Share News

Narendra Modi Foreign Policy: మారుతున్న ప్రపంచ దృశ్యంలో మోదీ

ABN , Publish Date - Nov 08 , 2025 | 05:43 AM

వర్తమాన ప్రపంచంలో మహా శక్తిమంతమైన నాయకులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌. ఈ ఇరువురి నిర్ణయాలు అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. ఈ కోవకు...

Narendra Modi Foreign Policy: మారుతున్న ప్రపంచ దృశ్యంలో మోదీ

వర్తమాన ప్రపంచంలో మహా శక్తిమంతమైన నాయకులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌. ఈ ఇరువురి నిర్ణయాలు అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. ఈ కోవకు చెందిన మరో ఇద్దరు నాయకులు: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు. ఈ నాయకుల మాటలు, చర్యలు వారి వారి దేశాల సరిహద్దులకు ఆవల ఎల్లెడలా మంచిగానో చెడుగానో పర్యవసిస్తాయి. ఇటువంటి శక్తిమంతమైన నాయకుల సరసన తానూ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తున్న అపూర్వ రాజనీతిజ్ఞుడు నరేంద్ర మోదీ అని ఆయన పార్టీ ఇప్పటికే ఘంటాపథంగా చెప్పుతోంది. అయితే యథార్థం భిన్నంగా ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో, అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలతో పోల్చిచే, చిన్నది. తలసరి ఆదాయం విషయంలో రష్యా, ఇజ్రాయెల్‌లతో పోల్చితే భారతీయుల తలసరి ఆదాయం చాలా చాలా తక్కువ. గణాంకాలను చూడండి (తొలి అంకె స్థూల దేశియోత్పత్తి పరిమాణం; రెండో అంకె తలసరి ఆదాయం. అన్ని అంకెలు అమెరికా డాలర్లలో): అమెరికా: 30.51 ట్రిలియన్‌; 89,000; చైనా: 19.23 ట్రిలియన్‌, 13,800; రష్యా: 2.54 ట్రిలియన్‌, 17,500; ఇజ్రాయెల్‌: 0.6 ట్రిలియన్‌, 54,000; ఇండియా: 4.19 ట్రిలియన్‌, 2,900. భారత్‌ ఆర్థిక వ్యవస్థ కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ 7 రెట్లు, చైనా ఆర్థిక వ్యవస్థ 4.5 రెట్లు పెద్దవి. భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థే కావచ్చు కానీ మన ప్రస్తుత స్థూల దేశియోత్పత్తి రెట్టింపు కావడానికి పది సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటికి అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థల పరిమాణం మరింతగా పెరుగుతుంది.


చెప్పవచ్చినదేమిటంటే స్థూల దేశియోత్పత్తిలో భారత్‌, అమెరికాల మధ్య అంతరం, అలాగే భారత్‌ చైనాల మధ్య అంతరం మరింతగా పెరుగుతుందేగానీ తగ్గే అవకాశం ఎంతమాత్రం లేదు. రష్యా, ఇజ్రాయెల్‌ల స్థూల దేశీయోత్పత్తి పరిమాణాలు చిన్నవేకానీ భారత్ తలసరి ఆదాయంతో పోలిస్తే రష్యా తలసరి ఆదాయం 6 రెట్లు, ఇజ్రాయెల్‌ తలసరి ఆదాయం 18 రెట్లు అధికంగా ఉన్నది. ఈ గణాంకాలు అన్నీ భారత్‌ ప్రస్తుత పాలకులకు మినహా ప్రపంచ నాయకులు అందరికీ తెలుసు సుమా! ప్రపంచ దేశాలు భారత్‌ను గౌరవిస్తున్నాయి, సందేహం లేదు. మనకు లభిస్తున్న గౌరవాదరాలకు కారణాలు ఏమిటి? మన ప్రజాస్వామ్యం, సముజ్వల చరిత్ర, పురాతన సంస్కృతి, ప్రపంచ శాంతి పరిరక్షణలో నిర్వహిస్తున్న పాత్ర, భారతీయ మార్కెట్‌ పరిమాణం, శక్తి సామర్థ్యాలు, అన్నిటికీ మించి అత్యధిక జనాభా ఉన్న సమాజం. అంతేగానీ ఒక అగ్రరాజ్యమనే భావనతో భారత్‌కు ఈ గౌరవాదరాలు లభించడం లేదు. ఇదొక నిష్ఠుర సత్యం. ఏ దేశమైనా ఇతర దేశాలతో సంబంధాల విషయంలో వాణిజ్యానికి అధిక ప్రాధాన్యమిస్తుంది. ప్రాంతీయంగా సుస్థిర శాంతిని కోరుకుంటుంది. ‘మీరు మాకు మిత్ర దేశమైతే, పాకిస్థాన్‌ పట్ల తప్పకుండా విరోధ భావం చూపాలి’ అన్న వైఖరితో భారత్‌ వ్యవహరిస్తున్నప్పటికీ తమ తమ వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే అన్ని దేశాలు భారత్‌, పాకిస్థాన్‌లతో సంబంధాలు నెరపుతాయి. ఇది మనం విస్మరించకూడని వాస్తవం. వర్తమాన ప్రపంచంలో పెనుమార్పులు అనూహ్య వేగంతో సంభవిస్తున్నాయి. 2023లో జీ–20 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సును భారత్‌ నిర్వహించింది. ఈ శిఖరాగ్ర సదస్సు ఒక వార్షిక కార్యక్రమం. ప్రతి సభ్య దేశమూ వరుసగా ఈ శిఖరాగ్రాన్ని నిర్వహిస్తుంది. మరుసటి సంవత్సరం ఈ సదస్సుకు ఏ సభ్య దేశం ఆతిథేయిగా ఉండాలో ముందటి సంవత్సరం శిఖరాగ్ర సమావేశంలోనే నిర్ణయిస్తారు. 2024లో జీ–20 శిఖరాగ్ర సదస్సును బ్రెజిల్‌ నిర్వహించింది. నవంబర్‌ 2025లో దక్షాణాఫ్రికాలో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరగనున్నది. 2026 జీ–20 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సు అమెరికాలో జరగనున్నది. ఇంతకూ జీ–20 శిఖరాగ్ర సదస్సును నిర్వహించడమనేది పెద్ద విషయం కాదు. అయితే మన దేశం మాదిరిగా ఏ సభ్య దేశమూ ఆ సదస్సు నిర్వహణ గురించి ఘనంగా ప్రచారం చేసుకోలేదు.


జీ–20 కంటే జీ–8, జీ–7 కూటములు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు కొత్తగా జీ–2 ప్రభవించింది. జిన్‌పింగ్‌తో సమావేశానికి ముందు, తరువాత కూడా చైనా అధినేతకు తనతో సమస్థాయి హోదా సమకూరుస్తూ సమాదరంతో మాట్లాడారు. ట్రంప్‌ మాటలు డాంబికంగా ఉన్నాయి. జిన్‌పింగ్‌ మనసులో ఏమున్నదో ఎవరికీ తెలియదు. అంతుచిక్కని స్పందనలు ఆయనవి. బహుళధ్రువ ప్రపంచం గురించి భారత్‌ ఏమి చెప్పినప్పటికీ ప్రపంచంలో రెండే రెండు అగ్రరాజ్యాలు ఉన్నాయి. రష్యా వాటికి కొంచెం వెనుకగా ఉన్నది. నిన్నటిదాకా ‘అమెరికా భద్రతకు పొంచి ఉన్న ముప్పు’ ఒక్కసారిగా అంతర్థానమయిపోయింది. అమెరికా, చైనాల మధ్య కొత్త ‘స్నేహపూరిత’ సంబంధాలతో క్వాడ్‌ ప్రాధాన్యం కోల్పోనున్నది. వాస్తవాలను మరింత నిశితంగా చూద్దాం: అరుదైన భూ ఖనిజాలు, సోయాబీన్‌ ఎగుమతులు, దిగుమతుల విషయంలో అమెరికా, చైనాల మధ్య ఒక మినీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. టిక్‌–టాక్‌ వివాదాన్ని కూడా ఆ రెండు దేశాలు పరిష్కరించుకునే అవకాశమున్నది; అమెరికా–భారత్‌ వాణిజ్య ఒప్పదం ఇంకా సంప్రతింపుల దశలోనే ఉన్నది. నెలల తరబడి జరుగుతున్న చర్చలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు; అమెరికా, చైనాల మధ్య సుంకాల సమరం జరిగింది (పరస్పరం ప్రతీకార సుంకాలు కూడా విధించుకున్నాయి). అయితే బుసాన్‌లో ట్రంప్‌, జిన్‌పింగ్‌ల సమావేశమనంతరం సాంకేతికతల బదిలీ, ఎగుమతులపై నియంత్రణలు, ఓడరేవుల చార్జీలతో వివిధ అంశాలపై రెండు దేశాలూ ఒక అంగీకారానికి వచ్చినట్టు కనిపిస్తోంది. పరస్పరం సుంకాలు తగ్గించేందుకు చైనా, అమెరికాలు అంగీకరించాయి. భారత్‌పై విధించిన శిక్షాత్మక సుంకాలను సడలించేందుకు అమెరికా ఇంకా సుముఖంగా లేదు; చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు యథావిధిగా ఉంటాయి. భారతీయ కంపెనీలు రష్యా చమురును కొనుగోలుచేస్తే వాటిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి; అమెరికా ప్రస్తుతం చైనా సరుకులకు ఇస్తున్న ప్రథమగణ్య ప్రాధాన్యతను తగ్గిస్తుంది; అలాగే భారత్‌కు 2019లో రద్దు చేసిన జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను పెంచుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై సుంకాలు తగ్గించడం లేదా తొలగించే విధానం)ను పునరుద్ధరించే అవకాశాలు లేవు అనేది స్పష్టం. ట్రంప్‌తో మోదీ చివరిసారి ఫిబ్రవరి 14, 20౨5న సమావేశమయ్యారు. దరిమిలా మూడు సందర్భాలలో ట్రంప్‌–మోదీ సమావేశం జరగవలసి ఉన్నది. తొలుత కెనడాలో జీ–7 శిఖరాగ్ర సదస్సు తరువాత. స్వదేశానికి తిరిగి వెళ్లుతూ ‘వాషింగ్టన్‌కు రావాలని మోదీని ట్రంప్‌ ఆహ్వానించారు.


ఈ ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించారు. ఇది సరైన నిర్ణయమే. పిదప ఈజిప్ట్‌లో గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమం. ఈ సమావేశానికి మోదీ వెళ్లలేదు. ఆ తరువాత గత నెల కౌలాలంపూర్‌లో ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సు. ఈ సదస్సునుద్దేశించి మోదీ వర్చ్యువల్‌గా ప్రసంగించారు. ఆసియాన్‌ సదస్సుకు మోదీ స్వయంగా వెళ్లకపోవడం సరికాదని నేను భావిస్తున్నాను. ట్రంప్‌తో ద్వైపాక్షికంగా సమావేశమయ్యేందుకు, అసలు ఆయనతో సంభాషించేందుకు కూడా మోదీ ఆసక్తిచూపడంలేదని, ఉద్దేశపూర్వకంగానే తప్పించుకుంటున్నారని దౌత్యవర్గాలు భావిస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ వ్యవహారంపై ట్రంప్‌ తన పాత మాటను మరొకసారి పునరుద్ఘాటించాడు. తీవ్రమవుతున్న సైనిక సంఘర్షణలకు స్వస్తి చెప్పేలా భారత్‌, పాకిస్తాన్‌లను బలవంతం చేయడానికై ‘వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోను’ అని ఆ రెండు దేశాలను బెదిరించానని, యుద్ధం నాలుగో రోజున నిలిచి పోయిందని ట్రంప్‌ వెల్లడించాడు. ఆయన ఇలా ప్రకటించడం ఇది ఎన్నోసారో మీకు గుర్తుందా? ట్రంప్‌ మాటను బహిరంగంగా గానీ, పార్లమెంటులో గానీ నరేంద్ర మోదీ నిరాకరించనే లేదు. చైనా సైనిక దళాలు భారత భూభాగాలలోకి చొచ్చుకువచ్చి తిష్ఠ వేశాయని, ఇది దురాక్రమణ మినహా మరేమీ కాదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయన మొహాన మోదీ చెప్పనే లేదు కదా. ట్రంప్‌, జిన్‌పింగ్‌ల మధ్య వెల్లివిరిసిన కొత్త స్నేహ సరసత జపాన్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌తో పాటు భారత్‌కూ సమస్యలు సృష్టిస్తోంది. భారత్‌కు ఇప్పుడు దక్షిణాసియాలో ఒక్క మిత్ర దేశమూ లేదు. పశ్చిమాసియా దేశాలు సమష్టిగా కొత్త సర్దుబాట్లు చేసుకుంటున్నాయి. అంతేకాదు, భారత్‌ను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌తో కొత్త స్నేహ వారధులు నిర్మించుకుంటున్నాయి. రాజనీతిలో మన పురాతన ఆచార్యుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలని చెప్పాడు? చుట్టుముట్టిన ఇబ్బందులను నమ్రతతో ఆకళింపు చేసుకుని విజ్ఞతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని కాదూ? నరేంద్ర మోదీగారూ, ప్రస్తుతం మీరు అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై తప్పక పునరాలోచన చేయాలి. మౌలిక మార్పులతో కొత్త వైదేశిక నీతికి రూపకల్పన చేయాలి.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఈ వార్తలు కూడా చదవండి...

ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్

రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2025 | 05:43 AM