Google AI Hub Investment Near Visakhapatnam: మారీచ కుట్రలు
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:18 AM
విశాఖపట్నం సమీపంలో 1.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ సంస్థ ద్వారా ఏఐ హబ్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని కేంద్రం ప్రకటించింది. మన దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుసకొడుతున్న...
విశాఖపట్నం సమీపంలో 1.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ సంస్థ ద్వారా ఏఐ హబ్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని కేంద్రం ప్రకటించింది. మన దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుసకొడుతున్న వేళ ఆ దేశానికి చెందిన గూగుల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖకు పెట్టుబడుల వరద ప్రవహిస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇదొక మైలురాయి. భారీ పెట్టుబడి సాధించినందుకు ‘ఆహా’ అని మురిసిపోవాలి. అయితే పునాదులు కూడా దాటని వైద్య కళాశాలల నిర్మాణాలను చూసి ‘ఆహా’ అని ఆశ్చర్యపోవాలని చెప్పుకొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అండ్ కో మాత్రం విషం కక్కడం మొదలుపెట్టారు. గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఏడుపులు లంకించుకున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పర్యటనలకు వెళ్లినప్పుడు పచ్చని చెట్లను నరికేసినా పర్యావరణం గురించి ఒక్క నోరు కూడా పెగల్లేదు. ఇంతటితో ఆగకుండా ప్రతిపాదిత డేటా సెంటర్‌ను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నాలు మొదలయ్యాయి. డేటా సెంటర్ అంటే సాదా సీదా గోడౌన్ లాంటిది అని, కంప్యూటర్లను లోపల పెట్టి బయటి నుంచి తాళాలు వేస్తారని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ అండ్ కోలో ఇంత మనోవికారం ఎందుకు ఏర్పడిందో అంతుపట్టదు. రాష్ర్టాభివృద్ధిని కాంక్షించే వారే అయితే తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబును మించి పెట్టుబడులు సాధిస్తామని చెప్పుకోవాలి. అలా కాకుండా పొరుగు రాష్ర్టాలకు ఈర్ష్యగా మారిన ఈ ఒప్పందంపై విషం చిమ్మడం ఏమిటి? దీన్నిబట్టి వారి మెదళ్లు ఎంత విషతుల్యం అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. గూగుల్ సంస్థ డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికాలోనూ భారత్‌లోనూ భారీగా పెట్టుబడులు పెడుతోందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ర్టీట్ జర్నల్ ఈ నెల 11న ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్‌రెడ్డికి ఇలాంటి పెద్ద విషయాలు తెలియకపోవచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన మద్దతుదారుల్లో అంతో ఇంతో చదువుకున్న వాళ్లు ఉన్నారు. వారికి కూడా తెలియకపోతే ఎలా? రాష్ర్టానికి పెట్టుబడులు వస్తే చంద్రబాబుకు గానీ, ఐటీ మంత్రి లోకేశ్‌కు గానీ వ్యక్తిగతంగా లాభం ఏమీ ఉండదు. పెట్టుబడుల ఫలితాలను ప్రజలు అనుభవిస్తారు. హైదరాబాద్ మహానగరమే ఇందుకు నిదర్శనం. ఆహా అని మెచ్చుకోవాల్సిన సందర్భాలలో కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.
గూగుల్‌తో ఒప్పందానికి సంబంధించిన వార్తను జగన్ మీడియా అస్సలు పట్టించుకోలేదు. అంటే సదరు రోత మీడియాకు రాష్ట్ర ప్రయోజనాలు అంత ముఖ్యం కాదు.. జగన్‌రెడ్డి ప్రయోజనాల కోసమే ఆ మీడియా పనిచేస్తోందన్న మాట! ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గూగుల్ ఏఐ హబ్ గేమ్ చేంజర్ అనే చెప్పవచ్చు. అల్ప బుద్ధులు ఉన్న వారికి ఇది అర్థం కాదు. చేపలు, రొయ్యల దుకాణాలు ఏర్పాటు చేయించడమే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకొన్న వారికి ఇలాంటి పెద్ద విషయాలు అర్థం కావు. చేపలు, రొయ్యలను తాజాగా కొని తెచ్చుకొని తినవచ్చునని పులివెందుల ప్రజలు ఊహించారా? అని సెలవిచ్చిన జగన్‌రెడ్డి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేము! ప్రభుత్వం సరఫరా చేసే విషతుల్యమైన మద్యం తాగుతూ చేపలూ రొయ్యలూ వండుకొని నంజుకుతింటూ కునారిల్లుతూ ఉండాలన్నది జగన్ అండ్ కో కోరిక. థింక్ బిగ్.. డ్రీమ్ బిగ్ అని దివంగత అబ్దుల్ కలాం చెప్పేవారు. జగన్ అండ్ కో నుంచి అంత ఆశించలేము. వినూత్న ఆవిష్కరణలు, భారీ పెట్టుబడుల గురించి ఆలోచించకపోయినా ఫర్వాలేదు– రాష్ర్టాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలపై మారీచ, సుబాహుల వలె నిప్పులు పోయడం ఏమిటి? సంక్షేమం పేరిట ప్రభుత్వం విసిరే మెతుకులు తింటూ జనం ఎదుగూ బొదుగూ లేని జీవితం గడపాలన్నదే జగన్ అండ్ కో అభిలాష. అధికారంలో ఉన్నప్పుడు ఆ దిశగానే అడుగులు వేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి మొదలైంది. గూగుల్ నిర్ణయం తర్వాత మరెందరో ఏపీకి రావొచ్చు. ఇదే ఒరవడి కొనసాగితే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరుగుతుంది. అదే జరిగితే తమకు రాజకీయంగా నష్టమని భావిస్తున్న జగన్ అండ్ కో కుత్సితపు ఆలోచనలకు తెర తీశారు. కుట్రల అమలు మొదలుపెట్టారు. ఏదో ఒకటి చేసి పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉండకుండా చేయాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. త్వమేవాహం అంటే త్వమేవాహం అనుకొనేలా కాకుండా జగన్‌రెడ్డికి భిన్నంగా చంద్రబాబు పనిచేయడం ఏమిటి? ఆయన ప్రయత్నాలు ఫలించడం ఏమిటి? కేంద్రం నుంచి సహకారం అందడం ఏమిటి? అని రగిలిపోతున్నారు.
ఆ చావులు మరిచారా?
‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టుగా అధికారంలో ఉన్నంత కాలం విషతుల్యమైన మద్యాన్ని ప్రజలకు విక్రయించి మద్యం కొనుగోళ్లలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన జగన్ అండ్ కో, ఇప్పుడు కల్తీ మద్యాన్ని తెర మీదకు తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతోనే రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం వ్యాపారం జరుగుతోందని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి కల్తీ మద్యం అమ్మకాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉంటాయి. కల్తీ సారా, కల్తీ మద్యం తాగి మన తెలుగునాటే కాదు, ఇతర రాష్ర్టాలలోనూ ఎంతో మంది మరణించిన సంఘటనలను చూశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, రాష్ట్రం విడిపోయాక గానీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒక్క జగన్మోహన్‌రెడ్డి మినహా మరే ముఖ్యమంత్రి కూడా మద్యం ద్వారా సొమ్ములు దండుకొనే ఆలోచన కూడా చేయలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా మద్యం ద్వారా వెనుకేసుకోవాలని భావించలేదు. కాసులకు కక్కుర్తిపడి విషతుల్యమైన మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘనత మాత్రం జగన్‌రెడ్డికే దక్కుతుంది. ఇప్పుడు కల్తీ మద్యం గురించి గగ్గోలు పెడుతున్న జగన్ అండ్ కో పాలనలో కల్తీ మద్యం సరఫరా కాలేదా? అంటే జంగారెడ్డిగూడెంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఆ మద్యం తాగి పలువురు మరణించిన విషయం అప్పుడే మరచిపోతే ఎలా? గతంలో ఏమి జరిగినా చర్యలు ఉండేవి కావు. ఇప్పుడు ములకలచెరువులో ఈ వ్యవహారం బయటకు రాగానే బాధ్యులందరినీ ప్రభుత్వం అరెస్టు చేసింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేయడానికే వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారుచేశానని ప్రధాన నిందితుడు జనార్దనరావు చెప్పారు. ఇందులో నిజానిజాలు త్వరలోనే బయటికొస్తాయి. పాపం పండే ప్రమాదం ఉందని తెలియడంతో జగన్‌రెడ్డి రోత మీడియా యథావిధిగా అభూత కల్పనలతో కథనాలను వండి వారుస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు నిజాలు చెప్పాలని ప్రయత్నిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ పత్రికపై మాజీ మంత్రి పేర్ని నాని విషం కక్కుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు జుగుప్స కలిగిస్తున్నాయని ఆయన నోరు పారేసుకున్నారు. నిజానికి ఒకప్పుడు సౌమ్యుడిగా పేరున్న నాని వైసీపీలో చేరిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పుడు ఆయన ప్రవర్తన సంస్కారవంతంగా ఉండేది. జగన్‌రెడ్డితో చేతులు కలిపిన తర్వాత ఆయన ప్రవర్తన మారింది. మంచివాడు అనిపించుకున్న పేర్ని నాని వంటి వారు కూడా వివేకం మరచి విజ్ఞత లేకుండా మాట్లాడటం చూస్తుంటే వారు ఏదైనా వైరస్ బారినపడ్డారా అన్న అనుమానం కలుగుతుంది. లేని పక్షంలో మంచివాళ్లు కూడా జగన్ పక్షం చేరగానే హద్దూ అదుపూ లేకుండా ఎలా వ్యవహరించగలరు? కల్తీ మద్యం తయారీ అనేది అసాధారణ సంఘటన ఏమీ కాదు. అయితే జగన్ అండ్ కో దీనికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారంటే, కారణం లేకపోలేదు. మద్యం ద్వారా నేను ఒక్కడినే సొమ్ములు వెనుకేసుకోలేదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారని ప్రజలను నమ్మించడానికే ఈ తాపత్రయం. అదే సమయంలో మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కూడా వారి లక్ష్యం కావచ్చు. జగన్‌రెడ్డి ఒక పార్టీకి అధిపతి కనుక ఇలాంటి ట్రిక్కులు చేయడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. చంద్రబాబుపై రాజకీయంగా బురద చల్లడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ, రాష్ట్రంపై కూడా విషం చిమ్మాలనుకోవడం ఏమిటి? అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఏమిటి? ఈ క్రమంలో జగన్ అండ్ కో గత కొంత కాలంగా చేస్తున్న ప్రచారం, అమలు చేస్తున్న కుట్రలను పరిశీలిస్తే వారికి ఇలాంటి విషపూరిత ఆలోచనలు ఎలా వస్తాయో అని ఆశ్చర్యం వేస్తుంది.
కులాల కుంపట్లలో చలి కాచుకుంటూ..
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో తప్పు లేదు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా పోరాటం చేయడం కూడా వారి హక్కు. అంతేగానీ జరగనిది జరిగినట్టుగా, ఏమీలేని చోట విద్వేషాలు రగిలించే ప్రయత్నాలు చేయడం, కులాల కుంపట్లు రగిలించడం ఏమిటి? దారి తప్పిన రాష్ర్టాన్ని గాడిలో పెట్టాలంటే కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్లు అధికారంలో ఉండాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. తెలుగుదేశం–జనసేన మధ్య విభేదాలు రాకపోతాయా? చంద్రబాబు–పవన్ కల్యాణ్ కొట్టుకొని విడిపోకపోతారా? అని జగన్ అండ్ కో ఇప్పటి వరకూ ఆశగా చూశారు. తాజాగా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. దీంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత కొంత కాలంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం– జనసేన మధ్య తగవులు పెట్టడానికి చెయ్యని ప్రయత్నం లేదు. అయితే వారికి నిరాశే మిగిలింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అభినందించాల్సిందే. కాపుల ముసుగులో జగన్‌రెడ్డి మద్దతుదారులు ఎంతగా రెచ్చగొడుతున్నా ఆయన సంయమనమే పాటిస్తున్నారు. జనసైనికులకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కనీసం పదిహేనేళ్ల పాటు కూటమి అధికారంలో కొనసాగాలని సూచిస్తున్నారు. అయితే అవతల ఉన్నది జగన్ అండ్ కో! హుందాతనంతో కూడిన రాజకీయాలను ఆ గుంపు నుంచి ఆశించలేము. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా కందుకూరులో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న వైషమ్యాల వల్ల ఒకరి హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. హత్య చేసిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇంకేముందీ.. వైసీపీకి చెందిన రాబందులు వాలిపోయాయి.
కమ్మ–కాపు అంశాన్ని తెర మీదకు తెచ్చి వైషమ్యాల సృష్టికి చేయని ప్రయత్నం లేదు. నిజానికి హతుడు–హంతకుడు కొంత కాలం క్రితం వరకు సన్నిహితంగానే ఉండేవారు. కారణాలు ఏమైనా వారి మధ్య వైరం ఏర్పడింది. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మదంతో విచక్షణ మరచి కారుతో తొక్కించి చంపాడు. జరిగినది హత్య అని తెలియగానే పోలీసులు ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడి తండ్రిని కూడా హత్యా నేరం కింద అరెస్టు చేశారు. ఇక్కడ కులాల గొడవ తలెత్తకూడదు. అయితే అలా వదిలేస్తే వారు జగన్ అండ్ కో ఎందుకవుతారు? వైసీపీకి మద్దతుగా ఉంటున్న కాపు సామాజికవర్గానికి చెందిన కొద్ది మంది అక్కడ వాలిపోయారు. కాపులను రెచ్చగొట్టే విధంగా వీడియోలు వదిలారు. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వీరంగం వేస్తున్నారు. అధికారంలో ఉన్నది కమ్మ సామాజిక వర్గమని, అందుకే కాపులకు రక్షణ లేకుండా పోయిందని, సొంత సామాజిక వర్గాన్ని రక్షించుకోవడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విఫలమయ్యారని, కమ్మ వాళ్ల చేతిలో కాపులు మరోసారి మోసపోయారంటూ కాపులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ముస్లిం మహిళకు వంగవీటి శిరీష అనే పేరు తగిలించి పోస్టులు పెట్టించారు. చౌదరి గారు ఆశపడితే నాయుడు తన భార్యను పంపకపోతే పరిణామం ఇలాగే ఉంటుందని తీవ్రమైన వ్యాఖ్యలతో సదరు ఫేక్ ఐడీ ద్వారా పోస్టులను సోషల్ మీడియాలో తిప్పారు. రాజకీయాల్లో ఇంత నీచత్వం ఏమిటి? ఫేక్ ఐడీలతో ప్రజల మెదళ్లలో విషం నింపే ప్రయత్నాలు చేయడాన్ని మించిన దురాగతం ఉంటుందా?
కూటమిలో చిచ్చు కోసం తహతహ!
ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు మరెక్కడైనా వ్యక్తుల మధ్య వివాదాలు ఏర్పడటం, ఘర్షణలు జరిగి హత్యలకు దారితీయడం కొత్త కాదు. అన్నదమ్ములే కొట్టుకు చస్తున్నారు. ఏ సంఘటనలోనైనా ఒకరు బాధితుడైతే మరొకరు నేరస్తుడవుతారు. కందుకూరులో కూడా ఇదే జరిగింది. అతడు కాపు.. చంపిన వ్యక్తి కమ్మ కావడం యాదృచ్ఛికం. ఈ దురాగతానికి పాల్పడిన వాడిని కాపాడటానికి ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ ప్రయత్నించలేదు కదా? హంతకుడు జైల్లోనే ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్‌ను అనేక విధాలుగా అవమానించడమే కాకుండా ఆయన నటించిన సినిమాలు కూడా నడవకుండా అడ్డుపడిన జగన్ అండ్ కో, ఇప్పుడు కాపులను రెచ్చగొట్టడం చూస్తే వారి ఆంతర్యం అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా కూటమిలో చిచ్చు పెట్టాలి. చంద్రబాబు–పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు సృష్టించాలి. ఇందుకోసం గోతి కాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. కూటమి ఐక్యంగా ఉంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న తమ కోరిక కలగానే మిగిలిపోతుందన్నది వారి బాధ. ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు కమ్మ–కాపులు సఖ్యంగానే ఉండేవారు. వంగవీటి రంగా హత్యానంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి రంగప్రవేశంతో ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించారు. కందుకూరులో జరిగిన సంఘటన ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే. ఇందులో ఆ రెండు కులాలకు చెందిన ఇతరుల ప్రమేయం ఏముంది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులే కాదు కమ్మ వారు కూడా హత్యలకు గురయ్యారు. ఈ హత్యలకు స్థానిక పరిస్థితులే కారణం కానీ కులాలు కావు కదా? మెదళ్ల నిండా విషం నింపుకొని రాజకీయం చేయాలనుకుంటున్న జగన్ అండ్ కోను అర్థం చేసుకోవడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ రాజకీయాలకు మాత్రమే అలవాటుపడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలో ఉండి కూడా జగన్‌ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడుతున్నారు.
విచిత్రమేమింటే, జగన్‌రెడ్డి విషపూరిత ఆలోచనలు, కుట్రలను అమలుచేయడానికి ఆయనకు మనుషుల కొరత లేదు. అదేమిటో గానీ, జగన్‌ను సమర్థించేవారు గానీ, కుట్రల అమలులో పాలుపంచుకొంటున్న వారు గానీ విచక్షణ కోల్పోతున్నారు. అంతుపట్టని ఉన్మాదం వారిని ఆవహిస్తోంది. లేనిపక్షంలో జగన్ కోసం అడ్డమైన పనులూ చేసి ఇబ్బందులపాలవడానికి ఎందుకు సిద్ధపడతారు? చేసిన పాపాలకు జైలుకు వెళ్లి వచ్చిన వారిలో కూడా పశ్చాత్తాపం కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనం. నేరం చేస్తే దొరికిపోతామన్న భయం వారిలో కనిపించడం లేదు. దొరికిపోయినా ఫర్వాలేదు జగన్‌రెడ్డి కోసం జైలుకు వెళ్లడానికి, చివరకు చనిపోవడానికి కూడా సిద్ధపడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలాగోలా జగన్ అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని కేక్‌లా కోసుకు తినవచ్చునన్న ఆశల్లో విహరిస్తున్నారు. కందుకూరు సంఘటనపై ఫేక్ ఐడీతో పోస్టులు పెట్టిన మహిళ కేవలం డబ్బుల కోసమే ఆ పని చేశారని భావించలేము. ఆమెను అంతకు మించిన ఉన్మాదం ఏదో ఆవహించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఈ బెడద పోవాలంటే పులివెందులను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి దానికి జగన్‌రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రిగా చేస్తే సరిపోతుందేమో! లేని పక్షంలో జగన్‌రెడ్డి వ్యాపింపజేస్తున్న వైరస్ ఇతర జిల్లాల ప్రజలకు సోకి మొత్తం రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే హైదరాబాద్‌లో ఉంటూ జగన్‌కు మద్దతు పలికే వారికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పురోగమించడం నచ్చడం లేదు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు వచ్చినా, అభివృద్ధి జరిగినా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నవారు ఎవరూ విమర్శించలేదు. జగన్‌రెడ్డికి జలుబు చేస్తే తెలంగాణలో ఆయన మద్దతుదారులు ముక్కు చీదుకుంటూ ఉపశమనం కలిగించాలనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై లేని వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేస్తున్నారు. వాళ్లంతా జగన్‌రెడ్డి హయాంలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినప్పుడు కళ్లు మూసుకొని ఆనందించారు.
ఇవాళ తన దాకా వచ్చేసరికి జగన్‌రెడ్డికి కూడా పత్రికా స్వేచ్ఛ గుర్తుకొచ్చింది. అధికారంలో ఉన్నంత కాలం ‘ఏబీఎన్’తో పాటు ‘టీవీ 5’ ప్రసారాలను నిలిపివేయించలేదా? శాసనసభ కార్యక్రమాలను కూడా కవర్ చేయకుండా ‘ఏబీఎన్’ను నిర్బంధించలేదా? సీఐడీ పోలీసులతో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక పైనా, సిబ్బందిపైనా కేసులు పెట్టించారు. ఆ కేసులకు సంబంధించి ఇప్పటికీ కోర్టులకు హాజరవుతున్నాం కదా? అధికారం కోల్పోయిన తర్వాత కూడా మా సంస్థలను దూరం పెట్టడం నిజం కాదా? జగన్ కార్యక్రమాలు, వైసీపీ నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్’లపై నిషేధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కదా? చివరకు నాపై కూడా దేశ ద్రోహం సెక్షన్ల కింద కేసులు పెట్టారు కదా? ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి గొంతు చించుకుంటున్న వాళ్లు అప్పుడు నోరు కట్టేసుకోవడానికి కారణం ఏమిటి? పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అప్పుడు గుర్తుకురాలేదా? నీవు నేర్పిన విద్యనే నీరజాక్షా.. అన్నట్టుగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని తప్పు పట్టే నైతిక హక్కు జగన్ అండ్ కోకు ఉందా? నాటి బాధితుల ఆక్రందనలు మీకు శ్రవణానందకరంగా ఉండి ఉండవచ్చు. ఇప్పుడు మీ ఆక్రందనలు కూడా ఇతరులకు అదే విధంగా శ్రవణానందకరంగా ఉంటాయని సరిపెట్టుకోండి. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అని అంటారు. నాడు అధికార మదంతో విర్రవీగినందుకు ఇప్పుడు ఫలితం అనుభవించాలి కదా? ఇప్పుడు అద్దెకు తెచ్చుకున్న గొంతులు మీకు అనుకూలంగా మాట్లాడవచ్చు.
మీకు మద్దతుగా మాట్లాడవచ్చు. అయితే అలాంటి గొంతులకు విలువ ఉండదు. దుష్ట సంప్రదాయాలను నెలకొల్పే ముందే ఆలోచించుకోవాలి. రేపు మనకూ అదే గతి పడుతుందని తెలుసుకోవాలి కదా? అప్పట్లో ‘ఏబీఎన్’ ప్రసారాల నిలిపివేతపై న్యాయస్థానాలు ప్రశ్నించగా, మాకేమి సంబంధం అని బుకాయించారు. అప్పుడు మీరు ఏర్పాటు చేసిన దారిలోనే ఇప్పుడు అధికారంలో ఉన్న వారు నడిస్తే ఎలా తప్పు పట్టగలరు? సాటి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నది ఎవరు? ఇప్పుడు మీ మీడియాను కూడా అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థిగానే భావించడంలో తప్పేముంది? అధికారం శాశ్వతం అని విర్రవీగిన వారికి ప్రకృతి గుణపాఠం నేర్పుతుంది. అన్యాయం, అక్రమం, దుర్మార్గం, దారుణం అని ఇప్పుడు ఎంత ఘోషించినా అది అరణ్య రోదనే అవుతుంది. ఇప్పటికైనా జగన్‌రెడ్డి అండ్ కో బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. అలా కాకుండా తాము కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రం సర్వనాశనం అవుతుందని నిత్యం గగ్గోలు పెట్టినా నిజం ఏమిటో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరు. అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియాను అణచివేయడానికి ఎంత ప్రయత్నించినా మీ ఓటమిని తప్పించుకోలేకపోయారు కదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నిజంగా తప్పు చేస్తే దాన్ని శిక్షించే విషయం ప్రజలే చూసుకుంటారు. అయితే ముందుగా మీ విశ్వసనీయత ఏపాటిదో తెలుసుకుంటే మంచిది. రాష్ర్టానికి మంచి జరిగినప్పుడు కూడా హర్షించలేని మనస్తత్వం ఉన్నవాళ్లను ఆ దేవుడే కాపాడాలి!
ఆర్కే
ఇవి కూడా చదవండి
హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మంటలు
బ్యాటరీ ఎంత పని చేసింది.. దెబ్బకు ప్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్..