Share News

Seed Act 2025: విత్తన చట్టానికి ఈ సవరణలు చేయాలి

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:28 AM

అరవై సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘విత్తన చట్టం–2025’ ముసాయిదాను రూపొందించి, ప్రజాభిప్రాయం కోసం ఇటీవల వ్యవసాయ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ (www.agriwelfare.gov.in/en/whatsnew/75)లో ఉంచింది...

Seed Act 2025: విత్తన చట్టానికి ఈ సవరణలు చేయాలి

అరవై సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘విత్తన చట్టం–2025’ ముసాయిదాను రూపొందించి, ప్రజాభిప్రాయం కోసం ఇటీవల వ్యవసాయ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ (www.agriwelfare.gov.in/en/whatsnew/75)లో ఉంచింది. ఈ చట్టం ద్వారా విత్తనాలు, నర్సరీ మొక్కల నాణ్యతను నియంత్రించడం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ ముసాయిదా బిల్లును చూసిన రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, మేధావులు, రైతు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నవారందరూ నిరాశకు గురయ్యారు. మొత్తం 48 సెక్షన్లు, 10 అధ్యాయాలతో రూపొందించిన ఈ ముసాయిదాను పరిశీలిస్తే, ఇది ‘‘విత్తన చట్టమా, లేక కంపెనీలకు అనుకూలమైన చుట్టమా?’’ అనే సందేహం కలుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం దీనిని ఒక మోడల్ చట్టంగా రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపాలి. తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు మార్పులు చేసుకుని, చట్టాలు రూపొందించుకోవడానికి అవకాశం కల్పించాలి. ఈ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర రైతాంగం వారి అభిప్రాయాలను డిసెంబరు 11లోపు ఇ–మెయిల్ (jsseeds–agri@gov.in.) ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. ఈ బిల్లులో రైతుల ప్రయోజనాలను కాపాడేలా, విత్తన నాణ్యతను బలపరిచేలా, అన్ని వర్గాల ఉత్పత్తిదారులు–వ్యాపారులకు సమాన అవకాశాలు కల్పించేలా సవరణలు, అదనపు ప్రతిపాదనలు చేర్చాల్సిన అవసరం ఉంది.

ఈ ముసాయిదా చట్టం సెక్షన్–13 ప్రకారం ఏ పంట విత్తన రకమైనా రైతులకు అందించే ముందు తప్పనిసరిగా కేంద్ర విత్తన కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్ పొందాల్సి ఉంటుంది. దీనిపై పూర్తి అధికారం కేంద్రానికి మాత్రమే ఉండటం వల్ల, రాష్ట్రాల భౌగోళిక–పర్యావరణ పరిస్థితులు, స్థానిక సాగు వ్యవస్థలు, రైతుల అవసరాలు రిజిస్ట్రేషన్ సమయంలో సక్రమంగా ప్రతిబింబించవు. కాబట్టి, ఈ సెక్షన్‌లో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నిర్ణయాధికారాన్ని కల్పించేలా నిబంధనలను సవరించాలి.


సెక్షన్–16(1) ప్రకారం, కొత్త విత్తన రకం రిజిస్ట్రేషన్ పొందాలంటే ఆ రకం దిగుబడి, ఇతర అంశాలపై కేంద్ర విత్తన కమిటీ నియమించిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు నిర్వహించిన పరిశీలన నివేదికలు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఇలా ఇతర సంస్థలు సమర్పించే పరిశీలనలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల చాలా అంశాలు పూర్తిగా నిర్ధారణ కావు. అందువల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, శాస్త్రీయతను పెంచడానికి ప్రతిపాదించిన ప్రతి కొత్త రకాన్ని తప్పనిసరిగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి లేదా సంబంధిత రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కనీసం ఒక పంటకాలం ప్రత్యక్ష క్షేత్ర పరీక్షలు చేయాలని నిబంధనగా చేర్చాలి.

సెక్షన్–17(3), సెక్షన్–18(1) ప్రకారం విత్తన ఉత్పత్తిదారులు, శుద్ధి కేంద్రాలు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను పాటించినప్పుడే రిజిస్ట్రేషన్ పొందగలరు. దీనిని సవరించాలి. విత్తనోత్పత్తిదారులు, శుద్ధి కేంద్రాలు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా రిజిస్ట్రేషన్ పొందాలంటే బీఎస్సీ (వ్యవసాయం), వ్యవసాయ డిప్లొమా లేదా ప్రభుత్వరంగ సంస్థలు అందించే విత్తనోత్పత్తి–విత్తన సాంకేతికతకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సు తప్పనిసరి అర్హతగా చేర్చాలి.

సెక్షన్–21(1డి) ప్రకారం ఏ విత్తన విక్రయ సంస్థకు స్వీయ ధ్రువీకరణకు అనుమతి ఇవ్వడం వల్ల గతంలో నకిలీ, నాసిరకం విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. అందువల్ల రైతులను రక్షించాలంటే, స్వీయ ధ్రువీకరణ విధానాన్ని తొలగించి, ఏ విత్తనమైనా విక్రయానికి ముందు తప్పనిసరిగా ప్రభుత్వరంగ విత్తన ధ్రువీకరణ సంస్థలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి లేదా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా అధికారిక ధ్రువీకరణ పొందాలన్న నిబంధన చేర్చాలి.

సెక్షన్–22 ప్రకారం, విత్తనాల ధరలు అసాధారణంగా పెరిగినప్పుడు లేదా కృత్రిమ కొరత ఏర్పడ్డప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చు. అయితే, ధరల మార్పులు, సరఫరా లోపాలు ప్రతీ ఏడాది రైతులను ప్రభావితం చేస్తున్నందున, అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం పర్యవేక్షణ సరిపోదు. స్థానిక పరిస్థితులు, డిమాండ్–సరఫరాపై రాష్ట్రాలకు ఎక్కువ అవగాహన ఉండటంతో, విత్తన సరఫరా, ధరల నియంత్రణ, మార్కెట్ పర్యవేక్షణ వంటి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించేలా చట్టాన్ని సవరించాలి.


సెక్షన్ 33(సి) ప్రకారం, ఇతర దేశాల్లో ధృవీకరించిన క్షేత్ర పరీక్షల ఆధారంగా విత్తనాలు దిగుమతి చేయవచ్చు. అయితే ఆ విత్తనాలు ఆ దేశ వాతావరణం, మట్టి, చీడ–పీడలు వంటి అంశాలకు అనుగుణంగా ఉండటం వల్ల, భారత్‌లో కూడా అలాగే పనిచేస్తాయని హామీ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి, విదేశీ విత్తనాలను రాష్ట్రంలో విక్రయించే ముందు కనీసం రెండు పంట సీజన్ల పాటు భారత వ్యవసాయ పరిశోధనా మండలి లేదా సంబంధిత రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా తప్పనిసరిగా క్షేత్ర పరీక్షలు నిర్వహించాలన్న నిబంధన ఉండాలి.

సెక్షన్ 34 ప్రకారం– రిజిస్టర్ చేయని, నాసిరకం లేదా నాణ్యత తక్కువ విత్తనాలను విక్రయించిన వ్యక్తులకు రూ.50 వేల నుంచి రూ.30 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. కానీ దీని సవరణలో.. లైసెన్స్ రద్దు చేసి, సంబంధిత ఉత్పత్తిదారులు, విక్రేతలు కనీసం ఐదేళ్ల పాటు విత్తన ఉత్పత్తి, విక్రయం చేయరాదన్న నిబంధన చేర్చాలి.

విత్తన చట్టం–2025లో ప్రధానంగా రెండు లోపాలు ఉన్నాయి. నకిలీ లేదా నాసిరకం విత్తనాల వల్ల రైతులకు పరిహారం కల్పించే సెక్షన్ లేకపోవడం; విత్తన ఉత్పత్తి రైతుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు లేకపోవడం. కాబట్టి విత్తన ఉత్పత్తి అత్యంత నైపుణ్యం, అధిక సాగు ఖర్చు, కఠినమైన నాణ్యత–నియంత్రణలను అవసరం చేసే క్రమంలో రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి ప్రత్యేక నిబంధనలు ఉండాలి. వీటిలో త్రిముఖ ఒప్పందాలు (రైతులు, విత్తన కంపెనీలు, వ్యవసాయశాఖ), విత్తన పంటకు బీమా, విత్తన రైతులకు జీవిత బీమా, విత్తనోత్పత్తిలో మధ్యవర్తుల వ్యవస్థపై పూర్తి నిషేధం, రైతుల దిగుబడిని కంపెనీలు అంగీకరించి నిర్ణీత ధరలో కొనుగోలు చేయడం వంటి ప్రమాణాలు ఉండాలి.

అంతేకాకుండా విత్తన కంపెనీలకు లైసెన్స్ జారీ చేసే విధానంపై కొన్ని ప్రత్యేక సూచనలు ఉన్నాయి. లైసెన్స్ ఇచ్చే కమిటీలో తప్పనిసరిగా ఐసీఏఆర్‌ లేదా సంబంధిత రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఉండాలి. విత్తన కంపెనీ ఏర్పాటుకు ఒక పరిశోధన విభాగం, 5–10 ఎకరాల స్థలం ఉండాలి. విత్తన రకం రిజిస్ట్రేషన్ కోసం కంపెనీ స్థాపించిన తర్వాత కనీసం 8–10 సంవత్సరాల కాల పరిశీలన, హైబ్రిడ్ అయితే కనీసం మూడేళ్ల కాల పరిశీలన ఉండేలా నిబంధన విధించాలి. ఈ సవరణలతో విత్తన చట్టం–2025 రైతుల ప్రయోజనాలను రక్షిస్తూ, నకిలీ విత్తనాల వ్యాప్తిని తగ్గించి, విత్తన ఉత్పత్తిలో నైపుణ్యం, నాణ్యత ప్రమాణాలు అమల్లో ఉండేలా తయారవుతుంది.

అల్దాస్ జానయ్య

ఉపకులపతి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఈ వార్తలు కూడా చదవండి..

సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..

మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు

Read Latest AP News and National News

Updated Date - Dec 11 , 2025 | 05:28 AM