Paila Chandramma: విప్లవాగ్నులు రగిల్చిన ఉక్కుమహిళ
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:02 AM
అది 1975వ సంవత్సరం అర్ధరాత్రి మందస పోలీస్ స్టేషన్. నెత్తుటి మడుగులో స్పృహతప్పిన మహిళను కొట్టి లేపి, ‘‘నీ భర్త ఎక్కడ? మీ దళం డెన్ ఎక్కడ?’’ అని అడుగుతున్నారు పోలీసులు. ‘‘నన్ను మీరు చంపక వదలరని తెలుసు. నా ప్రాణముండగా...
అది 1975వ సంవత్సరం అర్ధరాత్రి మందస పోలీస్ స్టేషన్. నెత్తుటి మడుగులో స్పృహతప్పిన మహిళను కొట్టి లేపి, ‘‘నీ భర్త ఎక్కడ? మీ దళం డెన్ ఎక్కడ?’’ అని అడుగుతున్నారు పోలీసులు. ‘‘నన్ను మీరు చంపక వదలరని తెలుసు. నా ప్రాణముండగా నా నుంచి ఒక్క విషయం రాబట్టలేరు’’ అంది ఆ మహిళ. పోనీ కనీసం లొంగిపోతే కలెక్టర్ నీకు ఉద్యోగం ఇస్తారు. మరో పెళ్ళి చేస్తారు, నీ బిడ్డను గొప్ప చదువులు చదివిస్తారు, భూమి కూడా ఇప్పిస్తారు... ఇలా ప్రలోభపెట్టారు. అయినా వినకపోయేసరికి ఆమెను జీప్‌లో ఎక్కించుకొని బుడార్ సింగ్ కొండపైకి తీసుకు వెళ్ళారు. కళ్లకు గంతలు కట్టి, తలకు తుపాకీ గురిపెట్టారు. ఆఖరు అవకాశం, మరోమారు ఆలోచించుకోమన్నారు. ‘‘మావో జిందాబాద్... విప్లవం వర్ధిల్లాలి!’’ అంటూ నినాదాలు ఇచ్చింది ఆమె. ఆమె పేరే పైలా చంద్రమ్మ. చివరకు ఆమెను అరెస్ట్ చేసి, ఆమెపై పార్వతీపురం కుట్ర కేసుతో సహా అనేక తప్పుడు కేసులు మోపి, పదమూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు.
శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామంలో చెల్లూరి చిన్నయ్య, కామమ్మ దంపతుల ఎనిమిదిమంది సంతానంలో చంద్రక్క ఆరోవారు. 1948లో జన్మించిన చంద్రక్క పదమూడేళ్ల వయస్సు లోనే అదే గ్రామానికి చెందిన గొరకల రాంబాబు స్ఫూర్తితో బాలల సంఘంలో చేరారు. ఆ తరువాత తెగింపు సంఘంలో చేరారు. అదే రాజాం గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని పని చేస్తోన్న పైలా వాసుదేవరావు చంద్రమ్మకు కమ్యూనిజాన్ని బోధించారు. ఉక్కుమహిళగా తీర్చిదిద్దారు. చిన్న వయస్సు నుంచే చంద్రక్క కూలి రేట్లు పెంచాలని, సారాను బందు పెట్టాలని, సాగు–తాగు నీటి పోరాటాల్లోనూ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగాను అనేక ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసేది. గరుడ భద్రలో కూలి రేట్ల కోసం జరిగే ఊరేగింపులో భూస్వామి మద్ది కామేషు, అతని గుండాలు పంచాది నిర్మలపై దాడి చేసిన ఘటనకు వ్యతిరేకంగా ఊరి భూస్వాములను ధీరత్వంతో ఎదుర్కొన్న వారిలో చంద్రక్క ఒకరు. 1968లో మద్ది కామేషు పంట కోతలో చంద్రక్క ముందున్నారు. ఆ ఘటన తరువాత పోలీసుల నిర్బంధం కారణంగా పార్టీ ఆదేశాలతో చంద్రక్క అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొట్టమొదట పుచ్చ అప్పల స్వామి దళంలో చేరారు చంద్రక్క. భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాల్గొని ఆస్తులు స్వాధీనం చేసుకొని పేదలకు పంచే రైతాంగ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. పైలా వాసుదేవ్‌ని 1970 మే 24న మందస ఏజెన్సీ కొండల్లో వివాహం చేసుకున్నారు. 1971లో పురిటిగుడ్డు అరుణను గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర చింతలపూడి గ్రామంలో కటిక పేదరికంలో ఉన్న అత్తలూరి శేషయ్య, శిరోమణి దంపతులకు ఇచ్చివేశారు.
ఆమె ౧3 సంవత్సరాల జైలుశిక్షకు కారణమైన సంఘటన 1975 మే 24న జరిగింది. మందస మండలం కొండ లోగాం ఏజెన్సీలో జరిగిన సమావేశంపై పోలీసులు దాడి చేశారు. కాల్పుల్లో పైలా వాసుదేవరావు సహా మిగిలిన దళ సభ్యులు తప్పించుకున్నారు. చంద్రక్క పొదల్లో ఇరుక్కుని పోలీసులకు చిక్కింది. ఆమెపై తప్పుడు కేసులు మోపి ౧3 సంవత్సరాలు జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా కాడి వదలని ఆమె పట్టుదల నేటి తరానికి ఎంతో ఆదర్శం.
పైలా వాసుదేవరావు మరణానంతరం సైతం ఆమె ఎంతో అంకితభావంతో పనిచేశారు. తన కళ్ళెదుటే ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా పట్టు వదలకుండా ఆఖరి శ్వాస వరకు పోరు బాటలో పయనించారు చంద్రక్క. కరోనా కష్టకాలంలో ప్రపంచం భయభ్రాంతుల్లో ఉన్న సమయంలో 2020 సెప్టెంబర్ 10న కుమారన్న వర్ధంతి సభను గిరిజన గ్రామంలో నిర్వహించారు. అదే సమావేశం సందర్భంగా కరోనా బారిన పడి సెప్టెంబర్ 23, 2020 న విశాఖపట్నం కేజీహెచ్‌లో చంద్రక్క తుది శ్వాస వీడిచారు. చంద్రక్క మరణంతో శ్రీకాకుళం విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన త్యాగాల తరం వెళ్లిపోయినట్లు అయ్యింది. దేశంలో భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద శక్తుల, ఫాసిస్టుల ప్రమాదం పెరుగుతున్న కాలంలో అశేష ప్రజానీకం నూతన ప్రజాస్వామ్య విప్లవం కొరకు పోరాడాల్సిన సమయం ఇది. ఆ దిశగా చంద్రక్క చూపిన పోరుబాట ఒక ఆదర్శం.
l వంకల మాధవరావు
సీపీఐ ఎంల్ రాష్ట్ర కమిటీ సభ్యులు
(నేడు పైలా చంద్రక్క ఐదవ వర్ధంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News