INDIA Alliance Candidate: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీకగా సుదర్శన్‌రెడ్డి
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:09 AM
సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించడంతో ఆయన మీడియా పతాక శీర్షికలలో ప్రధానంగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, అస్సాం హైకోర్టు...
సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించడంతో ఆయన మీడియా పతాక శీర్షికలలో ప్రధానంగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, అస్సాం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు జస్టిస్‌గా, పదవీ విరమణ అనంతరం గోవా లోకాయుక్తగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి తాను విధులు నిర్వహించిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. ఆయన వెలువరించిన తీర్పులను గమనిస్తే సుదర్శన్‌రెడ్డి ప్రజా దృక్పథం, ఆయన దార్శనికత వ్యక్తిత్వం, విలువల పట్ల నిబద్ధత వ్యక్తమవుతాయి, ఇవే ఆయన్ను ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయి. న్యాయమూర్తిగా ఆయన సేవలలో స్పష్టత, నిమగ్నత ప్రస్ఫుటం. ఆయన ఎన్నో కీలకమైన తీర్పులు ఇచ్చినా ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ యువకులతో నిర్మించిన ప్రైవేటు వ్యవస్థ సాల్వాజుడుం విషయంలో సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్‌లో భాగంగా ఇచ్చిన విలక్షణ తీర్పు మిక్కిలి ఎన్నదగినది. ఆ తీర్పులో ఆయన ఉల్లేఖించిన అనేక రాజనీతిజ్ఞుల, న్యాయ కోవిదుల ఉటంకింపులు చూస్తే ఆశ్చర్యం కలగటమే కాదు, ఆయన ప్రజా దృక్పథం కూడా స్పష్టంగా అర్థమవుతుంది.
గత దశాబ్ద కాలంగా దేశంలో రెండు పరస్పర విరుద్ధ భావనల మధ్య ఘర్షణ రాజకీయ వేదికని రక్తి కట్టిస్తున్నది. ఒకటి హిందూ భావజాలం అయితే మరొకటి భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా ప్రకటితమయ్యే విలువల భావజాలం. వీటి మధ్య 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేనంత సంఘర్షణ చోటుచేసుకున్నది. ప్రజాస్వామ్య దేశంలో అధికార –ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం పరిపాటి. రాజకీయ పార్టీల అధినాయకులు ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడిన మాటలకు, ఆయా పార్టీలు మేనిఫెస్టోలలో చేసిన వాగ్దానాలకు, అధికారం చేపట్టాక చేసే పాలనకు పొంతన ఉండదు. పాలకులు ప్రజలు కోరుకున్నట్టు పాలించడం మాని, తమకు వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్న వారికి అనుకూలంగా పాలిస్తుంటారు. చట్టాలూ అలాగే అమలవుతుంటాయి. ప్రపంచీకరణ తీసుకొచ్చిన అత్యంత దుష్పరిణామాలలో ఒకటి ‘క్విడ్ ప్రోకో’ సంస్కృతి. కేంద్రంలోను, రాష్ట్రాలలోను ప్రభుత్వాలు ఏర్పరిచినవారు తీసుకునే నిర్ణయాల వెనుక ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు స్పష్టంగానే గోచరమవుతుంటాయి. రాజ్యాంగ పీఠికలో రాసుకున్న పాఠ్యాంశాన్ని పాలకులు అప్పుడప్పుడు వల్లె వేస్తుంటారు కానీ, ఆచరణలో దానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. రాజ్యాంగం ద్వారా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల అనేక విభాగాలలో రాజకీయ జోక్యం ఇప్పుడు పెరుగుతున్నది. మన రాజకీయ వ్యవస్థ దీన్ని ఒప్పుకోకపోవచ్చు గానీ ప్రజలకు ఈ విషయంపై అవగాహన కలుగుతున్నది. దేశంలో జరిగిన అనేక సంఘటనలను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులు ఇటీవల దేశ వాస్తవ ముఖచిత్రాన్ని గుర్తించారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ సామాజిక కులగణన జరగాలని, అన్ని రంగాలలో ఆయా వర్గాల ప్రాతిపదికన ఫలాలు అందాలని ఒక శక్తిమంతమైన ఉద్యమానికి నాంది పలికింది. ఈ ఉద్యమం ఇటీవల దేశ రాజకీయ ముఖచిత్రంలో ఒక ప్రధాన ఎజెండాగా క్రమంగా మార్పు చెందుతున్నది. ఇది ప్రజలపరంగా శుభపరిణామం.
ఇప్పుడు భిన్న దృక్పథాల మధ్య దేశం ఒక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. రాజకీయ వర్గాలు రాజ్యాంగ పరిరక్షకులుగాను, రాజ్యాంగ వ్యతిరేకులుగాను చీలిపోయారు. ఇటువంటి రాజకీయ సందర్భంలో– ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా అధికార పార్టీ ఎన్‌డీఏ ఆర్ఎస్ఎస్ నేపథ్యం గల వ్యక్తిని నిలబెడితే, ప్రతిపక్ష ఇండియా కూటమి న్యాయశాస్త్ర కోవిదుడు, దార్శనికుడు, రాజ్యాంగ నిపుణుడైన జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా బరిలో నిలిపింది. సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోను, సాంస్కృతిక రంగంలోను తనదైన పాత్రను, గురుతరమైన బాధ్యతలను నిర్వర్తించారు. అన్నిటికన్నా ముఖ్యంగా బి. సుదర్శన్‌రెడ్డి ప్రజాస్వామిక దృక్పథం కలిగినవారు.
గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డి అధ్యక్షుడిగా పోటీ పడగా, తన అనంతరం వి.వి. గిరిని పోటీలో నిలిపి ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయమని ఇందిరాగాంధీ కోరారు. నేటి తరం ఆత్మలేని నాయకులకు ఆత్మ ప్రబోధాలు, విచక్షణలు ఉంటాయని ఆశించడం అత్యాశే! ఇప్పుడు పనిచేసేదల్లా పార్లమెంటు సభ్యుల మెజారిటీ, మైనారిటీ బలాబలాలు మాత్రమే. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో గెలుపు ఓటములు అంత ప్రధానమేమీ కాదు. కానీ ఇండియా కూటమి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డిని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా రాజ్యాంగ పరిరక్షణను సమర్థవంతమైన ప్రచార అస్త్రంగా ఎంచుకున్నది. క్రమంగా ఈ ఎన్నిక రాజ్యాంగ పరిరక్షకులకు, రాజ్యాంగ వ్యతిరేకులకు మధ్య పోరుగా మారుతున్నది.
జూకంటి జగన్నాథం
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News