Governance vs Grand Schemes: పీ 4 పిచ్చిలో చంద్రబాబు
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:46 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడూ నేల విడిచి సాము చేయాలని ఉబలాటపడుతుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు. ఆచరణ సాధ్యం కాని...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడూ నేల విడిచి సాము చేయాలని ఉబలాటపడుతుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు. ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ఆలోచనలంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్‌లో పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారు. దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఏ నాయకుడైనా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి గానీ, ప్రజలకు దూరమయ్యే సలహాలు, సూచనలు ఎవరు అందించినా పట్టించుకోకూడదు. జగన్‌రెడ్డి పాలనలో అష్టకష్టాలు పడి చివరకు జైలుకు కూడా వెళ్లిన చంద్రబాబు నాయుడు, ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. దీంతో గతంలో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వనని, 1995–1999 మధ్య కాలంలో తాను ఎలా వ్యవహరించానో ఇకపై అలాగే వ్యవహరిస్తానని ఆయన నమ్మబలికారు. 1999–2004 మధ్య కీర్తి కండూతికి అలవాటు పడిన ఆయన సంస్కరణల పేరిట ప్రజలకు దూరమయ్యారు. ప్రజా నాయకుడిగా కాకుండా రాష్ర్టానికి సీఈవో అని పిలిపించుకోవడానికే ఇష్టపడ్డారు. దీంతో 2004లో అధికారం కోల్పోయిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత 2014లో గానీ తిరిగి అధికారంలోకి రాలేకపోయారు. ఆ సమయంలో రియల్ టైం గవర్నెన్స్ అంటూ రాజకీయాలను విడిచిపెట్టి సమావేశాలు, సమీక్షలతో గడిపేశారు. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను పట్టించుకోలేదు. ఫలితంగా 2019లో 23 సీట్లకే పరిమితం అయ్యారు. జగన్మోహన్‌రెడ్డి స్వయంకృతాపరాధంతో 2024లో చంద్రబాబు కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలో వచ్చారు. ఈ పర్యాయం అయినా ఆయన ప్రాక్టికల్‌గా, రాజకీయ నాయకుడిగా మారి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తారని అందరూ ఆశించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత అనుభవాలు మరచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఊదరగొట్టారు. దీనిపై విమర్శలు రావడంతో ఈ మధ్యే తన ధోరణిని మార్చుకున్నారు. ఇంతలోనే ఆయన పీ–4 అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ దిక్కుమాలిన సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు గానీ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా పీ–4 విధానాన్ని అమలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో జీరో పావర్టీ తమ లక్ష్యమని ఆయన చెప్పుకొంటున్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 20 శాతం పేదలను రాష్ట్రంలో ఉన్న పది శాతం ధనవంతులు ఆదుకోవాలని, ఆయా కుటుంబాలను సదరు ధనవంతులు దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. లబ్ధి పొందే కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’, దత్తత తీసుకొనే ధనికులను ‘మార్గదర్శులు’ అని ముద్దుగా పేర్లు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పది లక్షలా 92 వేల బంగారు కుటుంబాలను, లక్షా 67 వేల మంది మార్గదర్శులను గుర్తించినట్టు ప్రభుత్వం చెబుతోంది. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చివేశారు. 2029 నాటికి రాష్ట్రంలో జీరో పావర్టీ అన్న లక్ష్యం ఆచరణ సాధ్యమా? అని కనీస ఆలోచన చేయకుండా మార్గదర్శులకు బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు.
చెంపదెబ్బ.. గోడదెబ్బ!
పేదరికం లేని సమాజం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఉంటుందా? మన దగ్గర ఎలా సాధ్యం అన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియదు. ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించే ఇలాంటి సలహాలు ఇచ్చినవారి జ్ఞానం ఏపాటిదో దీన్ని బట్టి అర్థమవుతోంది. 1995లో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. అప్పట్లో దీనికి మంచి స్పందన వచ్చింది. ఆయా గ్రామాల్లో పుట్టి పెరిగి ఉన్నత స్థానాలకు చేరినవారు ప్రేరణ పొంది తమ స్వగ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)’ పథకాన్ని తీసుకురాలేదు. ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో రెండు శాతం మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎంపిక చేసిన కార్యక్రమాలకు విధిగా ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు, సంస్థలు తమ లాభాల్లో రెండు శాతాన్ని సమాజ హితం కోసం ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పథకం అమలులో ఉండగానే వ్యక్తులకు లబ్ధి చేకూర్చే పీ–4 పథకాన్ని చంద్రబాబుకు ఎవరు అంటగట్టారు? నిజానికి సీఎస్‌ఆర్ నిబంధన లేనప్పుడు కూడా మనసున్న దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకున్నారు. విద్య–వైద్య రంగాలకు తమ వంతు సాయం చేసేవారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయాల్సిన సహాయాన్ని నిర్బంధం చేయాలనుకోవడమే తప్పు. ప్రభుత్వం–ప్రైవేట్–ప్రజల భాగస్వామ్యంతో కూడినదే పీ–4. దీంతో ఇది కలగాపులగంగా మారింది. ముందుగా ఈ పథకం వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా జరిగే నష్టం విషయానికి వద్దాం. రాష్ట్రంలో పేదరికంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత? అన్నది ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను కట్టే మరికొందరిని మినహాయిస్తే మిగతా అందరూ పేదరికంలో ఉన్నట్టే! వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఈ లెక్కన కనీసం కోటి కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి పదకొండు లక్షల కుటుంబాలను గుర్తించినట్టు ప్రభుత్వం చెబుతోంది. అలా అయితే మిగతా 89 లక్షల కుటుంబాల పరిస్థితి ఏమిటి? వారంతా ప్రభుత్వానికి దూరం కారా? ఏ పథకాన్నయినా అందరికీ వర్తింపజేసినప్పుడే రాజకీయంగా ఫలితాలు లభిస్తాయి. అరకొరగా అమలు చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. తాను స్వయంగా 250 బంగారు కుటుంబాలను కుప్పంలో దత్తత తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. అలా అయితే కుప్పం నియోజకవర్గంలో ఉన్న మిగతా పేద కుటుంబాలు కినుక వహించవా? కాగా, బంగారు కుటుంబాల ఎంపిక కూడా శాస్ర్తీయంగా జరగడంలేదు. కొన్నిచోట్ల మార్గదర్శిగా గుర్తించిన వారికంటే అధిక ఆస్తులు కలిగి ఉన్న వారిని కూడా బంగారు కుటుంబాల జాబితాలో చేర్చారు. ఒక మార్గదర్శికి కొన్ని కుటుంబాల వంతున ప్రభుత్వం కేటాయిస్తుంది.
బంగారు కుటుంబాల సంఖ్య పెరిగేకొద్దీ మార్గదర్శుల సంఖ్య కూడా పెరగాల్సి ఉంటుంది. దీంతో జిల్లా స్థాయి అధికారులకు మార్గదర్శుల సంఖ్య విషయంలో టార్గెట్ పెట్టారు. బంగారు కుటుంబాల ఎంపిక గందరగోళంగా ఉందనుకుంటే మార్గదర్శుల ఎంపికకు కూడా టార్గెట్లు విధించడంతో సహాయం చేయాలనుకున్న వారు కూడా ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. దీంతో ప్రభుత్వం పరిస్థితి ‘చెంపదెబ్బ–గోడదెబ్బ’గా మారుతోంది. బంగారు కుటుంబంగా ఎంపిక కాని వారు ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టకుండా ఉంటారా? అదే సమయంలో తమను బలవంతంగా మార్గదర్శులుగా ఎంపిక చేయడాన్ని దాతలు కూడా ఆక్షేపిస్తున్నారు. మద్యం షాపులు నడిపే వారిని, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మార్గదర్శులుగా ఎంపిక చేస్తున్నారు. స్వచ్ఛందంగా సాగాల్సిన కార్యక్రమాలలో ప్రభుత్వం తలదూరిస్తే ఇలాగే ఏడుస్తుంది. బంగారు కుటుంబాల ఎంపిక బాధ్యతను గ్రామ సచివాలయాలకు కూడా అప్పగించారట. వారు తమ గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయా అని పరిశీలించి ఎంపిక చేయకుండా ఎమ్మెల్యేల నుంచి వస్తున్న జాబితాలను పైస్థాయి అధికారులకు పంపుతున్నారు. ఇప్పటివరకు ఎంపికైన బంగారు కుటుంబాలలో 26 శాతం వరకు అనర్హులని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లోతుగా పరిశీలిస్తే ఇంకెంత మంది అనర్హులు తేలుతారో తెలియదు. లబ్ధిదారులుగా మారబోతున్న బంగారు కుటుంబాలకు ఏ అవసరాలు ఉంటాయో తెలుసుకోవడానికి ప్రాథమిక సర్వే చేయగా 31 శాతం మంది ఉద్యోగాలు కావాలని, 22 శాతం మంది వైద్య సహాయం కావాలని, 9 శాతం మంది వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి కావాలని కోరగా, మిగతా వారు తమ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. అంటే, ఒక బంగారు కుటుంబం భారాన్ని మొత్తం మార్గదర్శి భరించాలన్నమాట. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు పేదరికంలో ఉన్న తమ రక్తసంబంధీకులను కూడా పట్టించుకోని రోజులివి! ఏదైనా ఒక పథకానికి రూపకల్పన చేసే ముందు అది ఎంతవరకు ఆచరణ సాధ్యం? సదరు పథకం వల్ల ప్రజలకు జరిగే మేలెంత? ప్రభుత్వానికి రాజకీయంగా కలిగే ప్రయోజనం ఎంత? అని బేరీజు వేసుకోవాలి కదా? ప్రజలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియనివారు ఇచ్చే సలహాలను గుడ్డిగా ఆచరించి అమలు చేస్తే నష్టం తప్పదు. ఇటు పేదలను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేని విధంగా, అటు మార్గదర్శులుగా ఎంపిక చేస్తున్న వారికి నిర్బంధంగా బాధ్యతలు అప్పగించడం వల్ల ఉభయభ్రష్టత్వం తప్పదు.
ప్రకృతి విరుద్ధ ఆలోచన!
పేదలను ఆదుకోవడం వేరు.. పేదరికమే లేకుండా చేయడం వేరు. ఇలాంటి ఆలోచనే ప్రకృతి విరుద్ధం. పేదరికం లేని సమాజం సృష్టించడం అంత సులువైతే సంపన్న దేశాల్లోనూ పేదరికం ఎందుకు ఉంటోంది. అక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కదా! నిర్బంధ విధానం ఏదీ కూడా సక్సెస్ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు పీ–4ను పట్టుకొని వేలాడుతున్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులను పిలిపించుకొని గంటలకొద్దీ చర్చలు జరుపుతున్నారు. సదరు సమావేశాలలో ఒకరిద్దరు పారిశ్రామికవేత్తల గొప్పదనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తుండటంతో మిగతావారు చిన్నబుచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాలకు వెళ్లిన వారిలో పలువురు ఇదెక్కడి తద్దినం అని తిట్టుకుంటున్నారు. బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి సంక్షేమ పథకాలు ఆపేస్తారా? అంటే అదీ లేదు. అంటే, వారికి డబుల్ బొనాంజా అన్న మాట! అలాంటప్పుడు మిగతా వారికి కడుపు మంట ఉండటం సహజం. 30 ఏళ్ల క్రితం అమలు చేసిన జన్మభూమి పథకానికీ దీనికీ పోలిక లేదు. మీరు ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేస్తే మార్గదర్శులుగా ఎంపికవుతున్న వారికి కోపం రాకుండా ఉంటుందా? జిల్లా కలెక్టర్లకు టార్గెట్లు విధించడం వల్ల వారు వివిధ శాఖల అధికారులకు ఆ టార్గెట్లు పంచుతున్నారు. ఈ క్రమంలోనే టీచర్లు కూడా మార్గదర్శులుగా మారాలంటూ కొన్నిచోట్ల ఉత్తర్వులివ్వడాన్ని చూశాం. దీనిపై విమర్శలు రావడంతో అధికారులు వెనక్కు తగ్గారు. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా మార్గదర్శులను ఎంపిక చేయమంటున్నారట! ఇందుకోసం రెవెన్యూ అధికారులను ప్రయోగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులపై కూడా వ్యతిరేకత ఏర్పడుతోంది. గ్రామాలలో రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. రైతులను ఆదుకోవడానికి ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు బంగారు కుటుంబాల బాధ్యత అప్పగించాలని అనుకోవడం ఏమిటి? ఇలాంటి తల తిక్క పనుల వల్లే కదా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేది? ఈ నెల 19న ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ లోపు చంద్రబాబు మేల్కొని పీ–4 అమలు వల్ల తనకు లాభమా? నష్టమా? అన్నది సమీక్షించుకోవడం మంచిది. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఎవరెవరో ఏవేవో సలహాలు ఇస్తుంటారు. అలా వచ్చే సలహాలలో వేటిని పరిగణనలోకి తీసుకోవాలి? వేటిని విస్మరించాలి? అన్న ఇంగితం ప్రభుత్వానికి ఉండాలి కదా? ఈ పథకం అమలు పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన సంస్థకు వైస్ చైర్మన్‌గా సి.కుటుంబరావు అనే ఆయనను నియమించారు. ఆయన ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ఫోన్లు చేసి టార్గెట్లు విధిస్తున్నారని చెబుతున్నారు. మార్గదర్శుల ఎంపిక కోసం వ్యాపారులు, ఇతర సంపన్న వర్గాలతో ప్రభుత్వపరంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలకు వెళుతున్న ముఖ్యమంత్రి గంటలకొద్దీ సమయం వెచ్చిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్పితే పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు అసలు పనులు వదిలేసి మార్గదర్శుల వేటలో బిజీగా ఉంటున్నారు. మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ పథకం గురించి చర్చించిన దాఖలాలు లేవు. స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి చేయాల్సిన పనులను ప్రభుత్వ కార్యక్రమాలుగా మార్చడమే తప్పు. విచిత్రం ఏమిటంటే, మంత్రులు గానీ, సీనియర్ అధికారులు గానీ ఈ పథకం మంచిచెడులను ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నారు. ఈ కారణం వల్లనే ఆచరణ సాధ్యం కాని పథకాలు పురుడుపోసుకుంటాయి. చివరికి రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటారు.
అరాచకానికి అడ్డుకట్ట పడాలి!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఫోకస్ చేయాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. దారి తప్పిన రాష్ర్టాన్ని గాడిలో పెడతారని ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు. రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తారన్న నమ్మకం ప్రజలకు ఆయనపై ఉంది. ఈ దిశలో ఫలితాలు రావాలంటే సమయం పడుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి నాయకులు తమది మంచి ప్రభుత్వం అని చెప్పుకొంటున్నారు. మంచి ప్రభుత్వంలో ప్రజలను పీడించకూడదు. కూటమి తరఫున ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు ప్రజాకంటకులుగా మారారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల కంటే అరాచకంగా వ్యవహరిస్తున్నారన్న భావన ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఏర్పడుతోంది. నియోజకవర్గాలలో ఏ పనులు జరగాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. ఏ పని కోసం అధికారుల వద్దకు వెళ్లినా ఎమ్మెల్యే గారితో చెప్పించండి అని అంటున్నారు. అధికారులు రొటీన్‌గా చేయాల్సిన పనులకు ఎమ్మెల్యే సమ్మతి ఎందుకు? రిజిస్ర్టేషన్లు జరగాలన్నా, మున్సిపాలిటీలలో ఇంటి ప్లాన్ ఆమోదం పొందాలన్నా కూడా ఎమ్మెల్యేల జోక్యం ఏమిటి? ఇక రెవెన్యూ వ్యవహారాలలో ఎమ్మెల్యేల జోక్యం సంగతి చెప్పాల్సిన పనిలేదు. లేఔట్లు వేసి వ్యాపారం చేయాలన్నా, భూ వినియోగ మార్పిడి జరగాలన్నా ఎమ్మెల్యేలకు కప్పం కట్టాలా? మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మహాప్రభో అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించిన వారినందరినీ వేడుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేద్దామనుకుంటున్న వారిని ‘మా సంగతి ఏమిటి?’ అని వేధిస్తున్నారు. ప్రభుత్వ పరమైన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించడం వంటివి ఇవాళ కొత్త కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తామే చక్రవర్తులం అన్నట్టుగా భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో కేసు కట్టాలన్నా ఎమ్మెల్యే అనుమతి ఉండాలా? ఈ దుష్ట సంస్కృతి నానాటికీ వికృత రూపం సంతరించుకుంటోంది. ఇలాంటి చెత్త పనులు చేయడం వల్లనే గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఓడిపోయారు అని తెలిసి కూడా ఆత్మపరిశీలన ఎందుకు చేసుకోరో తెలియదు. కేవలం ఐదేళ్ల కాలానికే తాము ఎన్నికయ్యామన్న స్పృహ లేకుండా విర్రవీగుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. తమ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొనే ప్రయత్నాన్ని కూటమి నాయకులు వెంటనే చేయాలి. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్‌గుడ్ భావన ఉందో లేదో తెలుసుకోవాలి. అలాంటి భావన లేని పక్షంలో సంక్షేమ పథకాలు అమలు చేసినా, అభివృద్ధి చేసినా ఫలితం ఉండదు. ప్రస్తుతానికి కొంత మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. వారిని ఎలా కట్టడి చేయాలో కూటమి భాగస్వామ్య పక్షాలు ఆలోచించుకోవాలి. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగితే దిద్దుబాటు చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ప్రజలు ఎదురొచ్చి మీ పని తీరు బాగోలేదని ఎప్పుడూ చెప్పరు. చెప్పాల్సిన రోజే చెబుతారు. పీ–4 పథకం విషయమే తీసుకుందాం. బంగారు కుటుంబాల బాధ్యత తీసుకోవడానికి ఎంపిక అవుతున్న మార్గదర్శుల అభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేస్తే ఆ పథకం విషయంలో ముందుకు వెళ్లాలో లేదో తెలిసిపోతుంది. ఉపాధి కల్పించండి అని వ్యాపార, పారిశ్రామికవేత్తలను కోరడం వేరు. దత్తత తీసుకొని వారి ఆలనా పాలనా మొత్తం చూడాలని కోరడం ఏమిటి? ప్రజలను పని సంస్కృతికి దూరం చేయడం వల్ల జరుగుతున్న అనర్థాలను తెలుగు రాష్ర్టాలు అనుభవిస్తున్నాయి.
గ్రామాలలో వ్యవసాయ పనులకు కూలీలు కూడా దొరకడం లేదు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్ వంటి రాష్ర్టాలకు చెందినవారు వచ్చి మన దగ్గర పనులు చేసుకుంటున్నారు. వారు కూడా లభించని రోజున పరిస్థితి ఏమిటో ఊహించుకోండి. పని సంస్కృతిని పెంపొందించకుండా కూర్చోబెట్టి పెట్టాలనుకోవడం బాధ్యతారాహిత్యం. మన పిల్లల్ని అలాగే పెంచుతామా? చంద్రబాబుతో వచ్చిన తంటా ఏమిటంటే, ఆయన ఏది పట్టుకుంటే దాని వెనకాలే పరిగెడతారు. ఇంకోవైపు చూడరు. 1999–2004 మధ్య ప్రజలను సమాయత్తం చేయకుండా సంస్కరణలను అమలుచేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పేదరికమే ఉండకూదన్న పాట పాడుతున్నారు. అలా చెయ్యడం సాధ్యం అని ఎవరు చెప్పారో తెలియదు గానీ వారి పేరు తెలుసుకోవాలని ఉంది. గత ప్రభుత్వం ఎందుకు అధికారం కోల్పోయిందో ఒక పుస్తకంలో రాసుకుంటే, ఇప్పుడు తాము ఏం చేయాలో, ఏమి చేయకూడదో, ప్రజలు తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో కూటమి నాయకులకు తెలుస్తుంది. అలా కాకుండా నేల విడిచి సాము చేస్తామని మంకుపట్టు పడితే పర్యవసనాలకు కూడా సిద్ధం కావాలి. ఫలానా వారికి, ఫలానా జిల్లాలో పీ–4 బాధ్యత అప్పగిస్తున్నానని చంద్రబాబు ఆ మధ్య ప్రకటించారు. ఒకరో ఇద్దరో వారు ఏ స్థాయి పారిశ్రామికవేత్తలైనా ఒక జిల్లాలో పేదరికం లేకుండా చేయగలరా? అది అంత సులువైతే అంతటి మహత్తర సలహా ఇచ్చినవారిని సన్మానించాల్సిందే. ప్రపంచ దేశాలకు కూడా మీరు ఆదర్శం అవుతారు. దిక్కుమాలిన సలహాలు ఇచ్చేవారి విషయంలో కూటమి నేతలు జాగ్రత్తగా ఉండాలి. సలహాలు ఇచ్చేవారు సేఫ్‌గానే ఉంటారు. ఆచరణ సాధ్యంకాని సలహాలను అమలు చేస్తే మునిగేది కూటమి పార్టీ నాయకులే.
ప్రజల మనసెరిగి మెలగాలి!
రాజధాని అమరావతి విషయంలో కూడా గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయమై వెంటనే దృష్టిసారించాలి. లేని పక్షంలో మీపై పూలు చల్లిన రైతులే రాళ్లు విసిరినా ఆశ్చర్యం లేదు. సీఆర్‌డీఏ నిబంధనల గురించి రైతులకు పూర్తిగా తెలియదు. తెలిస్తే వారు ఆందోళన చేస్తారు. నమ్మిన రైతులను అధికారుల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం మంచిది కాదు. తన కళ్లకు గంతలు కట్టాలనుకుంటున్న వారి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అలెర్ట్‌గా ఉండాలి. అంతా నాకు తెలుసులే అని అనుకుంటే అది ఆయన ఇష్టం. నేల విడిచి సాము చేసే ప్రయత్నాలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ వ్యవహారాలలో, అంటే అనుమతుల మంజూరులో విచక్షణాధికారాలను రద్దు చేయడంతో పాటు ఎమ్మెల్యేల జోక్యం లేకుండా చేయగలిగితే ప్రజలు హర్షిస్తారు. ప్రజల్లో ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్న భావన కలిగేలా పాలనా సంస్కరణలు తీసుకువచ్చి వేధింపుల నుంచి ప్రజలను విముక్తి చేయడంపై చంద్రబాబు దృష్టి సారించాలి. ప్రజల మెప్పు పొందినప్పుడే రాజకీయంగా మేలు జరుగుతుంది. ప్రజల మనసెరిగి వ్యవహరించండి!
ఆర్కే

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం
QR Code scanచేయండి
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి