Share News

Gajoju Nagabhushanams Pranadeepam: వేయి గుండెల పద ప్రదర్శన

ABN , Publish Date - Sep 22 , 2025 | 02:49 AM

(కళ తన అస్తిత్వంలోనే తిరుగుబాటు తత్వాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే కొత్త దాన్ని సృష్టించడానికి పాత దాన్ని ధ్వంసం చేయాల్సి వుంటుంది – హబీబ్ తన్వీర్) స్వపల్లేరు పర్వతాలెక్కి సమస్త భూ దుఃఖ సాగరం లోకి దూకి...

Gajoju Nagabhushanams Pranadeepam: వేయి గుండెల పద ప్రదర్శన

Art in its existence itself is subversive. Because it has to destroy the old to create new

Habib Tanvir

(కళ తన అస్తిత్వంలోనే తిరుగుబాటు తత్వాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే కొత్త దాన్ని సృష్టించడానికి పాత దాన్ని ధ్వంసం చేయాల్సి వుంటుంది – హబీబ్ తన్వీర్) స్వపల్లేరు పర్వతాలెక్కి సమస్త భూ దుఃఖ సాగరం లోకి దూకి మరణించి... తన నెత్తుటితో తానే లోదీపాలని వెలిగించుకొని... మళ్లీ దూకే ఒక పునః ఫినిక్స్ రసక్రీడ: గాజోజు నాగ భూషణం సృజన – కవితైనా, కథైనా.

తమ యమపాశాల్తో తమను తామే బంధించుకొని, కోటి గాయాల వీణ తెలంగాణ స్వహస్త మీటులతో మెట్లెక్కుతున్నవాడు కాడు మనవాడు. ఏసీ గదుల్లో పడుకొని, ఉద్యమ యాగం లోకి నరమానవ పెట్రోళ్లు పోస్తూ నాగస్వరం ఊదుతున్నవాడు కాడు. అక్షరాలతో రాజచరణాలకు Luxలవుతున్నవాడు కాడు.

అతని కవిత్వ సంపుటి ‘ప్రాణదీపం’ ఎనభై ముక్కల కన్నీటి ఆట... తెరవంగనే టైటిల్స్‌ లోనే విభిన్న నామాలు, సర్వనామాలు, మానాలు, విశేషణాలు, అశక్తతలు, ప్రశ్నలు, ఆశ్చర్యాలు, పదచిత్రాలు, రూపకాలు, ధిక్కారాలు, Metanonyలు, simileలు సవాలక్షల కలగూర గంపలై, చేతుల్లో కాళ్ళేసుకొని నడుములకు రెక్కలు తొడుక్కొని, నీ చుట్టూ తిరిగి, భూమి చుట్టూ తిరిగి తిరిగి, నీ ఎముకల్లోకి ఇంకిపోతాయి. ఇప్పుడిక నువ్వు నువ్వు కాకుండా పోయి ఒక మహా దుఃఖాన్నీ అనంత ఆగ్రహాన్నీ శిగమూగుతావు. భూషణం వాడిన కొన్ని తెలంగాణ సజీవ జనభాషణలు: తాయిమాయి తండ్లాట, నెత్తి మీద నిండవడ్ల బస్తా, తీరొక్క శోకం, మాయా తెర్మల మర్మం, ఎద్దేడ్చిన ఎవుసం, తెగ్గోసుకున్న బొడ్డుతాడు, ఊపిరి ఊరి వరదగూడు, వాగు వట్టిపోయి, గత్తరచ్చి విడిచిపెట్టిన గ్రామం, తేజాబులో ముంచి, ఇవురంతో ఇంటి మొగురం, పన్గడి దాటాలే, పబ్బతి పట్టలేరా, తాయిలాల తరాజు, పగిలిన సల్లకుండ, నెనరెక్కువ... ఇలా ఎన్నో.


యే దేశపు, యే ప్రాంతపు, యే వర్గపు, యే కులపు, యే లింగపు కవి అయినా లోపల ఒక పసిబాలిక, వో సౌందర్యోపాసకుడు ప్రేమ మాలలు ధరించి నిత్యం ఖడ్గనాట్యం చేస్తుండాలి. ఎటో ఒకవైపు ఉన్నవాడు మాత్రమే సృజన చేయగలడు. గోడమీది పిల్లులు నెలనెలా మూడొందల కాపీల అక్షరాల గుట్టల్ని మాత్రమే పోగు చేయగలవు. కవీ, కళాకారుడు మరణించేవరకూ మహా స్వార్థపరుడై ఉండాలి – తన కవిత కోసం, తన కళ కోసం. అర్జునుడికి శతకోటి ఆకుల కోటికొమ్మల లక్షల పావురాల గుంపులోని ఒకే పావురపు ఒకే కన్ను కనిపించినట్టు, రాత్రీ పగలూ ఇరవ ఐదు గంటలూ తన కంటికి తన కవితా తన కళా తప్ప ఇంకేమీ కనిపించకూడదు. తన అంతర్‌ బాహ్య ప్రపంచాల్ని – అందువసించు, వర్ధిల్లు, ఘర్షించు సమస్త భౌతిక, అధిభౌతిక జీవనిర్జీవాల్ని ధ్వంసం చేసుకోవాలి – బంధాల్నీ జల సంద్రాల్నీ విప్లవాల్నీ పోరాటాల్నీ దుఃఖాల్నీ నెత్తురుల్నీ దేవుళ్లనీ మనుషుల్నీ మతాల్నీ వర్గాల్నీ కులాల్నీ ప్రకృతినీ సంఘర్షణల్నీ సంవేదనల్నీ సకల తాత్వికతల్నీ ఉద్వేగాల్నీ – ధ్వంసం చేసి – చివరకు తనని తాను ధ్వంసం చేసుకొని అంతర్థానమైపోవాలి – ‘ఇంకా ఇంకేం మిగిలింది దెంచనాలా! సకలం బూడిద కుప్పలే కదా’ అనుకుంటున్నారు కదా! Yes, exactly! – ఆ బూడిద plus సృజన పనిముట్లూ మాత్రమే మిగలాలి. అప్పుడు దానంతట అదే ఒక abstract mythological act జరిగి కళ ఉద్భవిస్తుంది. ఆ కళే తన సృజనకారున్ని మళ్ళీ బతికించుకుంటుంది.

‘ప్రాణదీపం’ కవిత్వ సంపుటి లోని ‘విభ్రాంత క్రీడ’ కవిత గాజోజును తన ముప్పై ఏళ్ల ప్రస్థానం నుంచి వేరు చేసి ఒక గొప్ప ఆధ్యాత్మికతత్వ కవిగా నిలబెడుతుంది. శృతిలయల సంభోగ సంద్రంలో నిండా మునిగి, పాట–వచన కవిత అర్థనారీశ్వరమైనది ఇక్కడ– పాడుకోడానికీ చదువుకోడానికీ ఆడుకోడానికీ. ఒక తెలుగు సీనియర్ కవి వచన కవితను సంగీతం నుంచి విడదీయాలన్నాడు కానీ అలా విడదీయటం పాశ్చాత్య ప్రతిభకు పెద్ద పీట వేసి, భారతీయ indigenous సిద్ధ సాధు యోగుల భక్త మూలవాసుల ఆదివాసీ బహుజన కవుల జన సహజ సృజనకు చిన్న పీట వేస్తుందని నా అభిప్రాయం. ‘జలకన్య అడుగులకు తడబడని ఆటనేర్పేటి ఆదిగురువెవ్వరు?/ విశ్వవినువీధుల్లో వెలిగేటి దీపాల కాంతి కారకుడైన విభుడు ఎవరు?’... ఇలా సాగే ఈ కవితను హేతువాది, కమ్యూనిస్టు అయిన గాజోజు ఎట్లా రాస్తాడు? అని మనం అనుకోవచ్చు. సైన్సునీ దేవుడ్నీ విశ్వసృష్టి నిరూపణలనీ మతాన్నీ అనుమానించడం అంటేనే ఓషో వలె గాజోజు కొన్ని వందలేళ్ళు ముందుకు పోయి ఆలోచిస్తున్నాడని అర్థం. కవిత చివరి పంక్తుల్లో ఆయనలోని సాంప్రదాయ హేతువాదిని కూడా మనం దర్శించొచ్చు.


‘ప్రాణ దీపం’లోని చాలా కవితలు ఆశావాద కవితలు. తరువాత రాసిన ‘ఉదయాస్తమయాల ఊయల’ లో కనీసం ఆశానిరాశల సందిగ్ధ సంఘర్షణను ప్రదర్శిస్తాడు ‘చీకటి కడుపులో వెలుగు దాగుందో వెలుతురు పిడికిట్లో చీకటి బందీ అయ్యిందో’ అంటూ... బైరాగి నైరాశ్యం గురించి పాలగుమ్మి ‘అది మనసును క్రిందకు లాగేది కాదు, అంతరాత్మను బయటకుతీసే ప్రభంజనంలాంటిది అంటాడు’. కరీంనగరం మట్టికి పుట్టడం మూలాన గాజోజు బోధించే కవిత్వం కూ.... డా.... రాస్తాడు. ఏకశిల్ప అనేకవస్తువుల గాజోజు కవిత్వం చదువరుల్ని తప్పక disturb చేస్తుంది. తన తల్లి మీద రాసిన semi biographical కవిత ‘ప్రాణదీపం’ మన అమ్మలను మనకు ఒడినింపుతుంది– ఈమె గ్రామీణ అమ్మ, కుటుంబం కోసం లోకంతో పోరాడి గెలుపోటముల శిలువేయించుకున్న అమ్మ, తాను ఉపాసముండి మనకు ఆన్గెపుకాయలు తినిపించిన అమ్మ, ఒక చేతిలో కొడుకును మరొక చేతిలో వడ్ల బస్తాను మోస్తూ జీవన గంగను దాటిన అమ్మ, గడప గడపకొక గాయాన్ని చేసుకున్న అమ్మ.

‘మహా నిర్మాణ వేదిక’ కవితలో పద చిత్రాలు అంత్య కవితల్లో లేని నైరాశ్యం వర్షించడం నాకు మహానందమున్నూ మహాశ్చర్యమున్నూ. ‘విస్పోటానంతర వినిర్మాణ సౌందర్య రూపమే జగత్తతంతా/ జొమాటో కుర్రాడిలా మరణం తలుపు ముందర నిల్చొని ఎదురుచూస్తుంది/ రిక్తహస్తాల నిష్క్రమణలు/ బతుకమ్మ పూలకు బదులు నదుల శవాలను.../ మునిగిపోతున్న నావలో మునగబోతున్న ముసాఫిర్‌వి/ పట్టుకపోవడానికి పిడికెడు మట్టి పనికి రానిదయ్యి’. – ఇట్లా విభిన్న నవ సమయాల మీద రాసిన కవి.. కొన్ని ‘అడివంటుకోకముందే’, ‘యదాతథంగా’, ‘కవిత్వం ఒక తపస్సు’, ‘ఆ కలం’ లాంటి cliche కవితలు కూడా రాశాడు.


భూమి ఆచంద్రతారార్కం ఉన్నట్టే యుద్ధాలూ, పోరాటాలూ, పెద్దమ్మలూ, అవమానాలూ, చెరువులూ, చిలకలూ ఉంటాయి. ఆధునికానంతర కవిని అంత్యక్రియల వరకూ ఇవి మాత్రమే వేటాడకూడదు. ఇప్పుడిక వర్తమాన కవి ఎప్పటికీ పొడవని ఉదయాల్నికాక నిత్యం అనుభవిస్తున్న అస్తమయాలని ఆహ్వానించాలి. సత్యానంతర సంధి యుగాన నిజ అనిజాల మధ్య చెరిగిపోతున్న రేఖలను దెయ్యమూగాలి. ఏక శిల్ప ఆధునిక కవులు అతికొద్ది మందే అవని మీద సృజనకారులైనారు. తెలుగు భూమండలంలో తొంభైమంది ఏకశిల్ప ఏకవస్తు పూజారులు. సకల కార్యకర్తలకు రక్తమేదైనా నెత్తురే. జన్మచితి ప్రయాణమంతా తన మీద అణచివేత ఉందనీ తనను రేప్‌ దోపిడీలు చేశారనీ తనను కులదహనం చేశారనీ క్షణానికొక యుద్ధం జరుగుతుందనీ ఆధునికానంతర కవి ఏకశైలి ఏకవస్తు మహాboring నర్తనం చేయకూడదు. చేస్తే తాను శాస్త్రీయ, జానపద కవిగా మిగిలిపోతాడు.

శ్రీనివాస్ దెంచనాల

98483 26517

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 02:50 AM