Model Citizens at Home and Beyond: ఇంటా బయటా ఉత్తమ పౌరులు
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:53 AM
నేను అనేక సంవత్సరాలుగా రాస్తున్న ఈ కాలమ్‌లో నా కుటుంబం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఇప్పుడు అందుకు ఒక మినహాయింపునిస్తున్నాను. మా అమ్మగారు గతవారం...
నేను అనేక సంవత్సరాలుగా రాస్తున్న ఈ కాలమ్‌లో నా కుటుంబం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఇప్పుడు అందుకు ఒక మినహాయింపునిస్తున్నాను. మా అమ్మగారు గతవారం మరణించారు. మా నాన్నగారు చనిపోయిన పన్నెండు సంవత్సరాలకు ఆమె శాశ్వతంగా కన్నుమూశారు. ఇరువురూ విస్తృతంగా ప్రసిద్ధులు కారు. అయితే ఆదర్శప్రాయులు అయిన తల్లిదండ్రులు. ఆ ఆదర్శప్రాయతలో గుర్తుచేసుకోవల్సిన కొన్ని ఇతర విషయాలు ఉన్నాయి. మొహమాటంలేని స్వోత్కర్షలకు పోకుండా, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టడం ద్వారా తమ దేశభక్తిని వ్యక్తం చేసిన తరానికి చెందిన విద్యావంతులు నా జననీజనకులు. ఇక్కడ వారి గురించి నేను రాస్తున్న ఉదాత్త విషయాలను పాఠకులు తమకు సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తుల– తల్లిదండ్రులు, పినతండ్రులు, మేనమామలు, మేనత్తలు, ఉపాధ్యాయులు, డాక్టర్లు– జీవిత విశేషాలలోను గుర్తించగలరు.
మా నాన్న సుబ్రమణియం రామదాస్ గుహ 1924లో ఊటీలో జన్మించారు. ఇరవైమూడు సంవత్సరాల తరువాత ఆయన తన కన్న ఊరును సందర్శించినప్పుడు అక్కడ పరిచయమైన విశాలాక్షి నారాయణమూర్తి అనే ఒక యువతితో ప్రేమలో పడ్డారు. రామదాస్ గుహ ఆ కాలంలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పిహెచ్.డి తుదిదశలో ఉన్నారు. ప్రముఖ భౌతికశాస్త్రవేత్త జి.ఎన్.రామచంద్రన్ ఆయన సహచర పరిశోధక విద్యార్థులలో ఒకరు. ఆయన కోరుకుంటే బ్రిటిష్, యూరోపియన్ లేదా అమెరికా విశ్వవిద్యాలయాలలో ఎక్కడైనా పోస్ట్ డాక్టొరల్ స్కాలర్‌షిప్ తప్పక లభించి ఉండేది. అయితే ఆయన హృదయం అంతా ఊటీలో మోసులెత్తిన ప్రేమతో నిండిపోయి ఉంది. ఆ భావోద్వేగం ఆయనను ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయంలో పరిశోధనకు కాకుండా డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎఫ్‌ఆర్‌ఐ)లో కొలువుకు నడిపించింది. విశాలాక్షి తండ్రి ఆ సంస్థలో ఉద్యోగి. మా నాన్న 1948లో ఎఫ్‌ఆర్‌ఐలో చేరారు. మూడు సంవత్సరాల అనంతరం మా అమ్మను వివాహం చేసుకున్నారు.
మా నాన్న ప్రభుత్వోద్యోగుల కుటుంబానికి చెందినవారు. ఆయన సోదరుడు ఒకరు భారత వాయుసేనలో ఉన్నారు. ఒక సోదరి ఆర్మీ నర్సింగ్ సర్వీస్‌లో ఉన్నారు. ఒక బాబాయి ఆయన మాదిరిగానే శాస్త్రవేత్త. అలాగే బావమరిది కూడా. ప్రజా హితానికి తోడ్పడే పరిశోధనలకు అంకితమైనవారు. మా నాన్నగారు భారత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో గౌరవభావం ప్రతిధ్వనిస్తూ ఉండేది. చిత్తశుద్ధి ఉన్న గౌరవమది. ప్రభుత్వ ఆస్తులను ఎటువంటి పరిస్థితులలోను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోకూడదనేది ఆయన సునిశ్చిత విశ్వాసం. ఆయన తన ఉద్యోగ జీవితమంతా ఈ విశ్వాసానికి కట్టుబడి ఉన్నారు. ఎఫ్‌ఆర్‌ఐ కల్పించిన కారు సదుపాయాన్ని ఆయన వాడుకోలేదు. ప్రతి రోజూ సైకిల్‌పైనే ప్రయోగశాలకు వెళ్లి, తిరిగి సైకిల్ మీదే ఇంటికి తిరిగివచ్చేవారు.
ప్రభుత్వోద్యోగ విధులను నిబద్ధతతో నిజాయితీగా నిర్వర్తించే మా నాన్న, సామాజిక సంకుచితత్వాలను నిరసించేవారు. ఆ కాలంలో ఇతర ప్రభుత్వ పరిశోధనా సంస్థలలో వలే ఎఫ్‌ఆర్‌ఐలో కూడా శాస్త్రవేత్తల విభాగంలో బ్రాహ్మణుల ప్రాబల్యముండేది. వారి కుమారులు తమ వంశావళి గురించి ఘనంగా చాటుకునేవారు. తాము, తమ తండ్రులు ఏటా తమ యజ్ఞోపవీతాలను ఎలా మార్చుకునేది సగర్వంగా చెబుతుండేవారు. మా నాన్నగారు జంధ్యం ధరించేవారు కాదు. నన్నూ ఆ ఆచారాన్ని పాటించేందుకు ప్రోత్సహించలేదు. కులపరమైన హెచ్చుతగ్గులను ఆయన ఏవగించుకునేవారు. కుటుంబ నేపథ్యమే ఆయనలో ఆ తిరస్కార వైఖరిని సృష్టించింది. ఆయన తండ్రి సోదరుడు ఆర్.గోపాలస్వామి అయ్యర్ (1878–1943) సాంఘిక సంస్కర్త. మైసూరు సంస్థానంలో అంటరానితనం అనాచార బాధితులకు ఆ దౌష్ట్యం నుంచి విముక్తి కలిగిచేందుకు ఆయన చాలా పాటుపడ్డారు.
మా అమ్మగారు మరింత సదాచార బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె కళాశాల విద్యాభ్యాసం మద్రాసు, ఢిల్లీ నగరాల్లో జరిగింది. డెహ్రాడూన్‌లో సమస్త కుల మతాల వారికి ప్రవేశార్హత ఉన్న ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. తోటి వ్యక్తి విలువను ఆదాయం, సామాజిక హోదా ప్రాతిపదికన అంచనా వేసేందుకు ఆమె పూర్తి విముఖత చూపేవారు. ఈ కాలమిస్ట్ వలే కాకుండా నా తల్లిదండ్రులు తమ లౌకికవాద విశ్వాసాలను ఎన్నడూ బహిరంగంగా చాటేవారు కాదు. అవి వారి ప్రవర్తనలో సువ్యక్తమవుతుండేవి. డెహ్రాడూన్‌లో వారు అత్యంత సన్నిహితంగా ఉన్న మూడు కుటుంబాలు సిక్కు, కాయస్థ, తమిళ్ క్రైస్తవులవి. సంపన్న బ్రాహ్మణ కుటుంబాలు వంట మనిషిని నియమించుకునేవారు. తాము తీసుకునే ఆహారం శుచిగా, శుద్ధంగా ఉండాలనే భావనతో తమ శాఖకు చెందిన పురుషుడిని మాత్రమే వంటవాడుగా ఏర్పాటు చేసుకునేవారు. వంట మనిషిని పెట్టుకునే తాహతు ఉన్న నా తల్లిదండ్రులు, నాకు తెలిసిన తరువాత నియమించుకున్న వంటవాళ్లు ఇరువురూ బ్రాహ్మణేతరులే. ఆ ఇరువురూ గఢ్వాల్ హిమాలయ ప్రాంతాలకు చెందినవారు. తదనంతర కాలంలో కుల పట్టింపులను మరింతగా అధిగమించి ఒక ముస్లిమ్‌ను తమ వంటవాడుగా నా తల్లిదండ్రులు నియమించుకున్నారు.
మా నాన్నగారి పర్యవేక్షణలో పిహెచ్.డి తీసుకున్నవారిలో మొదటి వ్యక్తి వి.ఎన్.ముఖర్జీ. ఆగ్రా విశ్వవిద్యాలయం ముఖర్జీకి డాక్టరేట్ పట్టా ప్రదానం చేసేందుకు అంగీకరించిందని తెలియగానే ఆయనను మరుసటి ఉదయం ఇంటికి రమ్మని మా నాన్న ఆహ్వానించారు. ముఖర్జీ మా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కగానే నా సోదరి వాణి, నేనూ (అప్పటికి మా వయసు వరుసగా పన్నెండు, పది సంవత్సరాలు) తలుపులు తెరిచి మా నాన్నగారు పురిగొల్పిన విధంగా ‘గుడ్ మార్నింగ్, డాక్టర్ ముఖర్జీ’ అని గౌరవపూర్వకంగా స్వాగతం పలికాము. అంతకు ముందురోజు సాయంత్రం వరకు కేవలం ‘ముఖర్జీ’గా మాత్రమే ఉన్న వి.ఎన్.ముఖర్జీ మా సంబోధనతో చాలా ఆనందభరితుడు అయ్యారు.
పాఠశాల ఉపాధ్యాయురాలిగా మా అమ్మగారు, నాన్నగారి కంటే చాలా ఎక్కువ మంది జీవితాలను ప్రభావితం చేశారు. డెహ్రాడూన్ కంటోన్మెంట్‌లోని కేంబ్రియాన్ హాల్ అనే పాఠశాలలో ఆమె రెండు దశాబ్దాల పాటు హిందీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, జాగ్రఫీ బోధించారు. కులం, వర్గం, మతం ప్రాతిపదికన గానీ, అంతకంటే ముఖ్యంగా అభ్యసన సామర్థ్యాల ఆధారంగా గానీ ఆమె తన విద్యార్థుల పట్ల ఎటువంటి తరతమ భావం చూపేందుకు అంగీకరించేవారు కాదు. పాఠశాల విద్యాభ్యాసం ముగిసిన తరువాత కూడా ఎంతో మంది విద్యార్థులు పండుగలు, కొత్త సంవత్సరం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుండేవారు. ప్రతి ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆమెకు ఆ రోజంతా ఫోన్ కాల్స్ వస్తుండేవి. తమ యాభైలు, అరవైలలో ఉన్న పలువురు మాజీ విద్యార్థులు వ్యక్తిగతంగా వచ్చి పూలగుత్తులతో శుభాకాంక్షలు తెలిపేవారు. ‘మేడమ్ గుహ’ గురించి గౌరవాదరాలతో మాట్లాడుతుండేవారు. మా అమ్మ మరణించిన తరువాత బోధనా వృత్తి, ముఖ్యంగా పాఠశాల విద్యాబోధన ఎంత ఉత్కృష్టమైన వృత్తో నాకు మళ్లీ సరికొత్తగా అర్థమయింది. అదొక నిస్వార్థమైన వృత్తి. స్వీయ కేంద్రితమైనది ఎంత మాత్రమూ కాదు. ఉద్యోగ విరమణ చేసిన 41 సంవత్సరాలకు మా అమ్మ మరణించింది. మా అమ్మ వద్ద చదువుకున్న విద్యావేత్తలు, నటులు, సైనికాధికారులు, ఫైటర్ పైలట్‌లు, రచయితలు, డాక్టర్లు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి సంతాప సందేశాలు నాకు వెల్లువెత్తాయి.
మా నాన్నగారు 2012లో క్రిస్మస్ పండుగ రోజున 88 సంవత్సరాల వయసులో మరణించారు. అంతిమ దినాలలో అనారోగ్యగ్రస్తుడైన మా నాన్నను ఆస్పత్రికి తీసుకువెళ్లింది అబ్బాస్, రాధాకృష్ణ అనే ఇద్దరు పొరుగు పెద్ద మనుషులు. వారిరువురూ ఆయనకు మంచి స్నేహితులు. నాన్న మృతి తరువాత మా అమ్మగారు బెంగళూరులో కోరమంగళ ప్రాంతంలోని తమ స్వగృహంలో కాకుండా మా అక్కయ్య వద్దనో లేదా నా కుటుంబంతోనో ఉండేవారు. వృద్ధాప్య సహజమైన అశక్తత మినహా కుటుంబం, స్నేహితులు, ఒకనాటి తన విద్యార్థుల సహవాసం, సమక్షంలో ఆమె జీవితం ఆనందంగా గడిచిపోయింది. రాజకీయాలలో ఆసక్తి చూపే వ్యక్తి కానప్పటికీ పెచ్చరిల్లుతున్న మత దురభిమానాలు, హిందుత్వ పక్షపాతాలు ఆమెను అమితంగా వ్యాకులపరిచాయి. నెహ్రూ కాలం నాటి బహుళత్వ, సమ్మిళిత, వైవిధ్యభరితమైన సామాజిక వాతావరణంతో ప్రభావితమైన ఆ విద్యావతికి ‘ఈ పురానవ భారత భూమి తన తోటి హిందువులకు మాత్రమే సొంత భూమి’ అన్న సంకుచిత భావనను ఆమె ఏవగించుకునేవారు. డెహ్రాడూన్‌లో డైసీ బట్లర్ వైట్, నిఘాత్ రహ్మాన్ అనే ఇద్దరు సహచర ఉపాధ్యాయురాళ్ల సలహాలు, సూచనలకు ఆమె ప్రత్యేక విలువనిచ్చేవారు. బెంగళూరు జీవితంలో ఆమెకు సన్నిహిత ప్రేమాస్పదులు లయీఖ్, జాఫర్ ఫుతేహల్లీ అనే దంపతులు.
నాకు పుట్టుకతోనే అనేక రకాల సామాజిక సౌలభ్యాలు సమకూరాయి. హిందువుల ప్రాబల్యం, పరిపాలనలో ఉన్న దేశంలో నివసిస్తున్న ఒక హిందూ మతస్థుడుగా, కుల పక్షపాతాలు పరిపూర్ణంగా ఉన్న సంస్కృతిలో ఒక బ్రాహ్మణ సంజాతుడుగా, పితృస్వామ్య అణచివేతలు తీవ్రంగా ఉన్న సమాజంలో ఒక పురుషుడుగా, జీవితోన్నతికి ఇంగ్లీషు మాత్రమే అనేక అవకాశాలు కల్పిస్తున్న దేశంలో– ఆ భాషను ధారాళంగా మాట్లాడగలిగిన మేధా సామర్థ్యమున్న వ్యక్తిగా నేను స్వయంగా ఆర్జించని ఆ సానుకూలతలు నా జీవిత ప్రస్థానాన్ని మరింత సుఖప్రదం చేశాయి. నా తోటి భారతీయులలో అత్యధికులకు ఆ అనుకూలతలు అసలు లేవనే వాస్తవాన్ని నా తల్లిదండ్రులు విశాలాక్షి, సుబ్రమణియం రామదాస్ గుహ ఉదాత్త జీవితాలు నాకు ఎరుకపరిచాయి. సౌభ్రాతృత్వ స్ఫూర్తి, పక్షపాతాలు, ప్రతికూలతలు ప్రదర్శించని విశాల భావదీప్తి, పౌరసత్వ ధర్మాలనే వివేకశీలతను మా అమ్మ, నాన్న ఇరువురూ సైద్ధాంతికంగా కాకుండా తమ జీవితాచరణలో దృఢంగా, స్వార్థరహితంగా ధ్రువీకరించారు. నా జననీజనకుల జీవితాలను సింహావలోకనం చేసినప్పుడు, ఆ సముదాత్త సత్యాన్ని నా యవ్వనంలో కంటే ఇప్పుడే మరింత స్పష్టంగా అవగతం చేసుకోగలుగుతున్నాను.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఈ వార్తలు కూడా చదవండి..
సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..
మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు
Read Latest AP News and National News