Share News

Indias Democratic Backsliding: తిరోగమిస్తున్న భారత ప్రజాస్వామ్యం

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:32 AM

నీవు ‘దేశ్‌, కాల్‌, పత్ర’ గురించి మాట్లాడుతున్నావు కదూ అని నా మిత్రుడు, భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ విజయ్‌ మహాజన్‌ వ్యాఖ్యానించారు. అవును, దేశ్‌ (నియోజకవర్గ సరిహద్దులు), కాల్‌ (ఎన్నికల సమయం), పత్ర (ఓటర్ల జాబితా) మార్చడం...

Indias Democratic Backsliding: తిరోగమిస్తున్న భారత ప్రజాస్వామ్యం

నీవు ‘దేశ్‌, కాల్‌, పత్ర’ గురించి మాట్లాడుతున్నావు కదూ అని నా మిత్రుడు, భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ విజయ్‌ మహాజన్‌ వ్యాఖ్యానించారు. అవును, దేశ్‌ (నియోజకవర్గ సరిహద్దులు), కాల్‌ (ఎన్నికల సమయం), పత్ర (ఓటర్ల జాబితా) మార్చడం గురించి నేను మథనపడుతున్నాను. మన ఎన్నికల వ్యవస్థలో సంభవించనున్న మూడు పెనుమార్పులను సూచిస్తున్న విషయాలవి. మహాజన్‌తో జరిగిన మాటామంతీతో డీ–లిమిటేషన్‌ (2026 జనాభా గణన ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన), వన్‌ నేషన్‌, వన్‌ టైమ్‌ (ఒక దేశం, ఒక ఎన్నిక (పార్లమెంటు, రాష్ట్ర శానసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ), ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌– సర్‌) మధ్య పరస్పర సంబంధమూ, అది జాతీయ అధికార పక్షానికి సమకూర్చే శాశ్వత నిర్మాణాత్మక ప్రయోజనం గురించి నాకు మరింత మెరుగైన అవగాహన ఏర్పడ్డది.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మంగళవారం లోక్‌సభలో, బుధవారం రాజ్యసభలో ‘ఎన్నికల సంస్కరణల’పై చర్చ జరిగింది. ఎన్నికల సంస్కరణ అనేది అందమైన భావన. అది గతించిన ఒక అమాయక కాలాన్ని గుర్తుచేస్తుంది. తమను అత్యున్నత చట్టసభకు తీసుకువచ్చి, తద్వారా అధికా రాన్ని అప్పగించిన నియమ నిబంధనలను మార్చాల్సిన ఆవశ్యకత విషయమై పార్లమెంటేరియన్లకు నచ్చజెప్పి, వారిని ఒప్పించడం సాధ్యమయ్యే నిష్కపటత్వం ఉన్న రోజులవి. అయితే యమునా నదిలో నాటికీ నేటికీ చాలా మురికినీరు ప్రవహించింది సుమా!

ఎన్నికల వ్యవస్థలో ఆవశ్యక మార్పుల విషయమై ‘ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌’ పద్ధతి (ఓటర్లు ఒకే అభ్యర్థికి ఓటు వేసే బహుళ ఓటింగ్‌ వ్యవస్థ. అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి విజేత అవుతాడు) నుంచి దామాషా ప్రాతినిధ్యానికి మారే విషయమై చర్చించాం. అలాగే ఎన్నికలలో ధనబలం, కండబలం ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకురావాల్సిన చట్టాల గురించీ తర్జన భర్జనలు పడ్డాం. చివరకు ఇప్పుడు ఎన్నికల సమగ్రత, నిష్పాక్షికత కనీసంగానైనా ఉండేలా తీసుకోవల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాల గురించి తర్కిస్తున్నాం. నిజానికి ఎన్నికల ‘సంస్కరణల’ గురించి కాకుండా ప్రస్తుత పాలకుల విధానాల వల్ల ఎన్నికల వ్యవస్థలో సంభవిస్తోన్న వికృతాలను నిరోధించే విషయమై పార్లమెంటు చర్చించడం యుక్తంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను.


ఎన్నికలలో అక్రమాలు సంభవించడమనేది భారత్‌కే పరిమితమైన పరిణామం కాదు. ఎన్నికల నిర్వహణా నియమాలను నిరంకుశ పాలకులు తమకు అనుకూలంగా మార్చుకోవడమనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఇరవయో శతాబ్ది నియంతలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే 21వ శతాబ్ది నిరంకుశ పాలకుల పరిస్థితి వేరు. తమకు ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నదని చూపాల్సిన అవసరం వీరికి ఉన్నది. కనుకనే ఎన్నికలను పూర్తిగా రద్దు చేయలేకపోతున్నారు. అలా అని ఎన్నికలు నిర్వహించి తమ అధికారానికి ప్రమాదాన్ని కొనితెచ్చుకోలేరు. అందుకే రెండు కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఒకటి– ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సంస్థను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు; రెండోది రాజకీయ పోటీని యథాతథంగా ఉంచుతూ ఎన్నికల నియమాలు పూర్తిగా పాలకులకే అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా చేస్తున్నారు. సమకాలీన ప్రపంచంలో హంగేరీ, తుర్కియే, వెనిజువెలా, ఈక్వెడార్‌, బొలీవియా, కెన్యా, థాయిలాండ్‌, మయన్మార్ మొదలైన దేశాల తులనాత్మక రాజకీయాల పరిశోధకులు నిగ్గుదేల్చిన ‘దుర్వినియోగ రాజ్యాంగవాదం’ (అబ్యూసివ్‌ కాన్ట్సిట్యూషనలిజమ్‌ – ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు, నిరంకుశ పాలనను నెలకొల్పేందుకు రాజ్యాంగ విధానాలను అనుసరించడం), ‘నిరంకుశ చట్టబద్ధత’ (ఆటోక్రాటిక్‌ లీగలిజం– అధికారాన్ని ఏకీకృతం చేసేందుకు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు స్వస్తిచెప్పేందుకు చట్టపరమైన పద్ధతులను ఉపయోగించడం), ‘ఎలెక్టోరల్‌ టిల్టింగ్‌’ (ఓటింగ్‌ చట్టాలను మార్చడం, మీడియా కథనాలను నియంత్రించడం తదితర చర్యల ద్వారా వ్యవస్థలను నిజమైన ప్రజాస్వామ్యం కంటే పోటీ నిరంకుశత్వం వైపు కదిలించడం) మొదలైన అప్రజాస్వామిక పాలనా రీతులకు ఉదాహరణలుగా ఉన్నాయి. గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న పాలకులు, అసమ పోటీ అవకాశాలను కల్పించేందుకు చట్టబద్ధమైన, పాలనా యంత్రాంగాలను ఉపయోగించుకుంటున్నారు. చట్టాలలోను, పాలనా సంస్థలలోను క్రమంగా తీసుకొచ్చిన మార్పులు భారత్‌లో పార్టీ– రాజ్య వ్యవస్థ ఏకీ భవనం (పార్టీ– స్టేట్‌ ఫ్యూజన్‌)ను ఎలా సృష్టించాయో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర ఆచార్యుడు తరునాభ్‌ ఖైతాన్‌ తన పరిశోధనా పత్రం ‘కిల్లింగ్‌ ఎ కాన్ట్సిట్యూషన్‌ విత్‌ ఎ థౌజండ్‌ కట్స్‌’లో చూపారు.

ఈ విశ్లేషణను దేశ్‌, కాల్‌, పత్రకు పొడిగిద్దాం. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత బాధ్యతల్లో ఉన్న పెద్ద మనిషి ఒకరు 2024 సార్వత్రక ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తూ సహజంగానే కలవరపడి ఉంటారు. తమ పార్టీ బలహీనతలు మూడింటిని ఆయన గుర్తించి ఉంటారు. దేశ్‌– తూర్పు తీరస్థ రాష్ట్రాలలో బీజేపీని వ్యతిరేకించిన ప్రాంతాలు ఉన్నాయి; కాల్‌– ఎన్నికల సమయాలు ఏటా బీజేపీ ఆధిపత్యానికి పరీక్ష పెడుతున్నాయి; పత్ర– సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న కొన్ని వర్గాలు బీజేపీకి ఓటు వేసినప్పుడు కూడా ఆ పార్టీని విశ్వసించడం లేదు. ఈ బలహీనతలను అధిగమించేందుకు ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. అది– నియోజకవర్గాల పునర్విభజన, ఒక దేశం–ఒక ఎన్నిక, ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణల కలయిక.


నియోజకవర్గాల పునర్విభజన (డీ–లిమిటేషన్‌) బీజేపీకి రెండు ప్రయోజనాలను సమకూరుస్తుంది. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో బీజేపీ ఓట్లు, సీట్ల పరంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా, ఆ పార్టీ తలపెట్టే రాజ్యాంగ సవరణలకు ప్రతికూలతనూ తగ్గిస్తుంది. బీజేపీ సాపేక్షంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలు (కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బెంగాల్‌, పంజాబ్‌) సీట్లను కోల్పోతాయి. ఎక్కువ నియోజకవర్గాలు ఉండే రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌) బీజేపీకి కంచుకోటలు అవుతాయి. ఇదంతా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజనను ఇప్పటికే అస్సోం, జమ్మూ–కశ్మీర్‌లలో ప్రయోగాత్మకంగా అమలుపరిచారు. దేశవ్యాప్తంగా దానిని అమలుపరిచినప్పుడు కనీసం డజన్‌కు పైగా సీట్లు బీజేపీ వైపు మొగ్గుతాయి.

ఒక దేశం, ఒక ఎన్నిక అనేది బీజేపీకి రెండు ప్రయోజనాలను సమకూరుస్తుంది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల అధికారంలో ఉన్న పార్టీకి పరిస్థితులు అనుకూలమవుతాయి. అసెంబ్లీ ఎన్నికలలో కూడా బాగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి.

బీజేపీకి అనుకూలంగా లేని వ్యక్తులకు, సామాజిక సమూహాలకు ఓటింగ్‌ హక్కులు నిరాకరిస్తున్న ‘సర్‌’ ఈ కథకు తగిన ముక్తాయింపు. బిహార్‌ దృష్టాంతాన్ని (‘సర్‌’కు ముందున్న ఓటర్‌ జాబితాల నుంచి నికరంగా 44 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు) బట్టి దేశవ్యాప్త ‘సర్‌’ ఓటర్‌ జాబితాల నుంచి ఐదు కోట్లకు పైగా ఓటర్ల పేర్లను తొలగించే అవకాశమున్నదని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అతిపెద్ద ఓటు హక్కు తొలగింపు కార్యక్రమమనడంలో సందేహం లేదు. ఇలా ఓటుహక్కు నిరాకరణకు గురైనవారిలో అత్యధికులు పేదలు, మైనారిటీలు, వలస కార్మికులు అనేది గమనార్హం. ఓటర్‌గా నమోదు చేసుకునే బాధ్యతా భారాన్ని పూర్తిగా ఓటర్లపై మోపడం కూడా ఆ తొలగింపులకు ఒక ప్రధాన కారణమని చెప్పితీరాలి. ఇలా తొలగింపునకు గురైన వారిలో బీజేపీ మద్దతుదారులు చాలా తక్కువ మంది కనుక ‘సర్‌’ ప్రక్రియతో బీజేపీకి ఇంచుమించు ఎటువంటి నష్టం ఉండదు. తన సంస్థాగత బలిమి, స్థానిక అధికారుల మద్దతుతోను తన విధేయ ఓటర్లను ఓటుహక్కు తొలగింపు ప్రక్రియ నుంచి బీజేపీ కాపాడుకోగలుగుతుంది. ఈ విషయంలో దేశ పాలకపక్షం తన ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే చాలా చాలా మెరుగ్గా ఉన్నది. ‘సర్‌’ను రూపొందించిన తీరు. దాన్ని అమలుపరుస్తున్న వైనాన్ని గమనిస్తే అత్యధిక ముస్లింల ఓటుహక్కు తొలగింపే ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ లక్ష్యమని అర్థమవుతుంది.


నియోజకవర్గాల పునర్విభజన, ఒకే దేశం–ఒకే ఎన్నిక, ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కలసికట్టుగా భారతదేశ ప్రజాస్వామ్య రేటింగ్‌ను మరింతగా దిగజార్చే అవకాశం ఎంతైనా ఉన్నది. అంతర్జాతీయ అంతర్‌– ప్రభుత్వ సంస్థ అయిన ఇంటర్నేషనల్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ డెమోక్రసీ అండ్‌ ఎలక్టోరల్‌ అసిస్టెన్స్‌ (అంతర్జాతీయ IDEA) ఇప్పటికే ఇండియాను ‘ప్రజాస్వామిక తిరోగమనం’కు ఒక నిదర్శనాధ్యయనం (కేస్‌ స్టడీ)గా పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థను క్రమంగా నిరంకుశత్వం వైపు మళ్లించడమే ప్రజాస్వామ్య తిరోగతి. ఇది చట్టబద్ధమైన మార్గాల ద్వారా, తరచుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల నిర్వాకాల వల్లే ఈ తిరోగతి సంభవిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా ‘విశ్వసనీయ ఎన్నికలు’ సహా వివిధ సూచికలపై భారత్‌ గణనీయమైన గణాంక తగ్గుదలను నమోదు చేసిందని ఆ సంస్థ ‘గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ నివేదిక పేర్కొంది. 2026 సంవత్సరంలో ఇంటర్నేషనల్‌ IDEA సంస్థ అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టనున్నది భారత ప్రజాస్వామ్య ప్రస్థానం, ఎన్నికల పద్ధతులు, సమ్మిళిత పాలనకు నిబద్ధత మొదలైన నిర్దిష్ట అంశాలను అంతర్జాతీయ సమాజం రాబోయే సంవత్సరంలో నిశితంగా పరిశీలించనున్నది. ఈ బృహత్తర బాధ్యతను ఆ అంతర్జాతీయ సంస్థ ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించనున్నదో తెలుసా? ఇంకెవరు? మన భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోనే!

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి..

సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..

మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు

Read Latest AP News and National News

Updated Date - Dec 11 , 2025 | 05:32 AM