Gratitude to CM Nara Chandrababu Naidu: వర్గీకరణ చేసినందుకు వందనాలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:48 AM
ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ మాదిగల, ఎస్సీ చిన్న కులాల చిరకాల ఆకాంక్ష. ఈ కోర్కె ద్వారా ప్రతి ఎస్సీ కులానికీ విద్య, ఉద్యోగ అవకాశాల్లో పంపిణీ న్యాయం కల్పించుకోవడానికి మేము సుదీర్ఘ, చారిత్రక ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాం...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి...
ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ మాదిగల, ఎస్సీ చిన్న కులాల చిరకాల ఆకాంక్ష. ఈ కోర్కె ద్వారా ప్రతి ఎస్సీ కులానికీ విద్య, ఉద్యోగ అవకాశాల్లో పంపిణీ న్యాయం కల్పించుకోవడానికి మేము సుదీర్ఘ, చారిత్రక ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాం. వేలాది మంది కార్యకర్తలు లక్షలాదిమంది మాదిగ ప్రజలను కదిలించారు. దశాబ్దాలుగా సాగిన మాదిగ దండోరా ఉద్యమంలో పది మందికి పైగా కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. వేలాదిమంది కార్యకర్తలు కేసులపాలయ్యారు. మా ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రతీ దశలోనూ సానుకూలంగా స్పందించింది. ప్రత్యేకించి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 1996లోనే, వర్గీకరణకు మద్దతుగా రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయించారు. జస్టిస్ రామచంద్రరాజు విచారణ కమిషన్‌ను 1997లో నియమించారు. ఈ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా 1997 జూన్ 6, 7 తేదీలలో వర్గీకరణ కోసం 68, 69 జీవోలను నాటి మీ ముఖ్యమంత్రిత్వాన గల తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోలను రక్షించుకోవడానికి నాటి మీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా సంతోషంగా గుర్తు చేసుకుంటున్నాం. 1999 నవంబర్‌లో నాటి మీ టీడీపీ ప్రభుత్వం వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడమే గాక, 2000 సంవత్సరం ఏప్రిల్‌లో అసెంబ్లీలో వర్గీకరణకు ఏకగ్రీవ చట్టం కూడా మీరు చేయించారు.
వర్గీకరణ వ్యతిరేకులు కల్పించిన అనేక అవాంతరాలను ఎదుర్కొని, 2024 సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును మీ ప్రభుత్వం సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా తీసుకున్నది. వర్గీకరణ అంశంపై పరిశీలనకు మీరు రాజీవ్ రంజన్ మిశ్రా విచారణ కమిషన్‌ను నియమించారు. గత ఏప్రిల్‌లో మీ ప్రభుత్వం వర్గీకరణకు ఆర్డినెన్సు విడుదల చెయ్యడం ఎంతో సంతోషకరమైన విషయం. సెప్టెంబర్ 23న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టించి, ఏకగ్రీవంగా చట్టం చేయించినందుకు గాను ఏపీ సీఎం అయిన మీకు రాష్ట్రంలోని యావత్ మాదిగల పక్షంగా, ఎస్సీ చిన్న కులాల పక్షంగా ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
కృపాకర్ మాదిగ,
వ్యవస్థాపక కార్యదర్శి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News