Share News

Hyderabad Birth Musi Floods: మూసీ వరదల సృష్టే హైదరాబాద్

ABN , Publish Date - Sep 28 , 2025 | 03:44 AM

హైదరాబాద్ నగర నిర్మాణానికి ప్రధాన కారణం దాని నిర్మాత ముహమ్మద్ కులీ కుతుబ్‌షాకు తన ప్రియురాలు భాగమతిపై ఉన్న ప్రేమ అనుకుంటారు చాలామంది. కానీ అసలు కారణం వర్షాలు–వరదలు, వాటి వల్ల పేట్రేగిన...

Hyderabad Birth Musi Floods: మూసీ వరదల సృష్టే హైదరాబాద్

హైదరాబాద్ నగర నిర్మాణానికి ప్రధాన కారణం దాని నిర్మాత ముహమ్మద్ కులీ కుతుబ్‌షాకు తన ప్రియురాలు భాగమతిపై ఉన్న ప్రేమ అనుకుంటారు చాలామంది. కానీ అసలు కారణం వర్షాలు–వరదలు, వాటి వల్ల పేట్రేగిన ప్లేగు మహమ్మారి బారి నుంచి తన ప్రజలను రక్షించుకోవాలనే రాజకాంక్ష. ప్రస్తుతం మూసీ నది మహానగరాన్ని ముంచెత్తుతున్న నేపథ్యంలో ఒకసారి గతాన్ని గుర్తుచేసుకుందాం.

హైదరాబాద్ నగర నిర్మాణ చిహ్నమైన చార్మినార్‌కు ముహమ్మద్ కులీ కుతుబ్‌షా శంకుస్థాపన చేసిన 19 అక్టోబర్ 1591కి కొన్ని నెలల ముందు ఎడతెరిపి లేని వర్షాలు కురిసి గోల్కొండ కోటలోనూ, మూసీ నదీ తీర ప్రాంతాల్లోనూ గత్తర్ (ప్లేగు) ప్రబలి వందలాదిమంది బలి అయ్యారు. అప్పటికే గోల్కొండ అధిక జనాభాతో కిటకిటలాడుతూ, కొత్త నగరం నిర్మాణం గురించి పాలకులు ఆలోచిస్తున్న కాలం అది. మూసీ నది ఒడ్డున ఉన్న చిచిలం (చిన్న శ్రీశైలం) గ్రామస్థులు నాలుగుదారుల కూడలిలో ఒక తాజియా (మహ్మద్ ప్రవక్త మనుమడు హుసైన్‌కు సంబంధించిన సమాధి ప్రతిరూపం) ప్రతిష్ఠించి మహమ్మారి బారి నుంచి తమ ప్రాణాలను కాపాడమని ప్రార్థించారు. ఆ సందర్భంలో గోల్కొండ రాజ్య సుల్తాన్ కులీ కుతుబ్‌షా కూడా నేలమీద మోకరిల్లి అల్లాను దయతో తన ప్రజల ప్రాణాలను కాపాడమని ప్రార్థించాడు. ప్లేగు వ్యాప్తి తగ్గిపోతే ‘‘ఈ ప్రదేశంలో ఒక మహత్తరమైన స్మారక చిహ్నం నిర్మిస్తాను. దానివల్ల సమస్త ప్రజలు నీ అద్భుత శక్తిని, అపార కరుణను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారు’’ అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే వర్షాలు తగ్గిపోయాయి, ప్లేగు ఉపశమించింది.

కృతజ్ఞతగా కులీ కుతుబ్‌షా చార్‌మినార్‌ నిర్మాణాన్ని నగరంలోని నాలుగు దిక్కులను సూచించేదిగా, నగర మధ్య కట్టడంగా మొదలుపెట్టాడు. ప్లేగుపై విజయానికి గుర్తు కాబట్టి ఈ స్మారకంలో ఒక గవాక్షంపై ఎలుక సహజ శత్రువైన పిల్లి విజయదరహాస రూపం చెక్కించారు. అదే పిల్లి జాతికి చెంది, కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మనుగడ సాగించిన ఈహా మృగం (శిర్దాల్) అనే ఊహాజంతువు రూపాలను మరి కొన్ని గవాక్షాలపై సింహం శరీరంతో, పక్షి ముక్కుతో చెక్కించారు.. చార్మినార్, దాని చుట్టూ ప్రపంచ ప్రసిద్ధమైన నగరం క్రీ.శ. 1597లో అందుబాటులోకి వచ్చాయి.


చార్మినార్ పైకి మెట్ల దారి ద్వారా వెళ్తే ఒక చిన్న మసీదును చేరుకోవచ్చు. ఆ మసీదులోని మిహ్రాబ్ (ప్రార్థనా గవాక్షం) వద్ద అంతకు ముందు వరకూ సంప్రదాయంగా ఉన్న వెలుగుతున్న జ్యోతి ప్రతీక స్థానంలో ఒక అందమైన గులాబీ పువ్వు చెక్కించారు. దీనినే కులీ కుతుబ్‌షాకు తన ప్రియురాలు భాగమతిపై ఉన్న ప్రేమకు చిహ్నమని చెప్తుంటారు. నిజమేనేమో! ఎందుకంటే, ముహమ్మద్ కులీ తన పద్యాలలో ఆమెను తెలంగన్ అని, భాగ్మతి అని, హైదర్ పియారి అని సంబోధించాడు. చార్మినార్‌ నిర్మించిన ప్రాంతంలో ఉన్న చిచిలం గ్రామస్థురాలు ఆమె. కులీ మనుమడు అబ్దుల్లా కుతుబ్‌షా రాజస్థాన చిత్రలేఖకుడు క్రీ.శ. 1650లో గీసిన చిత్రంలో కూడా చిచిలం ప్రాంతంలో పారే మూసీ నది, దాని ఒడ్డున చిన్న శ్రీశైలం గుడి కనిపిస్తాయి. నగరం నిర్మాణం పూర్తయిన తర్వాత కులీ కుతుబ్‌షా ఇలా ప్రార్థించాడట– ‘‘ఓ గొప్ప శ్రోతా! నా ప్రార్థన విను. సముద్రాన్ని చేపలతో నింపినట్టు నా నగరాన్ని ప్రజలతో నింపు’’. ఈ కొత్త నగరానికి కోటగోడలు లేవు. క్రీ.శ. 1590లలో చిన్న చిన్న సుల్తానులు పోటీలు పడుతూ పరస్పర దాడులు చేసుకుంటున్న కాలంలో ఇలాంటి రక్షణగోడలు లేని నగరం రూపకల్పన జరగడం ఒక విప్లవాత్మక ప్రయోగం.

స్వతంత్రంగా నిలిచిన నాలుగు గవాక్షా (ఆర్చ్)లతో నిర్మితమైన విశాలమైన చార్మినార్, మూసీ నదిపై నిర్మించిన రాతి వంతెన– ఆ నాటి గోల్కొండ రాజ్యశక్తిని ప్రతిబింబిస్తాయి. ఈ నగర నిర్మాణం పూర్తయిన 60 సంవత్సరాలకు నగరానికి వచ్చిన ప్రసిద్ధ యూరోపియన్ ప్రయాణికుడు జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ మూసీ నదిపై ఉన్న రాతి వంతెనను (ఈనాటి పురానాపూల్) పారిస్‌లోని సీన్ నదిపై ఉన్న వంతెనతో పోల్చాడు. అతని సహచరుడు థెవెనాట్ కూడా పారిస్‌లోని లూవ్ర్ రాజసౌధం ముందు ప్రవహించే సీన్ నదిలా మూసీ ఎంతో అందంగా ఉందని ప్రశంసించాడు.


హైదరాబాద్‌ నగరం పుట్టుకకు హేతువు వర్షాలు–వరదల నుంచి ప్రజల రక్షణ అనే సంక్షేమ కాంక్ష. మరో 311 సంవత్సరాల తర్వాత 1908లో హైదరాబాద్‌లో మళ్ళీ ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మూసీ ఉప్పొంగి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, ఆరవ నిజాం మహబూబ్ అలీ మూసీకి బోనాలెత్తగా వరదలు తగ్గిపోవడం, అనంతరం ఆయన వారసుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో మూసీ, ఈసీ నదులపై ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ డ్యామ్‌లను కట్టి, వరదలను అరికట్టడమే కాకుండా హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడం గమనార్హం. అప్పుడు హైదరాబాద్ నగరంలో కట్టిన భూగర్భ డ్రైనేజీలు, మూసీ ఇరువైపుల కరకట్టలను ఇప్పటికీ చూడవచ్చు. అలా హైదరాబాద్ నగరం మూసీనది వరదలను అరికట్టడంతోనే పుట్టి వృద్ధి చెందింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళన, దాని చుట్టూ పర్యాటకవృద్ధి ప్రణాళికలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనుకుంటుండడం గమనార్హం.

ద్యావనపల్లి సత్యనారాయణ

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 28 , 2025 | 03:45 AM