Share News

Bihars Politics Still Shaped: జేపీ లోహియా ప్రభావం కోల్పోని బిహార్

ABN , Publish Date - Nov 05 , 2025 | 03:39 AM

ఒకరు తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్ పూర్‌కు చెందిన బనియా. మరొకరు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌ల మధ్య ఉండే సితాబ్దియారాకు చెందిన కాయస్తుడు. ఇద్దరూ 20వ శతాబ్ది ప్రథమార్థంలో విదేశాలకు....

Bihars Politics Still Shaped: జేపీ లోహియా ప్రభావం కోల్పోని బిహార్

ఒకరు తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్ పూర్‌కు చెందిన బనియా. మరొకరు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌ల మధ్య ఉండే సితాబ్దియారాకు చెందిన కాయస్తుడు. ఇద్దరూ 20వ శతాబ్ది ప్రథమార్థంలో విదేశాలకు వెళ్లి చదువుకున్నారు. తిరిగి వచ్చి కాంగ్రెస్ గొడుగు క్రింద స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. జహహర్ లాల్ నెహ్రూ శిష్యులుగా కాంగ్రెస్‌లోని సోషలిస్టు శిబిరంలో కొనసాగారు. ఇరువురూ తర్వాత నెహ్రూకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఒకరు రామ్ మనోహర్ లోహియా, మరొకరు జయప్రకాశ్ నారాయణ్.

లోహియా జర్మనీలో చదువుకున్నారు. అమెరికాలోనూ, యూరప్‌లోనూ జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయ అధికారం, పాలనలో 60 శాతం వాటా కావాలని ఆయన అప్పుడే ప్రతిపాదించారు. పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించారు. మార్క్సిజమూ ఆయనకు నచ్చలేదు. దేశీయ సోషలిజాన్ని అన్వయించుకుని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం పోరాడారు. ప్రభుత్వాలు ప్రజలకు పాలకులుగా కాకుండా సేవకులుగా ఉండాలన్నారు. అధికార వికేంద్రీకరణ కోరుకున్నారు. ఇంగ్లీషును సామ్రాజ్యవాద భాషగా అభివర్ణించారు. గోవా విముక్తికై పోరాడి అరెస్టయ్యారు. సోషలిస్టు పార్టీ సభ్యుడిగా లోక్‌సభలో రైతుల సమస్యలపై గళమెత్తారు. కోట్లాది భారతీయులు కేవలం మూడణాల ఆదాయంపై జీవిస్తున్నారని ఎలుగెత్తారు. ఆయన కృషి వల్లే 1967లో ఏడు ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. జయప్రకాశ్ నారాయణ్ ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేశారు. మార్క్స్, ఎంగెల్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేసి కమ్యూనిస్టుగా మారారు. భార్య ప్రభావతి ప్రభావంతో గాంధేయవాదిగా మారి కాంగ్రెస్ కార్యకలాపాల్లొ పాలు పంచుకున్నారు. 1970లలో పోటెత్తిన కాంగ్రెస్ వ్యతిరేక ప్రభంజనంలో ఆయన కాంగ్రెసేతర శక్తులన్నిటికీ నాయకుడుగా మారి సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ అనంతరం తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆయన ఉద్యమ స్ఫూర్తి వల్లే సాధ్యమయింది.


లోహియా, జయప్రకాశ్ ఇరువురూ అధికారానికి వెంపర్లాడలేదు. ఎన్నడూ ఏ మంత్రి పదవినీ ఆశించలేదు. సోషలిస్టు సమాజ స్వప్నం నెరవేరకుండానే లోహియా 1967లో మరణించారు. తాను కారకుడైన కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం అధికార కుమ్ములాటల్లో కుప్పకూలిపోతుంటే జయప్రకాశ్‌ విషాదగ్రస్తుడై మరణించారు. బిహార్‌లోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ ఇవాళ వెనుకబడిన వర్గాల ప్రాబల్యం విస్మరించలేని స్థానంలో ఉండేందుకు లోహియా, జేపీ నిర్మించిన పునాదులే కారణం. లాలూప్రసాద్ యాదవ్, నితీశ్‌ కుమార్ ఆ మహానాయకుల ప్రభావంతో ఎదిగిన వారే. ఆ ఇరువురు లోహియా స్కూలులో చదువుకుని జేపీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ పొందారని సంకర్షణ్ ఠాకూర్ అనే సీనియర్ జర్నలిస్టు ‘బ్రదర్స్ బిహారీ’ అనే పుస్తకంలో రాశారు. దేశ రాజకీయాల్లో లాలూ, నితీశ్‌ నిర్వహించిన పాత్ర తక్కువేమీ కాదు. బిహార్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీసే క్రమంలో ఇరువురూ కీలకపాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలు తమ మద్దతు లేకుండా ఏర్పడని పరిస్థితి కల్పించారు. లాలూతో విభేదాల వల్ల నితీశ్‌ వేరుపడి బీజేపీతో చేతులు కలిపినప్పటికీ ఇరువురూ బిహార్ రాజకీయాల్లో ఇప్పటికీ తమ ప్రాబల్యం కోల్పోలేదు.

భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో నితీశ్‌ మద్దతుపై ఆధారపడి కొనసాగుతుండడమే కాక బిహార్‌లో ఆయన లేకుండా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నితీశ్ తన మనుగడ కోసం బిహార్‌లో బీజేపీ ప్రవేశానికి చేయూతనిస్తే, లాలూప్రసాద్ యాదవ్ బిహార్‌లో ఆ పార్టీ ప్రవేశాన్ని, ప్రభావాన్నీ అడ్డుకునేందుకు తీవ్ర యత్నం చేశారు. కేంద్రంలో పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం కొనసాగేందుకు దోహదం చేశారు. ఇప్పుడు తన కుమారుడు తేజస్వి వెనుక ఒక కొండలా నిలుచున్న లాలూ ప్రభావాన్ని తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు. ఒక రకంగా చెప్పాలంటే లాలూ, నితీశ్‌ ఇద్దరూ బిహార్‌లో వెనుకబడిన వర్గాలు రాజకీయ ప్రాభవం కోల్పోకుండా, జాతీయ పార్టీలు తమ మీద ఆధారపడి ఉండేందుకు కారణమవుతున్నారు. అంతే కాదు, ఎన్నికల అనంతరం ఆర్‌జేడీ, జేడీ(యు) చేతులు కలిపితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన పరిస్థితి దాదాపు ప్రతి ఎన్నికల ఫలితాల అనంతరం కనపడుతుంది. ఆ రకంగా లోహియా, జేపీల వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్లేనని అర్థమవుతోంది. నిజానికి వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే నితీశ్‌ను గుర్తించి ఆయనను ముఖ్యమంత్రిగా చేసేందుకు వీలు కల్పించారు. ఆ పరిస్థితి లాలూకు వీపీ సింగ్ హయాంలోనే లభించింది. 29వ ఏట లోక్‌సభ సభ్యుడైన అయిన లాలూ 42 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి అయ్యారు.


ఈ నేపథ్యంలో 2025 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను అర్థం చేసుకోవల్సి ఉంటుంది. నితీశ్‌, లాలూ పార్టీలు తమ ప్రాధాన్యాన్ని అదే విధంగా కొనసాగిస్తారా లేదా అన్నదే ఈ ఎన్నికల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 74 సంవత్సరాల నితీశ్‌ సంపూర్ణ ఆరోగ్యంతో లేకపోవచ్చు గానీ, ఆయన ప్రాధాన్యం కోల్పోయిన నాయకుడు ఎంతమాత్రం కాదు. మెజారిటీ పరిశీలకులు ఆయన ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత లేదని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు అత్యధిక సంఖ్యలో మద్దతునిస్తున్నారు. విద్యార్థినులకు సైకిల్ పంపిణీ పథకం ఆయనకు మంచి పేరు తెచ్చింది. నితీశ్ ఆరోగ్యం పట్ల ఏ వ్యతిరేక ప్రచారం జరిగినా, ఆయనను ఈ సారి బీజేపీ ముఖ్యమంత్రి చేయబోదన్న అభిప్రాయం వ్యాప్తి చెందినా అది ఆయన పట్ల సానుభూతికే దారితీస్తున్నదని ఒక అంచనా. ఏ విధంగానైనా తాను పోటీ చేసిన సీట్లలో కనీసం సగం సీట్లు, అంత కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే శక్తి నితీశ్‌కు ఉన్నదని చెప్పేందుకు ఆస్కారం ఉన్నది. ఇక ఆర్‌జేడీ పట్ల కూడా గడచిన రెండు ఎన్నికల్లో వ్యతిరేకత అంతగా కనపడలేదు. 2015లో 80, 2020లో 75 సీట్లు గెలుచుకున్న ఆర్‌జేడీ అన్ని పార్టీల కంటే ముందంజలోనే ఉన్నది. ఈ సారి కూడా దాదాపు అన్నే సీట్లు, లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. పైగా గతంలో కంటే ఇప్పుడు తేజస్వి ప్రాబల్యం, ఆదరణ పెరిగిందని పార్టీ వర్గాల భావిస్తున్నాయి. ఈ రీత్యా ఇప్పుడు కూడా అసెంబ్లీలో మెజారిటీ సీట్లు జేడీ(యు), ఆర్‌జేడీలే గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే బిహార్‌లో ఈ ఎన్నికల్లో కూడా వెనుకబడిన వర్గాల ప్రాధాన్యత పెద్దగా తగ్గకపోవచ్చు. అయితే లాలూ, నితీశ్‌ పార్టీలలో దేనికి ఎక్కువ సీట్లు లభిస్తాయన్నదే కోటి రూకల ప్రశ్న.

ఈ ఎన్నికల్లో బిహార్‌లోని 243 సీట్లలో బీజేపీ 101 సీట్లకు, కాంగ్రెస్ 61 సీట్లకు మాత్రమే పోటీ చేస్తున్నాయి. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రాధాన్యత ఎంత మేరకు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన లక్ష్యం బిహార్‌లో బీజేపీ పోటీ చేసిన సీట్లలో మెజారిటీ సీట్లు సాధించడమే. జేడీ(యు), ఆర్‌జేడీలు సాధించిన వాటి కంటే ఎక్కువ సీట్లు సాధించి ప్రథమ స్థానం సాధించేందుకు బిహార్‌లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీని 74 సీట్లతో తన లక్ష్యానికి దాదాపు చేరువలోకి తీసుకువచ్చేందుకు కారకుడయ్యారు. ఇప్పుడు బిహారీ ప్రజలు బీజేపీని ఎంతవరకు ఆదరిస్తారనే విషయమై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అక్కడ బీజేపీని గెలిపించేందుకు పలుకుబడి గల స్థానిక నాయకుడు ఎవరూ లేరు. ప్రతి సీటులోను బీజేపీ గెలుపు మోదీపైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర అధికార యంత్రాంగం ఆయనకు అండగా ఉన్నది. 2020 ఎన్నికల్లో దాదాపు 52 సీట్లు కేవలం వేయి ఓట్ల తేడాతో నిర్ణయమయ్యాయి. వీటిలో అత్యధిక సీట్లు ఎన్డీఏ కూటమికి చెందినవే. అంతేకాక ఈ సారి దాదాపు 15 సీట్లలో స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయి. వీరిలో అన్ని పార్టీలకు చెందిన తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించవచ్చు.


కాంగ్రెస్ 61 సీట్లకు పోటీ చేస్తున్నప్పటికీ దాదాపు 9 సీట్లలో స్నేహపూర్వక పోటీ జరుగుతున్నందువల్ల 52 సీట్లలోనే పోటీ చేస్తున్నట్లు లెక్క. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ సభలకు జనం హాజరవుతున్నప్పటికీ వాటిని ఓట్లుగా మార్చే యంత్రాంగం కాంగ్రెస్‌కు లేదనే చెప్పుకోవాలి. దళితుడిని బిహార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిని చేయడం ద్వారా దళిత ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేశామని, ముస్లింల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు బలమైన ప్రయత్నాలు చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందువల్ల ఈ సారి సగం సీట్లయినా కాంగ్రెస్ గెలుచుకోగలిగితేనే ఆ పార్టీ తన ప్రభావం నిలుపుకోగలుగుతుంది. విచిత్రమేమంటే మొదటి దశ పోలింగ్‌కు ప్రచార ఘట్టం ముగిసినప్పటికీ మహాఘట్‌బంధన్, ఎన్డీఏల మధ్య గట్టి పోటీ కొనసాగుతోందని. ప్రజలు ఎటు వైపు మొగ్గుతున్నారో తేలని పరిస్థితి ఉన్నదని నివేదికలు చెబుతున్నాయి. మధుబనిలో మోదీ కండువా ఊపినా, బెగుసరాయ్ చెరువులో రాహుల్‌ దూకినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిపి వంద సీట్లు దాటుతాయో లేదో చెప్పలేని పరిస్థితి. సిద్ధాంతాలకు అతీతంగా వెనుకబడిన, మైనారిటీ వర్గాల మనసుల్లో ఆలోచనలను ప్రతిఫలింపజేసే ఏకైక రాష్ట్రం బిహార్. ఆ ఘనత లోహియా, జేపీలకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి...

రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్‌ ప్రజాదర్బార్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 03:39 AM