కాలం కడలిలో ఒప్పంద కార్మిక స్త్రీలు
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:18 AM
‘ఎక్కడికి పోవాలో తెలియక ఫిజీకి వెళ్లారు. ఎన్నో మూగజీవాల మాదిరిగా వారిని తోటలకు కేటాయించారు. ఇచ్చిన పని సంతృప్తికరంగా చేయకపోతే, వారిని తిట్టడం, కొట్టడం, జరిమానా...

‘ఎక్కడికి పోవాలో తెలియక ఫిజీకి వెళ్లారు. ఎన్నో మూగజీవాల మాదిరిగా వారిని తోటలకు కేటాయించారు. ఇచ్చిన పని సంతృప్తికరంగా చేయకపోతే, వారిని తిట్టడం, కొట్టడం, జరిమానా వేయడం, జైలుకు పంపడం జరుగుతోంది. తోటల జీవితం వారి ప్రవర్తనను వారి ఆకారాల్ని సైతం మారుస్తోంది. కొందరు నలిగిపోయి, పగిలిన హృదయంతో, మరికొందరు నీరసంగా, మరికొందరు కఠినంగా చెడుగా తయారవుతున్నారు. ఒప్పంద స్త్రీలు వారి పని ముగించుకొని తిరిగి వెళ్తున్నప్పుడు, మొదటిసారి నేను చూసిన దృశ్యాన్ని ఎన్నటికీ మరచిపోలేను. ఆ స్త్రీల ముఖాలు నన్ను వెంటాడుతున్నాయి’ అని మెథడిస్ట్ మిషనరీ హన్నా డడ్లీ బాధపడ్డారు.
బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రలో బానిసత్వం ఏదో ఒక రూపంలో ఎక్కువ భాగం ఆఫ్రికా, కరేబియన్ దేశాలలోనే కొనసాగింది. అది ఒక సంస్థగా 1572–1834ల మధ్య, దాదాపు రెండున్నర శతాబ్దాలు నడిచింది. బానిసత్వం రద్దయాక దాదాపు 80 సంవత్సరాలు 1838–1917ల మధ్య, బ్రిటిష్ ప్రభుత్వ సమయంలో, ప్రపంచంలో 20 దేశాలకు, 13 లక్షల మంది ఒప్పంద కార్మికులుగా మనదేశం నుంచే పంపించబడ్డారు. ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారిలో పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ ఉన్నారు. వారందరూ కనీసం అయిదేళ్లు అక్కడ చెరకు తోటల్లో పని చేసేందుకు ఒప్పందం మీద వెళ్లినవారు. సాధారణంగా తమ ఒప్పందాలను పూర్తి చేసి తిరిగి వెళ్లే ఒంటరి పురుషులనే తోటల యజమానులు, వ్యవసాయ కార్మికులుగా ఇష్టపడ్డారు. మొత్తం కుటుంబాల నియామకాలను కూడా వారు వ్యతిరేకించారు. మహిళా ఒప్పంద కార్మికులకు వ్యతిరేకంగా ఉండేవారు. ప్రధానంగా శారీరకంగా బలమైన స్త్రీ కార్మికుల కోసమే వెతికేవారు. తొలి రోజుల్లో కారణాలు ఏమైనప్పటికీ, కార్మికులుగా మహిళలు ఎంత ఉపయోగకరంగా ఉంటారనే దాని గురించి యజమానులు ఆందోళన చెందారు. వారి పనుల దృష్ట్యా, స్త్రీని ఒక ప్రమాదకారిగా కూడా భావించారు. ఎందుకంటే గర్భం, పిల్లలను కనడం మూలాన, తక్కువ ఉత్పాదకతకు వారు కారణం అవుతారని. అయినా కార్మిక శక్తిని ‘స్థిరపరచడానికి’ వారికి స్త్రీ అవసరం అయింది. ఏది ఏమైనా స్త్రీలు ఎవరైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వారికి కావలసింది ఉత్పాదక కార్మికులు మాత్రమే.
ఒప్పంద కార్మికులందరిలోనూ స్త్రీల పాత్ర, ఎక్కువైనది ముఖ్యమైనది కూడానూ. ఉద్యోగిగా, భార్యగా, తల్లిగా, లేదా ఒంటరి మహిళగా, తోటలలో పని చేయడంతో పాటు ఇంటిపని కూడా చేసుకోవాలి. రోజంతా, అలా వారికి రెట్టింపు పని. అంతే కాకుండా తెలియని ప్రదేశంలో, కొత్త వాతావరణంలో, ఇంతకు ముందెన్నడూ తెలియని ఇతర ఒత్తిడులనూ అనుభవించాలి. ఒప్పంద కార్మికులలో చాలా మంది ఒంటరి మహిళలు, యువ వితంతువులు, యుక్తవయస్సులో ఉన్న బాలికలు, ఇతర నిరాశ్రయులైన మహిళలు వారి కుటుంబాలచేత విడిచిపెట్టబడ్డ వారు, లేదా వివిధ కారణాలతో వారే కుటుంబాల నుండి దూరమైనవారు. సాధారణంగా సామాజికంగా పితృస్వామ్య కట్టుబాట్ల మూలాన విడదీయబడ్డవారే అందులో ఎక్కువ. వారు ఒప్పంద మార్గాన్ని ఎంచుకున్నందుకు వివిధ కారణాలు ఉన్నాయి. కొంతమంది స్త్రీలకు, అది కొత్త జన్మ, కొత్త గుర్తింపును కోరుకునే ప్రయత్నం. ఇక్కడి వింత మనుషుల ప్రపంచం నుండి తప్పించుకునే మార్గం. వితంతువులు సతి నుండి తప్పించుకున్నారు, మరికొందరు బలవంతపు వివాహాల నుండి తప్పించుకున్నారు. సాంస్కృతిక అణచివేత, పితృస్వామ్యం, కుల ఆధారిత సమాజపు కట్టుబాట్ల నుండి తప్పించుకోవడానికి, భారతీయ స్త్రీలు మెరుగైన జీవితపు ఆశతో ఒప్పందాన్ని ఎన్నుకున్నారు. అయితే అది ఎవరికీ తెలియకుండా జరిగిన వ్యవహారం.
దేశాంతర గమన డిపోలకు చేరిన దగ్గరనుంచి, ఇరుకైన చెక్క ఓడలలో ప్రయాణం మొదలుకొని, చేరినచోటవరకూ మహిళలు ఊహించలేని కష్టాలు, వేధింపులు సవాళ్లను ఎదుర్కొన్నారు భరించారు. చాలా మందికి, కాలా పానీగా పిలుచుకున్న పిచ్చి సముద్రమే వారు చూసిన మొదటి దృశ్యం. ఓడ కెప్టెన్, ఓడలో వైద్యుడు లేదా సిబ్బంది భారతీయులను దుర్భాషలాడడం అవమానించడం లాంటి అనేక ఉదంతాలు వెలుగుచూసాయి. మహిళలు, ముఖ్యంగా ఒంటరి మహిళలు, ఎలాంటి అవకాశం వారు తీసుకుంటారోనన్న భయంతో పయనించేవారు. ఓడ అధికారులు కోరిన ఒక నిర్దిష్ట పనిని నిర్వహించడానికి నిరాకరించినందుకు గొలుసులతో బంధించబడిన ఒక మహిళ గొలుసుల నుంచి బయటపడ్డాక సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. చాలా మంది యువతులు ఓడలో అలా అమానవీయమైన ప్రవర్తన, చిత్రహింసలు భరించలేక సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మంచి భవిష్యత్తు కోసం వెతుకుతున్న ఆ యువతుల జీవితాలు క్రూరంగా ఆగిపోవడమే కాదు, అది ఒక దారుణమైన విషయంగా వారు చరిత్ర పుస్తకాల నుండి కూడా అదృశ్యమయ్యారు. వలస అధికారుల మనస్సులో, ఒప్పంద కార్మికులు ప్రత్యేకించి స్త్రీలు, కేవలం సరకులు లేదా వస్తువులు, సంఖ్యలుగా పరిగణించబడ్డారు తప్ప మానవులుగా కాదు. వారి దుర్బలత్వం తీవ్రంగా దుర్వినియోగమయింది. అలాంటి దాడులకు వ్యతిరేకంగా ఎలాంటి రక్షణా వారికి లేకుండా పోయింది.
ఒప్పంద కార్మికులుగా చేరిన ప్రదేశంలో, జాత్యహంకారంతో పాటు స్త్రీవివక్షను కూడా స్త్రీలు భరించారు. స్త్రీల కొరత మూలంగా అనధికారిక బహుభార్యత్వ వ్యవస్థ, సాంప్రదాయ విలువలను సవాలు చేసి, మహిళలకు తప్పించుకోలేని పోటీని, తోటల పనులలో చాలా బలంగా అక్కడ ఉండింది. కానీ భార్య వైవాహిక విశ్వసనీయత ఆమె భర్తకు తప్పనిసరి కావడం, ఒక భార్య వ్యభిచారం చేసినట్లు అనుమానించినట్లయితే, అది క్రూరమైన పరిణామాలకు దారి తీసేది. తోటలలో పని చేసే పురుషుల అనాగరిక, రక్త దాహంతో కూడిన స్వభావానికి రుజువుగా ‘భార్య’ హత్యలతో, మహిళలు ‘బహుళ అణచివేతలకు’ గురయ్యారు. ‘లైంగిక దోపిడీకి, అతి దోపిడీకి, స్వేచ్ఛ నిరాకరణ’కు, ఒప్పంద వ్యవస్థలో మహిళలు, విస్తృత స్థాయిలో బాధితులయారు. తోటల్లో పరిస్థితులు, స్త్రీలను పురుషుల మీద ఆధారపడేలా చేసాయి.
మహిళా కార్మికులు తోట యజమానుల దోపిడీకీ సైతం గురయ్యారు. నివసించడానికి వారికి సరైన స్థలాలు లేవు. గర్భధారణ సమయంలో ఎటువంటి సెలవులూ లేవు. వారు పురుషుల గుడిసెలలో ఉండాలి లేదా వారి జీవన భాగస్వాములను మార్చుకోవాలి. అనేక సందర్భాల్లో వారు పునరుత్పత్తి రూపాలుగా భావించబడ్డారు. ఫిజీ, సురినామ్ మొదలైన దేశాల్లో కార్మికులు లైంగిక అసూయతో హత్యలు, భార్యను నరకడం, ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి కారణాలను చూపించిన సందర్భాలు అనేకం. చాలా అత్యాచారాలు, ఇతర రకాల లైంగిక బలవంతాలు జరుగుతున్నాయనే వాస్తవాన్ని, తోటల యజమానులు ఎన్నడూ అంగీకరించలేదు.
మహిళలు చెరకు పొలాల్లో లేదా యూరోపియన్లకు గృహ కార్మికులుగా ఎక్కువ గంటలు పనిచేసేవారు. రోజుకు తొమ్మిది గంటలు ఉండాల్సిన వారి పని, రోజుకు పదమూడు గంటలకు పొడిగించారు. ముఖ్యంగా మహిళల పట్ల వారు కఠినంగా వ్యవహరించేవారు. చాలా మంది క్రైస్తవ మిషనరీలు, పగటి నుండి చీకటి పడే వరకు ఎక్కువ గంటలు చెరకు పొలాల్లో మహిళలు పని చేయడాన్ని తరచుగా ఖండిస్తూనే ఉండేవారు. పాలిచ్చే పిల్లలతో ఉన్నవారు 11 గంటల పాటు పొలాల్లో ఉంటున్నారని ఆధారాలు సమర్పించారు. స్త్రీలు ఎక్కువగా పని చేయలేరు అని వాదించినా, చెరకు పొలాల్లో ఎక్కువ గంటలు పని చేయడం, కలుపు తీయడం వల్ల వారిమీద హానికరమైన ప్రభావాన్ని కొందరు తప్పించుకోలేకపోయారు. అయినా అవేవీ యజమానుల మీద పనిచేసేవి కావు.
గర్భిణీ స్త్రీలు ఏడు నెలల పాటు పని చేయడం కొనసాగించారు. ఆ తర్వాత మళ్లీ పనిని ప్రారంభించే వరకూ వారి రేషన్ నిలిపివేసేవారు. పని చేయలేని లేదా అనారోగ్యంతో ఉన్నవారికి కూడా రేషన్ నిరాకరించారు. సామాజిక–ఆర్థిక పరిస్థితులు కుటుంబ జీవితాన్ని అనిశ్చితంగా మార్చేవి. మహిళలు తరచుగా అన్నింటికీ బాధ్యులయేవారు. తమ పిల్లలకు ఆహారం అందించడంలో నిరంతరం కష్టాలను వారు ఎదుర్కొనేవారు. రక్షణ కోసమో, జీవనాన్ని సాగించుకునేందుకో స్త్రీలు, కొన్నిసార్లు పురుషులకు దగ్గర కావల్సి వచ్చేది. బతకడానికి తీరని లోటుతో ప్రవర్తించిన అలాంటి స్త్రీలను పురుషులు ‘రైస్–కుక్కర్లు’ అని పేరు పెట్టారు. చెరకు తోటలలో పనిచేయడానికి, స్త్రీలకు అవకాశాలు ఉన్నప్పటికీ, చెరకు పరిశ్రమ బయట, మగవారికి ఉన్నన్ని అవకాశాలు స్త్రీలకు లేవు. 1880లలో స్త్రీలు నానీలుగా, టాయిలెట్లను శుభ్రం చేసేవారిగా, ఇంటి పనుల కోసం నియమించబడ్డారు. దారుణమైన పరిస్థితుల్లో భారతీయ స్త్రీలు జీవించారు. వారి వేతనాలు తక్కువగా ఉండేవి, కొన్నిసార్లు చెల్లించబడేవే కావు. ఆ ఇంటి యజమానులు వారిని బానిసలుగా చూసేవారు.
ఒప్పందానికి సంబంధించిన రెండు అత్యంత మొండి సమస్యలకు మహిళలు బాధ్యత వహించారు. ఒకటి హృదయాన్ని కదిలించే అధిక శిశుమరణాలు, ముఖ్యంగా 1890లలో, దాదాపు నాలుగింట ఒక వంతు మంది పిల్లలు, పుట్టిన మొదటి సంవత్సరంలోనే మరణించారు. అధికారులు దానికి భారతీయ తల్లుల మీదే నిందలు వేశారు. వారి చెడునడవడిక, ప్రబలమైన వ్యభిచారం, పేలవమైన పరిశుభ్రత కారణంగా ‘మాతృ ప్రవృత్తి’ లోపించిందని వారు ఆరోపించారు. కఠినమైన తోటల పెంపకంలోని దినచర్యే ఈ విపత్తుకు కారణమని మరి కొందరు అన్నారు. అనేక సందర్భాల్లో సౌకర్యమైన వసతే కాదు, స్నాన సదుపాయాలు కూడా ఉండేవి కాదు. ఒప్పంద కార్మికులు బహిరంగ స్నానం చేయవలసి వచ్చేది. కనీస వసతిలేని సౌకర్యాలులేని మురికివాడల్లో గుడిసెల్లాంటి ఇళ్లల్లో పిల్లల పెంపకం, స్త్రీలు ప్రసవించిన వెంటనే తిరిగి పొలాల్లోకి పనికి వెళ్లాలని ఒత్తిడి చేయడం, కొంకిపురుగు విరేచనాలు, రక్తహీనత వంటి బలహీనపరిచే అంటు వ్యాధుల ప్రాబల్యం మూలంగా చాలా మంది తల్లులు, పిల్లలతో సహా భారీ సంఖ్యలో మరణించేవారు. తోటల మీద మానవ జీవితాలను అత్యధికంగా ఈ వ్యాధులు బలి తీసుకునేవి. భారతీయ స్త్రీలు స్వదేశానికి తిరిగి వచ్చి ఉంటే, వారు వెళ్ళే ముందు అనుభవించిన కళంకం, అణచివేత, కష్టాలూ మరింత ఎక్కువ అయి ఉండేవి. ‘అనాగరిక పర్యాటకుల్లా లేదా యాత్రికుల్లా’ ఒప్పంద వలస స్త్రీ కార్మికుల కథలూ వారూ మరుగున పడిపోయారు.
ముకుంద రామారావు
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..