Marriage Vows and Modern Risks: పెళ్లినాటి ప్రమాణాలూ ప్రమాదాలూ
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:28 AM
గతంలో ప్రేయసి వలలో పడి భార్యను చంపే భర్తల గురించే వినేవాళ్లం, పేపర్లలో చదివేవాళ్లం. ఇప్పుడు భార్యలు ఈ పోటీలో భర్తలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రియుడితో కలిసి...
గతంలో ప్రేయసి వలలో పడి భార్యను చంపే భర్తల గురించే వినేవాళ్లం, పేపర్లలో చదివేవాళ్లం. ఇప్పుడు భార్యలు ఈ పోటీలో భర్తలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రియుడితో కలిసి గూడుపుఠాణీ చేసి, ప్రీమెడిటేటెడ్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్లు కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. జీవితాంతం కలిసి నడుస్తామంటూ పెళ్లి సమయంలో చేసిన ప్రమాణాలు ఏమై పోతున్నాయో తెలియటం లేదు. ప్రమాణాలు కేవలం నోటిమాటలుగా మిగిలిపోకుండా, ఆచరణలో కూడా చూపాలంటే సరైన ఆటిట్యూడ్ వుండాలి. ‘ఈ నా వివాహాన్ని వర్కబుల్ చేస్తాను’ అని దృఢంగా సంకల్పించుకోవాలి కూడా. దానికి అనుగు ణంగా మరో ప్రమాణాన్ని కూడా చేరిస్తే మంచిదనిపిస్తోంది.
భర్తలను భార్యలు చంపిస్తున్న కొన్ని సందర్భాల్లో పెళ్లికి ముందే ఈ ప్రీమెడిటేషన్ ప్రారంభమవుతోందని తెలుస్తోంది. ప్రియుడికి ఉద్యోగం, వేరేవాణ్ణి పెళ్లి చేసుకుని, వాణ్ణి ప్రియుడి ద్వారా చంపించి, ఆస్తికి వారసురాలై, తర్వాత ప్రియుణ్ణి పెళ్లాడి హాయిగా సెటిలైపోదామనే ప్లాన్లు కూడా వేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో హనీమూన్‌లో హనీ కంటే పాయిజన్ పాలు ఎక్కువవుతోంది. ఇవి విన్నప్పుడు ‘వీరికి తమ పెళ్లినాటి ప్రమాణాలు గుర్తుకురావా? లేక చిత్తశుద్ధి లేని ప్రమాణాలు చేస్తున్నారా?’ అనే అనుమానం వస్తుంది. ఈ ప్రమాణాలన్నీ ఒకరికొకరు జీవితాంతం బద్ధులమై ఉంటామని, అచంచలమైన పరస్పర విశ్వాసాన్ని కలిగి ఉంటామనీ చెప్పిస్తాయి. క్రైస్తవ వివాహాల సమయంలో ‘ఈ రోజు నుంచి, సుఖంలోనూ, దుఃఖంలోనూ, ఐశ్వర్యంలోనూ పేదరికంలోనూ, ఆరోగ్యంలోనూ అనారోగ్యంలోనూ – మృత్యువు మమ్మల్ని విడదీసేదాకా– కలిసే ఉంటాము’ అని క్రైస్తవ దంపతులు ప్రమాణం చేస్తారు.
హిందూ వివాహాల్లో తాళి కడుతూ ‘నేను నీ మెడలో కడుతున్న ఈ మంగళసూత్రం నా జీవితానికి ఆధారం. నీవు నూరేళ్లు బతికి నన్ను కూడా బతికించు’ అనే అర్థంలో ‘మాంగల్యం తంతునానేనా, మమ జీవన హేతునా’ మంత్రాన్ని పఠిస్తాడు. దీనికి గాను తన వంతుగా ఏం చేస్తాడో మరో మంత్రంతో చెప్తాడు– ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ... నాతి చరామి’ అని. ధర్మంలో, ధనార్జనలో, కోరికలో, మోక్షంలో.. నిన్ను దాటి వెళ్లను. నీతోనే ఉంటాను’ అని దాని అర్థం. జీవితానికి అతి ముఖ్యమైన ఈ నాలుగు పురుషార్థాలలోనూ కలిసి ఉంటానని చెప్పడం ఆజన్మాంత జీవన సహచర్యానికి నిర్వచనమే!
ఆ తర్వాత ఇద్దరూ ‘సప్తపది’ పేర ఏడడుగులు కలిసి నడుస్తారు. ఒక్కొక్క అడుగుకూ ఒక్కొక్కటి చొప్పున వధువుకు వరుడు సూచనలు చేస్తాడు. ‘నువ్వు నాకు పోషణ కలిగించాలి’, ‘నాకు శక్తి, ఉత్సాహాలను కలిగించాలి’, ‘కుటుంబానికి ఐశ్వర్యాన్ని తేవాలి’, ‘ఆనందాన్ని కలిగించాలి’, ‘సంతానాన్ని సమకూర్చాలి’, ‘అన్ని ఋతువులలోనూ మనం కలిసి జీవించాలి’ (ఇక్కడ అన్ని ఋతువులు అనడంలో వసంతం నుంచి శిశిరం దాకా అనే కాదు, కలిమిలో లేమిలో, కష్టాల్లో సుఖాల్లో.. అనే భావం యిమిడి ఉంది), చివరగా ఏడో అడుగులో చెప్తాడు– ‘మన మధ్య శాశ్వతమైన స్నేహం ఉండాలి’ అని. నిజానికి ఈ స్నేహమే వైవాహిక బంధాన్ని నిలిపి ఉంచుతుంది. స్నేహితులు మధ్యమధ్యలో వాదించుకుంటారు, కొట్లాడుకుంటారు. కానీ ఒకరంటే మరొకరికి గాఢమైన ఇష్టం ఉంటుంది. స్నేహానికి తైలం అనే అర్థం కూడా ఉంది. దాంపత్యజ్యోతి నిరంతరం వెలగాలంటే భార్యాభర్తల మధ్య ఈ స్నేహం చాలా ముఖ్యం.
సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లిళ్లలో ఏదో రకంగా ప్రమాణాలు చేయిస్తూనే ఉన్నారు. కొంతకాలానికి పెళ్లిళ్లలో కలతలు రావడం, విడాకులు తీసుకోవడం... చివరకు పైన చెప్పిన హత్యాకాండల గురించి విన్నప్పుడు ఈ ప్రమాణాల ప్రామాణికత ఏమిటన్న సందేహం వస్తుంది. ఆనాటి బాసలు నీరసించడం, సడలిపోవడం క్రమేపీ జరుగుతోందనే సంగతిని మనం ఆకళింపు చేసుకోవాలి. చాలా సందర్భాల్లో భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి మోజు విరిగిపోవడం, విభేదాలు పొడచూపడం జరుగుతోంది. వీటిని కాలంతో పాటు వచ్చే మార్పులుగా అర్థం చేసుకోవాలి.
తమాషా ఏమిటంటే పరిస్థితులు మారవు, కానీ వాటిని చూసే దృక్కోణంలో మాత్రం మార్పు వస్తుంది. ఒకప్పుడు ప్రేమతో, ఆరాధనతో నిండి తనను మంత్రముగ్ధుణ్ణి చేసిన భార్య అందమైన కళ్లే, కోపంతో పెద్దవై, నిప్పురవ్వలు కురిపించడం భర్తకు కలిగే అనుభవం. స్వీట్ నథింగ్స్‌తో తనను పులకింపచేసిన భర్త కంఠస్వరమే తన మాట చెల్లనప్పుడు చికాకుతో గర్జించడం భార్య నివ్వెరపోయే సందర్భం. భర్త వినే సంగీతం పెళ్లయిన కొత్తల్లో ఆహ్లాదకరంగా భావించిన భార్య, పోనుపోను దాన్ని వట్టి రొదగా కొట్టిపారేయడం కద్దు. భార్య తీసే కూనిరాగాలను ఒకప్పుడు శ్రావ్యంగా భావించిన భర్త తర్వాతి రోజుల్లో వాటినే ఖూనీరాగాలుగా భావించడం కాలమహిమ కాక మరేమిటి?
ఈ కారణంగా భార్యాభర్తలిద్దరి ప్రవర్తనల్లోనూ మార్పులు వస్తాయి. చెవిలో గుసగుసలు, ముసిముసి నవ్వుల స్థానంలో పక్కింటి వాళ్లకు కూడా వినబడే స్థాయిలో అరుపులు, రంకెలుగా రూపాంతరం చెందుతాయి. ఇద్దరూ కలిసి ప్రేమగా ఏరికోరి కొన్న గాజు, పింగాణీ వస్తువులు నేల కూలి ముక్కలవుతాయి. గిన్నెలు సొట్టబడతాయి. ఒకప్పుడు అపురూపంగా దాచుకున్న ఉత్తరాలు, ఫొటోలు కోపావేశంలో చిరిగి ముక్కలవుతాయి. ఏదో ఒక స్థాయిలో ప్రతి జంటకూ ఇలాంటి అనుభవాలు ఉంటాయి. టాల్‌స్టాయ్ నుంచి గాంధీ దాకా గృహ కలహాలను ఎవరూ తప్పించుకోలేకపోయారు. కానీ పోట్లాడుకున్న వాళ్లందరూ విడిపోరు. ‘పిల్లల కోసం కలిసి ఉంటున్నారు పాపం’ అని బయటివాళ్లు అనుకోవచ్చు కానీ వాస్తవమేమిటంటే– వయస్సు, అనుభవం పెరుగుతున్న కొద్దీ, చాలా మంది దంపతులకు ‘కలిసి బతకలేం, అలా అని విడిపోయీ బతకలేం’ అనే అవగాహన కలుగుతుంది. విడిపోయీ బతకగలం అనుకున్న వాళ్లు విడిపోతారు.
విడాకులు తీసుకోవడం గతంలో కంటే సులభమైన ఈ కాలంలో కూడా భాగస్వామిని చంపడం దేనికి? ఈ ‘క్రైమ్స్ ఆఫ్ పేషన్’లో శరీరాని కంటే మనసు పాత్రే ఎక్కువ. భార్యాభర్తల మధ్య మానసికబంధం సడలిన సమయంలో మూడో వ్యక్తి ప్రవేశిస్తే– ఈ బంధాన్ని ఎలా వదుల్చుకోవాలా అనే ఆలోచన కలగవచ్చు. సామరస్యంగా విడిపోవాలా, హింసాత్మకంగా విడిపోవాలా అనేది వ్యక్తిగత నిర్ణయం. దాన్ని ఆ మూడో వ్యక్తి ప్రభావితం చేయవచ్చు. హింసాత్మక మార్గాన్ని ఎంచుకుని, హత్యలకు పాల్పడితే దాని వలన అనర్థం జరిగే అవకాశాలే ఎక్కువ. పరిస్థితి అక్కడిదాకా వెళ్లకుండా, మానసిక బంధం సడలకుండా చూసుకునే ఉపాయాల గురించి ఆలోచించాలి. గీతాకారుడు ఏం చెప్పాడు? మానవ ప్రయత్నం తప్పదు అన్నాడు. స్వర్గంలో పెళ్లి చేయడం వరకు దేవుడి పనే కానీ, భూమి మీద దాన్ని నిలబెట్టుకోవడం మన పని. పెద్దలిచ్చిన ఆస్తి కానీయండి, స్వయంకృషితో తెచ్చుకున్న ఉద్యోగం కానీయండి, నిలబెట్టుకోవడంలోనే ఉంది ప్రజ్ఞ. కాపురాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినది సరైన ఆటిట్యూడ్. ప్రత్యామ్నాయం దీనికంటే మెరుగు కాదనే ఎఱుక! దానికి మించి చుట్టూ పరిస్థితులెలా ఉన్నా, సంతోషంగా ఉండి తీరాలనే పట్టుదల!
బతకడమంటే విసుగుతో, నిరాశానిస్పృహలతో, కోపతాపాలతో తనని తాను తిట్టుకుంటూ, ఇతరులను విసిగిస్తూ బతకడం కాదు. ఈసురోమని మనుషులుంటే దేశమే కాదు, కాపురాలూ బాగుపడవు, వర్ధిల్లవు. హ్యాపీగా ఉండడానికి నిశ్చయించుకోవడంలో ఉంది అసలైన కీలకం. నాకు వివాహమై, ఫస్ట్ పోస్టింగు వచ్చి, కాపురం పెట్టడానికి వెళ్లబోయే ముందు సలహా కోసం అడిగితే మా నాన్నగారు చెప్పిన మాట ఒక్కటే– ‘వృత్తిలో కానీ, సంసారంలో కానీ సంతోషంగా ఉండు’ అని! మనం సంతోషంగా ఉండడానికి పక్కవాళ్లందరూ కూడగట్టుకుని ప్రయత్నం చేయరు. ఆ తంటాలు మనమే పడాలి. ఫ్రెంచి వాళ్లు ‘la joie de vivre’ అంటారు. జీవితం పట్ల జోష్ ఉండాలి. సరదాగా బతకాలి అని మనకు మనమే సంకల్పం చెప్పుకుని, దాన్ని అమలుచేయాలి. జీవిత భాగస్వామి ఆటిట్యూడ్‌లో మార్పు వచ్చిందని ఫిర్యాదు చేసేముందు మనమూ మారామనే గ్రహింపు ఉండాలి. మార్పు సహజమని యాక్సెప్ట్ చేయడంలోనే విజ్ఞత ఉంది.
కొన్ని జంటలను చూస్తూ ఉంటాం. అహం, కోపతాపాలు, పంతాలు పట్టింపులు ఏ స్థాయిలో ఉంటాయంటే పక్కింట్లో ఉన్న మనకు ‘ఇదెక్కడి మార్జాల కాపురంరా బాబూ!’ అనిపిస్తుంది. కానీ మర్నాటికి వాళ్లు పాలూ నీళ్లల్లా, పప్పూ ఉప్పులా కలిసిపోవడం చూసి విస్తుపోతాం. దీనికి కారణం ఇలా సర్దుకుపోయి, సంతోషంగా ఉండాలనే వాళ్ల దృఢసంకల్పమే! నా దృష్టిలో రుచులు– అభిరుచులు, సంగీతం, భోజనం, స్నేహితుల విషయంలో వచ్చిన తేడాలు, కొన్నిసార్లు తీవ్రమైన విభేదాలు... ఇవన్నీ మన దాంపత్య జీవితానికి నిజమైన రుచిని ఇచ్చే మసాలాలు. ఇవి లేకపోతే జీవితం నిస్సారంగా, చప్పగా గడిచిపోతుంది.
మనం మళ్లీ మొదటి టాపిక్‌కు – అంటే పెళ్లినాటి ప్రమాణాలకు– వస్తే నావి రెండు సూచనలున్నాయి. హిందూ వివాహాల్లో భర్త ఒక్కడే ‘నాతి చరామి’ మంత్రం పఠిస్తున్నాడు. కట్టుబాట్లను దాటి చరించే ప్రవృత్తి ఇటీవల మహిళల్లో కూడా పెరుగుతోంది కాబట్టి ‘నాతి చరామి’ మంత్రం భర్త చేతే కాకుండా, భార్య చేత కూడా చేయించడం మంచిదని నా ఉద్దేశ్యం. దానితో పాటు ‘నేను హ్యాపీగా ఉండదలచుకున్నాను, పక్కవాళ్లనూ హ్యాపీగా ఉంచడానికి సర్వదా ప్రయత్నిస్తాను’ అనే ప్రమాణం కూడా ఇద్దరి చేతా చేయించాలని నా అభిప్రాయం. ‘నేను రాజీ పడుతున్నాను, కానీ అది నా సంతోషం కోసమే’ అనే దృక్పథం ఉంటే వివాహ సంబంధమైన కలహాలూ, మరణాలూ తగ్గుతాయి.
డా. మోహన్ కందా
విశ్రాంత చీఫ్ సెక్రటరీ, ఉమ్మడి ఆం.ప్ర. ప్రభుత్వం
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest AP News And Telugu News