Share News

BJP Telangana Crisis: కమలానికి నాథుడేడి

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:27 AM

తెలంగాణకు చెందిన పార్టీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంత గుస్సా ఎందుకయ్యారు? ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిది మంది ఎంపీల స్థాయికి....

BJP Telangana Crisis: కమలానికి నాథుడేడి

తెలంగాణకు చెందిన పార్టీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంత గుస్సా ఎందుకయ్యారు? ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిది మంది ఎంపీల స్థాయికి ఎదిగిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో క్రమంగా ఎందుకు చతికిలపడుతోంది? ఇక అధికారంలోకి రావడమే తరువాయి అని తలపోసిన పార్టీ అగ్రనేతలకు తత్వం బోధపడిందా? లోపం పార్టీ రాష్ట్ర నాయకుల్లోనే కాకుండా కేంద్ర నాయకత్వంలో కూడా ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. తెలంగాణలో కొంత కాలంగా పార్టీ చల్లబడుతూ వస్తోంది. దాదాపు ఐదేళ్ల క్రితం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠానికి చేరువగా వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని, అప్పుడు ఒకటి రెండు సీట్లకు పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించింది. ఆ తర్వాత బండి సంజయ్‌ నాయకత్వంలో మరింత దూకుడు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ నాయకత్వాన్ని మార్చారు. కారణం ఏమైనప్పటికీ అప్పటి నుంచి పార్టీ దూకుడు తగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కరిజ్మా కారణంగా అధికార కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. ఇందుకు పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు కొంత కారణం కాగా, పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు మరొక కారణం. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వివిధ పార్టీలకు చెందిన బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకున్నారు. దీంతో భవిష్యత్తుపై పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో శాసనసభకు ఎన్నికలు రావడం, పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించడం జరిగింది. దీంతో పాల పొంగుపై నీళ్లు చల్లినట్టయింది. సదరు పరిణామం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చెందిన బలమైన నాయకులను బీజేపీ కేంద్ర నాయకత్వం ఎన్నికల బరిలోకి దించింది. దీంతో కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది స్థానాలను పార్టీ గెలుచుకోగలిగింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. నివురుగప్పిన నిప్పులా పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు పార్టీని దెబ్బతీశాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్టీ మొదటి నుంచీ బలంగా ఉండేది. పటిష్ఠమైన కేడర్‌ ఉండేది. ఏ ఎన్నికలు జరిగినా గట్టి పోటీ ఇచ్చేది. కానీ కొన్ని రోజుల క్రితం జరిగిన జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏకంగా డిపాజిట్‌ కోల్పోయారు. దీంతో పార్టీ కేంద్ర నాయకత్వానికి తత్వం బోధపడింది. రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిని వెనక్కు నెట్టి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని పార్టీ అగ్రనేతలు తలపోశారు. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రాంతీయ పార్టీలు బలపడకూడదన్న పార్టీ విధానానికి అనుగుణంగా బీఆర్‌ఎస్‌ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు. అయితే అంతర్గత కుమ్ములాటలతో పార్టీ బలహీనపడుతున్న విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించలేకపోయింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీతో పొత్తుకు భారత రాష్ట్ర సమితి సిద్ధపడిందని, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడైనా కుదరవచ్చు అన్న ప్రచారం విస్తృతంగా సాగింది.


ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాల్సిన తెలంగాణ బీజేపీ నాయకత్వం అక్కడ కూడా విఫలమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఈ ప్రచారం వల్ల లబ్ధి పొందాల్సిన పార్టీ ఆ దిశగా కృషి చేయలేదు. మరోవైపు కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలను నమ్మించే దిశగా భారత రాష్ట్ర సమితి వివిధ కార్యక్రమాలు చేపట్టింది. మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తులు ఉంటాయా లేదా అన్నది పట్టించుకోకుండా సొంతంగా తన కాళ్ల మీద నిలబడడం కోసం భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా కేటీఆర్‌, హరీశ్‌ రావు ద్వయం పార్టీని ముందుకు నడిపించే బాధ్యత చేపట్టారు. కేసీఆర్‌ ఆరోగ్యం దెబ్బతినడం భారతీయ జనతా పార్టీకి కలసి వచ్చే అంశమే. అయినప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తమకు అందివచ్చిన అవకాశాన్ని కూడా వదులుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీలో అలా ఉండదని, ఆ పార్టీ క్రమశిక్షణకు మారు పేరని భావిస్తారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. కాంగ్రెస్‌ నాయకుల వలే బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోకపోయినా అంతర్గతంగా కత్తులు దూసుకోవడం మొదలెట్టారు. ఆరెస్సెస్‌ నేపథ్యంతో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ సంస్కృతిని అర్థం చేసుకోలేక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అయోమయానికి గురవుతున్నారు. క్షేత్ర స్థాయిలో బలం లేకపోయినా ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న వారి మాట పార్టీలో చెల్లుబాటు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కేంద్ర నాయకులు కూడా స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడంలో విఫలమయ్యారు. ఉత్తరాది రాష్ట్రాలలో అమలు చేసిన ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేశారు. దీంతో ప్రజా బలం ఉన్న నాయకులు పార్టీలో చేరినప్పటికీ సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ నేపథ్యంలోనే బీసీ నాయకత్వం అంశం కూడా తెరపైకి వచ్చింది. పార్టీకి బీసీలే నాయకత్వం వహించాలన్న డిమాండ్‌ అంతర్గతంగా బలపడుతూ వచ్చింది. అలా అని బీసీ నాయకుల్లో ఐక్యత ఉందా అంటే అదీ లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కూడా బీజేపీ తన పట్టును ప్రదర్శించలేక పోయింది. తాజాగా జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా సర్పంచ్‌ ఎన్నికల్లో పార్టీ పనితీరు పేలవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో పార్టీ బలపడింది అనేది పాల పొంగు వంటిదే అన్న అభిప్రాయం బలపడింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు.


చాన్స్‌ వచ్చినా అందుకోరే..

నిజానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారం చెలాయించిన భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోంది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన కేసీఆర్‌ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కవిత ఆ పార్టీకి తలపోటుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలను ఆమె ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల చిట్టా విప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సొంత సోదరుడు కేటీఆర్‌కు కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. తాజాగా మరో అడుగు ముందుకేసి ఉద్యమ సమయంలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని కవిత ఆరోపించారు. ఆమె తన ఆరోపణలు, విమర్శలను పార్టీ నాయకులకే పరిమితం చేయకుండా కన్నతండ్రిని కూడా టార్గెట్‌ చేయడానికి వెనుకాడటం లేదు. శుక్రవారంనాడు ఆమె చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాన్ని అందిపుచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన భారతీయ జనతా పార్టీ ఎందుకో స్తబ్దుగా ఉండిపోతోంది. ఇది గమనించడం వల్లనే కాబోలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు క్లాస్‌ తీసుకున్నారు. కవిత చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆసరాగా చేసుకొని భారత రాష్ట్ర సమితిని ఇరుకునపెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి భారతీయ జనతా పార్టీకి ఇది ఒక మహదావకాశం. అయితే కారణం తెలియదు గానీ, అలా జరగడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా భారత రాష్ట్ర సమితిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం జరగకపోవడం ఏమిటో కూడా తెలియదు. మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీతో పొత్తు కుదురుతుందన్న అభిప్రాయంతో బీజేపీ రాష్ట్ర నాయకులు సంయమనం పాటిస్తున్నారేమో తెలియదు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ నిలదొక్కుకోవాలంటే కాయకల్ప చికిత్స అవసరం. పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా ఉన్న అంశాలను ముందుగా గుర్తించి విరుగుడు చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితితో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న విషయమై రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలకు పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టత ఇవ్వాలి. భారత రాష్ట్ర సమితి బలంగా ఉన్నంత కాలం తెలంగాణలో బీజేపీ బలపడలేదు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అన్న భావన ప్రజల్లో కల్పించకుండా ఏం చేసినా అది ఉపరితల విన్యాసమే అవుతుంది. సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అంతర్గత కుమ్ములాటలకు మారు పేరైన కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన పట్టును పెంచుకుంటుండగా, భారతీయ జనతా పార్టీలో ఆ స్థాయి నాయకుడు కనిపించడం లేదు. కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు ఉన్నారు.


ఈ ఇద్దరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యామ్నాయం ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఉత్తరాది రాజకీయాలకు భిన్నంగా దక్షిణాది రాజకీయాలు ఉంటాయన్న విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా గుర్తించాలి. ఉత్తరాది రాష్ట్రాలలో పార్టీ ప్రభావం అధికంగా ఉంటుంది. స్థానికంగా బలమైన నాయకులు లేకపోయినా ఇబ్బంది ఉండదు. దక్షిణాదిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి! బలమైన నాయకుల చుట్టూ రాజకీయం సాగుతుంటుంది. కర్ణాటకలో యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ బలంగా ఉండేది. నాయకత్వ స్థానం నుంచి ఆయనను తప్పించగానే అక్కడ పార్టీ బలహీనపడింది. తమిళనాడులో కూడా అన్నామలైను నాయకత్వం నుంచి తప్పించిన తర్వాత ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూకుడు తగ్గింది. తెలంగాణలో కూడా బండి సంజయ్‌ను నాయకత్వం నుంచి తప్పించాకే తంటాలు మొదలయ్యాయి. ఉత్తరాదిన పార్టీని ముందుగా విస్తరించి ఆ తర్వాత నాయకులను పెంచడం బీజేపీ విధానంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో ఈ విధానం చెల్లుబాటు కాదు. ఇక్కడ ముందుగా నాయకులను పెంచాలి. ఆ తర్వాత పార్టీ దానంతట అదే బలపడుతుంది. కేసీఆర్‌ కారణంగా భారత రాష్ట్ర సమితి బలంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కారణంగానే ఇటు కాంగ్రెస్‌ బలంగా రూపొందింది. ఈ రెండు పార్టీలను ఢీ కొనాలంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఆ స్థాయి నాయకుడు ఉండాలి కదా? అలాంటి నాయకుడిని తీర్చిదిద్దుకోవాలి కదా? మా పార్టీ సిద్ధాంతాల పునాదిపై ఆధారపడి మాత్రమే పనిచేస్తుంది అంటే కుదరదు. జాతీయ స్థాయిలో కూడా ప్రధాని మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు కదా? తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఎనిమిది స్థానాలు లభించాయంటే అందుకు మోదీయే కారణం కాదా? రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకుడు లేని కారణంగానే ఇతర ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన పేలవంగా ఉంటోంది. జూబ్లీహిల్స్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీసుకోగా, భారత రాష్ట్ర సమితి బాధ్యతను కేటీఆర్‌ తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున బాధ్యతను ఎవరు తీసుకున్నారు? అంటే సమాధానం లభించడం లేదు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే పరిస్థితిని చూస్తున్నాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే భారత రాష్ట్ర సమితిని ముందుగా దెబ్బతీయాలి. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఆ ప్రయత్నమే జరగడం లేదు. కవిత తాజాగా చేసిన ఆరోపణల విషయమే తీసుకుందాం. ఆమె చేసిన ఆరోపణలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు స్పందించారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఒక్కరు కూడా స్పందించలేదు.


3-ed.jpg

రేవంత్‌ పట్టు!

ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో తన పట్టును నానాటికీ పెంచుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అనూహ్య విజయం తర్వాత మరింత ఆత్మ విశ్వాసంతో ఆయన అడుగులు వేస్తున్నారు. ప్రజలలో తన ప్రతిష్ఠ పెంచుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఆయన వదులుకోవడం లేదు. తెలంగాణ రైజింగ్‌ పేరిట నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు భారీ ప్రయత్నం చేశారు. మరోవైపు పార్టీలో తన పట్టును మరింతగా పెంచుకుంటున్నారు. మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని ఆయన మొదటిసారిగా ప్రకటించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇలా ప్రకటించుకోవడం సాహసమే అవుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డికి మాత్రమే ఆ స్థాయి దన్ను లభించింది. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి అలా ప్రకటించుకున్నారు. మంత్రులు కూడా వచ్చే టర్మ్‌ రేవంత్‌ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించడం చూస్తున్నాం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఐకాన్‌ మెస్సీతో తాను సరదాగా ఆడిన మ్యాచ్‌ను వీక్షించడానికి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీని ప్రత్యేకంగా పిలుచుకోగలిగారంటేనే పార్టీలో రేవంత్‌ రెడ్డి పట్టు ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 58 శాతం వరకు సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి తన సత్తా చాటుకున్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతింటుందని చాలా మంది భావించారు. కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు కలలుగన్నారు. తీరా చూస్తే మొదటి దశ ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి సాధించినన్ని స్థానాలను కాంగ్రెస్‌ దాదాపుగా గెలుచుకోగలిగింది. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఫలితాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండటం సహజమే అయినప్పటికీ, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడాన్ని విస్మరించకూడదు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పనితీరు మరీ పేలవంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రానప్పటికీ తమదే పైచేయి అని చెప్పుకొంటూ భారత రాష్ట్ర సమితి ఆత్మవంచన చేసుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ దుమ్ము రేపింది అని సొంత మీడియాలో ప్రచారం చేసుకుని ఆత్మసంతృప్తి చెందుతోంది. భారతీయ జనతా పార్టీలో పైకి కనిపించని కుమ్ములాటలు చోటుచేసుకుంటుండగా, భారత రాష్ట్ర సమితిలో ఇంటిపోరు మిన్నంటుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చాప కింద నీరులా బలం పెంచుకుంటూ పోతున్నారు. రాజకీయంగా ఆయన ఎత్తుగడలు ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. మిగతా రెండు పార్టీలలో నెలకొన్న పరిస్థితులు కూడా ఆయనకు కలిసివచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ రెండు పార్టీలకు జుట్లు ముడివేశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. ఇది రాజకీయంగా రేవంత్‌ రెడ్డి సాధించిన విజయం. కొద్ది నెలల క్రితంతో పోల్చితే రేవంత్‌ రెడ్డి రాజకీయంగా బలపడ్డారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు ఒక దశలో మిన్నంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితులను ఆయన అధిగమించడమే కాకుండా తెలంగాణలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ స్థానం మరింత పటిష్ఠం అయింది.


పోటీ ఎవరు?

రేవంత్‌ రెడ్డి బలపడిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆయనతో భారత రాష్ట్ర సమితి తలపడుతుందా? లేక భారతీయ జనతా పార్టీ ఢీకొంటుందా? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది. కేసీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరితే భారత రాష్ట్ర సమితి పటిష్ఠంగానే ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్యనే ప్రధాన పోటీ ఉండవచ్చు. అలా కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ప్రధానంగా పోటీలో ఉండాలంటే ఆ పార్టీ కేంద్ర నాయకత్వ ధోరణి మారడంతో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీకి అవసరమైన ఆక్సిజన్‌ను అందించాలి. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి బలపడుతున్న కొద్దీ బీజేపీ–బీఆర్‌ఎస్‌ మధ్య స్నేహం చిగురించి పొత్తు పొడిచే అవకాశాలను కొట్టివేయలేం. పార్టీ రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పార్టీ ప్రస్తుత దుస్థితికి తాము కూడా పరోక్ష కారణమన్న వాస్తవాన్ని ఆయన గుర్తించాలి. భారత రాష్ట్ర సమితి విషయంలో కేంద్ర పార్టీ వైఖరి స్పష్టం చేయకుండా రాష్ట్ర నాయకులను నిందించి ప్రయోజనం ఉండదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందా? లేక పొత్తు కుదుర్చుకోబోతున్నదా? అన్నది స్పష్టమైతే గానీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది తేలదు. రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్నటిదాకా బీజేపీతో పొత్తుకు ఆరాటపడిన బీఆర్‌ఎస్‌ భవిష్యత్తులో కూడా అదే వైఖరితో ఉంటుందని చెప్పలేం. భారతీయ జనతా పార్టీ మరింత బలపడే విషయం అటుంచి ఉన్న బలాన్ని కూడా కాపాడుకోలేకపోతే ఆ పార్టీతో పొత్తుకు బీఆర్‌ఎస్‌ కూడా ముఖం చాటేయొచ్చు. ఏ ప్రయోజనం లేకుండా ఏ పార్టీ అయినా మరో పార్టీతో చేయి కలపదు కదా? ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని తీర్చిదిద్దడానికి ప్రధాని మోదీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అన్నదే చర్చనీయాంశంగా ఉంది. తత్వం బోధపడినందున పార్టీకి పూర్తి స్థాయిలో జవసత్వాలు సమకూర్చడానికి కేంద్ర నాయకత్వం ఏదో ఒకటి చేయకపోతుందా? అని బీజేపీ శ్రేణులు ప్రస్తుతానికి ఆశగా ఎదురుచూస్తున్నాయి. మునుముందు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది తెలియాలంటే ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఏం చేయబోతున్నదో తెలియాలి. అంతవరకు అంతా సస్పెన్స్‌గానే ఉంటుంది. అధికారాన్ని అందుకోగలిగిన స్థాయికి వచ్చిన పార్టీ బలహీనపడటాన్ని ప్రధాని మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరు. త్వరలోనే విరుగుడు చర్యలు తీసుకుంటారు. అవేమిటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

ఆర్కే

ఇవీ చదవండి:

కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్

ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్

Updated Date - Dec 14 , 2025 | 01:27 AM