Share News

Launch: జ్వర లాలస లాంటి మైకాన్ని ఇచ్చిపోయింది

ABN , Publish Date - Jul 07 , 2025 | 05:52 AM

కవిత్వం లలిత సంగీతంలా అందరికీ అర్థం కావాలని తీర్మానించే మనుషుల్ని చూసి నవ్వుకోవటం, వాళ్ళను కవ్విస్తూ మరింత గాఢంగా రాయటం సరదా నాకు. వాక్యానికి వాక్యానికి మధ్య చీమలా దూరి పదాలను కొరకటంలోని మజా గుజ్జుమామిడి తిన్నా రాదని...

Launch: జ్వర లాలస లాంటి మైకాన్ని ఇచ్చిపోయింది

కవిత్వం లలిత సంగీతంలా అందరికీ అర్థం కావాలని తీర్మానించే మనుషుల్ని చూసి నవ్వుకోవటం, వాళ్ళను కవ్విస్తూ మరింత గాఢంగా రాయటం సరదా నాకు. వాక్యానికి వాక్యానికి మధ్య చీమలా దూరి పదాలను కొరకటంలోని మజా గుజ్జుమామిడి తిన్నా రాదని, పొడి వచనంతో కవిత పలచపడుతుందని నమ్ముతాను. అలా అని ప్రబంధ భాష కూడా వాడను. చకోరాలు, పక్షుల సంగీతాలు, పరిమళ జ్ఞాపకాలు నాకు వస్తువులు. వాటికి ఉద్వేగాలు జోడించి రాసుకుంటాను. దానికి సరిపోయే భాషనే వాడాలనుకుంటాను. ఈ నేపథ్యంతో నేను తెచ్చిన మొదటి కవితా సంపుటి ‘ఒక స్వాప్నికుడి శ్వేత సంతకం’.

1997 జూన్ నెలలో జ్ఞాన్‌ బాగ్ వెళ్ళినప్పుడు నా పొయెట్రీ నోట్‌బుక్‌ శేషేంద్ర శర్మ గారి టీపాయ్ మీద పెట్టి, ‘‘దీనిని అచ్చేయమంటారా లేదా నిష్కర్షగా చెప్పండి,’’ అన్నాను. అకవిత్వానికి ఆయన బద్ధశత్రువు కనుక అంతంత మాత్రంగా ఉంటే కవితల్ని తిరగరాయమని అడుగుతాడని తెలుసు. ఏ వాక్యమూ మార్చాల్సిన అవసరం లేదనుకున్నారేమో వారం తరువాత ‘స్వాప్నికుడి జెండా’ అనే టైటిల్‌తో ముందుమాట రాసి పంపారు. ఇలా: ‘‘ఆపాద మస్తకమూ భావావేశ విద్యుల్లతలు పాకుతున్న వ్యక్తి నుండి ఝంఝా మారుతంలా వీచే మాటలే పుడతాయి. అవి గొర్రె మందల్లాంటి మాటలుగా ఎప్పుడూ ఉండవు. రసోన్మిశ్రితంగా, శ్రోతల్ని చకచ్చకితులను చేసే అనుపమాన శక్తియుక్తాలై ఉంటాయి. ఎంత అద్భుత శక్తి ఉందో రఘు గొంతులో! ఆయన కవిత మనల్ని వశీకరించుకునే సాంద్ర చంద్రిక.’’

ఆ ఉత్తరం నా అంతర్లోకాల్లో రేపిన తుఫాను నుండి తేరుకునేందుకు చాలా కాలం పట్టింది. శేషేంద్ర శర్మ అభిప్రాయం చెప్పకుంటే అచ్చు జోలికి పోయేవాడ్నే కాదు.


అప్పటికి ఖమ్మంలో జూనియర్ లాయర్‌ని. పావలా బేడా పోగేసుకొని బెజవాడ పోయి కవర్ పేజీకి బొమ్మేయమని బాలి గారిని అడిగాను. గంట తర్వాత ఆయన గీసిన ముఖచిత్రం చూసి కృతజ్ఞతతో చేతులు పట్టుకొని నొక్కినప్పుడు, ‘‘ఉద్వేగాలు బాగా పట్టుకుంటారు మీరు. దానినే బొమ్మ చేసే ప్రయత్నం చేశాను,’’ అని మెచ్చుకున్నారు. కట్ చేస్తే అగస్ట్ 17. జిల్లా గ్రంథాలయంలో జ్వాలాముఖితో పుస్తకవిష్కరణ. వెన్నెల సొనకు పరవశించే రఘు కవిత్వానికి లావా లాంటి జ్వాలాముఖితో ఆవిష్కరణ సరిపడదని మిత్రులు పెదవి విరిచినా పట్టుపట్టి పిలిచాను. ఆ రోజు జ్వాలాముఖి ఉపన్యాసంలో శుద్ధ కవిత్వ ప్రేమికుడిని చూసింది ఖమ్మం. 70వ దశకంలో ఆయన ఉపన్యాసాలు విని ఉర్రూతలూగిన తరం ఆ సభ లోనే ఉంది. వాళ్ళ ఎర్ర చొక్కాలకు, ఉద్యమ గీతాలకు జ్వాలాముఖి రెండో పార్శ్వం తెలీదు.

‘‘ముడుచుకున్న మునివేళ్ళ కలం తంత్రులు బిగించాను కాలం పొత్తిళ్ళపై కొత్తగీతం రాద్దామని,’’ వంటి నా పంక్తుల్ని ఉటంకిస్తూ నడిచింది సభ. ఆ తరువాత ఇంకో తొమ్మిది పుస్తకాలువచ్చినా, వాటి గురించి వక్తలెంత గొప్పగా మాట్లాడినా మొదటి సభలోని తాజాదనం ఎప్పటికీ ప్రత్యేకం.

కొన్ని రోజుల్లో బోలెడు సమీక్షలు..! ‘‘ఇతని కవిత్వ శరీరం నిండా మెరుపులు గుబాళిస్తాయి. విరుపులు తళుక్కున మెరుస్తాయి. కొత్త కొత్త పదబంధాలు, భావగంధాలు అత్తరు వాసనలతో ప్రభాసిస్తాయి. ఈ కవిది నిజంగా అభివ్యక్తిలో కొత్త జెండా!’’ అని మెచ్చుకున్నారు నాగ భైరవ.


‘‘రఘు అద్దం లాంటి కవి. పూలతీగ లాంటి కవి. అతనిలో ప్రతి క్షణాన్నీ కళాత్మకం చేసే కళాకారుడున్నాడు. ప్రపంచం లోని గొప్ప కవుల ఊహల్తో సమానమైన ఊహలు ఆయన చేశాడు,’’ అని రాశారు సౌభాగ్య.

నా కవిత్వ జీవితానికి పునాదులు వేసిన శేషేంద్ర శర్మ గారికి మొదటి ప్రతిని భక్తితో సమర్పించుకున్నాను. ఒక జ్వర లాలస లాంటి మైకాన్ని ఇచ్చిపోయింది నా మొదటి సంపుటి.

96761 44904

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

మదుపరులూ పారాహుషార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jul 07 , 2025 | 05:52 AM