Indian Railways Sets Benchmark at Kumbh Mela: జన సమూహాల నిర్వహణలో రైల్వే దక్షత
ABN , Publish Date - Oct 24 , 2025 | 02:12 AM
మన దేశం 1.4 బిలియన్ల జనాభాతో అన్నివిధాలా వృద్ధి చెందుతున్నది. అనేక జాతులు, సంస్కృతులు, భాషలు, పండుగల సమాహారమైన ఈ దేశంలో సహజంగానే ప్రజలంతా ఒకే చోట...
మన దేశం 1.4 బిలియన్ల జనాభాతో అన్నివిధాలా వృద్ధి చెందుతున్నది. అనేక జాతులు, సంస్కృతులు, భాషలు, పండుగల సమాహారమైన ఈ దేశంలో సహజంగానే ప్రజలంతా ఒకే చోట గుమికూడే సందర్భాలు ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గుంపుల నిర్వహణకు మన దేశం వేదికగా మారుతున్నది. దేశంలో జనాభా పెరిగే కొద్దీ, గుంపులు కూడా అంతకంతకూ పెద్దవి అవుతున్నాయి. వాటిని నియంత్రించటం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
గుంపుల నిర్వహణ (క్రౌడ్ మేనేజ్‌మెంట్) అంటే మనుషుల్ని బలవంతంగా అదుపు చేయటమో, వారికి కాపలా కాయటమో కాదు; బహిరంగ ప్రదేశాల్లో గుమికూడిన మనుషుల ప్రవర్తన పట్ల శాస్త్రీయమైన అవగాహనతో వ్యవహరించటం. భారత్ వంటి దేశంలో గుంపుల నియంత్రణ ఎంతో ముఖ్యమైన అంశం. దేశ జనాభా పెరిగే కొద్దీ, ప్రజా సమూహాల కదలికని అదుపు చేయటం, ముఖ్యంగా ఇరుకు ప్రదేశాల్లోను, ఆవేశపూరితమైన వాతావరణంలోను మనుషుల్ని నియంత్రించటం చాలా కష్టంగా మారింది. దేశంలో నగరాలు విస్తరించేకొద్దీ, వలసలు పెరిగేకొద్దీ, గుంపుల నియంత్రణలో ఇప్పుడు సైకాలజీ, టెక్నాలజీల వినియోగమూ, ముందస్తు ప్రణాళికల అవసరమూ పెరిగింది.
ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన తొక్కిసలాట– గుంపుల నియంత్రణ ఎంత అవసరమో మరోమారు తెలియజెప్పింది. ఒక నటుడి రాజకీయ ప్రచారం సందర్భంగా ఆ ప్రాంతంలో ముప్పై వేల మందికి పైగా జనాభా గుమికూడారు. భారతదేశంలో 2000–2022 సంవత్సరాల మధ్య జరిగిన ప్రమాద మరణాలూ, ఆత్మహత్యలపై ఎన్‌సీఆర్‌బీ ప్రకటించిన నివేదిక ప్రకారం తొక్కిసలాటల్లో 3,074 మంది ప్రాణాలు పోయాయి. గత మూడు దశాబ్దాలుగా నాలుగువేలకు పైగా తొక్కిసలాట ఘటనలు జరిగాయి. వీటిలో 2001–2014 మధ్య జరిగిన 79 శాతం తొక్కిసలాట ఘటనలు ప్రార్థనా స్థలాల్లోనే జరిగాయి.
అది కుంభమేళా అయినా, రాజకీయ ప్రచార సభ అయినా– గుంపుల్లో మానవ స్వభావాన్ని అంచనా వేసి నియంత్రించగలగటం వల్ల చాలా ప్రమాదాలను నివారించగలం. ఒక సామూహిక కలయిక సక్రమంగా జరగటానికి బారికేడ్లు ఉంటే సరిపోవు. ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకోవటం, పరస్పర గౌరవాన్ని ఇవ్వటం, పౌర బాధ్యతను పాటించటం ముఖ్యం. ఎంతమంది హాజరవుతారన్న లెక్కలూ, అందుకు తగ్గ ఏర్పాట్లతోపాటు, మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవటం కూడా గుంపులను నిర్వహించటంలో కీలకమైన అంశం. లక్షలాది మంది ఒకేచోట చేరినప్పుడు వారంతా సంయమనంతో కదిలారా, గందరగోళంతో చెల్లాచెదురయ్యారా అన్నది ముందస్తు ప్రణాళికని బట్టి ఉంటుంది. గుంపుల నిర్వహణలో చిన్న చిన్న లోపాలే తొక్కిసలాటలకు దారితీస్తాయి.
కుంభమేళా సందర్భంలో భారతీయ రైల్వే దానికి సిద్ధమైన తీరు నుంచి ఎన్నో మంచి పాఠాలను నేర్చుకోవచ్చు. ప్రయాగ్‌రాజ్‌లో 2025లో జరిగిన కుంభమేళాను భూమి మీదే అతిపెద్ద మానవ సమీకరణగా చెప్పవచ్చు. దీన్ని నిర్వహించిన తీరు గుంపుల నిర్వహణకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ భారీ వేడుకలో భాగంగా త్రివేణీ సంగమ స్థలిలో పుణ్యస్నానం చేసేందుకు కోట్లాదిమంది ఒకచోటకు చేరతారు. ఈ ఏడాది 67 కోట్ల మంది ఈ ఉత్సవంలో పాల్గొన్నారని అంచనా. ఎక్కువ మంది హాజరైన రోజుగా చెప్తున్న జనవరి 29న ఏకంగా ఏడుకోట్ల అరవై లక్షల మంది పాల్గొన్నారు. ఇంతటి భారీ ఉత్సవం కోసం భారతీయ రైల్వే నెలల ముందు నుంచీ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా– టెంపరరీ స్టేషన్లు, శాటిలైట్ స్టేషన్లు తెరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా జన సాంద్రతను అంచనా వేస్తూ, డ్రోన్ సర్వేలెన్స్‌ను నిరంతరం వాడారు. రైల్వేలకు, పోలీసులకు, ఇతర పౌర సంబంధ అధికారులకు మధ్య సమన్వయాన్ని సాధించారు. ప్రజలతో వ్యవహరించే సిబ్బందికి స్పష్టంగా సామరస్యంగా ఎలా నడుచుకోవాలో శిక్షణ ఇప్పించారు. కచ్చితమైన గణాంకాలకు తోడుగా, టెక్నాలజీని, ఏఐను విస్తృతంగా వాడారు. రైల్వే పరిసరాలను ఎప్పటికప్పుడు రీడిజైన్ చేస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ రైల్వే రికార్డు స్థాయిలో 17,152 రైళ్లను నడిపింది.
ప్రయాగ్‌రాజ్‌తో పాటు ఆ దరిదాపుల్లో ఉన్న రైల్వే స్టేషన్లు అన్నింటికీ పెద్ద స్థాయిలో మార్పులు చేపట్టారు. 48 కొత్త ప్లాట్‌ఫామ్‌లూ, 21 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలూ, 21 రోడ్‌ఓవర్ బ్రిడ్జిలూ, రోడ్ అండర్ బ్రిడ్జిలూ నిర్మించారు. ప్రయాగ్‌రాజ్, పపామావ్, రాంబాగ్, ఝూసీ ప్రాంతాల్లో రైల్వే యార్డ్ రీమోడలింగ్ పనులను చేపట్టారు. గుంపుల ఉధృతి తీవ్రస్థాయికి చేరిన సమయాల్లో వాళ్లకి చోటు కల్పించేలా శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. ప్రయాణికుల రాకడను నిత్యం కనిపెడుతూ ఉండటానికి వెయ్యికి పైగా సీసీ టీవీ సర్వేలెన్స్ కెమెరాలను వాడారు. అలాగే ప్రకటనలను వేర్వేరు భాషల్లో వినిపించటం వల్ల చాలావరకు గందరగోళాన్ని తగ్గించగలిగారు.
కుంభమేళా సందర్భంగా గుంపులను నియంత్రించేందుకు, నిర్వహించేందుకు భారతీయ రైల్వే తీసుకున్న చర్యలు ఇప్పుడు ఇలాంటి మరికొన్ని సందర్భాల కోసం ఉపయోగపడుతున్నాయి. 2027లో నాసిక్‌లో జరగనున్న సింహస్థ కుంభమేళా, అదే ఏడాది రాజమండ్రిలో జరగనున్న పుష్కరాలు, 2028లో ఉజ్జయినిలో జరగనున్న కుంభమేళాల కోసం ఆయా స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచటం కోసం భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో గుంపుల నిర్వహణ కోసం భారతీయ రైల్వే చేపట్టిన చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అలాంటి సందర్భాలకు ఆదర్శంగా మారాయి.
పరిసర వ్యవస్థల అభివృద్ధితోపాటు, సిమ్యులేషన్, స్పష్టమైన సైన్‌లు, గుంపుల కదలికను అంచనా వేయటం... ఇవన్నీ సమర్థమైన గుంపుల నిర్వహణకు ఎంతో కీలకం. మన దేశంలో ప్రజా సమూహాలు పరిమాణంలో పెరుగుతూనే ఉంటాయి. ప్రజలు గుంపులుగా ఒకచోట గుమికూడటం ఆగదు. కానీ తెలివిగా వ్యవహరిస్తే– ఆ గుంపులు సామూహిక అయోమయంగా గాక, సామూహిక ఐక్యతకు ఉదాహరణగా నిలుస్తాయి. ఈ విషయంలో కుంభమేళా నేర్పిన పాఠం: ‘‘సమూహాన్ని నడపాలంటే ముందు దాని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి’’.
ఇతీ పాండే
ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్
సౌత్ సెంట్రల్ రైల్వే
ఈ వార్తలు కూడా చదవండి..
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు
Read Latest AP News And Telugu News