Share News

నియోజకవర్గాల పునర్విభజన అవసరమా?

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:36 AM

భారత్‌కు ఇప్పుడు అవసరమైనది ఏమిటి? లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన. ఎంత మాత్రం కాదు. ప్రభుత్వమూ, ప్రజలు ఆలోచించాల్సిన విషయాలలో అది ఆఖరిది అవడం మంచిది. ఆ పునర్విభజన ప్రక్రియన....

నియోజకవర్గాల పునర్విభజన అవసరమా?

భారత్‌కు ఇప్పుడు అవసరమైనది ఏమిటి? లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన. ఎంత మాత్రం కాదు. ప్రభుత్వమూ, ప్రజలు ఆలోచించాల్సిన విషయాలలో అది ఆఖరిది అవడం మంచిది. ఆ పునర్విభజన ప్రక్రియను మరో 30 సంవత్సరాల పాటు వాయిదా వేయాలని కోరుతూ తమిళనాడులో అఖిలపక్ష సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేవలం ఒక రాష్ట్రం లేదా ఒక ప్రాంత ప్రయోజనాలను కాపాడుకునే నిమిత్తం ఆమోదించిన తీర్మానం కాదు అది. జాతీయ సమైక్యతను మరింత పటిష్ఠం చేసేందుకు ఉద్దేశించిన తీర్మానమది. లోక్‌సభా సీట్ల పునః కేటాయింపును శాశ్వతంగా నిలిపివేయడమే భారత్‌ సమైక్యతను కాపాడుతుంది. దేశ సమైక్యతకు ఎదురయ్యే సవాళ్లనన్నిటినీ సమర్థంగా ఎదుర్కొనేందుకు పునర్విభజన నిలిపివేత దోహదం చేస్తుంది. భారత గణతంత్ర రాజ్య సంస్థాపనలో అంతర్‌ గర్భితంగా ఉన్న ‘సమాఖ్య ఒప్పందం’ను గౌరవించేందుకు ఉత్తమ మార్గం లోక్‌సభా సీట్ల ప్రస్తుత కేటాయింపును ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించడమే; రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన అధికార –భాగస్వామ్య ఒప్పందాన్ని అనుల్లంఘననీయమైనదిగా పరిగణించాలి. దానిపై పునరాలోచన ఎంతమాత్రం అవసరం లేదు. పునర్విభజనను వ్యతిరేకిస్తున్నవారు ఆ ప్రక్రియను శాశ్వతంగా నిలిపివేయాలని కోరడం లేదు. వారు ఒక పరిమిత, లోపభూయిష్ట వాదన చేస్తున్నారు. ‘జనాభా నియంత్రణ’లో కొన్ని రాష్ట్రాల సంపూర్ణ విజయాలు, మరికొన్ని రాష్ట్రాల వైఫల్యాల ప్రాతిపదికన చేస్తున్న వాదన అది. రాజ్యాంగంలో అంతస్సూచితమైన, అయితే అనుల్లంఘనీయమైన ‘సమాఖ్య ఒప్పందం’ భావన భారతీయుల చర్చల్లో ప్రస్తావనకే రావడం లేదు. మన గణతంత్ర రాజ్యం ఏర్పాటై 75 సంవత్సరాలు గడచిన తరువాత ఇప్పుడు సమాఖ్య ఒప్పందం గురించి ఆలోచించడమెందుకు?


సమస్యను స్పష్టంగా అర్థం చేసుకుందాం. వర్తమాన చర్చ, ప్రస్తుత వాదన నియోజకవర్గాల తాజా పునర్విభజనకు సంబంధించిన రెండు అంశాలలో ఒకదానికే పరిమితమయింది. నియమానుసారం పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చి వేయడంపై ఎవరికీ ఆక్షేపణ లేదు. ఒక రాష్ట్ర పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చివేయడం లేదా అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడం సమాఖ్య సమతౌల్యతను ప్రభావితం చేయవు. అసలు సమస్యేమిటంటే వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడమే. యాభై సంవత్సరాల క్రితం రాష్ట్రాలకు కేటాయించే నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించారు. ఆ సంఖ్యను కొనసాగించాలా? లేక మార్చాలా? లేక ఎప్పటికీ యథాతథంగా కొనసాగించాలా? ఈ అంశాలపై నిశిత, నిష్పాక్షిక చర్చ జరగాలి.

జనాభా గణన అనంతరం విధిగా జరిగే నియోజక వర్గాల పునర్విభజన ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ’ అన్న సూత్రం ప్రాతిపదికన జరగాలని రాజ్యాంగ నిబంధన పేర్కొంది. లోక్‌సభకు ఎన్నికయ్యే ప్రతి సభ్యుడు ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య సమానంగా ఉండి తీరాలని ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ’ అనే ప్రజాస్వామిక సూత్రం నిర్దేశిస్తుంది. ఈ సూత్రం ఉల్లంఘనకు గురైతే పెద్ద నియోజకవర్గాలలోని ఓటు విలువ చిన్న నియోజకవర్గాలలోని ఓటు విలువ కంటే తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూపీలో 32 లక్షల మంది ప్రజలకు లోక్‌సభలో ఒక ఎంపీ ఉండగా కేరళలో 18 లక్షల కంటే తక్కువ మందికి లోక్‌సభలో ఒక ఎంపీ ఉన్నాడు. దీనివల్ల కేరళలో ఒక ఓటరుకు, యూపీలోని ఒక ఓటర్‌ కంటే రెట్టింపు ప్రాధాన్యముంటుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే జనాభాకు, లోక్‌సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంతవరకు అన్ని రాష్ట్రాలకు ఒకేవిధంగా ఉండాలి. మరి అలా ఉన్నదా? లేదు. కనుక ఈ అసంబద్ధతను తొలగించాల్సి ఉన్నది. అయితే చిన్న రాష్ట్రాల విషయంలో రాజ్యాంగం ప్రకారమే ఈ సూత్రం వర్తించదు. ఇందుకు రాజ్యాంగమే వెసులుబాటు కల్పించింది జనాభాలో తమ వాటా కంటే లోక్‌సభలో ఎక్కువమంది ప్రతినిధులను కలిగి ఉండే హక్కు చిన్న రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించింది. ఇటువంటి పరిస్థితులలో ‘అసౌష్ఠవ సమాఖ్య విధానం’ అమలులో ఉండేందుకు సమాఖ్యలోని వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగ విహిత రక్షణలు కల్పించారు.


జనాభాకు, లోక్‌సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంతవరకు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలన్న నిబంధనకు (కొన్ని రాష్ట్రాల విషయంలో) ఇచ్చిన మినహాయింపును ఇప్పుడు ఒక సాధారణ సూత్రంగా పాటించాలి, రాజ్యాంగ నిర్మాతలు చూడలేకపోయిన, ఊహించలేకపోయిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఆ ‘సాధారణీకరణ’ ఆవశ్యకత అర్థమవుతుంది. ఇదేమీ జనాభా నియంత్రణ విధాన సాఫల్య వైఫల్యాలకు సంబంధించినది కాదు. జననాల, మరణాల రేట్లు జనసంఖ్యా సంబంధి మార్పులకు అనుగుణంగా ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు లేదా సామాజిక సమూహాలు జనాభా పెరుగుదల శీఘ్రగతిన నిలిచిపోవడం కద్దు. అదొక సహజ పరిణామం.

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత జాతి జీవనంలో విభేదాలు, అనైక్యతలు తీవ్రమయ్యాయి. సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలు మూడింటిలోనూ ఈ విపరిణామాలు చోటుచేసుకున్నాయి, సంలీనమవుతున్నాయి. ఈ పతన ప్రక్రియ గత మూడు దశాబ్దాలలో మరింత వేగవంతమయింది. ఈ నేపథ్యంలో తాజా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లోక్‌సభ సీట్ల పునఃకేటాయింపు ఆ విభేదాలు, అనైక్యతలకు దోహదం చేసే మరొక ప్రమాదకర అంశమవుతుంది. ఇది జాతీయ సమైక్యతా స్ఫూర్తిని మరింతగా బలహీనపరుస్తుంది. భారతదేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉన్న సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంతరాలు, అనైక్యతలను తొలగించేందుకు తక్షణ కృషి జరగాలి. ఈ దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలి.


హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు, హిందీయేతర, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వ్యత్యాసాలు నెలకొనివున్నాయి. ఈ తేడాలు మొదటి నుంచీ ఉన్నప్పటికీ దేశ విభజన అనంతరం బాగా పెరిగిపోయాయి. అయితే తొలి నాటి రాజకీయ నాయకులు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, హిందీని ఏకైక అధికార భాషగా ఉండకూడదన్న డిమాండ్‌ను అంగీకరించడం ద్వారా హిందీ, హిందీయేతర రాష్ట్రాల మధ్య సమైక్యతను సంరక్షించారు. గత మూడు దశాబ్దాలుగా దేశ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు దక్షిణ–పశ్చిమ భారత రాష్ట్రాలు, ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల మధ్య తీవ్ర అసమానతలను సృష్టించాయి. దేశ రాజకీయాలలో ఒక ప్రధాన శక్తిగా బీజేపీ ప్రభవించడం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల సంబంధాలను ప్రభావితం చేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ఒక తిరుగులేని శక్తిగా ఉండగా ఇతర రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాదిన దాని ఉనికికి తీవ్ర పోటీ ఎదురవుతోంది.

హిందీ, హిందీయేతర రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వ్యత్యాసాలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అంతరాలను తొలగించని పక్షంలో దేశ సమైక్యతకు ముప్పు ఏర్పడుతుందనడంలో సందేహం లేదు.

నియోజకవర్గాల పునర్విభజనతో వ్యత్యాసాలు, అసమానతలు, అంతరాలు మరింత తీవ్రమయ్యే అవకాశమున్నది. 2026 జనాభా గణన అనంతరం జనాభా ప్రాతిపదికన ప్రతి రాష్ట్రానికి లోక్‌సభ సీట్ల కేటాయింపు పర్యవసానాలు ఎలా ఉంటాయో మిలన్‌ వైష్ణవ్‌, జమియె హింట్సన్‌లు విశ్లేషించారు. ఈ విశ్లేషణ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు భారీగా నష్టపోతాయి. లోక్‌సభలో కేరళ, తమిళనాడు చెరొక ఎనిమిది సీట్లను కోల్పోతాయి; తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లు కలిసికట్టుగా ఎనిమిది సీట్లను నష్టపోతాయి; కర్ణాటక రెండు సీట్లను కోల్పోతుంది. ఇతర హిందీయేతర రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్‌ నాలుగు సీట్లను, ఒడిషా మూడు సీట్లను, పంజాబ్‌ ఒక స్థానాన్ని కోల్పోతాయి. ఉత్తరాదిలో హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లు ఒక్కొక్క సీటును కోల్పోతాయి. అయితే యూపీ అదనంగా 11 సీట్లను పొందుతుంది. బిహార్‌కు అదనంగా పది సీట్లు, రాజస్థాన్‌కు అదనంగా ఆరు సీట్లు, మధ్యప్రదేశ్‌కు అదనంగా నాలుగు సీట్లు లభిస్తాయి.


ఆయా రాష్ట్రాలకు ఈ లాభనష్టాల వల్ల హిందీ, హిందీయేతర భాషా రాష్ట్రాల మధ్య ఉన్న సున్నితమైన సమతౌల్యత మరింతగా దెబ్బతింటుంది. ప్రస్తుతం లోక్‌సభలోని 543 స్థానాలలో 226 హిందీ భాషా రాష్ట్రాల్లో ఉన్నాయి. పునర్విభజన తరువాత వాటి సంఖ్య 259కి పెరుగుతుంది. ప్రస్తుతం 132 స్థానాలు ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తూర్పు, పశ్చిమ రాష్ట్రాలతో కలిసి ఏదైనా కీలక రాజ్యాంగ సవరణను వీటో చేయగలిగే స్థితిలో ఉన్నాయి. పునర్విభజన అనంతరం వాటికి ఇటువంటి వెసులు బాటు ఉండదు. ఇది భారత గణతంత్ర రాజ్య సంస్థాపక సూత్రాల స్ఫూర్తికి విరుద్ధమైనది. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు తీవ్ర విఘాత మేర్పడుతుంది. ఈ ప్రాథమిక సూత్రాలను గౌరవించడం అంటే మన రాజ్యాంగంలో అంతర్గతంగా ఉన్న ఒక సమాఖ్య ఒప్పందానికి ఒక ప్రాతిపదికను ఏర్పరచుకోవడమే అవుతుంది. మన సమాఖ్య, స్వతంత్ర రాష్ట్రాలు ఒక విశాల దేశాన్ని ఏర్పాటు చేయడానికి స్వచ్ఛందంగా కలిసిన రాజకీయ వ్యవస్థ కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో అధికారంలో భాగస్వాములుగా ఉన్న సమాఖ్య రాజకీయ వ్యవస్థ మనది. ఈ కారణంగానే మన సమాఖ్య ఒప్పందం లిఖితపూర్వకంగా లేదు. అది రాజ్యాంగంలో సూచనప్రాయంగా మాత్రమే ఉన్నది. అయితే అదొక మౌలిక సూత్రం.


ఈ సమాఖ్య ఒప్పందాన్ని అంగీకరించడమంటే రెండు వాదనలకు శాశ్వతంగా ముగింపు పలకడమే. అవి: జనాభా ఆధారిత రాజకీయ ప్రాతినిధ్యం; పన్నుల రాబడి ప్రాతిపదికన ఆర్థిక వనరులలో వాటా. హిందీభాషా రాష్ట్రాలు, హిందీయేతర భాషా రాష్ట్రాలు ఈ రెండు అంశాలలో ఒకదానితో లబ్ధి పొందగా మరొకదాని విషయంలో నష్టపోతాయి. ఎన్నికల ప్రయోజనాలను పక్కన పెట్టి ఈ సమాఖ్య ఒప్పందంపై జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించడం, భారత గణతంత్ర రాజ్యసంస్థాపక సూత్రమైన ‘జస్ట్‌ రిపబ్లిక్‌’

(న్యాయమైన గణతంత్రం) దిశగా ముందంజవేయడమే అవుతుంది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 13 , 2025 | 03:36 AM