Telangana Medical Colleges: మెడికల్ కాలేజీలపై తప్పులెన్నువారు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:44 AM
నార్సిస్టిక్ పెర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారు తమను తాము గొప్పవారిగా ఊహించుకుంటూ, అవతలివారి ప్రతి పనినీ తప్పుపడుతూంటారు. బీఆర్‌ఎస్ నేతలు మెడికల్ కాలేజీల అంశంమీద చేసిన విమర్శలు ఈ కోవలోకే...
నార్సిస్టిక్ పెర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారు తమను తాము గొప్పవారిగా ఊహించుకుంటూ, అవతలివారి ప్రతి పనినీ తప్పుపడుతూంటారు. బీఆర్‌ఎస్ నేతలు మెడికల్ కాలేజీల అంశంమీద చేసిన విమర్శలు ఈ కోవలోకే వస్తాయి. ప్రతి జిల్లాకూ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, జిల్లా హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా మార్చుకోవడానికి రాష్ట్రాలకు నిధులు కేటాయించింది. మూడో దశలో దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది. దీనికి ముందే, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి ఖమ్మం, కరీంనగర్‌లో మెడికల్ కాలేజీలు ఇవ్వాలని కోరితే, పూర్తి వివరాలతో (డీపీఆర్) మూడోదశలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు కాలేజీలు ఏర్పడడం ఇష్టంలేక కాబోలు, నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ సూచనను తుంగలో తొక్కింది. దీంతో తెలంగాణ మినహా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కేంద్రం నుంచి మెడికల్ కాలేజీలు, నిధులు మంజూరు అయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పార్లమెంట్‌లో ప్రకటించడంతో దీనికి కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ తిప్పలు పడింది. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇరుకున పెడుతుండడంతో ‘కేంద్రం ఇచ్చేది ఏంది.. మేమే జిల్లాకో మెడికల్ కాలేజీ పెడతాం’ అని ప్రకటించింది. అనుకున్నదే తడువుగా సరిపడా ఫ్యాకల్టీ, కాలేజీల భవనాలు, ల్యాబులు, మౌలిక వసతులు, అనుబంధంగా అవసరమైన బెడ్ స్ట్రెంత్ కలిగిన హాస్పిటళ్లు లేకుండానే 2022లో 8 కాలేజీలు, 2023లో 9 కాలేజీలను ప్రారం భించారు. ఇలా గంపగుత్తగా కాలేజీల ఏర్పాటును నిపుణులు వ్యతిరేకించినప్పటికీ నాటి ప్రభుత్వం లెక్కచేయలేదు. 2021 వరకూ ఉన్న పాత 9 కాలేజీల్లోని ఫ్యాకల్టీనే మొత్తం 17 కాలేజీల్లోకి సర్దుబాటు చేశారు. 2023లో మరో 9 కొత్త కాలేజీలతో మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరింది. దీంతో, టీచింగ్ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా పెరిగింది.
ఒక వంద సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టాలంటే, కనీసం 420 బెడ్ల హాస్పిటల్ ఉండాలి. మన దగ్గర 50 బెడ్లు లేదా వంద బెడ్లు ఉన్న హాస్పిటళ్లనే మెడికల్ కాలేజీలకు అనుబంధ హాస్పిటళ్లుగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి చూపించారు. కొత్తగా హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మించలేదు. పాత 50 లేదా 100 బెడ్లు ఉన్న హాస్పిటళ్లలోనే అదనంగా బెడ్లను వేసి సర్దుబాటు చేశారు. ఈ అంశంలో ఎన్‌ఎంసీ అభ్యంతరాలు లేవనెత్తగా, రెండేళ్లలో కొత్త హాస్పిటళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని నాటి ప్రభుత్వం అఫిడవిట్లు ఇచ్చింది.
మరోవైపు, అద్దెకు భవనాలను తీసుకుని, పాత ప్రభుత్వ భవనాలను రిపేర్లు చేసి కాలేజీలుగా మార్చారు. కొన్ని చోట్ల గోదాములను క్లాసు రూములుగా మార్చేశారు. రెండేళ్లలో అన్ని కాలేజీలకు భవనాలను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్‌ఎంసీకి అప్పటి ప్రభుత్వం అఫిడవిట్లు ఇచ్చి, పర్మిషన్లు తెచ్చింది. కానీ, 2023 చివరిలో అధికారం నుంచి దిగిపోయే నాటికి కూడా హాస్పిటళ్లను, కాలేజీలను అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. చాలా చోట్ల కనీసం భవన నిర్మాణ పనులను కూడా ప్రారంభించలేదు.
మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు అని మూడు కేటగిరీలు ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లను మాత్రమే నేరుగా నియమించుకోవడానికి అవకాశం ఉంది. అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లను డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకునే అవకాశం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిక వ్యక్తి కనీసం మూడేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకుంటేనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్‌కు అర్హులు అవుతారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా కనీసం నాలుగేళ్ళ సర్వీస్ ఉంటేనే ప్రొఫెసర్‌గా ప్రమోషన్‌కు అర్హులు అవుతారు. అంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన వ్యక్తి, ప్రొఫెసర్ అవ్వాలంటే కనీసం ఏడేళ్ళ అనుభవం ఉండాలి. మన మెడికల్ కాలేజీల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల కొరతకు ఇదే ముఖ్య కారణం. మూడేళ్ళలో 25 కొత్త కాలేజీలు ఏర్పడగా, అవసరమైన మేర అర్హత కలిగిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఇందుకు అవసరమైన క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్ ఉన్నవాళ్లు ఎక్కువమంది లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో పనిచేయడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాల వల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.
సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడం, కాలేజీలకు హాస్పిటళ్లకు భవనాలు లేకపోవడంతో 2022–23 నుంచి ఏటా మన రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ నోటీసులు జారీ చేస్తున్నది. ఈ ఏడాది కూడా నోటీసులు జారీ కావడంతో ఇదే అదునుగా నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ బాధితులు రంగంలో దిగారు. నాడు సరైన ప్రణాళిక, తగిన వసతులు లేకుండా కాలేజీలు ప్రారంభించి సమస్యలకు బీజం వేసిన గత ప్రభుత్వంలోని వ్యక్తులే, నేడు ఎన్‌ఎంసీ నోటీసులు ఇవ్వడాన్ని ప్రస్తుత ప్రభుత్వ చేతగానితనంగా చూపిస్తూ విమర్శలు గుప్పించారు, విద్యార్థులను ఆందోళనకు గురిచేశారు. కానీ, ఇంతలోనే ఆ భ్రమలనూ ఎన్‌ఎంసీ తొలగింపజేసింది. మెడికల్ కాలేజీల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తూ, రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులను యథావిధిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దెబ్బతో నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యక్తులు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి మరో అంశాన్ని వెతుక్కొనే పనిలో పడ్డారు.
డేగ కుమార్ యాదవ్
జర్నలిస్ట్
ఈ వార్తలు కూడా చదవండి..
జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు
పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్
For More AndhraPradesh News And Telugu News