Share News

యువతరానికి ఆదర్శం ఓంకార్‌

ABN , Publish Date - May 11 , 2025 | 02:38 AM

మద్దికాయల ఓంకార్‌ నిస్వార్థ ప్రజా నాయకుడు. ఈ తరానికి తెలియాల్సిన గొప్ప త్యాగధనుడు. నమ్మిన సిద్ధాంతపు గీత దాటని, రాజీపడని ఆయన తత్వానికి రాజకీయ, వర్గ శత్రువులు కూడా ఎందరో ఉండేవారు. ఆయన సైద్ధాంతిక, రాజకీయ పాఠశాల ఎందరినో తీర్చిదిద్దింది. 1926 మే 12న నేటి సూర్యాపేట జిల్లా...

యువతరానికి ఆదర్శం ఓంకార్‌

మద్దికాయల ఓంకార్‌ నిస్వార్థ ప్రజా నాయకుడు. ఈ తరానికి తెలియాల్సిన గొప్ప త్యాగధనుడు. నమ్మిన సిద్ధాంతపు గీత దాటని, రాజీపడని ఆయన తత్వానికి రాజకీయ, వర్గ శత్రువులు కూడా ఎందరో ఉండేవారు. ఆయన సైద్ధాంతిక, రాజకీయ పాఠశాల ఎందరినో తీర్చిదిద్దింది. 1926 మే 12న నేటి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం, ఏపూరు గ్రామంలో మద్దికాయల రామయ్య, అనంతలక్ష్మీ దంపతులకు ఓంకార్‌ జన్మించారు. నిజాం నవాబు పాలనలో దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలతో తెలంగాణ ప్రజలు అవమానాలకు గురవుతూ, వెట్టిచాకిరీ చేస్తూ బానిసలుగా జీవించేవారు. ‘వెట్టిచాకిరీని నిర్మూలించాలి, దున్నేవానిదే భూమి’ అనే నినాదాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆంధ్ర మహాసభలో 15 ఏళ్ల ఓంకార్‌ వలెంటీర్‌గా చేరి తరువాతి పోరాటంలో తుపాకీ చేతపట్టి నిజాం పాలనకు ఎదురొడ్డి పోరాడారు. 1972 నుంచి 83 వరకు మూడుసార్లు సీపీఎం నుంచి, 1985 నుంచి 1994 వరకు రెండుసార్లు ఎంసీపీఐ(యు) నుంచి మొత్తం ఐదుసార్లు (22 సంవత్సరాలు) నర్సంపేట ప్రజలు ఓంకార్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, ఆదివాసి హక్కుల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం, సాగుభూమి, సాగునీరు, ఇళ్ల స్థలాల పంపిణీ, మిగులు భూముల పంపకం, తాగునీరు, నిరుద్యోగ సమస్య, కార్మికుల, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ప్రజలచే ‘అసెంబ్లీ టైగర్‌’గా మన్ననలందుకున్నారు. మార్క్సిస్టు సైద్ధాంతిక రాజకీయ నిబద్ధతతో ఉన్న ఓంకార్‌ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, ఆ తరువాత సీపీఎంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కులమతాల అసమానతలు లేని నవసమాజం కోసం అహర్నిశలు పోరాడిన అమరజీవి ఓంకార్‌. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ 2025 మే 12 నుంచి 2026 మే 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజాచైతన్య కార్యక్రమాలను చేపడుతోంది. ఓంకార్‌ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాలకు పూనుకుంది.


ఈ కార్యక్రమాల్లో వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులతో పాటు సామాజిక శక్తులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువజనులు, ప్రజాతంత్రవాదులను కలుపుకుని ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఓంకార్‌ స్వస్థలమైన సూర్యాపేట జిల్లా ఏపూరులో 2025 మే 12న కాగడతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అదే రోజున సమీపంలోని వరంగల్‌ జిల్లా మచ్చాపూర్‌లో ఓంకార్‌ 125 అడుగుల భారీ స్మారక స్థూపాన్ని ఆవిష్కరిస్తూ ‘ఓంకార్‌ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ’ మొదలుకానుంది.

వనం సుధాకర్

ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

ఇవి కూడా చదవండి

Operation Sindoor: పౌరులు, ఆలయాలపైనే పాక్ దాడి.. వీడియోలతో భారత్ కౌంటర్

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..

Read Latest International News And Telugu News

Updated Date - May 11 , 2025 | 02:38 AM