కుంభమేళా సందర్భంలో మేడారం ముచ్చట!
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:14 AM
ప్రయాగరాజ్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభమేళా నేపథ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలోనే ఆ మాటకొస్తే...

ప్రయాగరాజ్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభమేళా నేపథ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు కేవలం నాలుగురోజుల్లోనే కోటిన్నర మంది భక్తులు హాజరవుతారు. వీరిలో దాదాపు 60శాతం మంది గిరిజనులు, 30శాతం మంది అట్టడుగు వర్గాల వారు ఉంటారు. కనీస సౌకర్యాలు లేకున్నప్పటికీ కేవలం గిరిజన దేవతలైన సమ్మక్క సారాలమ్మ, గోవిందరాజు పగిడిద్ద రాజు, జంపనల ఆత్మబలిదానాలను గుర్తు చేసుకుంటూ వారిని దర్శించుకునే అపురూప ఘట్టం రెండేళ్లకోసారి ఆవిష్కృతమవుతుంది. ఫిబ్రవరి 12 నుంచి సంక్షిప్తరూపంలో మినీజాతర జరుగుతుంది.
మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రాంతాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ నుండి గుత్తి కోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రపంచంలో ఆదివాసీలు ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యే వేడుక మరొకటి లేదు. ఆదివాసీలు కాకుండా ఇతర మత, వర్గ, వర్ణాల వారు కోట్లాదిగా హాజరయ్యే ప్రార్థనాలయాలు, పూజా స్థలాలు–శబరిమల, మక్కా, జెరూసలేం, కుంభమేళా, తిరుపతి వంటివి–ఉన్నాయి. కానీ ఏమాత్రం కనీస సౌకర్యాలు లేకుండా, దట్టమైన అటవీ ప్రాంతంలో, కేవలం కొయ్యలను కోయ దేవతలుగా భావిస్తూ పూజించడానికి కోటిన్నరమంది రావడం ప్రపంచంలోనే మరెక్కడా కానరాదు. అందుకే, దీనిని, అత్యంత అరుదైన జన జాతరగా భావించవచ్చు.
ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.7500కోట్లతో వివిధ సౌకర్యాలను కల్పించింది. ఈ మహామేళావల్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 25 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా జాతీయ హోదా కల్పిస్తే గిరిజన జిల్లాగా పేరొందిన ములుగు జిల్లా రూపురేఖలు మారడమే గాక, ఆదివాసీ గిరిజన కుటుంబాలు ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తాయి. జాతర మేడారం కుగ్రామంలో సాగడం, నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు కోటిన్నర మంది హాజరు కావడం, పూర్తిగా గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలను ఈ జాతరలో అనుసరించడం తదితర కారణాలు దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనువుగా ఉన్నాయి. ఇటీవలే మన రాష్ట్రంలోని సుప్రసిద్ధ కాకతీయ కట్టడం రామప్ప రుద్రేశ్వరాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఇదే కోవలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ విభాగం క్రింద మరో అద్భుతమైన గిరిజన సాంస్కృతిక వేడుకగా నిలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి.
మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో పాటు తాడ్వాయి మండలానికి సమ్మక్క సారలమ్మ పేరు పెట్టింది. ఈ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆదివాసీ, గిరిజన సంఘాలు ఎంతోకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అటు చారిత్రక శిల్పసంపద ఉన్న రామప్ప దేవాలయం, ప్రకృతి సౌందర్యంతో అలరాడే లక్నవరం చెరువు, విస్తారమైన అటవీప్రాంతం, వేలసంవత్సరాల నాటి శిలాజాలు ఉన్న పాండవుల గుట్ట, సహజంగా పారే గోదావరీ నదీ... ఇలా ప్రతీ అంశంలోనూ ప్రత్యేకత గాంచిన ములుగు జిల్లాలోని మేడారం జాతరకు కూడా జాతీయ గుర్తింపు లభించేందుకు అన్ని అర్హతలున్నాయి. ఈ గుర్తింపు లభిస్తే మేడారం జాతరపై అధ్యయనం చేయడానికి, ఇక్కడి గిరిజన, ఆదివాసీ సంస్కృతిని తెలుసుకోవడానికి వివిధ దేశాలనుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. రామప్పకు వరల్డ్ హెరిటేజ్ హోదా దక్కడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర వహించింది. ఇప్పుడు మేడారం జాతరను జాతీయ పండగగా ప్రకటిస్తే దేశంలోని ఆదివాసీ గిరిజనుల పూర్తిస్థాయిలో మద్దతు లభించే అవకాశం కూడా ఉంటుంది.
కన్నెకంటి వెంకటరమణ
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..