Share News

Kodela Siva Prasada Rao: కోటికి ఒక్కడు ఈ కోడెల శివుడు

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:39 AM

చనిపోయిన తర్వాత కొందరిని కీర్తి శేషులుగా పిలుస్తుంటాం. కానీ నిజంగా కీర్తిని వదిలిపోయే వారు కోటికొక్కరే ఉంటారు. ఆ కోవలోకే కోడెల శివప్రసాద్ వస్తారు. రూపాయి వైద్యుడిగా సేవలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ఆయన...

Kodela Siva Prasada Rao: కోటికి ఒక్కడు ఈ కోడెల శివుడు

చనిపోయిన తర్వాత కొందరిని కీర్తి శేషులుగా పిలుస్తుంటాం. కానీ నిజంగా కీర్తిని వదిలిపోయే వారు కోటికొక్కరే ఉంటారు. ఆ కోవలోకే కోడెల శివప్రసాద్ వస్తారు. రూపాయి వైద్యుడిగా సేవలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ఆయన, నందమూరి తారక రామారావు పిలుపుతో రాజకీయాలలోకి ప్రవేశించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నుంచి 1983లో విజయం సాధించి, ఆ తర్వాత అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల్లో బలమైన పట్టు, అపారమైన సేవాభావం ఆయన విజయానికి మూలం. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల మేలుకోసమే. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒక అజరామరమైన ముద్ర వేసిన నాయకుడు డాక్టర్‌ కోడెల.

1947 మే 2న గుంటూరు జిల్లాలోని నకరికల్లు మండలం, కండ్లగుంట గ్రామంలో కోడెల జన్మించారు. వైద్య విద్యను పూర్తి చేసి శస్త్ర చికిత్స నిపుణుడిగా రోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. తెలుగుదేశం పార్టీ నాటి యువ బృందంలో ఉన్న కోడెల, ఎన్టీఆర్ హయాంలో 1987లో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఒక వైద్యుడిగా మొదలైన ఆయన ప్రయాణం, తరువాత గొప్ప ప్రజానాయకుడిగా మలుపు తిరిగింది. ప్రజల సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడిన ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోం, ఇరిగేషన్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అన్నగారు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సమర్థంగా బాధ్యతలను నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడు కోడెల. ఏ శాఖ మంత్రిగా పనిచేసినా ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగారు. రాజకీయాలలో ఉండడం కంటే, వైద్య వృత్తే తనకు ఇష్టమని ఆయన అనేవారు. అన్నగారి కల అయిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి, ఆసియాలోనే అత్యుత్తమ హాస్పిటల్‌గా తీర్చిదిద్దడంలో కోడెలది మరువలేని పాత్ర. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అన్నగారి విగ్రహం సత్తెనపల్లి తారకరామసాగర్‌లో ఏర్పాటు చేశారు కోడెల. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాలను జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించేంతగా కోడెల కష్టపడ్డారు.


2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీకి కోడెల శివప్రసాద్‌ స్పీకర్‌గా నియమితులయ్యారు. నూతన రాష్ట్ర చరిత్రలో పార్లమెంటరీ ప్రమాణాలు కాపాడుతూ సభను సమర్థంగా నడిపారు. ప్రజా నాయకుడిగా, ప్రభావవంతమైన మంత్రిగా, స్పీకర్‌గా చిరస్మరణీయంగా నిలిచారు. ఆర్థిక స్వావలంబన కోసం మహిళలలో చైతన్యం నింపేలా తొమ్మిది నిర్దిష్ట లక్ష్యాలతో అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును కోడెల అద్భుతంగా నిర్వహించారు.

దుర్మార్గమైన కుట్రలతో లొంగదీయాలనుకున్నవారి ప్రయత్నాలకు బెదరకుండా ఆయన దూరమవ్వడం పార్టీకి, ప్రజలకు పూడ్చలేని లోటు. జీవితమే పోరాటంగా గడిపిన నాయకుడు. నమ్మిన నాయకుని కోసం నమ్ముకున్న కార్యకర్తలను కాపాడటం కోసం తన మీద హత్యా ప్రయత్నం, అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొని, పల్నాడులో తెలుగుదేశం కార్యకర్తల గుండె ధైర్యంగా వ్యవహరించారు. రాజకీయాలలో వైరాలు, ప్రత్యర్థులు ఉండడం సహజం, కానీ శత్రువులుగా వ్యవహరించడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. ప్రతిపక్షాలపై అధికారపక్షం జరిపే ప్రతీకార చర్యలు వేటగా, వేధింపులుగా మారి, ప్రాణాలు తీసేవరకు వెళ్లడం అత్యంత హేయం. పల్నాడు రాజకీయాలలో ఆయన సరళి ఏమైనా, సభాపతి స్థానంలో కోడెల హుందాగా వ్యవహరించి, ప్రతిపక్షానికి తగినన్ని అవకాశాలు ఇచ్చారు. కానీ ఆయనను నాటి ప్రతిపక్షం.. స్పీకర్‌గా చూడడానికి ఇష్టపడలేదు. తాము గట్టిగా ఎదుర్కొనవలసిన రాజకీయ శత్రువు అన్న తీరులోనే విపక్ష నేతలు వ్యవహరించి, స్పీకర్ స్థానానికి కూడా గౌరవం ఇవ్వలేదు. సభా కార్యక్రమాలను బహిష్కరించారు. ఎన్నికల్లో ఓడించి తీరాల్సిన నేతగా గురిపెట్టారు. 2019 ఎన్నికల సమయంలో కోడెలపై భౌతిక దాడికి దిగడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రథమ కర్తవ్యాలలో ఒకటిగా కోడెలపై వేట ప్రారంభించారు.

ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం పాడి, చంపడం కాదు... చదువుతో సమాజం బాగు చేయాలనుకుని రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేసిన ఆదర్శప్రాయుడు కోడెల. పల్నాడు ప్రాంత అభివృద్ధి, ప్రధానంగా గుంటూరు జిల్లా అభివృద్ధిపై ఆయన చెరగని ముద్ర వేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల అభివృద్ధిని ఆయన ఒక స్థాయికి తీసుకెళ్లారు. పేటలో ఏ మూలకు వెళ్లినా ఆయన చేసిన అభివృద్ధి జాడలు కనిపిస్తాయి. పేట ద్విశతాబ్ది ఉత్సవాలు 1997లో నిర్వహించినప్పుడు పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, ప్రజల తాగునీటి కష్టాలకు చరమగీతం పాడారు. 200 పడకల ఆసుపత్రి, భువనచంద్ర టౌన్ హాల్, ఆర్‌యూబీ నిర్మాణం, ప్లైఓవర్, స్టేడియం, షాదీఖానా, ఎస్ఆర్‌కేటీ, బీసీ, శివసంజీవ కాలనీలు ఏర్పాటు, జేఎన్టీయూ విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, రోడ్ల విస్తరణ, సిమెంట్ రోడ్లు, ఎక్కడ చూసినా గుర్తొచ్చే ఏకైక పేరు కోడెల. అప్పట్లోనే 10 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత కూడా ఆయనదే. 2015లో పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పట్టణంలో మూడురోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి రూ.500 కోట్ల మేర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేశారు.


ఒకప్పుడు దుర్భరమైన పరిస్థితులలో ఉన్న నరసరావుపేటకు శాశ్వతంగా విముక్తి కలిగించారు కోడెల శివప్రసాద్. నకరికల్లులో 267 ఎకరాల్లో ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌తో నరసరావుపేట పట్టణానికి మరో 25 ఏళ్ల వరకూ తాగునీటి సమస్యలు లేకుండా చేశారు. శ్మశానవాటికలను నందన వనాలుగా తీర్చిదిద్దారు. ఒకే రోజున వేలాది మంది విద్యార్థులతో చేతులు శుభ్రం చేయించి గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించారు. 16 వేల మందితో అవయవదానానికి అంగీకారపత్రాలు ఇప్పించి శభాష్ అనిపించుకున్నారు. సత్తెనపల్లిలో పాడుబడిన చెరువుని ఎన్టీఆర్ ఘాట్‌గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కోటప్పకొండ అభివృద్ధి, ప్రతి ఇంటికి ఆడబిడ్డల కొరకు టాయిలెట్ ఏర్పాటు చేయడం రాష్ట్రం మొత్తానికే ఆదర్శం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కోడెల శివప్రసాద్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరం నాయకులకు ఒక స్ఫూర్తి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఒక వైద్యుడిగా, ప్రజలకు దగ్గరైన రాజకీయ నాయకుడిగా, ప్రభావవంతమైన మంత్రిగా, స్పీకర్‌గా తెలుగు రాజకీయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారు. కోడెలతో కలిసి పనిచేయడం అదృష్టం. మరువలేని మహనీయుడు కోడెల. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, తెలుగుదేశం పార్టీ పుస్తకంలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ..

చింతకాయల అయ్యన్నపాత్రుడు

అసెంబ్లీ స్పీకర్

(నేడు డా. కోడెల శివప్రసాద్‌ 6వ వర్ధంతి: సాయంత్రం ఆరు గంటలకు

పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, రావిపాడు గ్రామంలో విగ్రహావిష్కరణ)

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 01:39 AM