Share News

BRS Losing: తెలంగాణ బీఆర్‌ఎస్‌ జాగీరా

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:38 AM

ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అయితే కృష్ణశాస్ర్తి బాధ ప్రపంచానికి బాధ అని ‘మహా ప్రస్థానం’ పుస్తకానికి రాసిన యోగ్యతాపత్రంలో చలం వ్యాఖ్యానించారు. తమ సొంత బాధల్ని ప్రజలు తమ బాధలుగా భావించాలని కోరుకొనేవాళ్లు రాజకీయాల్లోనూ....

BRS Losing: తెలంగాణ బీఆర్‌ఎస్‌ జాగీరా
Kothapaluku

ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అయితే కృష్ణశాస్ర్తి బాధ ప్రపంచానికి బాధ అని ‘మహా ప్రస్థానం’ పుస్తకానికి రాసిన యోగ్యతాపత్రంలో చలం వ్యాఖ్యానించారు. తమ సొంత బాధల్ని ప్రజలు తమ బాధలుగా భావించాలని కోరుకొనేవాళ్లు రాజకీయాల్లోనూ ఉంటారు. భారత రాష్ట్ర సమితి నాయకుల ఆక్రోశం, ఉక్రోషం ఇందుకు తాజా నిదర్శనం. తాము అధికారంలో ఉంటే అంతా సవ్యంగా ఉందని, ఇతరులు అధికారంలో ఉంటే తెలంగాణ సర్వనాశనం అయిపోతోందని, తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని యావత్‌ తెలంగాణ సమాజం భావించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలకు ఆ పార్టీ నాయకుడు జగదీశ్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తమ పెద్ద సారు, చిన్న సారుకు కష్టం, నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియాదే అన్నట్టుగా ఆయన చెప్పకనే చెబుతున్నారు. థంబ్‌ నెయిల్‌ విషయంలో ఒక న్యూస్‌ ఛానల్‌ చేసిన పొరపాటును ఆసరాగా చేసుకొని ఆ ఛానల్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేశారు. సదరు ఛానల్‌పై జరిగిన దాడి శాంపిల్‌ మాత్రమేనని, మునుముందు మీడియా సంస్థలపై తాము చేయబోయే దాడి ఊహించనంత తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. తమ చర్యలను సమర్థించుకొనే క్రమంలో ‘ఆంధ్రా మీడియా సంస్థలు’ అనే పాతబడిపోయిన వాదనను బీఆర్‌ఎస్‌ నాయకులు మళ్లీ తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడితే సహించబోమని చెబుతున్నారు. పెద్ద సారు, చిన్న సారుకు వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వస్తే తెలంగాణ అస్తిత్వం ఎందుకు, ఎలా ప్రమాదంలో పడుతుందో వారికే తెలియాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా కొంత కాలంపాటు ఇదే సెంటిమెంట్‌ను రగిలించి బీఆర్‌ఎస్‌ రాజకీయంగా లాభపడింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు దాటింది. ఆంధ్రా, తెలంగాణ అనే భావనను ఉభయ రాష్ర్టాల వారూ మరచిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది కానీ పెద్ద సారు, చిన్న సారు తప్పులను ఎత్తిచూపితే తెలంగాణ సమాజానికి కలిగే నష్టం ఏమిటో జగదీశ్‌రెడ్డి లాంటి వారే చెప్పాలి.


ఉద్యమంలో ‘ఆంధ్రజ్యోతి’...

తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకోక ముందు, ఆ మాటకొస్తే కేసీఆర్‌ రాజకీయాల్లోకి రాక ముందు కూడా వారు నిందిస్తున్న మీడియా సంస్థలు తెలంగాణలో ఉన్నాయి. అప్పుడు కేసీఆర్‌కు గానీ, జగన్మోహన్‌రెడ్డికి గానీ సొంత మీడియా సంస్థలు లేవు. వారికి అధికారంతో పాటు సొంత మీడియా బోనస్‌గా లభించింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు ఆ ఉద్యమ ప్రస్థానంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ‘ఆంధ్రజ్యోతిని కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుంది’ అని వ్యాఖ్యానించడం నిజం కాదా? రాజకీయ పార్టీలైనా, మీడియా అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వ్యవహరించాలి. లేని పక్షంలో వాటికి మనుగడ ఉండదు. ఈ వాస్తవాన్ని విస్మరించి జగదీశ్‌రెడ్డి వంటి వారు మరోసారి ‘ఆంధ్రా’ అన్న పదాన్ని అందుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఏ రాజకీయ ప్రయోజనాలకోసం బీఆర్‌ఎస్‌ నాయకులు ఈ వాదన చేస్తున్నారో తెలుసుకోవడం అవసరం. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన ఆ పార్టీ... తనకు తానుగా తెలంగాణ సమాజానికి దూరమైంది. తమది తెలంగాణ ఇంటి పార్టీగా చెప్పుకొన్నవారు ఇప్పుడు ఇంటి పేరు మార్చుకున్నందుకు ఏం చెబుతారు? పార్టీ పేరు మార్చుకోవాలని జగదీశ్‌రెడ్డి అండ్‌ కో నిందిస్తున్న ఆంధ్రా మీడియా సూచించలేదు కదా? ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిందని ఇదే రాజకీయ నాయకులు చెబుతారు. మెరుగైన అవకాశాల కోసం ఆంధ్రా వారితో పాటు తెలంగాణ వారు కూడా విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ఆయా దేశాల స్థానికులు కూడా ఇలా సంకుచితంగా ఆలోచించడం మొదలు పెడితే అక్కడ మన వాళ్ల పరిస్థితి ఏమిటి? అంతెందుకు... మెరుగైన విద్య కోసం ఇదే జగదీశ్‌రెడ్డి తన కొడుకును లండన్‌లో చదివించడం లేదా? కేటీఆర్‌ ఒకప్పుడు గుంటూరులో చదువుకోలేదా? తెలంగాణ రాష్ట్ర సమితి నిలదొక్కుకోక ముందు కేటీఆర్‌, కవితలు అమెరికాలో ఉద్యోగాలు చేయలేదా? అప్పుడు ఎక్కడ ఉంటున్నాం? ఎవరి తిండి తింటున్నాం? అని వారు ఆలోచించారో లేదో జగదీశ్వరరెడ్డి కనుక్కుంటే మంచిది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన వాళ్లు కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయనే వచ్చారు. ఆంధ్రా వాళ్లు కూడా ఇలాగే వచ్చి ఉంటారు. తెలంగాణకు వలస వచ్చిన వాళ్లు కష్టపడి సంపాదించుకొని తమ తిండి తాము తింటున్నారు. జగదీశ్‌రెడ్డి వంటి వారు వారికి వంటా వార్పూ చేసి పెట్టడం లేదు కదా? అయినా తెలంగాణ ఎవరి జాగీరు? తెలంగాణ సమాజం భారత రాష్ట్ర సమితికి జీపీఏ ఇవ్వలేదు కదా?


ఓడించింది ఎవరు.. ఆదరించింది ఎవరు?

ఇప్పుడు సాకు దొరికింది కదా అని మీడియాను నిందిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు ఒక వాస్తవాన్ని మరచిపోతున్నారు. గత ఎన్నికల్లో యావత్‌ తెలంగాణ సమాజం బీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించింది. కేసీఆర్‌ అండ్‌ కోను తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా ఉండిన ఉత్తర తెలంగాణ– అంటే నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ ప్రజలే బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారు. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు నిరాకరిస్తున్నారు. తమను ఆదరించి అక్కున చేర్చుకున్న వాళ్లే ఎన్నికల్లో ఎందుకు బండకేసి కొట్టారో తెలుసుకోకుండా మీడియానో, మరొకరినో నిందించడం అవివేకం. బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరించగా, హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల నివసిస్తున్న ఇతర రాష్ర్టాలకు చెందినవారే ఆ పార్టీని ఆదరించి ఆదుకోవడం వాస్తవం కాదా? స్థానికేతరులు కూడా తిరస్కరించి ఉంటే బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. బీఆర్‌ఎస్‌ నాయకులకు ఇవన్నీ తెలియక కాదు. రాజకీయంగా తాము బలహీనపడుతున్నామన్న అనుమానం కలిగిన సందర్భాలలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును భూతంగా చిత్రీకరించడం, ఆ క్రమంలో మీడియాను వివాదాల్లోకి లాగడం బీఆర్‌ఎస్‌ నేతలకు పరిపాటిగా మారింది. 2018 ఎన్నికల్లో ఈ అస్త్రం ప్రయోగించి రాజకీయంగా లబ్ది పొందారు. ఇప్పుడు మళ్లీ అదే అస్ర్తాన్ని ప్రయోగించడానికి సిద్దమవుతున్నారు. రాజకీయాలలో ఏ అస్త్రమైనా ఒకేసారి పనిచేస్తుంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడును ఓడించడానికి కేసీఆర్‌ తన వంతు సహాయ సహకారాలను జగన్మోహన్‌రెడ్డికి అందించారు. ఇందులో భాగంగా జగన్‌కు ఆర్థిక సహాయం చేయడంతో పాటు చంద్రబాబుకు హైదరాబాద్‌ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు. ఈ అనుభవంతో 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు. అదే సందర్భంలో, జైల్లో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా నిలబడిన తెలంగాణలోని టీడీపీ సానుభూతిపరులపై కేటీఆర్‌ హేళనగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం సానుభూతిపరులు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికారు. దీంతో కేసీఆర్‌ అండ్‌ కో మరింత ఆగ్రహం చెందారు. తమ ఓటమికి చంద్రబాబు, తెలుగుదేశం సానుభూతిపరులే కారణమని మనసులో పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తమకు దూరమైన వర్గాలను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేసీఆర్‌ ఆ ప్రయత్నం చేయకుండా వ్యక్తులపై అలిగినట్టుగా తెలుగుదేశం సానుభూతిపరులను కూడా శత్రువులుగా ప్రకటించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి జగన్మోహన్‌రెడ్డే గెలవాలని కోరుకున్నారు. ఇప్పటికీ జగన్‌రెడ్డికే మద్దతుగా మాట్లాడుతుండటంతో తెలంగాణలోని తెలుగుదేశం సానుభూతిపరులు కేసీఆర్‌కు మరింత దూరమయ్యారు.


‘కూటమి’ కడితే...

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం – బీజేపీ – జనసేన కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ కూటమి ప్రయోగం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కారణంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రగిలించడానికి కేసీఆర్‌ అండ్‌ కో ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా మీడియాను టార్గెట్‌గా చేసుకున్నారు. నిజానికి తెలంగాణలో కూటమి ప్రయోగం అమలు చేస్తే కాంగ్రెస్‌ పార్టీకే అధిక నష్టం. గత ఎన్నికల్లో తెలుగుదేశం సానుభూతిపరులు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఈ కారణంగానే ఖమ్మం వంటి జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థులకు భారీ మెజారిటీలు లభించాయి. అయినా చంద్రబాబు పేరు వినడానికి కూడా కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇష్టపడటం లేదు. ఆ కారణంగానే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టకూడదని వారు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకున్న కేసీఆర్‌ ఇతర రాష్ర్టాలలో పోటీ చేయాలని అప్పట్లో ఉబలాటపడ్డారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టుగా 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అసలుకే మోసం వచ్చింది. కేసీఆర్‌ ఆలోచనలను, చర్యలను తెలంగాణ సమాజం తిరస్కరించింది. దీంతో ఆ తర్వాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇతర రాష్ర్టాల్లో పోటీ చేసే సాహసం కేసీఆర్‌ చేయలేకపోయారు. తెలంగాణలో ఇతర పార్టీలకు స్థానం లేదని, రాష్ర్టానికి తామే పట్టాదారులమని చెప్పుకున్న బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్ల్లో ఒక్కటంటే ఒక్క సీటూ రాలేదు. ఇదీ గతం! తెలంగాణలో తమకు తిరుగులేదని భావించిన బీఆర్‌ఎస్‌కు ఈ దుస్థితి ఎందుకు ఏర్పడిందో గుర్తించే ప్రయత్నం చేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు మీడియా పైనో మరొకరి పైనో రంకెలు వేసే అవసరం వచ్చేది కాదు. రాజకీయ గండరగండడుగా పేరొందిన కేసీఆర్‌కు ఈ దుస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకొనే ప్రయత్నం జగదీశ్‌రెడ్డి వంటి వారు చేయకుండా ఎవరినో బెదిరించాలనుకోవడం కుప్పిగంతులు వేయడమే అవుతుంది. తమను తెలంగాణ సమాజమే తిరస్కరించిందన్న కఠోర సత్యాన్ని విస్మరించి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందని ఏడ్వడం ఎబ్బెట్టుగా ఉంది. తెలంగాణ అస్తిత్వానికి ఎవరూ ముప్పు తలపెట్టడం లేదు. పదకొండు సంవత్సరాల కిందట ఏర్పడిన తెలంగాణ అస్తిత్వం ఇవాళ మాత్రమే కాదు రేపు కూడా పదిలంగానే ఉంటుంది. బీఆర్‌ఎస్‌ గానీ, మరొక పార్టీ గానీ ఉండొచ్చూ లేకపోనూ వచ్చు. తెలంగాణ మాత్రం సగర్వంగా నిలబడే ఉంటుంది. తమ అహంకారపూరిత పోకడలను తెలంగాణ సమాజం హర్షించలేకపోయిందన్న వాస్తవాన్ని గుర్తించడానికి బీఆర్‌ఎస్‌ నాయకులు ఎందుకు నిరాకరిస్తున్నారో తెలియదు.


రాజకీయ కాలుష్యం...

రాజకీయాలు కలుషితమయ్యాయి. దాని ప్రభావం తెలంగాణ రాజకీయాలపైనా పడింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించే వారు. ఈ ధోరణి ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది. ప్రత్యర్థులను వేధించడమే అధికారం పరమావధి అన్నట్టుగా తెలుగునాట రాజకీయాలను మార్చిన ఘనత కేసీఆర్‌, జగన్‌రెడ్డిలదే. తాము అల్పుడుగా భావించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ఒంటి కాలి మీద లేస్తున్నారు. వాడు, వీడు అన్న పద ప్రయోగాలు చేస్తున్నారు. వయసు, అనుభవం రీత్యా కేసీఆర్‌ తన రాజకీయ ప్రత్యర్థులను తిట్టినా ఎవరూ పెద్దగా నొచ్చుకోలేదు. కేసీఆర్‌ వాడిన భాషను కేటీఆర్‌ వాడడాన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా హర్షించలేక పోతున్నాయి. జగదీశ్‌రెడ్డి వంటి రాజకీయ మరుగుజ్జులకు కేటీఆర్‌ చిన్నసారు కావొచ్చుగానీ, ప్రజలెందుకు లెక్క చేస్తారు! కేసీఆర్‌నే ప్రజలు మట్టికరిపించిన విషయం అప్పుడే మరచిపోతే ఎలా? వ్యక్తిత్వ హననాల విషయానికి వద్దాం! సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రజా జీవితంలో ఉన్న వారితో పాటు ప్రముఖుల వ్యక్తిత్వ హననం పరిపాటి అయింది. ఈ విషయంలో ప్రధాన మీడియాకు బాధ్యత ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఎవరు పడితే వాళ్లు, ఏదిపడితే అది వాగవచ్చు. అంచేత అన్ని పార్టీల వాళ్లూ బాధితులుగానే ఉంటున్నారు. కేటీఆర్‌ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ప్రత్యేకంగా బాధపడటం అనవసరం. ఈ వ్యక్తిత్వ హననాలు, దుష్ప్రచారాలు చేయడంలో కేటీఆర్‌ కూడా ఏమీ తీసిపోలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన సోషల్‌ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. బలమైన సోషల్‌ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎన్నికల్లో గెలిచిపోవచ్చునని, అలా లేనందునే గత ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్‌ పిచ్చి భ్రమలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డికి బలమైన సోషల్‌ మీడియా సైన్యం ఉండి కూడా గత ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోలేకపోయారన్న వాస్తవాన్ని విస్మరిస్తే ఎలా? ప్రజల్ని తక్కువ అంచనా వేయడం వల్లే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. సోషల్‌ మీడియా ద్వారా వికృత పోకడలను ప్రోత్సహించడంలో ఫలానా నాయకుడికి మినహాయింపు అని చెప్పలేని పరిస్థితి. అన్ని పార్టీలకూ ఈ జబ్బు పట్టుకుంది.


ఈ క్రమంలో ప్రధాన మీడియాలో కూడా అప్పుడప్పుడూ అవాంఛనీయ పోకడలు తొంగి చూస్తున్నాయి. యూట్యూబ్‌లో కనిపిస్తున్న థంబ్‌ నెయిల్స్‌కూ వాస్తవ కథనానికీ పొంతన ఉండటం లేదు. ఇది గుర్తించిన యూట్యూబ్‌ యాజమాన్యం ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడున్న పరిస్థితులలో సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి సంబంధించిన పోస్టులు, వీడియోలపై నియంత్రణ అవసరం. ఈ విషయం అలా ఉంచితే తెలుగునాట రాజకీయాలలో కక్షలూ కార్పణ్యాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకూ, రాష్ర్టానికీ ఏం చేస్తామో చెప్పకుండా తాము ఎంత కర్కశంగా వ్యవహరించబోతామో చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు ప్రత్యర్థులను రప్పా రప్పా నరుకుతామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ పోకడలను జగన్‌రెడ్డి కూడా సమర్థిస్తున్నారు. ఈ ధోరణిని ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియాను హెచ్చరించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల సంగతి తేలుస్తామని రంకెలు వేస్తున్నారు. ఎంపిక చేసుకున్న ప్రత్యర్థులకు భౌతికంగా హాని చేయడానికి అధికారం ఇవ్వాలని కోరడం వింత ధోరణి.

విచారణల పరంపర...

తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ కూడా ఈ విచారణ కమిషన్‌ ముందు హాజరయ్యారు. మరోవైపు టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటైంది. నిజానికి సిట్‌ టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు ఏర్పాటు కాలేదు. ట్యాపింగ్‌కు సంబంధించి ప్రారంభంలో ప్రత్యేకంగా ఫిర్యాదులు కూడా రాలేదు. దశాబ్దాలుగా తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించి సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేశారని ఎస్‌ఐబీ అధికారులు చేసిన ఫిర్యాదు కారణంగా సిట్‌ ఏర్పాటైంది. ఈ దర్యాప్తులో భాగంగా ప్రజా ప్రతినిధులు, ప్రత్యర్థుల ఫోన్లను విచ్చలవిడిగా ట్యాప్‌ చేశారని వెల్లడైంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది. తాము చేసిన ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు లభించకుండా చెయ్యాలన్న ఉద్దేశంతో నాటి అధికారులు సర్వర్లు, హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేశారు. దీనిపై ప్రారంభమైన విచారణలో తీగ లాగితే డొంక కదిలింది. టెలిఫోన్‌ ట్యాపింగ్‌తో ముఖ్యమంత్రికి ఏమి సంబంధమని కేసీఆర్‌ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. నిజమే... తీవ్రవాదులు, ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం కోసం అధికారులు వారి స్థాయిలోనే ఫోన్లు ట్యాప్‌ చేస్తారు. దానికీ ముఖ్యమంత్రికీ నేరుగా సంబంధం ఉండదు. రాజకీయ నాయకులు, వ్యాపారులు, మీడియా ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేయాలన్న ఆలోచన అధికారులకు ఎందుకొస్తుంది? వారికి ఆ అవసరం ఏమిటి? అలా చేయడం వల్ల ప్రయోజనం పొందేది ఎవరు? అధికారంలో ఉన్నవారే కదా? అలాంటప్పుడు నాకేమిటి సంబంధం? అని కేసీఆర్‌ వాదించడం తర్కానికి నిలబడదు. ఇప్పుడు సిట్‌ విచారణ వేగాన్ని అందుకున్నందున ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ఇది సహజం. అంత మాత్రాన టెలిఫోన్‌ ట్యాపింగ్‌తో కేసీఆర్‌, కేటీఆర్‌కు ముడిపెడుతూ వార్తలు రాయడం ఏమిటి? అని జగదీశ్‌రెడ్డి లాంటి వారు హూంకరించడం ఏమిటి? కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు చేరాయని ఆయన కుమార్తె కవిత ఆరోపించారు కదా? ఈ ప్రకటన వల్ల ఆమె బీఆర్‌ఎస్‌కు ఎంతో కొంత నష్టం చేసినట్టే కదా? అయినా ఆమెను తమ హిట్‌ లిస్ట్‌లో ఎందుకు చేర్చుకోలేదో?


తలవంపులు తెచ్చిందెవరు?

తెలంగాణకు తలవొంపులు ఎవరైనా తెచ్చారంటే అది బీఆర్‌ఎస్‌ వాళ్లే. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో జైలుకు వెళ్లిన కవితది ఏ పార్టీ? జాతీయ స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేసి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలికి చివరికి తోక ముడవడం వల్ల తెలంగాణ నవ్వులపాలు కాలేదా? కేసీఆర్‌, కేటీఆర్‌కు కష్టం వస్తే మొత్తం తెలంగాణ సమాజం ఎందుకు బాధపడాలి? తెలంగాణ సమాజం వేరు– కేసీఆర్‌ కుటుంబం వేరు. ప్రజలకు కష్టం వస్తే బాధపడాలి. వారిని ఆదుకోవడానికి చేతులు కలపాలిగానీ కేసీఆర్‌, కేటీఆర్‌ను అధికారంలోకి తీసుకురావడం కోసం అందరూ నిద్రాహారాలు మాని ఏడ్చుకుంటూ కూర్చోవాలని కోరుకోవడం ఏమిటి? తాను మఠం నడపడం లేదని, ఫక్తు రాజకీయ పార్టీ నడుపుతున్నానని కేసీఆర్‌ స్వయంగా చెప్పుకొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీల వలె బీఆర్‌ఎస్‌ కూడా ఒక రాజకీయ పార్టీ మాత్రమే. తెలంగాణ సమాజంపై ఆ పార్టీకి ప్రత్యేకంగా పేటెంట్‌ ఏదీ లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను అభిమానించేవారు అభిమానిస్తూనే ఉంటారు. అంత మాత్రాన తమ పార్టీని మాత్రమే ప్రజలందరూ అభిమానించాలని, మీడియా కూడా తమకే ఊడిగం చేయాలని అనుకోవడం ఏమిటి? గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను గుర్తించి ప్రజల వద్దకు వెళ్లి చెంపలు వేసుకుంటే వాళ్లే మళ్లీ ఆశీర్వదించవచ్చు. అంతేగానీ మా పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేస్తామని మీడియాను హెచ్చరించడం ఏమిటి? ఉడత ఊపులకు చింతకాయలు రాలవు. మా వరకు మేము ఇలాంటి దాడులను, బెదిరింపులను ఎన్నో చూశాం. రాజశేఖరరెడ్డి హయాంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి తగులబెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత కేసీఆర్‌ పాలనలోనూ ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలపై దాడులు జరిగాయి. వివిధ రూపాల్లో నిర్బంధాలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డాం. భవిష్యత్తులో కూడా నిలడతాం.


తమను అధికారంలోంచి తప్పించి తప్పుచేశామని ప్రజలు వాపోతున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు తహతహలాడుతున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పడమే కాదు, నమ్ముతున్నారు కూడా. అలాంటప్పుడు రెండు మూడు మీడియా సంస్థలు మీ దారికి రాకపోతే ఏమౌతుంది? ఏదో ఒక రాజకీయ పార్టీని అధికారంలో కూర్చోబెట్టే సత్తా మీడియాకు ఉండదు. ప్రజల తిరస్కరణకు గురైన పార్టీ అధికారాన్ని కోల్పోతుంది. అలాగే ప్రజల నిరాదరణకు గురయ్యే మీడియాకు కూడా మనుగడ ఉండదు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా జగన్‌రెడ్డి బాటలో నడవాలనుకుంటే అది బీఆర్‌ఎస్‌ నాయకుల ఇష్టం. తనపై తనకు నమ్మకం ఉన్నవాడు ఇతరులపై పడి ఏడవడు. ఆత్మవిశ్వాసం లోపించినవాడే ఆ పని చేస్తాడు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు సహనం అలవర్చుకుంటే మంచిది. వీళ్లకు ఇంకా బలుపు తగ్గలేదని ప్రజలు భావిస్తే మరో పర్యాయం కూడా అధికారానికి దూరంగానే ఉండవలసి వస్తుంది. పుట్టింటి గొప్పలు మేనమామ దగ్గర చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కేసీఆర్‌ గొప్పతనం గురించి నాబోటి వాళ్ల వద్ద చెప్పాలని జగదీశ్‌రెడ్డి వంటి వాళ్లు ప్రయత్నించడం వ్యర్థం. బెదిరింపులను మానుకొని ప్రజలను నమ్ముకుంటే మంచిరోజులు మళ్లీ రావొచ్చు. ఆలోచించమని మాత్రమే ఎవరైనా చెప్పగలరు. కాదూ కూడదూ అనుకుంటే మాత్రం అది వారి ఖర్మ!

ఆర్కే


ఈ వార్తలు కూడా చదవండి.

రాష్ట్రంలో.. ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌‌కు మాజీ మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 06 , 2025 | 08:38 AM