఫలించినా, రెండవదానిలో అప్పటికి అత్యంత అవసరమైన కార్యసాధనా దృష్టి ప్రతిబింబించింది. రాయలసీమ నాయకులకు తలలోని నాలుకలాగా వ్యవహరించిన రామాచార్యులు ‘శ్రీ బాగ్ ఒడంబడిక’ మీద సంతకం చేసిన వారిలో ఒకరు. అనంతపురంలోని సొంత ముద్రణాలయంలో ప్రతి శనివారం 12 పుటలతో వచ్చేట్టు, వారపత్రికగా 1926 ఆగస్టు 14న ‘శ్రీసాధన పత్రిక’ మొదలైంది. ‘‘దత్త మండలం స్థితిగతుల నరసి వెల్లడించుటకు ఇప్పుడు తగిన పత్రిక లేని లోపమును బాపుటకై మరల ఒక వారపత్రిక నెలకొల్ప ప్రయత్నించు మమ్ము మండల వాసులు చాలామంది ప్రోత్సహించిరి...’’ అని తొలి సంచికలో వివరమైన ఆశయాలను ప్రకటిస్తూ రాజకీయ అంశాలే కాకుండా సాంఘిక, నైతిక, సారస్వత విషయాలు తమ పత్రిక అజెండాలో ఉన్నాయని పేర్కొంటూనే; సాంఘిక జీవనమే, నైతికవర్తనమే ప్రధానమని విస్పష్టంగా చెప్పడం విశేషం. ‘‘రాజకీయం ప్రజలకు సంబంధించినది కాదా? ప్రజలతో సంబంధంలేని రాజకీయముంటుందా? సహకారమూ రాజకీయమే! ప్రభుత్వము, ప్రజలు వేరుగా ఉన్నంతవరకూ భారతజాతి యొక్క ప్రతి విషయమూ రాజకీయమే అవుతుంది. మనం తినే తిండి, త్రాగే నీరు, కట్టే గుడ్డ, కట్టుకున్న పెండ్లాము, కన్నబిడ్డలు అంతా రాజకీయమే. కానీ దృష్టి మార్చుకుని చూస్తే ఏదీ రాజకీయము కాజాలదు. అప్పుడు ప్రతిదీ సాంఫీుక సమస్య అవుతుంది. ఈ దృష్టి మార్పుకే స్వరాజ్య సంపాదనమని పేరు...’’ అని 1929 మే 11వ తేదీ ‘శ్రీసాధన పత్రిక’ సంచికలో ఒక విమర్శకు జవాబుగా రామాచార్యులు రాశారు. వేమనను తెలుగువారికి కొత్తగా సమగ్రంగా పరిచయం చేస్తూ రఘుపతి వెంకటరత్నంనాయుడు పూనికతో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు ఆధ్వర్యంలో 1928 అక్టోబర్ 25 నుండి 31 దాకా రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ వారం రోజులపాటు అనంతపురంలోని సీడెడ్ డిస్ట్రిక్ట్ కాలేజ్ (ఇప్పటి ఆర్ట్స్ కాలేజ్) భవనంలో ప్రఖ్యాతమైన ప్రసంగాలు చేశారు. రామాచార్యులు తన పత్రికలో తొలి నుంచి కవిత్వం, కథలు, ఉపన్యాసాలు, నాటికలు, వ్యాసాలు, లేఖలు, నాటక విమర్శలు, మాండలిక వృత్తాంతాలు, యాత్రాచరిత్రలు, భాషా విషయాలు, శాసన విషయాలు, సాహిత్య విమర్శ, పుస్తక సమీక్షలు, నీతి కథలు వంటివి ఎన్నో రాజకీయ వార్తలు, వ్యాఖ్యలతో పాటు ప్రచురించేవారు. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, విద్వాన్ విశ్వం, తిరుమల రామచంద్ర వంటి విద్వాంసుల తొలి రచనలు ఈ పత్రిక కుదురు నుంచి వెలువడినవే. కనుక పప్పూరు రామాచార్యులను రాయలసీమ ఆధునిక సాహిత్య నిర్మాతగా కూడా పరిగణించాలి. మొదటి పదేళ్లు సాహిత్య ప్రధానంగా సాగిన తర్వాత రాజకీయ పోరాటపు ఆయుధంగా ‘శ్రీసాధన’ను మలిచారు.
ఆర్థికంతోపాటు ఆంక్షల ఇబ్బందులతో ముందుకు సాగినా లక్ష్యాన్ని, వ్యూహాన్ని వదలలేదు. కనుకనే 1932 సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా సంపాదకుడు జైలు పాలైనప్పుడు రెండున్నర సంవత్సరాలకు పైగా పత్రిక ఆగిపోయింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో రామాచార్యులు రాజకీయ ఖైదీ కావడంతో తిరిగి మరల కొంతకాలం శ్రీసాధన ఆగిపోయింది. రాజకీయాలలో గాంధీజీ స్ఫూర్తిగా మొదలై, ప్రకాశం అనుయాయిగా కొనసాగిన వాస్తవికవాది పప్పూరు. కల్లూరు సుబ్బారావు తొలినాటి నుంచీ మిత్రుడే అయినా వారితో రాజకీయపరమైన అభిప్రాయబేధాలుండేవి. తాను చదువు చెప్పిన నీలం సంజీవరెడ్డి రాజకీయాలలో కీలకంగా ఉన్నప్పుడు, అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రామాచార్యులు ఆయనతో తీవ్రంగా విభేదించేవారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్‌కు దూరంగా జరిగిన ఈ స్వేచ్ఛావాది 1963 సెప్టెంబరు 28 నుంచి తీవ్ర నిరాశలో తన పత్రికలో రాజకీయ విమర్శలు చేయడం మానివేశారు. 1928 నవంబర్ 17, 18 తేదీలలో నంద్యాలలో సర్వేపల్లి రాధాకృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలలోనే డా. చిలుకూరు నారాయణరావు 128 పాదాల ‘దత్త’గేయం చదివి దత్త మండలానికి ‘రాయలసీమ’ అనే పేరు ప్రతిపాదించారు. ‘...ఇచ్చిన దెవ్వరో పుచ్చినదెవరో’ ...అంటూ ఆ గేయం మొదలై, ‘పరిహాసములు సేయ తరిగాదు నేడు’ అని వివరిస్తూనే ‘‘దత్త కానమ్మ నే దత్తను కాను/ ఉత్తదబ్బరలివి చిత్తము కలదు/ దత్తతయన్ దూడు తొలగించరేని/ దరి చేర్చినా నేమి మరసిరయేని/ ఇరుగువారలు మన పొరుగు వారాలను/ సరిజూచి మన్నించి సఖ్యంబు నేరపి/ గౌర సబుద్ధితో గాంతురు మనల/ నంతలో జూపట్టు నాంధ్రాభ్యుదయము’’ అని ముగుస్తుంది. ఆ సభలలో చివరి రోజున దత్తమండలాలకు ‘రాయలసీమ’ అని నామకరణం చేస్తూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించారు. తొలుత ‘శ్రీసాధన పత్రిక’ మకుటంలో ఉన్న ‘వాయిస్ ఆఫ్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్’ అనే మాటలను పప్పూరు రామాచార్యులు 1929 మార్చి 16 నుంచి ‘వాయిస్ ఆఫ్ రాయలసీమ’గా మార్చారు. రాయలసీమకు గుండెకాయ వంటి ‘శ్రీసాధన పత్రిక’ను ఉజ్జ్వలంగా నడిపిన పప్పూరు రామాచార్యులు 1972 మార్చి 21న గతించినా సదా చిరస్మరణీయుడే!
డా. నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి పూర్వసంచాలకులు (నేడు పప్పూరు రామాచార్యులు జయంతి)
ఈ వార్తలు కూడా చదవండి...
ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్
రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News