Share News

రాజ్యాంగంపై మావోయిస్ట్‌ అవగాహన స్పష్టమే

ABN , Publish Date - May 08 , 2025 | 02:03 AM

ఏప్రిల్‌ 15న ఆంధ్రజ్యోతిలో డానీ రాసిన ‘పాలకులు–మావోయిస్టులు, మధ్య రాజ్యాంగం’ అనే వ్యాసంలోని రెండు విషయాలపై చర్చను పొడిగించాల్సి ఉంది. ఒకటి: మావోయిస్టులు–రాజ్యాంగం, రెండు: మావోయిస్టుల రాజకీయ కార్యక్రమం....

రాజ్యాంగంపై మావోయిస్ట్‌ అవగాహన స్పష్టమే

ఏప్రిల్‌ 15న ఆంధ్రజ్యోతిలో డానీ రాసిన ‘పాలకులు–మావోయిస్టులు, మధ్య రాజ్యాంగం’ అనే వ్యాసంలోని రెండు విషయాలపై చర్చను పొడిగించాల్సి ఉంది. ఒకటి: మావోయిస్టులు–రాజ్యాంగం, రెండు: మావోయిస్టుల రాజకీయ కార్యక్రమం.

మధ్య భారతదేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం ఆగడానికి ప్రభుత్వానికి–మావోయిస్టులకు మధ్య శాంతి చర్చలకు రాజ్యాంగం ప్రాతిపదిక అవుతుందా? అనే ముఖ్యమైన ప్రశ్నను డానీ లేవదీశారు. ‘‘పెట్టుబడిదారీ ప్రయోజనాలు నెరవేర్చేందుకు రాజ్యాంగం పుట్టిందని’’ మావోయిస్టులు విమర్శిస్తుంటారని రాశారు. ఈ మాట సరైనదే. దీనితోపాటు చెప్పుకోవాల్సింది ఇంకా ఉంది. ప్రముఖ పౌరహక్కుల నాయకుడు ప్రొ. శేషయ్య ‘‘రాజ్యాంగం అనేక వైరుధ్యాల పుట్ట’’ అన్నారు. ఈ వ్యవస్థలో చిన్నచిన్న మార్పులు ఎన్ని జరిగినా, మౌలికంగా మారకుండా, దాన్ని యథాతథంగా పట్టి ఉంచేందుకు పాలకవర్గాలకు రాజ్యాంగం సాధనంగా ఉపయోగపడుతుందని విప్లవకారులు విమర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో జరిగిన అనేక పీడిత సమూహాల, వర్గాల పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలోకి కొన్ని సానుకూల అంశాలు వచ్చి చేరినా, దానికి ఈ మౌలిక స్వభావం ఉన్నదని చెబుతారు.

రాజ్యాంగంలోని సానుకూల అంశాలు కూడా వాటంతట అవి అమలు కావడం లేదు. ఈ సానుకూల అంశాలను ప్రభుత్వాలు అనుక్షణం బాహాటంగా ఉల్లంఘిస్తున్నాయి. దీనికి తోడు సామాజిక వివక్షల వల్ల కూడా రాజ్యాంగం అమలులోకి రావడం లేదు. అందువల్ల పోరాటాల వల్లనే రాజ్యాంగంలోని సానుకూల విషయాలు ప్రజల అనుభవంలోకి ఎంతో కొంత వస్తున్నాయి. అయినప్పటికీ పౌరహక్కులు, చట్టబద్ధ పాలన, ఆదేశిక సూత్రాలు అనేవి రాజ్యాంగంలో భాగం కావడం చారిత్రకంగా ప్రగతిశీలమైన విషయం. మన సామాజిక, సాంస్కృతిక వికాసంలో, పీడిత సమూహాల రక్షణలో రాజ్యాంగం ఎంతో కొంత సానుకూల పాత్ర పోషిస్తోంది. విప్లవోద్యమానికి ఈ అవగాహన ఆరంభం నుంచీ ఉంది. అందువల్ల విస్తృతస్థాయిలో పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం, చట్టబద్ధ పాలన కోసం, పీడిత సమూహాల రక్షణ కోసం పోరాడుతున్నది.


ఈ వైఖరి నుంచే అంతర్గత భద్రత పేరుతో ప్రజల మీద సైన్యాన్ని ప్రయోగించడం రాజ్యాంగ వ్యతిరేకం అని మావోయిస్టులు తమ ప్రకటనలో అన్నారు. రాజ్యాంగంలోని సమానత్వ భావనకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల వల్ల తలెత్తిన సమస్యలు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సైనిక రంగాల్లో వ్యవస్థీకృతం అయ్యాయి. దోపిడీ, పీడనలను తీవ్రం చేశాయి. దీనికి రాజ్యాంగంలోనే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థితిలోంచి విప్లవోద్యమం పుట్టుకొచ్చింది. దాన్ని అణచివేయడానికి ప్రభుత్వం హింసకు పాల్పడుతున్నది కాబట్టి ఇప్పుడు ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలు జరగాలంటే మొదట ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ప్రజల మీద యుద్ధాన్ని ఆపాలి. ఆ పని చేయకుండా మావోయిస్టులు ఆయుధాలు దించితేనే శాంతి చర్చలని ప్రభుత్వం కండీషన్‌ పెట్టడానికి లేదు. ఆ మాట అనడమంటే తన రాజ్యాంగ ఉల్లంఘనను సమర్థించుకోవడమే. శాంతి చర్చల సంగతి అటుంచి రాజ్యాంగ ఆదర్శాలకే ఈ వైఖరి అతి పెద్ద సవాల్‌.

ఈ పరిస్థితిలో రాజ్యాంగ పరిధిలోని అంశాలన్నీ శాంతి చర్చలకు ప్రాతిపదిక కావాలి. విప్లవోద్యమ సిద్ధాంతం, వ్యూహం, లక్ష్యం రాజ్యాంగ పరిధిలోని అంశాలు కావు. అయితే తాము తుపాకులు వినియోగిస్తే రాజ్యాంగం ప్రాతిపదికగా జరగాల్సిన శాంతి చర్చలకు ఆటంకం అవుతుందని విప్లవకారులకు తెలుసు. అందుకే వాళ్లు కాల్పుల విరమణకు సిద్ధం అన్నారు. ఈ పని జరగాలంటే ముందు ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం నేర్చుకోవాలి. తక్షణంగా అంతర్యుద్ధాన్ని ఆపివేయాలి. ఈ స్పష్టత వల్లనే మావోయిస్టుల ప్రకటనలో రెండుసార్లు రాజ్యాంగం ప్రస్తావన వచ్చింది.


ఇక రెండో అంశం– మావోయిస్టుల రాజకీయ విధానం గురించి. బస్తర్‌లో మావోయిస్టులు ప్రవేశించాక అక్కడ సమసమాజం ఏర్పడిందని ప్రచారం జరుగుతోందని డానీ రాశారు. ఇది పూర్తిగా తప్పు. అంతర్జాతీయ స్థాయిలోనూ, తెలుగులోనూ తటస్థులు, అభిమానులు రాసిన క్షేత్ర పరిశీలనలు, విశ్లేషణలు కనీసం డజన్‌కు పైగా పుస్తకాల్లో కనిపిస్తాయి. వాటిలో డానీ చెప్పిన మాట లేదు. స్వయంగా మావోయిస్టులే దండకారణ్యంలోని ప్రత్యామ్నాయ అభివృద్ధి, ప్రజా పాలన బీజరూపం నుంచి ప్రాథమిక దశకు చేరుకున్నాయని మాత్రమే రాశారు. సమ సమాజమని ఎక్కడా అనలేదు. తొలి రోజుల్లో మైదాన ప్రాంత విప్లవకారులు ‘బయటి వాళ్లు’గా అక్కడికి వెళ్లిన మాట నిజమే. ఆ తర్వాత అసంఖ్యాకంగా ఆదివాసులే మావోయిస్టులుగా మారారు. వాళ్లే తమ స్థలకాలాలకు, సంస్కృతికి, జీవితావసరాలకు తగినపద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు రాజకీయాలను మార్గదర్శకంగా తీసుకున్నారు. ఇదంతా వర్గపోరాటంలో భాగంగా జరుగుతున్నది. దండకారణ్యంలో వర్గాలు, వర్గపోరాటం మీద మావోయిస్టులు, వాళ్ల అభిమానులు రాసిన రచనలు చదివి ఎంతైనా చర్చించవచ్చు.

బస్తర్‌లో మావోయిస్టులు చేస్తున్న ఈ పనికీ, వాళ్ల ప్రకటిత కార్యక్రమానికీ పొంతన ఉందా? అనే సిద్ధాంత సందేహాన్ని కూడా డానీ లేవదీశారు. విప్లవకారులు 1980లో దండకారణ్యంలోకి తమ ప్రకటిత కార్యక్రమంలో భాగంగానే వెళ్లారు. నూతన ప్రజాస్వామిక విప్లవమంటే భూములు పంచడమే కాదు. అర్ధ భూస్వామ్యానికి, కార్పొరేట్‌ పెట్టుబడిదారీ విధానానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగే విస్తృత పోరాటం. రాజ్యానికి, సామాజిక అసమానతలకు, అన్ని రకాల పీడనలకు వ్యతిరేకంగా సాగే కొత్త తరహా ప్రజాస్వామిక పోరాటం. ఇప్పుడైతే అది కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పీడిత సమూహాలు, వర్గాల నాయకత్వంలో జరిగే పోరాటం. ఇలాంటి సమగ్ర పోరాట వ్యూహం మావోయిస్టులకు ఉన్నది. అందులో భాగమే దండకారణ్యం తరహా ఆదివాసీ ప్రాంతాల్లో పోరాటాలను, ప్రత్యామ్నాయాలను నిర్మించారు. ‘ఆయుధాలతో మాత్రమే ప్రజా వ్యతిరేక వ్యవస్థను నిర్మూలించగలమనేది నక్సలైట్ల సిద్ధాంతం’ అని డానీ అన్నారు. సాయుధ పోరాట ప్రాధాన్యతను నొక్కి చెప్పినప్పటికీ ప్రజా చైతన్యంతో, క్రియాశీల ఆచరణతో అనేక పోరాట రూపాలతో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకపోవాలనేది వాళ్ల అవగాహన. గత నలభై ఏళ్ల చరిత్ర ఇదే చెబుతోంది. కాబట్టి ఇందులో ఎలాంటి సిద్ధాంత గందరగోళం లేదు.


ప్రజలపై ప్రభుత్వం అమలు చేస్తున్న హింస రాజకీయార్థిక యుద్ధంగా మారింది. ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే ఈ యుద్ధం ముంచుకొచ్చేదీ కాదు. దానికి కారణమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంక్షోభాలూ వచ్చేవి కావు. రాజ్యాంగం ప్రాతిపదిక మీద చర్చలు జరగాలంటే ప్రభుత్వం ముందు ఈ అభివృద్ధి నమూనాను, యుద్ధాన్ని వెనక్కి తీసుకోవాలి. దాని కోసం ప్రజాస్వామిక వాదులు ఒత్తిడి తీసుకురావాలి. మావోయిస్టులు కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు కాబట్టి రాజ్యాంగ పరిధిలోని అంశాలన్నిటినీ శాంతి చర్చల్లో భాగంగా కూచొని మాట్లాడుకోవచ్చు.

పాణి

ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 02:03 AM