Share News

The Rise of Political Arrogance: ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:53 AM

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి....

The Rise of Political Arrogance: ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజలపాలిట సమస్యగా మారుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింప జేసుకొని ఆయా నియోజకవర్గాలలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2004 నుంచి ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వెర్రితలలు వేస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి హయాంలో శాసనసభ్యులకు అపరిమిత స్వేచ్ఛను ఇవ్వడంతో వారు ప్రభుత్వ కార్యాలయాలను తమ అజమాయిషీలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకూ అదే ఆదర్శమైంది. గతానికి భిన్నంగా ఈ జాడ్యం ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించింది. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వంటి స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వారిని ఉద్దేశించి, వాటి గురించి స్థానిక ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకు చెప్పాలని సూచించేవారు. ఇది ప్రజలకు రుచించలేదు. అది వేరే విషయం! 1983కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉనికి ఉండేది కాదు. అక్కడి ప్రజా సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించేవి. అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కారు. ఎమ్మెల్యేలను కలుసుకోగలిగే పరిస్థితి జిల్లా స్థాయిలో కొద్దిమందికే ఉండేది. ఇక మంత్రులు, జిల్లా కలెక్టర్లను కలుసుకోవడం అరుదైన అవకాశంగా ఉండేది. అలా కలుసుకోగలిగిన వారికి పలుకుబడి ఉన్నట్టు పరిగణించేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగక తప్పలేదు. ఫలితంగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను, కుటుంబ పంచాయితీలను పరిష్కరించవలసిందిగా కూడా ఎమ్మెల్యేలను కోరేవారు. మొగుడూ పెళ్లాల పంచాయితీలు తామెందుకు పరిష్కరించాలని ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు విసుక్కొనేవారు. హైదరాబాద్‌లో ఉండే తమ ఎమ్మెల్యేలను తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలు వచ్చి కలుసుకొని బాధలు చెప్పుకొనేవారు. కొంతమందైతే తిరుగు ప్రయాణాలకు చార్జీలు ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యేలను కోరేవారు. తమను కలవడానికి వచ్చిన వారికి కాఫీ, టీలు తాగించడంతో పాటు భోజనం, వసతి కూడా ఏర్పాటు చేయవలసి రావడంతో శాసనసభ్యులు ఆర్థికంగా నలిగిపోయేవారు. పెళ్లిళ్లు, చావులకు వెళ్లడం విధిగా మారింది. అదే సమయంలో ఖర్చుల కోసం డబ్బు కూడా డిమాండ్‌ చేసేవారు. తెలంగాణలో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంది. కొంత కాలం క్రితం ఒక లారీ డ్రైవర్‌ తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి తాను డ్యూటీ మీద దూరంగా ఉన్నాననీ, పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఆస్పత్రిలో చేర్పించి ప్రసవం చేయించవలసిందిగా కోరారు. ఇలాంటి విచిత్రమైన అనుభవాలను శాసనసభ్యులు గతంలో పంచుకొనేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా, దండ నాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది.


రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేస్తారు? ఎరువుల ఫాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తిచేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ వ్యవహారం మంత్రి, ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని సదరు ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్దిచెప్పారు. ఈ ధోరణిని ఏమనాలి? ఇల్లు తగలబడుతుంటే బొగ్గులు ఏరుకోవడానికి ప్రయత్నించినట్టుగా లేదా? కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయంలో ఒకరికొకరు ఆదర్శం అయ్యారు. ఫలితంగా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధిపత్యం పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ కట్టాలన్నా శాసనసభ్యుడి అనుమతి ఉండాలని నిర్దేశించారు. దీంతో యావత్‌ అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ, మరోవైపు భూ కబ్జాలు, దందాలలో ఎమ్మెల్యేలు మునిగితేలారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ అభ్యర్థులను మార్చకుండా పాతవాళ్లు అందరికీ టికెట్లు ఇచ్చారు. అప్రతిష్ఠపాలైన శాసనసభ్యులను మార్చి ఉంటే కేసీఆర్‌ అధికారం కోల్పోయి ఉండేవారు కాదన్న అభిప్రాయం భారత రాష్ట్ర సమితి ముఖ్యులలో ఇప్పటికీ ఉంది.


నాడు 10 వేలు.. నేడు 30 కోట్లు!

ప్రభుత్వ వ్యవహారాలలో శాసనసభ్యులు జోక్యం చేసుకొనే విధానం 2004 నుంచే మొదలైంది. దీంతో శాసనసభ్యులు అక్రమ సంపాదనకు అలవాటుపడ్డారు. ఇప్పుడు అదొక హక్కుగా మారింది. ముఖ్యమంత్రులు సైతం ఎమ్మెల్యేలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 తర్వాత పైస్థాయిలో అవినీతి వ్యవస్థీకృతం అయింది. అదే సమయంలో మీరు కూడా సంపాదించుకోండి అన్నట్టుగా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో చట్టసభల సభ్యులు జనం మీద పడ్డారు. ఐదేళ్లపాటు సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలుపెట్టారు. దీంతో తెలుగునాట ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక నియోజకవర్గంలో సగటున 30 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. తెలుగు రాష్ర్టాలలో ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారాయి. 1985 ఎన్నికల్లో వెనుకబడిన శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ప్రతిభా భారతికి అయిన ఎన్నికల వ్యయం ఎంతో తెలుసా? కేవలం పది వేల రూపాయలు! అదే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన జీవన్‌ రెడ్డికి అయిన వ్యయం 15 వేల రూపాయలు మాత్రమే. తన వద్ద ఉన్న పది వేలు సరిపోవని, మరో ఐదు వేలు పార్టీ తరఫున ఇప్పిస్తే గెలిచి వస్తానని ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎన్టీఆర్‌ను జీవన్‌ రెడ్డి కోరగా, మరుసటి రోజు ఎన్టీఆర్‌ ఆ ఐదు వేలూ సర్దుబాటు చేయించారు. అప్పట్లో పదివేలు మాత్రమే ఖర్చు చేసిన నియోజకవర్గాలలో ఇప్పుడు పది కోట్లు కూడా సరిపోవడం లేదు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఖర్చు వంద కోట్లు దాటుతోంది. దీంతో ఎన్నికల్లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకోవడం కోసం శాసనసభ్యులు బరితెగించాల్సి వస్తోంది. విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్టుగా పరిస్థితి తయారైంది. చివరికి ముఖ్యమంత్రులు కూడా ఎమ్మెల్యేలను అదుపు చేయలేని పరిస్థితులు దాపురించాయి. ఇక ప్రభుత్వానికి బొటాబొటీ మెజారిటీ ఉంటే ఎమ్మెల్యేలను సంతృప్తిపరచడానికే ముఖ్యమంత్రి తన సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నట్టు తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సన్నిహితులు ఆయనతో మాట కలపగా ‘ఎన్నికల్లో ఖర్చు చేసిన పైసలు రాబట్టుకోవాలిగా! 25 కోట్ల రూపాయలు పంపండి!’ అని కోరారట. దీంతో సదరు మధ్యవర్తులు వెనుదిరగాల్సి వచ్చింది.


బాబు కృషి బూడిదపాలు!

ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, గెలిచిన వారు తిరిగి ఆ డబ్బు రాబట్టుకోవడానికి తెగబడటం అనేది ఒక విషవలయంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత వికటిస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక శాసనసభ్యులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వ్యవస్థలంటే భయం లేకుండా పోయింది. మీరు అందిన కాడికి దోచుకోండి, నన్ను మాత్రం ఏమీ అడగకండి అంటూ శాసనసభ్యులకు జగన్‌రెడ్డి లైసెన్స్‌ ఇచ్చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కళ్లు మూసుకోమన్నారు. ఎమ్మెల్యే చెప్పిన మాట వినాల్సిందే అని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఫలితంగా రాష్ట్రంలో ఒక రకమైన అరాచక వాతావరణం ఏర్పడింది. రూల్‌ ఆఫ్‌ లా గాలికి పోయింది. సహనం నశించిన ప్రజలు 2024 ఎన్నికల్లో అధికార వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి, కూటమికి అఖండ మెజారిటీని కట్టబెట్టారు. గాడి తప్పిన రాష్ర్టాన్ని దారిలోకి తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా ముఖ్యమంత్రికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడిన సత్సంబంధాలను వాడుకుంటూ రాష్ర్టానికి ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కోరిన విధంగా రాష్ర్టానికి సహాయ సహకారాలు అందిస్తోంది. ఉదాహరణకు యూరియా కొరతనే తీసుకుందాం. తెలంగాణలో ఉన్నంత తీవ్రంగా ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కోరిందే తడవుగా కేంద్రం పది వేల టన్నుల యూరియాను సమకూర్చింది. త్వరలో మరో 30 వేల టన్నుల యూరియా సరఫరా కాబోతోంది. విశాఖను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహకరిస్తోంది. రాష్ర్టాభివృద్ధికి ఉన్నత స్థాయిలో కృషి జరుగుతున్న వేళ క్షేత్ర స్థాయిలో కొంత మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్‌రెడ్డి హయాంలో శాసనసభ్యులు అనుసరించిన ధోరణినే కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైలు కదలాలంటే స్థానిక శాసనసభ్యుడి అనుమతి తప్పనిసరి చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఆస్తి రిజిస్ర్టేషన్‌ కోసం వెళ్లగా, స్థానిక ఎమ్మెల్యేతో ఒక మాట చెప్పించండి అని సబ్‌ రిజిస్ర్టార్‌ అడిగారట. ఆస్తుల క్రయ విక్రయాలతో ఎమ్మెల్యేలకు ఏం పని? అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.


రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లే అవుట్లు వేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి. భూ వినియోగ మార్పిడి జరగాలన్నా స్థానిక శాసనసభ్యుణ్ణి సంతృప్తిపరచాలి. చివరికి ఇళ్లు, కార్యాలయ భవనాల నిర్మాణం కోసం మునిసిపల్‌ అనుమతులు కావాలన్నా శాసనసభ్యుడి పర్మిషన్‌ ఉండాల్సిందే. జగన్‌రెడ్డి హయాంలో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరగడం ఏమిటి? అని ప్రజలు చిరాకు పడుతున్నారు. విచిత్రం ఏమిటంటే, శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వారు, కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు ఇలాంటి అరాచకాలకు అధికంగా పాల్పడుతున్నారు. గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన వారు ఇలా అన్నింటిలో తల దూర్చడం లేదు. నియోజకవర్గాలను చెరబట్టిన ఎమ్మెల్యేల వల్ల పైస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. కూటమి ఎమ్మెల్యేల పోకడల గురించిన సమాచారం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళుతోంది. అయినా వారిని ఆయన కట్టడి చేయలేకపోతున్నారు. బరితెగించిన ఎమ్మెల్యేలను సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా వారి వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత అంటూ ఉంటే అది ఎమ్మెల్యేల వల్లేనని ముఖ్యమంత్రికి తెలియంది కాదు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇటీవలే అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశారు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం ఇది తీవ్ర నేరం. అయినా సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారే కానీ అరెస్టు చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే భర్త ఆగడాలు శ్రుతి మించాయని నివేదికలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమ నియోజకవర్గాల్లో అమలు కావాలన్నా కూడా తమను సంతృప్తిపరచాలని కొందరు ఎమ్మెల్యేలు మొరాయిస్తున్నారు. పై నుంచి ఫోన్‌ చేసి చెప్పినా వారు పట్టు వీడటం లేదు. పలువురు శాసనసభ్యులు కట్టు తప్పుతున్నారని తెలిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. కూటమి ప్రభుత్వానికి శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉంది. పాతిక మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ విషయంలో ప్రజల తప్పేమీ లేదు. వారు కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ కట్టబెట్టి సుస్థిర ప్రభుత్వాన్ని అందివ్వాలని ఆశీర్వదించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడానికి కారణం ఏమిటి? మా వాళ్లను అదుపు చేయడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదని కూటమికి చెందిన ఒక ఎమ్మెల్యే వాపోయారు. గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శాసనసభ్యులు బాధ్యతగా ఉండేవారు. వారిలో భయం ఉండేది. ఇప్పుడు నక్సలైట్ల భయం లేకపోవడంతో బరితెగిస్తున్నారు. కొన్ని ఉదంతాలు వింటుంటే మళ్లీ నక్సలైట్లు బలపడాలనిపిస్తోందని మరో సీనియర్‌ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి శాసనసభ్యులను కట్టడి చేయడం అంత కష్టమేమీ కాదు. అధికారం అండ చూసుకొనే కదా వారు రెచ్చిపోతున్నారు? ఆ అధికారాన్ని వారికి దూరం చేస్తే దారిలోకి వస్తారు కదా? ఇటీవలి కాలంలో మరీ బరితెగించిన శాసనసభ్యులు ఎవరో ముఖ్యమంత్రికి సమాచారం లేకపోలేదు. అలాంటి వారిని అదుపు చేయడానికి ఒకటే మార్గం ఉంది. బరితెగించిన వారి జాబితా రూపొందించి జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు ఫోన్‌ చేసి ఫలానా ఎమ్మెల్యే ఆదేశాలను పట్టించుకోవద్దని చెబితే దారికి వస్తారు కదా? నియోజకవర్గాలలో ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కాకపోతే వారి పరిస్థితి నీటిలో నుంచి బయటపడిన చేపలా తయారవదా? ఈ చిన్న లాజిక్‌ను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియడం లేదు. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలను కట్టడి చేయకుండా దోచుకోవడానికి అనుమతించిన కేసీఆర్‌, జగన్‌రెడ్డికి ఏ దుస్థితి పట్టిందో చూస్తున్నారు కదా!


1-edd.jpg

దండోపాయమే మందు!

ఈ సందర్భంగా మహాభారతంలోని ధృతరాష్ర్టుడి పాత్ర గురించి చెప్పుకొందాం. ధృతరాష్ర్టుడికి పాండవుల మీద ప్రేమ ఉండేది. తమ్ముడి పిల్లలకు న్యాయం చేయాలని కోరుకొనే వారు. అయితే నిండు సభలో పాండవులకు అన్యాయం జరిగిన సందర్భాలలో కూడా కుమారులైన కౌరవులను కట్టడి చేయలేక మౌనంగా ఉండేవారు. ద్రౌపది వస్ర్తాపహరణం సమయంలో కూడా ధృతరాష్ర్టుడు మౌనంగా ఉండిపోయారు. అన్యాయాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా మహాభారత సంగ్రామం జరిగి కౌరవులు అందరూ హతమయ్యారు. కురు సామ్రాజ్యం అంతరించి పోయింది. అలా అని ధృతరాష్ర్టుడు మంచివాడు కాడని చెప్పలేం. చెడును, అన్యాయాన్ని నిలువరించని వారు ఫలితం అనుభవిస్తారని చెప్పడానికి మహాభారతంలో ఈ ఉదంతాలను పేర్కొని ఉంటారు. వర్తమానంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ధృతరాష్ర్టుడిగా మిగిలిపోకూడదు. శాసనసభ్యుల పోకడలను అదుపుచేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కౌరవులకు పట్టిన గతే కూటమి సభ్యులకు పట్టదా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక యుద్ధం బదులు ఎన్నికలు జరుగుతాయి. ప్రజాభిమానం కోల్పోయిన వారందరూ ఓడిపోతారు. రాష్ర్టాన్ని ఒడ్డున పడేయగలరని ఆయన మీద ప్రజలకు నమ్మకం ఉంది. ప్రజల్లో ఉన్న ఈ నమ్మకం కొనసాగాలంటే దారి తప్పిన శాసనసభ్యులను వెంటనే దారిలో పెట్టడానికి చంద్రబాబు కొరడా ఝళిపించాలి. మంచితనం, మెతక వైఖరి అన్ని వేళలా మంచివి కావు. నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించనప్పుడు భయపెట్టడం ఒక్కటే మార్గం. నిజానికి కొద్ది మంది మినహా మెజారిటీ ఎమ్మెల్యేలకు ఎన్నికల సమయంలో పార్టీ పరంగానే ఆర్థిక సహాయం అందింది. చంద్రబాబుపై నమ్మకంతో ఎంతో మంది పార్టీ ఫండ్‌ ఇచ్చారు. ఆయన కూడా పలువురిని ఒప్పించి, మెప్పించి నిధులు సేకరించి పార్టీ అభ్యర్థులకు అందించారు. అయినా ఎన్నికల్లో గెలవడానికి ఆస్తులు అమ్ముకున్న వారిలా కొంత మంది ఇలా బరితెగించడం ఎందుకు? శాసనసభ్యులకు అపరిమిత అధికారాలు కల్పిస్తూ రావడం వల్లనే ప్రస్తుత దుస్థితి. ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ కార్యక్రమాలతో ఎమ్మెల్యేలకు ఏం పని? అధికారులు స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించే వెసులుబాటు కల్పించాలి కదా? ప్రభుత్వం వేరు– ఎమ్మెల్యే వేరు. అధికార కూటమికి చెందిన వారైనంత మాత్రాన శాసనసభ్యులు చెప్పినంత మాత్రాన అధికారులు, పోలీసులు నడుచుకోవాలని ఏ చట్టంలో ఉంది? చట్టాలు, నిబంధనల అమలు బాధ్యత అధికారులదే! ఎమ్మెల్యే చెప్పారని తప్పు చేసిన అధికారికి మినహాయింపు ఉంటుందా? శాసనసభ్యులు కూడా తాము కేవలం ఐదేళ్ల కాలానికే ఎన్నికయ్యామన్న వాస్తవాన్ని విస్మరించి తమ అధికారం శాశ్వతమని ఎందుకు విర్రవీగుతున్నారో అర్థం కావడం లేదు. అధికారం శాశ్వతం కాదని తెలిసి కూడా వల్లమాలిన అధికారదర్పాన్ని ఒలకబోస్తే రేపటి పరిస్థితి ఏమిటి అన్నది తెలుసుకోవాలి కదా? తప్పు చేస్తున్న వారిని దారిలోకి తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నయానో భయానో చేసిన, చేస్తున్న ప్రయత్నాలు ఫలించనందున ఇక మిగిలింది దండోపాయమే. హద్దు మీరుతున్న ఎమ్మెల్యేలను బ్లాక్‌ లిస్టులో పెట్టి వారిని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోతే అందరూ దారిలోకి వస్తారు. తమది మంచి ప్రభుత్వమే కాదు– బలమైన, దృఢమైన ప్రభుత్వమని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే!

ఆర్కే

ఇవి కూడా చదవండి

హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..

జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..

Updated Date - Aug 31 , 2025 | 01:53 AM