Share News

Madala Narayanaswamy: ప్రజల గుండెల్లో ఎగిరిన పోరు పతాక

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:10 AM

జాతీయోద్యమంలోనూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్న మూడు తరాల వారథి మాదాల నారాయణస్వామి (ఎం.ఎన్‌.ఎస్‌). నమ్మిన ఆశయం...

Madala Narayanaswamy: ప్రజల గుండెల్లో ఎగిరిన పోరు పతాక

జాతీయోద్యమంలోనూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్న మూడు తరాల వారథి మాదాల నారాయణస్వామి (ఎం.ఎన్‌.ఎస్‌). నమ్మిన ఆశయం కోసం అంతిమ శ్వాస వరకు ఆయన అలుపెరగని పోరాటం చేశారు. పార్లమెంటరీ పంథాను తిరస్కరించడంలో, ప్రజాపంథాను ముందుకు తీసుకెళ్లడంలో పట్టుదలగా కృషి చేశారు. కమ్యూనిస్టు విలువల్ని, ఆదర్శాలని కాపాడడంలో, ఆచరించడంలో ముందు వరుసలో నిలబడ్డారు. విప్లవోద్యమంలో ఎగిరే ఎర్రని జెండా అయి, కడదాకా నిలిచారు. ఎంఎన్‌ఎస్‌ ఎత్తిన జెండా, నడిచిన పంథా, చూపిన చొరవ, ప్రదర్శించిన పట్టుదల నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వారందించిన పోరాట సంప్రదాయాలు, ఆచరించి నిర్మించిన ప్రజా ఉద్యమాలను మనం కొనసాగించాల్సి ఉంది. ఈ ఆదర్శ కమ్యూనిస్టు అమరుడై 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.

మాదాల నారాయణస్వామి 1914 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలం, మైనంపాడు గ్రామంలో జన్మించారు. బెనారస్ యూనివర్సిటీలో ఎం.ఎ ఎకనామిక్స్ పూర్తి చేశారు. జాతీయ ఉద్యమం ప్రభావంతో విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1936లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం పొందారు. 1937లో జరిగిన కొత్తపట్నం రాజకీయ పాఠశాలలో విద్యార్థిగా పాల్గొన్నారు. అక్షరాలు నేర్చుకోవడమే చదువు కాదని, చదువంటే ఉద్యమమని, ఉద్యమమే ఊపిరని, అది పీడిత ప్రజల విముక్తికి ఉపయోగపడాలని భావించారు. అందుకే చదువు ముగిసిన వెంటనే ప్రజా ఉద్యమాలకు అంకితమై, ప్రజలతో మమేకమయ్యారు.

వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినప్పుడు ఎం.ఎన్‌.ఎస్‌ రహస్య జీవితంలోకి వెళ్ళారు. నిత్య నిర్బంధాల మధ్య రైతుల్ని, కూలీల్ని, మత్స్యకారుల్ని సంఘటితం చేస్తూ భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా, అంటరానితనానికి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. రహస్య జీవిత కాలంలో ఆయన ఆచూకీ కోసం తమ్ముళ్లు కోటయ్య, నర్సయ్యలను పోలీసులు పట్టుకుని కాల్చి చంపినా, చలించకుండా పోరాటపథంలో నడిచారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేశాక, 1952లో ఒంగోలు ఎమ్మెల్యేగా, 1962లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో ప్రజా సమస్యలపై తన వాణిని వినిపించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు కొల్లా వెంకయ్యతో కలిసి విశాఖ ఉక్కు ఆందోళన సందర్భంగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.


1964లో కమ్యూనిస్టు ఉద్యమంలో తలెత్తిన విభేదాల కారణంగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం వైపు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన చీలికల్లో విప్లవ కమ్యూనిస్టు పార్టీ వైపు నిలబడ్డారు. 1968లో డీవీ, టీఎన్, సీపీ, కొల్లా వెంకయ్యలతో ఏర్పడిన ఆంధ్ర విప్లవ కమ్యూనిస్టు కమిటీ వైపు నిలబడ్డారు. అదే ఏడాది పాలకొల్లు ప్లీనంలో రాష్ట్ర నాయకులు అయ్యారు. 1973లో ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేశారు. చివరి క్షణం వరకు కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు.

30 సంవత్సరాలు ప్రజాపంథా పత్రిక ఎడిటర్‌గా పనిచేశారు. భారత్–చైనా మిత్రమండలి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1977 నుంచి 20 సంవత్సరాలు రైతు కూలీ సంఘం అధ్యక్షులుగా, అఖిల భారత రైతు కూలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. జీవితాంతం దున్నేవాడికి భూమి కావాలని, ప్రజల విముక్తికి వ్యవసాయక విప్లవమే మార్గమని ఉద్యమించారు. గుంటూరు జిల్లా ఉద్యమంలోనూ కీలక భూమిక నిర్వహించారు. విప్లవ శక్తులు ఐక్యం కావాలని చివరి వరకు తపనపడ్డారు. భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద కూటమికి వ్యతిరేకంగా బలమైన ప్రజా పోరాటాల్ని నిర్మించడమే ఎం.ఎన్.ఎస్‌.కి మనమిచ్చే నిజమైన నివాళి.

l చిట్టిపాటి వెంకటేశ్వర్లు

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

(నేడు గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో

మాదాల నారాయణస్వామి వర్ధంతి సభ)

ఈ వార్తలు కూడా చదవండి..

రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..

వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 02:10 AM