Share News

Caste Tensions and Political Fallout: ఈ ఘటనల రేపటి దృశ్యం ఏమిటి

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:44 AM

భారతదేశంలో కొన్ని సంఘటనలు అనూహ్యంగా రాజకీయ పరిణామాలకు దారితీయడం కద్దు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనల రాజకీయ పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉన్నది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై బూటు...

Caste Tensions and Political Fallout: ఈ ఘటనల రేపటి దృశ్యం ఏమిటి

భారతదేశంలో కొన్ని సంఘటనలు అనూహ్యంగా రాజకీయ పరిణామాలకు దారితీయడం కద్దు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనల రాజకీయ పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉన్నది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై బూటు దాడి కలిగించిన దిగ్భ్రమ నుంచి సమాజం తేరుకోకముందే హరియాణాలో పూరన్ కుమార్ అనే ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ రెండు ఘటనల మధ్య రాయబరేలీలో ఒక అమాయకుడిని చెట్టుకు కట్టి కొట్టి చంపారు. ఈ ముగ్గురూ దళితులే కావడం దేశంలో ఆ అణగారిన సామాజిక వర్గాల పరిస్థితిపై చర్చలకు దారితీస్తోంది. గ్వాలియర్ కోర్టులో అంబేడ్కర్ విగ్రహావిష్కరణను కొందరు అడ్డుకోవడం, ఒక న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ సంఘటనలు ఏ మార్పును సూచిస్తున్నాయి?

పూరన్ కుమార్ ఆత్మహత్య తర్వాత సంభవించిన పరిణామాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోనేపట్‌లో జనవిశ్వాస్- జనవికాస్ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉండగా తన పర్యటననే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి సైనీ పాల్గొనాల్సిన వాల్మీకి ఉత్సవాలను కూడా రద్దు చేశారు. పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన 9 పేజీల లేఖలో హరియాణాలో తాను ఎదుర్కొన్న కులవివక్షను, వేధింపులను ప్రస్తావించారు. డీజీపీతో సహా 12 మంది అధికారుల పేర్లను కూడా పేర్కొన్నారు. తనకు ప్రమోషన్లు రాకుండా అడ్డుకున్నారని, ప్రాధాన్యత లేని పోస్టింగులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. తన భర్త ఆరోపణలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోనిపక్షంలో ఆయన భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టమ్‌కు అప్పగించే ప్రసక్తి లేదని పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్‌ అధికారి అమ్నీత్ కుమార్ పట్టుబడుతున్నారు. పూరన్ ఆత్మహత్య తర్వాత చండీఘడ్‌లో ఆయన నివాసాన్ని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీతో సహా రాజకీయ పార్టీల నేతలందరూ సందర్శించడం ప్రారంభించారు. బిహార్‌లో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న లోక్‌జనశక్తి నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా పూరన్ కుమార్ నివాసానికి వెళ్లి ప్రభుత్వ సంస్థల్లో కులఆధారంగా వివక్ష జరుగుతోందని విమర్శించారు. ఈ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఏ దళిత కుటుంబమూ ప్రధాన స్రవంతిలో చేరేందుకు ముందుకు రాదని ఆయన అన్నారు. అక్టోబర్ 7న పూరన్ ఆత్మహత్య చేసుకోగా వారం రోజుల తర్వాత డీజీపీని సెలవుపై పంపించడం అనివార్యమయింది.


అధికార వ్యవస్థలోను, రాజకీయాల్లోనూ కుల వివక్ష దేశంలో కొత్తది కాదు. పూరన్ కుమార్ ఆరోపణల్లో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయో, ఆయన నిజంగా వివక్ష వల్ల ఆత్మహత్య చేసుకున్నారో అన్నవి సరైన విచారణ జరిగినప్పుడే తేలుతుంది కాని ఈ దేశంలో కుల వివక్ష తీవ్రంగా ఉన్నదన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. అదే సమయంలో వివిధ అణగారిన కులాలను దరిచేర్చుకోకుండా రాజకీయాల్లో విజయం సాధించలేమన్న విషయం కూడా ఆయా పార్టీలకు తెలుసు. 16 శాతం దళితులు ఉన్న హరియాణలో కుల రాజకీయాల ప్రాధాన్యం తెలిసినందువల్లే గత ఎన్నికల్లో ఎస్సీల్లో మరింత వెనుకబడిన వర్గాలకు ఎన్నికల ముందు 20 శాతం రిజర్వేషన్ కల్పించారు. అదే సమయంలో సెల్జా వంటి దళిత నేతలను కాంగ్రెస్ విస్మరించడం కూడా బీజేపీకి ఉపయోగపడింది. ఇప్పుడు అదే బీజేపీకి పూరన్ కుమార్ ఆత్మహత్య సమస్యలు తెచ్చిపెడుతోంది.

నిజానికి హిందూత్వ ఆధారంగా అనేక కులాలను ఆకర్షించి బీజేపీకి ఓటు బ్యాంకు సాధించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా కాలంగా కృషి చేస్తోంది. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ సిద్ధాంతానికీ బందీ కాదు. అది నిత్యం సమాజం అవసరాలకు తగ్గట్లుగా తనను తాను మార్చుకున్నందువల్లే అది దినదిన ప్రవర్థమానమవుతోంది’ అని ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ సిద్ధాంతకర్త రాంమాధవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ కూడా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కాని ఆ పార్టీ క్షీణ దశలో ఉన్నదని, 21వ శతాబ్దంలో కమ్యూనిస్టు పార్టీ ఆవశ్యకత తగ్గిపోతుండగా ఆర్ఎస్ఎస్ ఆవశ్యకత పెరిగిపోతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒక మెజారిటీ మతం ఆధారంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్‌ను ఒక రాజకీయ పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీతో పోల్చవచ్చా అన్న విషయాన్ని పక్కన పెడితే ఏ సంస్థ ప్రభావాన్ని అయినా అది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నది అన్న విషయం ఆధారంగా అంచనా వేయడం కష్టం. 11 సంవత్సరాల క్రితం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఆర్ఎస్ఎస్ విశేషంగా దోహదం చేసిందనడంలో సందేహం లేదు. అదే సమయంలో బీజేపీ అధికారంలో ఉన్నందువల్ల కూడా ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరిగిందన్న విషయంలో కూడా అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యున్నతికి ఆర్ఎస్ఎస్ కారణమైనందువల్ల మోదీ ప్రభుత్వం ఎదుర్కొనే ప్రశంసలనైనా, విమర్శలనైనా సంఘ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా చేయడం సరైంది కాదేమో? ఒక రకంగా రాజగురువు పాత్రను సంఘ్ పోషిస్తుండడమే అందుకు కారణం.


రాంమాధవ్ అన్నట్లు ఆర్ఎస్ఎస్ తనను తాను పరివర్తనం చేసుకుంటోంది. బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కూ పెద్ద తేడాలేని విధంగా ఈ మార్పు జరుగుతోంది. అనేకమంది బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాల్లో పాల్గొంటున్నారు. ఆర్ఎస్ఎస్‌ను ఒక ఎన్జీవోగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినప్పటికీ ప్రభుత్వంపై దాని ప్రభావాన్ని విస్మరించలేము. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు మారుమూల ప్రాంతాల్లో కూడా రాజకీయ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బూత్‌ స్థాయి మేనేజ్‌మెంట్ నుంచి బీజేపీ నేతల మధ్య విభేదాలు తొలగించేందుకు కూడా ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. వివిధ రాజకీయ పార్టీల మధ్య పొత్తులు సంఘ్ వల్లే ఏర్పడుతున్నాయి.

ఒకప్పుడు అగ్రవర్ణాల పార్టీగా, బ్రాహ్మణ–బనియా పార్టీగా మాత్రమే గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీ ఇవాళ దళితులు, ఆదివాసీలు, ఇతర అణగారిన వర్గాల్లో చొచ్చుకువెళ్లేందుకు సంఘ్ అనేక కార్యకలాపాలు నిర్వహించడమే ప్రధాన కారణం. ఉత్తర భారతదేశంలో కాన్షీరామ్ ప్రయోగం విఫలమయ్యాక దళితులను పెద్ద ఎత్తున తమ వైపునకు తిప్పుకునేందుకు చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్ యత్నిస్తోంది. కాన్షీరామ్ విమర్శించిన చెంచారాజ్ సంస్కృతే ప్రత్యామ్నాయ దళిత రాజకీయాలకు నష్టం చేకూరుస్తుందేమో? 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక దళిత ఓట్లు బీజేపీ సాధించేందుకు ఆర్ఎస్ఎస్ కారణం అనడంలో అతిశయోక్తి లేదు.

నిజానికి దళితులను హిందూత్వ వైపునకు మళ్లించడంలో ఆర్ఎస్ఎస్ రూపొందించిన భూమిక ఆధారంగానే బీజేపీ పనిచేస్తోంది. దళితులను రాజకీయంగా సమీకరించడంలో భాగంగా వారిలో వేర్వేరు సాంస్కృతిక వర్గాలను, స్థానిక ఆచారాలను, వారు ఆరాధించే సద్గురువులను హిందూత్వలో విలీనం చేసేందుకు సంఘ్ చాలా కాలంగా కృషి చేస్తోంది. ‘సామాజిక సమరసత మంచ్’ పేరుతో దళితుల్లో చొచ్చుకుపోయే ప్రయత్నం చేసింది. రవిదాస్‌, కబీర్, శివనారాయణ్ సందేశాలను స్వంతం చేసుకుంది. తమ సాధువులు, గురువులకు ఇస్తోన్న గౌరవాన్ని దళితులూ గుర్తించి సంఘ్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమానత్వం, గౌరవం కోసం దళితుల తపనను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. సుహుల్దేవ్, బల్దేవ్, దల్దేవ్ వంటి పాసీ హీరోల ఉత్సవాలను నిర్వహించారు. ఒకప్పుడు వారిని అగ్రవర్ణాలపై పోరాడిన శక్తులుగా కాన్షీరామ్ భావించారు. కాని వారిప్పుడు జాతీయవాద, హిందూత్వశక్తులుగా మారారు. అంతేకాక జాతవేతర దళితులు, యాదవేతర ఓబీసీల్లో కూడా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. గుజరాత్ నుంచి త్రిపుర వరకు ఆదివాసీలు, సంచార జాతుల్లో కూడా పనిచేస్తోంది. యూపీ, రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లు లభించేందుకు అదే కారణం. వారి చరిత్రను, గుర్తింపును, సాంస్కృతిక చిహ్నాలు, సంకేతాలను వేదాలు, పురాణాల్లో గాథలకు, వ్యక్తులకు ముడిపెట్టి దేశం జాతి ప్రయోజనాలు అన్న భావనను ప్రవేశపెట్టేందుకు సంఘ్ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు.


అగ్రవర్ణాలను బీజేపీ వైపు తిప్పుకోవడం పెద్ద కష్టం కాదు యూపీ, బిహార్‌లో దళితులు, ఓబీసీలను హిందూత్వ పరిధిలో ఇముడ్చుకోవడం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక సవాలుగా తీసుకున్నాయి. సోషలిస్టు రాజకీయాలు విఫలమయ్యాక వారి పని కొంత సులువైంది. షెడ్యూల్డు కులాలు, బీసీల ఓట్లను సమీకరించేందుకు ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్, సుహుల్దేవ్ భారతీయ సమాజ్ వంటి పార్టీలతోనూ, బిహార్ నితీశ్‌ కుమార్, రాంవిలాస్ పాశ్వాన్ వంటి వ్యక్తులతోనూ బీజేపీ పనిచేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రోద్బలమే కారణమని వేరే చెప్పనక్కర్లేదు. రాజ్యాంగాన్ని కూడా బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ గౌరవించే ప్రయత్నం చేస్తున్నాయి. ‘ఇది మన రాజ్యాంగం’ అని గోల్వాల్కర్ అన్న మాటల్ని రాంమాధవ్ గుర్తు చేశారు.

కాని ఈ మార్పు ప్రజల జీవితాల్లో, ఆలోచనా విధానంలో, ఎంత మేరకు మార్పు తీసుకువచ్చిందన్నదే ప్రధానం. సంఘ్ ఎంత ప్రయత్నించినా ప్రజల్లో కుల అస్తిత్వాలను చెరిపివేయడం అంత సులభం కాదని తెలుస్తోంది. తాను నిలబెట్టిన ప్రభుత్వంపై నైతిక ఆధిపత్యం చలాయించడం కూడా అంత సులభం కాదని స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా సామాజిక న్యాయం అజెండాగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు పనిచేస్తున్న విషయాన్ని విస్మరించలేము. గవాయ్‌పై దాడి, పూరన్ కుమార్ ఆత్మహత్య వంటి సంఘటనలు ప్రతిపక్షాల సామాజిక న్యాయ అజెండాకు తోడ్పడతాయనడంలో అతిశయోక్తి లేదు. కుల రాజకీయాలే ప్రధానమైన బిహార్ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో ఇప్పుడే చెప్పలేము కాని హిందూత్వ పరిధిలోకి అణగారిన వర్గాలను తీసుకువచ్చేందుకు ఆర్ఎస్ఎస్ చేసిన కష్టం వృథా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉన్నది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 01:44 AM