Share News

Renewables Poised to Surpass Coal: ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటి

ABN , Publish Date - Oct 24 , 2025 | 02:17 AM

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో ఏకైక నిశ్చయత అనిశ్చితి మాత్రమే! వాతావరణ మార్పును ఎదుర్కోవాల్సిన పద్ధతులపై ఎడతెగని మథనం జరుగుతోంది. అంతిమంగా ఏ భావాలు, పద్ధతులు...

Renewables Poised to Surpass Coal: ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటి

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో ఏకైక నిశ్చయత అనిశ్చితి మాత్రమే! వాతావరణ మార్పును ఎదుర్కోవాల్సిన పద్ధతులపై ఎడతెగని మథనం జరుగుతోంది. అంతిమంగా ఏ భావాలు, పద్ధతులు విజయం పొందుతాయన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయి విషయమై ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించిన విషయాన్ని పరిశీలనలోకి తీసుకోండి. అది, 2023లో 420.4 పీపీఎమ్‌ నుంచి 2024లో 423.9 పీపీఎమ్‌కు పెరిగింది. ఈ పెరుగుదల పూర్వపు పెరుగుదలలు అన్నిటికంటే అధికంగా ఉన్నదని ఆ ప్రపంచ సంస్థ పేర్కొంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రమవుతాయని, ప్రాకృతిక విపత్తుల సంభవత అధికమవుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ వాతావరణ మార్పును నిరోధించేందుకు తక్షణమే తగు చర్యలు చేపట్టడంలో తీవ్ర తాత్సారం జరుగుతోంది. ఈ తిరోగమన పోకడల్లో అనేక దేశాలు పోటీపడుతున్నాయి! కాలుష్యకారక వాయు ఉద్గారాలను తగ్గించే సాంకేతికతలు, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకోవడాన్ని ముమ్మరం చేసేందుకు ప్రపంచ దేశాలు సంశయిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో వాతావరణ మార్పునరికట్టే చర్యల తక్షణ ఆవశ్యకత లేక ఆర్థిక ప్రయోజనాలే పరమ లక్ష్యంగా ఉన్న క్రియాశూన్యతలో ఏది అంతిమంగా ప్రాధాన్యం పొందుతుందనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.

ఈ శోచనీయ పరిస్థితుల్లో ఒక శుభ పరిణామమూ చోటుచేసుకున్నది. ఈ ఏడాది ప్రథమార్థంలో పునరుత్పాదక ఇంధన వనరులు మొదటిసారిగా బొగ్గును అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విద్యుదుత్పాదనకు అతిపెద్ద వనరుగా మారాయి. 2025 మొదటి ఆరునెలల్లో పునరుత్పాదక ఇంధన వనరులు 5072 టీడబ్ల్యూహెచ్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా, శిలాజ ఇంధనమైన బొగ్గు 4896 టీడబ్ల్యూహెచ్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసిందని నిపుణ ఆలోచనాశీలుర బృందం (థింక్‌ ట్యాంక్‌) ‘Ember’ నివేదిక ‘Global Electricity MidYear Insights–2025’ వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుదుత్పాదనలో అగ్రగామిగా ఉన్న చైనాయే బొగ్గు ఆధారిత కొత్త థర్మల్‌ విద్యుదుత్పాదన కేంద్రాల నిర్మాణంలో చురుగ్గా ఉన్నదని ‘Carbon Brief’ అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది. భారత విద్యుత్‌ రంగంలోనూ ఇలానే జరుగుతోందనేది మనం విస్మరించలేని వాస్తవం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుదుత్పాదన మరింతగా ఉధృతమవుతుందా లేక విద్యుదుత్పత్తికి ప్రధాన వనరుగా శిలాజ ఇంధనాలే ప్రధానంగా పునర్వినియోగమవుతాయా?


సరే, ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల వైపు మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా రంగంలో కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడంలో విద్యుత్‌ వాహనాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. తత్కారణంగా ఈ అధునాతన వాహనాలకు విశేష ప్రోత్సాహం లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా విక్రయమవుతున్న కొత్త కార్లలో 20శాతం విద్యుత్‌ వాహనాలే అని ‘ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ’ (ఐఈఏ) వెల్లడించింది. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి, వినియోగంలో చైనా ప్రపంచ అగ్రగామిగా ఉన్నది. విద్యుత్‌ వాహనాల సరఫరా గొలుసులో చైనాకు తిరుగులేని ప్రాబల్యం ఉన్నది. లిథియం, కోబాల్ట్‌ మొదలైన ముడి పదార్థాల తవ్వకం, ప్రాసెస్‌ చేయడం; బ్యాటరీ సెల్స్‌ను ఉత్పత్తి చేయడం, వాటిని వాహనాలలో అనుసంధానించడం; వాహనాలను అసెంబుల్‌ చేయడం.. మరింత స్పష్టంగా చెప్పాలంటే విద్యుత్‌ వాహనాల తయారీ, పంపిణీ ప్రక్రియలన్నిటా చైనాదే సంపూర్ణ ఆధిపత్యం. సరిగ్గా ఈ కారణాల వల్లే ఇతర వాహనాల తయారీలో అగ్రగాములుగా ఉన్న దేశాలు విద్యుత్‌ వాహనాల ఉత్పత్తిని చేపట్టేందుకు సంశయిస్తున్నాయి. విద్యుత్‌ వాహనాల రంగంలో అగ్రగామిగా వెలుగొందాలన్న తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు తమకు అనుకూల పరిస్థితులు లేవని, చైనాతో పోటీపడలేమన్న వాస్తవాన్ని గుర్తించాయి. ఈ కారణంగానే విద్యుత్‌ వాహనాలకు ప్రకటించిన సబ్సిడీలను ఉపసంహరించుకుంటున్నాయి. సంప్రదాయక ఐసీ ఇంజన్లతో నడిచే వాహహనాల తయారీకి దశల వారీగా ముగింపు పలకడంపై పునరాలోచన చేస్తున్నాయి. విద్యుత్‌ వాహనాల తయారీకి కీలకమైన అరుదైన భూ ఖనిజాల ఎగుమతిపై చైనా ఇటీవల విధించిన ఆంక్షలతో హరిత పరివర్తన (గ్రీన్‌ ట్రాన్సిషన్‌ – కర్బన ఉద్గారాలు అధికంగా ఉండే ఆర్థిక వ్యవస్థ నుంచి అవి తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థకు మారడం)కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వర్తమాన ప్రపంచ ఆర్థిక, వాణిజ్య పరిస్థితులలో విద్యుత్‌ వాహనాల తయారీ వేగవంతమవుతుందా లేక మందగిస్తుందా అనేది మన ముందున్న ఒక ముఖ్యమైన ప్రశ్న.


నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, అస్థిరత నెలకొన్నాయని, వాణిజ్య ఘర్షణలు, రాజకీయ అనిశ్చితి అందుకు ప్రధాన కారణాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) సంస్థ ఇటీవల వెలువరించిన ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌’ నివేదిక పేర్కొంది. 2000 సంవత్సరం తరువాత ప్రప్రథమంగా 2025లో పేద దేశాలు అభివృద్ధి సహాయం కింద విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పొందుతున్న నిధుల కంటే తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే అధిక మొత్తాలను వెచ్చిస్తున్నాయనే చేదు సత్యాన్ని కూడా ఐఎమ్‌ఎఫ్‌ నివేదిక వెల్లడించింది. మరి ఈ గందరగోళ, అవ్యవస్థిత ప్రపంచంలో మన భవిష్యత్తు ఏమిటి? సానుకూల మార్పుల పవనాలు మరింత వేగంగా, శక్తిమంతంగా వీచేందుకు మనం ఏం చేయాలి? అన్నదే మన చివరి ప్రశ్న. బహుశా, ఇది మాత్రమే మనం వేసుకోవాల్సిన ఏకైక ప్రశ్న.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

ఈ వార్తలు కూడా చదవండి..

అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 02:17 AM