Indo Caribbean Legacy: కరేబియన్ చక్కెర భూమిలో భారతీయులు
ABN , Publish Date - Sep 28 , 2025 | 03:50 AM
కరేబియన్ ద్వీపాలలో ఒకటి ట్రినిడాడ్. తన మూడవ సముద్రయానంలో క్రిస్టోఫర్ కొలంబస్ 1498లో అక్కడకి చేరుకున్నాక, ఆ ప్రాంతానికి ట్రినిడాడ్ అని పేరు పెట్టాడు. ఈ పేరు క్రైస్తవ త్రిమూర్తులను స్మరించుకునే ట్రినిటీ నుంచి...
కరేబియన్ ద్వీపాలలో ఒకటి ట్రినిడాడ్. తన మూడవ సముద్రయానంలో క్రిస్టోఫర్ కొలంబస్ 1498లో అక్కడకి చేరుకున్నాక, ఆ ప్రాంతానికి ట్రినిడాడ్ అని పేరు పెట్టాడు. ఈ పేరు క్రైస్తవ త్రిమూర్తులను స్మరించుకునే ట్రినిటీ నుంచి వచ్చింది. ఈ ద్వీపం 4,828 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. కొలంబస్ అక్కడకి చేరకముందే, స్పెయిన్‌కి కూడా వలసరాజ్యం కాక ముందే, టైనో, కాలినాగో తెగలవారు అక్కడ నివసించేవారు. వారిని కరేబ్ ద్వీపవాసులంటారు. ఆ ద్వీపాల సముదాయానికి కరేబియన్ అన్న పేరు వారి మూలంగానే వచ్చింది. దానిని బ్రిటన్ 1797లో స్వాధీనం చేసుకునే వరకూ, స్పానిష్ కాలనీగానే కొనసాగింది. 1962లో స్వతంత్ర దేశంగా అవతరించే వరకూ బ్రిటిష్ చేతుల్లో ఉంది. అత్యంత సారవంతమైన కాలనీగా బ్రిటిష్ వారు దానిని గుర్తించారు.
ఆఫ్రికన్ బానిసత్వం 1834లో పూర్తిగా రద్దయాక, బ్రిటిష్ సామ్రాజ్యంలోని చెరకు తోటలలో పనిచేసేందుకు కార్మికులు దొరకక, అన్ని ప్రాంతాలలోనూ తోటల యజమానులు చెరకు ఉత్పత్తిలో సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. చౌకదైన ప్రత్యామ్నాయ, శ్రామిక శక్తి కోసం తోటల యజమానులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట మడైరా, వెనిజులా, తూర్పు కరేబియన్‌ల నుంచి ట్రినిడాడ్‌కు చిన్న సమూహాలుగా కూలీలను తీసుకువచ్చి ప్రయత్నించారు. ట్రినిడాడ్‌లోని వలసపాలన అధికారులు చైనా, భారతీయ కార్మికులతో కూడా ఏకకాలంలో ఈ ప్రయోగాలు చేశారు. భారతీయ కార్మికుల కంటే, చైనా కార్మికులను దిగుమతి చేసుకోవడానికి రెండు రెట్లు ఎక్కువ ఖర్చుతో పాటు, పనికి ఏ మాత్రం సరిపోని ఆ కార్మికుల నుంచి, ఆ వాతావరణానికి ఇమడలేకపోయిన కార్మికుల నుంచి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. యూరోపియన్ ఒప్పంద కార్మికులతో కూడా ఆ పనులేవీ సాధ్యపడలేదు. చివరికి, వారు 1863 నాటికే వలస పాలన స్థాపించిన మరొక కాలనీ, భారతదేశం వైపు పూర్తిగా మొగ్గారు. తోటల యజమానుల దృష్టి కూడా ఇటే పడింది. భారతీయ జనాభాలో 80 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి, బానిసలుగా ఉన్న ఆఫ్రికన్‌లకు సరైన శ్రామిక ప్రత్యామ్నాయాన్ని భారతీయులు ఇవ్వగలరని వారంతా భావించారు.
అప్పటికే ఏర్పర్చిన ఒప్పంద కార్మిక వ్యవస్థలో భాగంగా, బ్రిటిష్ 30 మే 1845 నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికుల్ని పంపిన మూడవ దేశంగా, ట్రినిడాడ్ & టొబాగోని చేర్చుకుంది. ఆ వ్యవస్థ ఆ సరికే మారిషస్, గయానాల్లో ఉనికిలో ఉంది. కార్మికులను అలా తీసుకువెళ్లిన తొలి నౌక ఫతేల్ రజాక్ 1845 ఫిబ్రవరి 16న కలకత్తా నుంచి బయలుదేరి 1845 మే 30న, 225 మంది కార్మికులతో ట్రినిడాడ్‌కు చేరింది. భారతీయ కార్మికులను 1917 వరకు, అలా క్రమ పద్ధతిలో ట్రినిడాడ్‌కు రవాణా చేయడానికి, మొత్తం 154 నౌకలు కలకత్తా, మద్రాస్, బొంబాయి నుంచి 320 ప్రయాణాలు చేశాయి. 1845–1917ల మధ్య మొత్తం 1,43,939 మంది భారతీయులు ఒప్పంద విధానంలో ట్రినిడాడ్‌కు వలస వెళ్లారు.
ట్రినిడాడ్ ఒప్పంద కార్మికులలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాల వ్యవసాయ, కార్మిక తరగతుల వారే ఉన్నారు. బెంగాల్, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్నారు. వలస వెళ్లిన వారిలో దాదాపు 85 శాతం మంది హిందువులు, 14శాతం ముస్లింలు. ఒప్పంద కార్మిక వ్యవస్థ కింద నలిగి కష్టతరమైన పరిస్థితులు అనుభవించినప్పటికీ, దాదాపు 90 శాతం మంది భారతీయ వలసదారులు తమ ఒప్పంద కాల వ్యవధి ముగింపులో, ట్రినిడాడ్‌నే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు. వలసదారుల్లో అధికశాతం 20–30 వయస్సు మధ్య వారే.
ఒప్పంద ఐదేళ్ల వ్యవధి ముగింపులో, భారతీయ వలసదారులకు పారిశ్రామిక నివాస ధ్రువీకరణ పత్రం మంజూరు చేయబడేది. ఆ వ్యక్తి ఇక ఒప్పందానికి లోబడి లేడని ధ్రువీకరిస్తూ ఇచ్చిన ఒక విధమైన హామీ అది. అయినా భారతదేశానికి ఉచితంగా తిరిగి వెళ్లే అర్హత సంపాదించడానికి, కార్మికులు మరో ఐదేళ్ల పాటు తిరిగి ఒప్పందాన్ని పొందవలసి వచ్చేది. కాలనీలో పదేళ్ల శ్రమను పూర్తి చేయకుండా భారతదేశానికి తిరిగి రావడానికి ఏకైక ప్రత్యామ్నాయం వారివారి స్వంత ఖర్చుతో పయనమవడం. అది కుదరక దాదాపు 75 శాతం మంది ద్వీపంలో శాశ్వత స్థిరనివాసులుగా ఉండిపోయారు. మిగిలినవారు పొదుపుగా దాచుకున్న దానితో భారతదేశానికి తిరిగి వచ్చారు. అలా దాదాపు 20 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగొచ్చారు.
1870ల నాటికి, భారతీయులు ట్రినిడాడ్‌లోని చక్కెర పరిశ్రమకు నిజమైన వెన్నెముకగా నిరూపించుకున్నారు. భారతీయులకు, ఎస్టేట్ జీవితం ఆకర్షణీయంగా లేనపుడు స్వతంత్ర రైతులుగా మారడానికి పెద్ద సంఖ్యలో ఎస్టేట్‌ల నుంచి తరలివెళ్లడం ప్రారంభించారు. భూ వినిమయ పథకం ద్వారా వారికి మంజూరు అయిన భూముల్లోనో లేదా ప్రాంతం నుంచో, వారు కొనుగోలు చేసిన భూముల్లోనో వారు స్థిరపడ్డారు. 1902 నాటికి, ట్రినిడాడ్‌లోని ఉత్పత్తి అయిన చెరకులో సగానికి పైగా స్వతంత్ర చెరకు రైతులతోనే ఉత్పత్తి అయింది. వారిలో అత్యధికులు భారతీయులు. అందుకే వారు ట్రినిడాడ్‌ను ‘చీనీ డాడ్’ (భోజ్‌పురి భాషలో చక్కెర భూమి) అని వ్యంగ్యంగా పిలుచుకోవడం మొదలుపెట్టారు.
1884 తర్వాత ఒక కొత్త ప్రజా కార్యరూపం అకస్మాత్తుగా అక్కడ ఏర్పడింది. అది కాలనీల ప్రముఖ పత్రికలకు లేఖలు రాయడం రూపంలో బయటకొచ్చింది. భారతీయుల్లో అలా మొదటి లేఖ రాసినవాడు ‘‘A Son of India’’ అనే కలంపేరుతో 1888లో ట్రినిడాడ్‌లోని San Fernando Gazette అనే పత్రికలో రాయడం ప్రారంభించాడు. అది కాలనీలో ప్రముఖమైన క్రియోల్ (నల్లజాతీయులు) పత్రిక. చదువుకున్న క్రియోల్స్, వారి హక్కుల కోసం పోరాడే పత్రిక. ఆ లేఖల్లో ప్రస్తావించిన ప్రధాన అంశాల మూలంగా, 1889 నాటికి, ‘‘కూలీ’’ అనే పదం అవమానకరంగా భావించబడింది. అప్పటికే ఏర్పడ్డ ‘కూలీ మిషన్’ ‘ఈస్ట్ ఇండియన్ మిషన్’గా పేరు మార్చబడింది. ఈ లేఖలు భారతీయ ప్రజా ఉద్యమం, ట్రినిడాడ్‌లో భారతీయ సముదాయ ఉనికిని, విద్య, పౌరసత్వం, సాంస్కృతిక గౌరవం వంటి అంశాల ఆధారంగా ప్రజా వేదికల ద్వారా వ్యక్తీకరించడానికి పునాది వేశాయి.
1881లోనే ట్రినిడాడ్‌లో భారతీయులు ‘కాశీ పూరి’ ఆలయం నిర్మించుకున్నారు. భారతీయ పేర్లతో మందిరాలు, హోటళ్లు, విద్యాలయాలు, కాలేజీలు ఉన్నాయి. హిందూ పండుగలను సైతం జరుపుకుంటారు. 30 ఏళ్లకు పైగా ప్రజాజీవితంలో ఉన్న ట్రేడ్ యూనియన్ ప్రతిపక్ష నాయకుడు బాస్డియో పాండే అక్కడ ప్రధానమంత్రిగా ఎన్నికైన మొదటి భారతీయుడు. అతడి నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ సభ్యురాలు కమలా పెర్సాద్ బిస్సెస్సర్ అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు అక్కడి ప్రధానమంత్రిగా ఆమె ఆహ్వానం మీదనే, ఇటీవల మన ప్రధాని మోదీ ట్రినిడాడ్ వెళ్లారు. అప్పటి వారి వారసులు అలా అక్కడ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అక్కడి జనాభాలో 38 శాతం భారతీయ వారసులే ఉన్నారు.
కరేబియన్‌లో భారతీయ ఉనికికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి నవలా రచయిత వి.ఎస్. నైపాల్, 2001లో సాహిత్యానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. భారతీయ వారసత్వం, ట్రినిడాడ్ టొబాగో జీవనశైలిలో అంతర్భాగం అయింది. సాహిత్యంలో భారతీయ వారసులు వారి మూలాల్ని మరచిపోలేని రచనలు చేస్తున్నారు. రమాబాయి ఎస్పినెట్ సంపాదకత్వంలో, ‘క్రియేషన్ ఫైర్’ కరేబియన్ మహిళల కవిత్వ సంకలనంలో 115 మంది కరేబియన్ మహిళా కవయిత్రుల (దాదాపు 200 కవితల) ఉత్తేజకరమైన సంకలనం కూడా వెలువడింది.
కరేబియన్ ద్వీపంలో ట్రినిడాడ్ మాత్రమే, మే 30, 1845న వచ్చిన మొదటి ఒప్పంద కార్మికుల రాకను పురస్కరించుకుని వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఒప్పంద కార్మికుల రాకను జరుపుకుంటున్న మరొక దేశం మారిషస్. చాలా మంది నాల్గవ, ఐదవ తరం ఇండో–కరేబియన్లు తమ పూర్వీకుల మూలాలను వెతుక్కుంటున్నారు. భారతదేశంలోని వారి పూర్వీకుల ఇళ్లు/గ్రామాలను సందర్శిస్తున్నారు. కాస్మోపాలిటన్ కరేబియన్‌లో వారు తమను తాము ఎలా పిలుచుకున్నా, అక్కడి వారు తమను ప్రత్యేకమైన వ్యక్తులుగా చూస్తున్నారనే వాస్తవాన్ని మాత్రం తప్పించుకోలేకపోతున్నారు.
ముకుంద రామారావు
కవి, వలసజీవితాల చరిత్రకారుడు (99083 47273)
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News and National News