మాతృభాష పునాదిగా ప్రపంచ పౌరులమవుదాం !
ABN , Publish Date - Feb 21 , 2025 | 12:40 AM
వ్యక్తుల అభివృద్ధిలోనూ, వ్యవస్థల పురోభివృద్ధిలోనూ భాషల పాత్ర చాలా కీలకం. భాషలు కేవలం మాట్లాడుకోడానికి మాత్రమే కాదు, విద్యను నేర్చుకోడానికి, దాని ద్వారా...
వ్యక్తుల అభివృద్ధిలోనూ, వ్యవస్థల పురోభివృద్ధిలోనూ భాషల పాత్ర చాలా కీలకం. భాషలు కేవలం మాట్లాడుకోడానికి మాత్రమే కాదు, విద్యను నేర్చుకోడానికి, దాని ద్వారా స్థిరమైన వృద్ధిని సాధించడానికి చాలా అవసరం. మాట్లాడే విధానాలు, నేర్చుకొనే పద్ధతులు, సమాజంతో మెరుగైన సంబంధాలను ఏర్పరుచుకోగలగడం వంటివి భాషా జ్ఞానం వల్లనే సాధ్యపడతాయి. భాషలు అంతరిస్తుంటే ప్రజలలో అవగాహన లోపం పెరుగుతుంది. సాంస్కృతిక వారసత్వం దెబ్బతింటుంది. వ్యక్తి-వ్యవస్థల వృద్ధి కుంటుపడుతుంది. ప్రపంచం అనేకమైన భాషలు మాట్లాడే ప్రజలతో నిండిన బహుభాషా వ్యవహార ప్రాంతం. దేశాలుగా పిలుచుకునే భౌగోళికమైన హద్దులకన్న, ఈ బహుభాషా వ్యవహార ప్రాంతాలు భిన్నం. భౌతికంగా ఒక ప్రాంతానికి పరిమితమైనా, బౌద్ధికంగా ప్రపంచంతో చప్పున అనుసంధానాన్ని సాధించగల తెలివిడి మనకు ఉంటుంది. అనేక భాషలలో మనకు ఉన్న వ్యవహార జ్ఞానం ఇందుకు సహకరిస్తుంది. కాబట్టి, భాషలను వేరుగా ఉంచి ఏ వృద్ధినీ కొలవలేం, ఏ అభివృద్ధినీ సాధించలేం.
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదివేలకు పైగా భాషలున్నాయి. వీటిలో ఏడువేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. మారుతున్న ప్రపంచం తీసుకొస్తున్న అనేక మార్పుల తాకిడి మాతృభాషలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. తక్కువమంది మాట్లాడే భాషలు త్వరగా అంతరించిపోతున్నాయి. భారతదేశం వంటి బహుభాషా వ్యవహార దేశాలలో ఈ మార్పును స్పష్టంగా గుర్తించవచ్చు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అండమాన్ నికోబార్ దీవుల్లోని భాషల్లో ఒకటైన ‘బో’ భాష మాట్లాడే చివరి వ్యవహర్త కొద్దికాలం క్రితం వచ్చిన సునామీలో చనిపోయింది. దీంతో ఆ భాషావ్యవహర్తల సమూహం అంతరించినట్టయింది. చివరి వ్యవహర్త జీవించి ఉన్నపుడు పరిశోధకులు గుర్తించి సేకరించిన వివరాలు రికార్డుల రూపంలో భద్రంగా ఉన్నాయి. కాని, ఆ సమూహపు వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలకు ఉనికి లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేకానేక కారణాలవల్ల ఇలా తుడిచిపెట్టుకుపోతున్న మాతృభాషల సంఖ్య ప్రతి ఏటా మూడంకెల సంఖ్యలలో పెరిగిపోతుండడం మనల్ని కలవరపెట్టే అంశం.
అభిప్రాయాలను వెల్లడించడానికి మాత్రమే కాక, జ్ఞానాన్ని పంచుకోడానికి, పెంచుకోడానికి కూడ భాషే మనకి ఆధారం. ప్రపంచ జ్ఞానం మనకు ఇవాళ అనేకమైన భాషల్లో అందుతోంది. విద్యావ్యవస్థ ఈ జ్ఞానాన్ని మాతృ భాషలలో ఆయా సమాజాలకు అందించాలి. జ్ఞాన శాఖలలోని వైవిధ్యాన్ని మాతృ భాషలలో గ్రహింపుకు తెచ్చుకున్న సమాజాలు సులభంగా, వేగంగా వృద్ధి చెందుతాయి. అందుకే భాషావేత్తలు విద్యను మాతృభాషల్లోనే నేర్పాలి అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.
ప్రపంచ దేశాలతో అనుసంధానం కావడం అన్నది ఇప్పుడు ప్రతిఒక్కరికి అవసరంగా మారిపోయింది. ఇటువంటి సందర్భాలలో భాష పరంగా మనకు భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ౩7 శాతం కన్నా ఎక్కువమంది తమ మాతృభాషలలో కాకుండా పర భాషలలో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఇది ౯0 శాతం దాకా ఉంది. విద్యావ్యవస్థలోని ఈ కల్లోలం ఆయా సమాజాలలోని ప్రజలలో భాషాపరమైన, భావ పరమైన సంఘర్షణలకు కారణమవుతుంది. సాంఘిక, రాజకీయ, వైజ్ఞానిక, కళాత్మక ఆలోచనలను ఇది నిరంతరం అస్థిరపరుస్తుంది. సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తమ భాషలో చదువుకొనే హక్కు ఉంటుంది. సమాజాలను పాలించే వ్యవస్థలు ఈ హక్కును గుర్తించటం, పాటించటానికి అనువైన విధానాలను రూపొందించటం విధిగా భావించి, కార్యాచరణను కట్టుదిట్టం చేయాలి.
ఇప్పుడు ప్రపంచమంతా బహుభాషా వ్యవహార ప్రాంతమే. అవకాశాలను, సందర్భాలను అనుసరించి అనేక దేశాలలో బహుభాషా విద్యాప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. మాతృభాషను విడిచిపెట్టకుండా మరిన్ని భాషలలో విద్యను నేర్పడమన్నది ఇప్పుడు ప్రపంచానికి కలిసి వస్తున్న తారకమంత్రం. దీనివల్ల విద్యార్థులలో విద్యార్జన శక్తిని, విద్యాసక్తిని పెంపొందింపజేయవచ్చు. తల్లిదండ్రులలో పిల్లల భవిష్యత్తు పట్ల ఆందోళనలను తగ్గించవచ్చు. అనేక సమాజాలతో కలసి జీవించగలిగే నైపుణ్యాన్ని పిల్లలలో వృద్ధి చేయవచ్చు. నేటి బాలలు రేపటి పౌరులు అన్నది పాతబడిన మాట. నేటి బాలలు రేపటి ప్రపంచ పౌరులు అన్నది కళ్ళకు కడుతున్న సత్యం. మనభాషతో పాటు మరిన్ని భాషలను నేర్చుకోవడం, భిన్నమైన సంస్కృతులను తెలుసుకోవడం అనేవి ఈ కాలపు పిల్లలకు మనం అందించదగిన సంపద. ఇది వారిలో వ్యక్తిగతమైన వృద్ధిని కలిగిస్తూ, సామూహిక చైతన్యానికి బాటలు వేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతిని కల్పించటంతో పాటు, ప్రపంచంతో అర్థవంతమైన భాగస్వామ్యం సాధించేందుకు సహకరిస్తుంది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఒకటిగా భాషల ప్రాధాన్యాన్ని యునైటెడ్ నేషన్స్ ఏనాడో గుర్తించింది. ప్రపంచం సాధించదగిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా యునైటెడ్ నేషన్స్ పేర్కొన్న పదిహేడింటిలో నాలుగవ లక్ష్యం ‘అందరికీ నాణ్యమైన విద్య’. అలాగే ‘లింగ సమానత్వం, అసమానతల తగ్గింపు’, ‘స్థిర అభివృద్ధిని సాధించే సమాజాలు -నగరాలు’... మొదలైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలన్నిటికీ భాషలతో నేరుగా సంబంధం ఉంది. యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలకు నిర్దేశించిన ఈ లక్ష్యాల సాధనలో మాతృభాషల ద్వారా విద్యాబోధన ప్రాధాన్యాన్ని మన రాష్ట్రాలు, దేశాలు ప్రథమ ప్రాధాన్యాంశంగా గుర్తించాలి. 2015లో ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలను అన్ని దేశాలకు యునైటెడ్ నేషన్స్ సంస్థ పంపించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆయా దేశాలు సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో 2016 నుంచి మనకు అందిస్తోంది. గడచిన తొమ్మిదేళ్ళ నివేదికల సారం ఏమిటంటే, ‘సమాజాల మధ్య సంభాషణకు, విద్యకు, సమ్మిళిత వృద్ధి సాధనకు, సాధికారతకు మాతృభాషలు చాలా కీలకం’ అని. 2022–-2032 దశాబ్దాన్ని యునెస్కో దేశీయభాషల దశాబ్దంగా ప్రకటించి ప్రపంచదేశాలలో మాతృభాషల ద్వారా సమ్మిళిత, సుస్థిర వృద్ధిని సాధించేందుకు కృషి చేస్తోంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంలో మనమూ, మన వ్యవస్థలూ ఈ విషయంపై దృష్టినిలపవలసిన అవసరం ఉంది.
ఆచార్య పమ్మి పవన్ కుమార్
తెలుగు ప్రొఫెసర్, హైదరాబాద్ యూనివర్సిటీ
(నేడు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం)
Also Read: కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?
Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక
Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..
Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు
Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం
For National News And Telugu News