ఆపరేషన్ సిందూర్ శత్రుదేశానికి గట్టి హెచ్చరిక
ABN , Publish Date - May 16 , 2025 | 06:24 AM
‘ఆపరేషన్ సిందూర్ లక్ష్మణరేఖ – ఇంకోసారి దాడి చేస్తే చొరబడి మరీ అంతు చూస్తాం’... పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా, తాము నాశనం చేశామని పాకిస్థాన్ ప్రకటించుకున్న అదంపూర్ ఎయిర్‌బేస్ వేదికగా, పాకిస్థాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన హెచ్చరిక ఇది. ఓ వైపు పాకిస్థాన్ డ్రోన్లను, మిస్సైళ్లను నేలకూల్చిన S–400, మరోవైపు బ్రహ్మోస్‌తో...
‘ఆపరేషన్ సిందూర్ లక్ష్మణరేఖ – ఇంకోసారి దాడి చేస్తే చొరబడి మరీ అంతు చూస్తాం’... పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా, తాము నాశనం చేశామని పాకిస్థాన్ ప్రకటించుకున్న అదంపూర్ ఎయిర్‌బేస్ వేదికగా, పాకిస్థాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన హెచ్చరిక ఇది. ఓ వైపు పాకిస్థాన్ డ్రోన్లను, మిస్సైళ్లను నేలకూల్చిన S–400, మరోవైపు బ్రహ్మోస్‌తో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లను పనికి రాకుండా చేసిన సుఖోయ్ యుద్ధ విమానం ఉండగా మోదీ ఈ హెచ్చరిక చేశారు. ధీరులైన సైనికులు పిడికిలి బిగించి చేసిన ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదాలు సమీపంలోని పాకిస్థాన్‌లోనూ ప్రతిధ్వనించి ఉంటాయి. భారత్ సామర్థ్యం, బలం ప్రధాని మాటల్లో, చేతల్లో ప్రపంచం అంతా చూసింది. భారత సైన్యం పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ టూరిజం, పరిశ్రమల రాకతో ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఉగ్రవాద జాడలేమీ మిగలవని భయపడిన పాకిస్థాన్ ఆర్మీ తన కుట్రలను అమలు చేసి తన నెత్తిమీదే చేయి పెట్టుకుంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కశ్మీర్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన వారానికే పహల్గాంలో టూరిస్టులను చంపేశారు. వెళ్లి మోదీకి చెప్పుకోవాలని పర్యాటకులకు సూచించారు. భారతీయుల జోలికి వచ్చినందుకు వారికి అప్పటికే డెత్ డేట్ ఖరారు అయిందని తర్వాత పరిణామాలు నిరూపించాయి. భారత్ దాడి చేస్తుందని ప్రపంచం అంతా తెలుసు, పాకిస్థాన్‌కూ తెలుసు. అయినా సరే, ఊహించని విధంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రధాని మోదీ నేతృత్వంలో అమలు చేశారు. తమ ఉగ్రవాద శిబిరాల జాడలు భారత్‌కు తెలియవని అనుకున్నారు. ప్రార్థనా మందిరాల్లో ఉన్నాయి కాబట్టి టెర్రరిస్టుల్ని కాపాడుకోవచ్చని అనుకున్నారు.
కానీ ఆపరేషన్ సిందూర్ వంద మందికిపైగా కరుడుగట్టిన ఉగ్రవాదుల అంతం చూసింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ, పాలకులు పాల్గొన్న సత్యాన్ని ప్రపంచానికంతటికీ భారత్ తెలియజెప్పింది. పాకిస్థాన్ పిచ్చిపట్టినట్లుగా భారత సరిహద్దుల్లో డ్రోన్ దాడులు చేస్తే, వాటిని కూల్చివేసి, నేరుగా పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు గురిపెట్టింది. తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్థాన్... టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్లు, చైనా ఇచ్చిన హతాఫ్ క్షిపణులతో దాడికి ప్రయత్నించినా, అన్నింటినీ భారత్ నేలమట్టం చేసింది. భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్థాన్‌కు ఉనికి సమస్య వచ్చేసింది, అందుకే కాళ్ల బేరానికి వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’లో మన సైన్యం ధ్వంసం చేసిన ఎయిర్‌బేస్‌లలో అత్యంత ముఖ్యమైనది రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్. ఇది పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ లాజిస్టిక్, కమాండ్ హబ్. ఇక్కడ ఉన్న C–130 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, IL–78 రీఫ్యూయలింగ్ ట్యాంకర్స్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్‌ను భారత దళాలు ధ్వంసం చేశాయి. చక్వాల్‌లోని మురిద్ ఎయిర్‌బేస్ మీద భారత్ చేసిన దాడిలో డ్రోన్ సౌకర్యాలు, ఫైటర్ జెట్‌లు ధ్వంసమయ్యాయి. JF–17, మిరాజ్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌లను కలిగి ఉన్న రఫీకీ ఎయిర్‌బేస్‌నూ భారత దళాలు టార్గెట్ చేసి ధ్వంసం చేశాయి. రహీం యార్‌ఖాన్ ఎయిర్‌బేస్ రన్‌వేలో భారీ గొయ్యి పడేలా భారత దళాలు బాంబులు వేశాయి. సింధ్ ప్రావిన్స్‌లోని సుక్కూర్ ఎయిర్‌బేస్ రన్‌వే, సౌకర్యాలు దెబ్బతిన్నాయి. పంజాబ్‌లోని చునియన్ ఎయిర్‌బేస్ మీద చేసిన దాడిలో ఎయిర్ డిఫెన్స్ రాడార్‌లు ధ్వంసమయ్యాయి. సింధ్‌లోని భోలారీ ఎయిర్‌బేస్ హ్యాంగర్, రన్‌వేకు పెద్ద నష్టం వాటిల్లి, అక్కడ 50 మందికి పైగా మరణించారు. వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, నలుగురు ఎయిర్‌మెన్ ఉన్నారు. ముషాఫ్ ఎయిర్‌బేస్‌పై భారత్ చేసిన దాడితో కిరనా హిల్స్‌లో భూగర్భ న్యూక్లియర్ నిల్వ స్థలాలకు సమస్యలు వచ్చాయని చెబుతున్నారు. ఈ దాడి పాకిస్థాన్‌లో ఆందోళనను రేకెత్తించింది. ఈ స్థావరం పాక్ ఆక్రమిత కశ్మీర్ సమీపంలో ఉంది. పాకిస్థాన్ సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి 35–40 మంది సైనికులను కోల్పోయింది. ఎయిర్‌ఫోర్స్ అనేక హైటెక్ ఎయిర్ క్రాఫ్ట్‌లను కోల్పోయింది.
ఈ దాడులు పాకిస్థాన్ రక్షణ సామర్థ్యాలను, ఆత్మ స్థైర్యాన్ని బాగా దెబ్బతీశాయి. ఎంతగా అంటే భారత ప్రధాని అదంపూర్ ఎయిర్‌బేస్‌లో ప్రసంగిస్తే దానికి పోటీగా పాకిస్థాన్ ప్రధాని కూడా ఓ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఎయిర్‌బేస్ లేదు. యుద్ధ ట్యాంక్‌పై నిలబడి మాట్లాడాల్సి వచ్చింది. మత మౌఢ్యంతో నిండిన టర్కీ.. భారత్‌పై వ్యతిరేకతను నరనరాన నింపుకున్న చైనా తప్ప, ఎవరూ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వలేదు. బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. కాల్పులు ఆపాలంటూ పాక్ ఆర్మీనే మొదట ప్రతిపాదించింది. అప్పటికే భారత్ తన లక్ష్యాలను చాలావరకూ సాధించింది. వందమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. పాకిస్థాన్ సైన్యం సమీపకాలంలో కోలుకోలేని విధంగా దాని మౌలిక సదుపాయాల్ని దెబ్బతీసింది. మరొక్కరోజు ఘర్షణలు కొనసాగి ఉంటే కరాచీ పోర్టు నుంచి ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టు వరకూ ఏవీ మిగిలేవి కావు. భారత్ సాధించిన విజయం ఎంత పద్ధతిగా ఉందో చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. మన బ్రహ్మోస్ క్షిపణి కోసం 17 దేశాలు ప్రతిపాదనలు పెట్టాయి. యుద్ధం ఎలాంటిదైనా వినాశనమే. అందులో విజేతలు సాంకేతికంగా ఉంటారు కానీ.. యుద్ధం చేసిన వారంతా నష్టపోతారు. ఆ విషయమే ప్రధాని మోదీ చెప్పారు. ఇది యుద్ధాల యుగం కాదన్నారు. అదే సమయంలో ఉగ్రవాద యుగం కూడా కాదని స్పష్టం చేశారు. శత్రువును ఓడించడమే యుద్ధంలో విజయం కానీ.. చంపడం కాదు. చంపడం కన్నా.. ఓడించడం ద్వారా జీవితకాలం ఆ విజయం నిలుస్తుంది. ఈ యుద్ధనీతిని బాగా ఔపోసన పట్టిన నేత ప్రధాని నరేంద్రమోదీ. ఈ భరతమాత ముద్దుబిడ్డ మనదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత శక్తిగా నిలబెట్టారు. ఆపరేషన్ సిందూర్ భారత చరిత్రలో ఓ విజయపతాక.
ఎస్. విష్ణువర్ధన్‌రెడ్డి ఉపాధ్యక్షుడు, ఏపీ బీజేపీ
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News