Kurnool Development On The Rise: మోదీ సహకారంతో అభివృద్ధిపథంలో
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:28 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు ప్రాంతం మరింత అభివృద్ధికి బాటలు వేసుకోబోతోంది. గతంలో విభజనతో మూడు రాజధానులను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇప్పుడు కొత్తగా అభివృద్ధి దిశలో పయనిస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు ప్రాంతం మరింత అభివృద్ధికి బాటలు వేసుకోబోతోంది. గతంలో విభజనతో మూడు రాజధానులను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇప్పుడు కొత్తగా అభివృద్ధి దిశలో పయనిస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం గత దశాబ్దంగా చేపట్టిన పథకాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి కొత్త రూపు ఇస్తున్నాయి. 1953లో చెన్నైని కోల్పోవడం, 1956లో కర్నూలు– తాత్కాలిక రాజధానిగా ఏర్పడటం, 2014లో తెలంగాణ విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయింది. అయినా ఇప్పుడు రాష్ట్రం కొత్త దిశలో పయనిస్తోంది.
కర్నూలు చరిత్రాత్మక నగరం నుంచి ఆధునిక కేంద్రంగా మారింది. నేడు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమల కేంద్రంగా అవతరిస్తోంది. బెంగళూరు–చెన్నై పరిశ్రమల కారిడార్‌లో భాగంగా ఓర్వకల్ నోడ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో ఆధ్వర్యంలో డ్రోన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కాగా, రాబోయే డ్రోన్ ఉత్పత్తి యూనిట్ ఈ ప్రాంతాన్ని దేశ రక్షణ, సాంకేతిక రంగంలో ప్రాధాన్యం కలిగిన కేంద్రంగా నిలబెడుతుంది. ప్రధాని ఈ నెల 16న తన పర్యటనలో డ్రోన్ సహా పలు కీలక ప్రాజెక్టులను సందర్శించనున్నారు. అలాగే, ఆసియాలోనే అతిపెద్ద హైబ్రిడ్ సౌర–గాలి–హైడ్రో విద్యుత్ ప్రాజెక్ట్ కర్నూలులో పనిచేస్తోంది. ఇది రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది.
విద్యా రంగంలో మోదీ ప్రభుత్వం తన ముద్ర వేసింది. విద్యా రంగాన్ని అభివృద్ధి సాధనంగా భావిస్తూ, మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో పలు జాతీయ స్థాయి విద్యా సంస్థలను స్థాపించింది. వీటిలో ఐఐటీ–తిరుపతి, ఐఐఎం–విశాఖపట్నం, ఎన్‌ఐటీ–తాడేపల్లిగూడెం, ఐఐఐటీడీఎం–కర్నూలు, ఐఐఎస్‌ఈఆర్–తిరుపతి, ఎఐఐఎంఎస్–మంగళగిరి వంటి సంస్థలు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌ను దేశ విద్య, పరిశోధనా మ్యాప్‌లో స్థిరంగా నిలబెట్టాయి. పరిశ్రమలు, రవాణా, కారిడార్లు, పెట్టుబడుల కొత్త గమ్యం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ఆర్థిక కారిడార్లలో మూడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. హైదరాబాద్–బెంగళూరు, బెంగళూరు–చెన్నై, విశాఖ–చెన్నై... ఈ కారిడార్ల ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు విస్తరిస్తున్నాయి.
కేవలం హైవేలు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రూ.1.2 లక్షల కోట్ల మౌలిక వసతుల ప్రాజెక్టులు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014లో 4,193 కి.మీ. ఉన్న నేషనల్ హైవేలు ఇప్పుడు 8,660 కి.మీ.కు పెరిగాయి. ప్రధాన ప్రాజెక్టులను సైతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్– రూ.5వేల కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్– రూ.12వేల కోట్లు, ఓఎన్‌జీసీ పెట్టుబడులు– రూ.8,110 కోట్లు, బీపీసీఎల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్– విశాఖ, అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్– రూ.15,000 కోట్లు.
మోదీ ప్రభుత్వం ‘అభివృద్ధి అందరికీ’ సూత్రంతో పలు సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తోంది. ‘అమృత్’ పథకం కింద కర్నూలు నగరంలోని 52 వార్డుల్లో రూ.130 కోట్లు వ్యయం చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,300 కోట్ల పనులు జరిగాయి. పీఎం ఆవాస్ యోజన (అర్బన్) కింద 20.28 లక్షల ఇళ్లు నిర్మించి, దేశంలో అగ్రస్థానాన్ని సాధించింది. జల్‌జీవన్ మిషన్ కింద 39.77 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆత్మవిశ్వాసం, అవకాశాలు, పెట్టుబడుల రాష్ట్రంగా అవతరించింది. కేంద్ర ప్రభుత్వం అందించిన మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమల మద్దతు రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను ఇచ్చాయి. కర్నూలు ప్రాంతం ఇప్పుడు పరిశ్రమల, విద్యా, సాంకేతిక కేంద్రంగా ఎదుగుతోంది. పోలవరం నుంచి విశాఖపట్నం వరకు అభివృద్ధి ఇప్పుడు గణాంకాలకు పరిమితం కాకుండా, ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
డా. వినూషరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News