Share News

Kalingandhras Literary Legacy Behera Ramakrishna: కళింగాంధ్ర నేల సారంతో రామకృష్ణకవి నలచరిత్ర

ABN , Publish Date - Oct 27 , 2025 | 06:08 AM

దార్శనికుడు గురజాడ, గిడుగు, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, తాతాజీ, ఆరుద్ర, చాసో, రావిశాస్త్రి, కారా లాంటి ఉద్ధండుల్ని కళింగాంధ్ర సాహిత్యం అందించింది. వీరు ఆధునిక సాహిత్యస్రష్టలు...

Kalingandhras Literary Legacy Behera Ramakrishna: కళింగాంధ్ర నేల సారంతో రామకృష్ణకవి నలచరిత్ర

దార్శనికుడు గురజాడ, గిడుగు, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, తాతాజీ, ఆరుద్ర, చాసో, రావిశాస్త్రి, కారా లాంటి ఉద్ధండుల్ని కళింగాంధ్ర సాహిత్యం అందించింది. వీరు ఆధునిక సాహిత్యస్రష్టలు. అనేక ప్రక్రియలకు ఆదిగురువులు. కాగా ఇక్కడే మూడువందలయేళ్ళ క్రిందట పుట్టిన బెహరా రామకృష్ణ వెయ్యేళ్ళ పద్య కవులెవరికీ తీసిపోని విధంగా, నలచరిత్రను కమనీయ ప్రబంధంగా మృదుమధురంగా రచించడాన్ని ఇక్కడి మట్టిసారంగా భావించవచ్చు.

బెహరావారు శ్రీకాకుళం జిల్లాకేంద్రానికి సమీపంలోని బొంతలకోడూరు మిరాసీదార్లు. కటకం గజపతుల ఆదరణతో వారితోపాటు పఠననాయకులుగా వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. పట్నాయకులుగా, శిష్టు కరణాలుగా పిలవబడుతున్నారు. నలచరిత్రలో ఈయన వాడిన లాంతరు, ముక్మాలు వంటి పదాలవలన ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనలో జీవించాడని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అందుచేత క్రీ.శ.1800లకు ముందే ఈ గ్రంథాన్ని రాశాడని చెప్పవచ్చు.

గతంలో సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో వచ్చిన నల చరిత్రలను బెహరా రామకృష్ణకవి చదివే ఉంటారు. ఈ గ్రంథంలో నన్నయ నుండి చేమకూర వరకూ తారసపడుతున్న పద్యసరళులు ఈ విషయాన్నే చెబుతున్నాయి. గ్రంథాన్ని పరిపుష్టం చేయడానికి నలుడి వేట ఘట్టంతోపాటు మరికొన్ని కల్పనలు, తదితర వర్ణనలను కథానుకూలంగా మూలానికి జోడించారు. మూత్రవిసర్జన తరువాత కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేయడం వల్ల నలుని శరీరంలోకి శని ప్రవేశించాడని నన్నయాదులు రాశారు. నలుడు వంటి నిష్ఠాగరిష్ఠునికి అలాంటి నైచ్యాన్ని అంటగట్టడం సరికాదని భావించి, ‘‘ఒగిఁ బదమున సూచికమోపఁగలట్టి ప్రదేశమపు డపరిశుద్ధత నుండఁగ సంధ్యోపాసన’’– అని సవరించాడితడు. నలుడు కాళ్ళు కడుక్కున్నప్పుడు సూదిమోపినంత చోటు తడవకుండా ఉండిపోయిందట. దానిలోంచి శని లోపలికి ప్రవేశించాడని మార్చి, కథను ఔచిత్యవంతం చేశారు. 1511 పద్యగద్యాలతో ఈ ప్రబంధాన్ని రచించారు రామకృష్ణకవి. నగర, ఋతు, పుష్పాపచయ, సూర్యోదయ, సూర్యాస్తమయాది అష్టాదశ వర్ణనలలో ఒకటి రెండు తప్ప అన్ని రకాల వర్ణనలూ హృదయాహ్లాదంగా రచించారు రామకృష్ణకవి.


‘‘వనరమాయువతి పుష్పవతి యయ్యె’’ – ఈ పాదంలో శ్లేష ఉంది. తోటంతా పుష్పించింది అని ఒక అర్థం, పుష్పించడంవల్ల వనలక్ష్మి ఈడేరిందని వేరే అర్థం స్ఫురిస్తోంది కదూ! కనకకారవృత్తిని వాడుకుంటూ ఇంకొక అద్భుతవర్ణన. ‘‘కరగిన పూదెఁ దాఁ గనకకారుఁడు నీటనుముంచు మాడ్కి భాస్కరుఁ డపరాబ్ధిలోనఁ దిగఁజారెఁ’’–. నలుడి వేటవర్ణనలో సాయంసంధ్యను వర్ణిస్తున్నాడు. కరిగించిన బంగారుముద్దను స్వర్ణకారుడు నీటిలోముంచుతున్నాడా అన్నట్టు సాయంసంధ్యావేళ సూర్యుడు పశ్చిమసముద్రంలో మునిగిపోతున్నాడట. ఉత్ప్రేక్ష ఎంత అద్భుతమో అంత రమణీయం.

ఏ గ్రంథంలోనైనా రచయిత అస్తిత్వం ఎక్కడో ఓచోట పట్టుబడుతుంది. బెహరావారు గ్రీష్మఋతు వర్ణనలో ‘‘గావిరి యీవలి గలియఁగ్రమ్మె’’ అని రాశారు. ఈ సీసపద్య చివరిదళానికి ‘నల్లని వేడిపొగలు అంతటా కమ్మాయి’ అని అర్థం. ఈ పాదంలో ఈవలి అని ఉంది. వేసవి వేడి వేళ కలిగే దాహాన్నే ఈవలి, ఈష్ట అని కళింగాంధ్రలో అంటారు. దాహం వేస్తుంది అనడానికి ఈవలేస్తుంది, ఈష్టగా ఉంది అని వాడుతారు. బలహీనుడిమీద కోపంవస్తే ‘కొంకులిరగ్గొట్టీ గల్ను’ అని ఇక్కడివారి వాడుక. ఈ గ్రంథంలో నలుడి వేటవర్ణనలో రెండుసార్లు కొంకులు పదాన్ని వరసపద్యాలలో వాడారు కవి. ‘‘నడుములు దునుమాడి తొడలుచెండాడి కొంకులుదెగ వ్రేసి చెంపలనుగోసి.... అత్తఱి ముక్కులు చెక్కులు కుత్తుక లంసములు తలలు కొంకు లురములున్‌’’. ముంగాలి ఎముకల్నే కళింగాంధ్రులు కొంకులని అంటారు. పెళ్ళికి వచ్చిన బంధువులు వధూవరులకు ఈడు చదివించడం ఈ ప్రాంతంలో నేటికీ ఉంది. దీనినే బెహరావారు ‘‘వీడు/ చెలగి చదివించిరి వధూవరులకు నపుడు’’ అని ఒక పద్యంలో రాశారు. వీడు అంటే కట్నం.

అందమైన వర్ణనలూ, అలంకారాలతోపాటు, వారి శబ్ద చమత్కారమూ ఉంది. ‘‘ఈయదు తనభావము చనవీ యదు సఖులకును గోర్కులీయదు శుకి కం/ దీయదు ఫలములు తన పొందీయదు కేకులకుఁ జేరనీయదు గోరన్‌’’. ఇలా శబ్దిస్తూ, పద్యాలను జవనాశ్వాల్లా పరుగెత్తించడం ఈ కవికి వెన్నతోపెట్టిన విద్య. ఇలాంటి లయవిన్యాసమే ఈతని వచనరచనలోనూ గమనిస్తాం: ‘‘పుష్కరువలను నక్షంబులు పక్షంబులై యుండుటయు, నిజాధ్యక్షుని పక్షంబున విపక్షంబు లగుటయు, సమక్షంబునన్‌ బరీక్షించి’’.


గ్రంథం అంతటా అలంకారాలను విరివిగా వెదజల్లినా ఎక్కడా వ్యర్థపదాలుగానీ, ఊతపదాలుగాని తారసపడవు. అందుచేతనే బెహరా రామకృష్ణకవి ‘నలచరిత్ర’ మధుర ప్రబంధం. ఈ గ్రంథానికి సాహిత్యచరిత్రలలో తగు స్థానం లభించలేదు. 1933లో చివరిసారిగా ముద్రించారు. ఇన్ని ప్రత్యేకతలుగల గ్రంథం ఇటీవల పునర్ముద్రణ పొందిన విషయాన్ని సాహిత్యలోకానికి తెలియజేయాలనే ఈ ప్రయత్నం.

గార రంగనాథం

98857 58123

ఇవీ చదవండి:

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 06:09 AM