Gaza Conflict: సర్వనాశనం రాగంగా శాంతిగీతం
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:37 AM
ఏకపక్ష ప్రేమలూ, ఏకపక్ష యుద్ధాలూ, ఏకపక్ష శాంతి ఒప్పందాల్లేని దేశ చరిత్రలు లేవు! కనీస న్యాయం కావాలని ఘోషించే వారే తరచూ వీటికి బాధితులుగా కనపడతారు. ఇక కనీవినీ ఎరుగని జీవన విధ్వంసానికి సాక్షులుగా నిలిచిన వారికి...
ఏకపక్ష ప్రేమలూ, ఏకపక్ష యుద్ధాలూ, ఏకపక్ష శాంతి ఒప్పందాల్లేని దేశ చరిత్రలు లేవు! కనీస న్యాయం కావాలని ఘోషించే వారే తరచూ వీటికి బాధితులుగా కనపడతారు. ఇక కనీవినీ ఎరుగని జీవన విధ్వంసానికి సాక్షులుగా నిలిచిన వారికి నోరెత్తే పరిస్థితీ ఉండదు. గాజాలో ఇప్పుడదే జరుగుతోంది. తాము ప్రతిపాదించిన బలవంతపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే సర్వనాశనాన్నే చూస్తారనే హెచ్చరికలు అగ్రరాజ్య అధినేత ట్రంప్ నుంచి రావటంతో హమాస్‌కు వేరే దారి కనపడటం లేదు. హమాస్ పూర్తిగా దిగి రావచ్చు. పాదాక్రాంతమూ కావచ్చు. ఇజ్రాయెల్– అమెరికా పెట్టిన అన్ని షరతులకూ అంగీకరించొచ్చు. కానీ హమాసే గాజా కాదు. హమాసే పాలస్తీనా కాదు. ప్రజలను ఒక సంస్థకు గుత్తాధిపత్యంగా భావించలేం. బాధిత ప్రజలకు న్యాయం దక్కటమే లక్ష్యమైతే శాంతి ప్రణాళిక ఆ దిశగా ఉండాలి. కానీ అందులో ఆ ఛాయల్లేవు. బాధితుల గొంతు అందులో లేదు. చిరకాలంగా వారు కోరుకుంటున్న న్యాయమూ లేదు. పాలస్తీనా సమస్య పరిష్కారానికి అందులో నిర్దిష్ట చర్యల్లేవు. రెండు దేశాల ఏర్పాటు వాగ్దానం ఊసేలేదు. ఇజ్రాయెల్ కోరుకున్న రీతిలో శాంతి ప్రణాళిక ఉందనే విమర్శలే ప్రధానంగా వినపడుతున్నాయి. సుంకాల యుద్ధాలతో నలిగిపోతున్న దేశాధినేతలకు.. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోటానికి శాంతి ప్రణాళిక ఒక సందర్భాన్ని సృష్టించింది. అది వేరే కథ!
మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో సైతం పరాజితులు తమ విన్నపాలనూ బలంగానే విన్పించారు. పరాజితులు పరాభవ భారంతో మిగిలిపోకుండా, దాని ఆసరాగా ప్రజలను మళ్లీ యుద్ధోన్ముఖులను చేయకుండా ఉంచటానికి ప్రయత్నాలు జరిగాయి. రెండు ప్రపంచ యుద్ధాల్లో తలపడిన దేశాలన్నీ ఎంతోకొంత సమవుజ్జీలు కావటంతో పరాజితులు పూర్తిగా పాదాక్రాంతులు కాలేదు. లేచి నిలబడే స్వేచ్ఛను దక్కించుకున్నారు. లోగొంతుతో కొన్ని స్పష్టంగానే చెప్పారు. స్వంత మార్గంలో ముందుకు వెళ్లటానికి వెసులుబాట్లూ పొందారు. అందుకే పరాజిత దేశాలైన జర్మనీ, జపాన్‌లు పదేళ్లలోనే మళ్లీ పుంజుకుని ఆర్థికంగా కీలకంగా మారాయి. గాజా పరిస్థితి వేరు. 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఒక చిన్న ప్రాంతంలో జరిగిన బీభత్సమూ, విధ్వంసమూ ఈ శతాబ్దంలో మరెక్కడా చోటుచేసుకోలేదు. ప్రపంచంలోనే అత్యధికంగా శరణార్థులు ఉన్న చిన్న ప్రదేశం గాజా. అత్యధిక జనసాంద్రతలు కలిగిన వాటిల్లో అగ్రభాగాన ఉంది. మరణాలు, ఆస్తులు, సౌకర్యాల విధ్వంసాల గురించి ఇప్పటి వరకూ వస్తున్నవన్నీ తుది లెక్కలు కావు. ప్రాణాలు కోల్పోయిన వారు 67,000 నుంచి 84,000 మంది ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. క్షతగాత్రులెందరో పూర్తిగా తెలియదు. అందులో పనిచేయగలిగిన వారెందరో చెప్పలేం. అనుకున్నట్లుగా శాంతి ప్రణాళిక అమలైతే, ఇజ్రాయెల్ దానికి అడ్డంకులు కల్పించకుండా ఉంటే అసలు లెక్కలు తేలతాయి. అప్పుడే యుద్ధనేరాల, కిరాతకాల సంపూర్ణస్వరూపం బయటపడుతుంది.
1948 నుంచీ ఇప్పటివరకూ అరబ్బు దేశాలతో ఇజ్రాయెల్ పరోక్ష, ప్రత్యక్ష యుద్ధాలు చాలానే చేసింది. వాటిల్లో మరణించిన వారి సంఖ్యతో పోల్చితే గాజా మృతులే ఎక్కువ. 1948 యుద్ధంలో 10 నుంచి 15 వేల వరకూ అరబ్బులు చనిపోయారు. 1967 నాటి ఆరురోజుల యుద్ధంలో 15,000 మంది మరణించారు. 1973 నాటి యుద్ధంలో 8,000 నుంచి 18,500 వరకూ మరణాలు చోటుచేసుకున్నాయి. ఏ కోణం నుంచి చూసినా గాజా యుద్ధమంత దారుణమైంది మరొకటి లేదు. అందుకే ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ ప్రతిష్ఠ ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో గాజా బీభత్సాల దృశ్యాలు చూసిన వారి హృదయాలు విషాదంలో బరువెక్కాయి. యువతలో ఆగ్రహాలు వెల్లువెత్తాయి. విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. నిరసనలకు నిలయాలైన వర్సిటీలకు అందించే ఆర్థిక సహాయానికి కత్తెరవేసే చర్యలు అమెరికాలో మొదలయ్యాయి. వియత్నాం యుద్ధసమయంలో కూడా వర్సిటీల్లో నిరసనలు జరిగాయి. ఇప్పటిలా వాటిపై కత్తికట్టలేదు. భావస్వేచ్ఛకు వీలు ఇవ్వని ఛాందస జాతీయవాదం ఎక్కడైనా చెరుపే చేస్తుందనటానికి ఇంతకంటే నిదర్శనం లేదు.
పాలస్తీనా ప్రజల సమస్య పరిష్కారం అయితేనే గాజా, వెస్ట్‌బ్యాంకులో ప్రశాంతత నెలకొంటుంది. అక్కడి ప్రజలకు ఆమోదంలేని ఏ ప్రణాళికా దీన్ని సాధించలేదు. హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలు కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని అంగీకరిస్తున్నాయి. అరబ్బు దేశాలు కూడా ఇజ్రాయెల్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌ను ఇంకా గుర్తించని దేశాలు కూడా తెరవెనుక మంతనాలు సాగిస్తున్నాయి. ఏ దృష్టితో చూసినా ఇజ్రాయెల్ అస్తిత్వానికి ఇప్పుడు ప్రమాదమే లేదు. సైనికంగా ఇజ్రాయెల్‌తో తలపడే దేశం కూడా మధ్యప్రాచ్యంలో లేదు. దుస్సాహసం చేసినా ఓటమినే చూడాల్సి వస్తుంది. అంతటి శక్తిని ఇజ్రాయెల్ సంపాదించుకుంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ గతంలో కంటే భిన్నంగా ముందుకొచ్చి పాలస్తీనా సమస్యను పరిష్కరించటానికి చర్యలు తీసుకోవాలి. కానీ ఒకనాటి పాలస్తీనా ప్రాంతమంతా గ్రేటర్ ఇజ్రాయెల్‌కే చెందాలనీ దైవనిర్దేశం ప్రకారం అది జరిగితీరుతుందనే మత విశ్వాసాలు గల పార్టీలపై ఆధారపడి అధికారాన్ని నెట్టుకొస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అందుకు సిద్ధంగా లేరు. ఆయన నాయకత్వం వహిస్తున్న లికుడ్ పార్టీకీ కూడా పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావటం ఇష్టంలేదు. పరిమిత అధికారాలతో కూడిన స్వయంపాలనను పాలస్తీనాకు ఇవ్వటానికి కూడా లికుడ్ పార్టీలో అతివాదులు అంగీకరించరు. వాదనలో సహేతుకత లేనప్పుడూ, ఏ విధంగానైనా ఐక్యరాజ్యసమితి తీర్మానాలను కాలరాయాలని అనుకున్నప్పుడూ అతివాదులకు మతమే ఆలంబనగా ఉంటుంది. బైబిల్‌లో ఇజ్రాయెల్ ప్రజలు, వారు నివసించే ప్రాంతాల ప్రస్తావన ఉంది కాబట్టి.. పాలస్తీనా వాసులందరూ వేరేచోట్లకు తరలివెళ్లాలనే వితండవాదననే అతివాదులు చేస్తారు.
ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం 56 శాతం భూభాగం ఇజ్రాయెల్‌కూ 43 శాతం పాలస్తీనాకూ చెందాలి. ఒకశాతం జెరూసలెం ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణ కింద ఉంచాలి. రెండు దేశాల రాజధానులూ జెరూసలెంలోనే ఉండాలని ఐరాస తీర్మానంలో స్పష్టంగా ఉంది. ఐరాస ప్రణాళికను యూదులు ఆమోదించారు. అరబ్బు దేశాలు దాన్ని వ్యతిరేకించి యుద్ధానికి దిగాయి. బహుశా ఇది చారిత్రక తప్పిదమే కావచ్చు! యుద్ధంలో గెలిచిన ఇజ్రాయెల్ ఎక్కువ భూభాగాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. 56 శాతం భూమి 78 శాతమైంది. 1967 నాటి యుద్ధంతో మిగతా 22 శాతాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుంది. గాజా, వెస్ట్‌బ్యాంకు ప్రాంతాలు అలా వచ్చినవే. ఈ రెండు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలనీ ఐరాస తీర్మానాలు చేసినా అమెరికా, బ్రిటన్ మద్దతుతో ఇజ్రాయెల్ వాటిని ఖాతరుచేయలేదు. గాజా, వెస్ట్‌బ్యాంక్ నుంచి వైదొలగటానికి ఇజ్రాయెల్ అంగీకరించి ఆ రెండూ ప్రాంతాలూ కలిసి స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి దోహదం చేస్తే శాంతి ప్రణాళికకు అర్థం ఉంటుంది. ట్రంప్‌కు కానీ, నెతన్యాహుకు కానీ ఆ దిశగా అడుగులు వేయాలని ఏ మాత్రమూ లేదు. అందుకే 20 సూత్రాల శాంతి ప్రణాళికలో రెండు దేశాల ఏర్పాటు ప్రస్తావనకు ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు. ఎన్నో చర్చల అనంతరం కుదిరిన ఓస్లో ఒప్పందాలు (1993, 1995) విఫలమైన నేపథ్యంలో పాలస్తీనా నాయకుల ప్రమేయమే లేని 20 సూత్రాల ప్రణాళిక అనుకున్నట్లుగా అమలైతే అది పెద్ద విశేషమే అవుతుంది! హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలు బలపడటానికి ఓస్లో ఒప్పందాల వైఫల్యాలే ప్రధాన కారణాలు. చరిత్ర పునరావృతమైతే హమాస్ లాంటి సంస్థలే పుట్టుకొస్తాయి. వాటివల్ల ఇజ్రాయెల్ ప్రజలకూ, పాలస్తీనా ప్రజలకూ ఎటువంటి మేలూ జరగదు.
తన చుట్టూ పాలస్తీనా ఒక ముస్లిం దేశంగా ఉండటం ఇజ్రాయెల్‌కు ఇష్టంలేదు. భద్రతా కారణాల దృష్ట్యా అది సబబే అనుకుందాం! మరి చుట్టూ ఉన్న ముస్లిం దేశాల సంగతి ఏమిటి? వాటి నుంచి ప్రమాదాలు రావా? అన్న ప్రశ్నకు ఇజ్రాయెల్ వైపు సహేతుక సమాధానం కనపడదు. పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడితే దానికంటూ చరిత్రను నెమరువేసుకునే క్రమం మొదలవుతుంది. విద్యా బోధనలో భాగంగా పాలస్తీనా ఛిన్నాభిన్నమైన తీరును వివరిస్తారు. ప్రజల జ్ఞాపకాల్లో నిక్షిప్తమైన బాధలు కళారూపాల ద్వారా వెలుగులోకి వస్తాయి. చరిత్రలో ఎవరు ఎక్కడ నుంచి వచ్చారో, ఎవరు ఎవరిని లొంగదీసుకున్నారో, పరసీమలకు ప్రజలు ఎలా చెల్లాచెదురయ్యారో తెలిపే సంఘటనలన్నీ ప్రజల ముందుంచటం అనివార్యమవుతుంది. అవన్నీ కలిసి ప్రజల్లో ఒక యుక్తాయుక్త వివేచనను మేల్కొలుపుతాయి. అది ఇజ్రాయెల్‌కు అసలు సరిపడదు. కానీ చరిత్రలోని చేదునిజాలను ఎల్లకాలమూ దాయలేం!
గాజాతో పాటు వెస్ట్‌బ్యాంకుని కూడా పూర్తిగా విలీనం చేసుకుని అక్కడి ప్రజలకు పూర్తిపౌరసత్వం కల్పించటానికి ఇజ్రాయెల్ ముందుకొస్తే అదొక కొత్త చరిత్ర అవుతుంది. దీంతోపాటు దేశదేశాల్లో తలదాచుకున్న పాలస్తీనా శరణార్థులందరికీ స్వదేశంలోకి ప్రవేశం కల్పించటానికి సిద్ధపడితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇవి జరగాలంటే ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యపరంగా ఎంతో ఎదగాలి. యూదుల కోసమే ప్రత్యేక రాజ్యమన్న భావనను వీడాలి. ఒకనాటి పాలస్తీనా భూభాగంలో ఉండే ప్రజలందరికీ సమానహక్కులు కల్పించే విధంగా ఇజ్రాయెల్ రాజకీయవ్యవస్థ పరిణతి చెందాలి. ఒకప్పుడు రెండు దేశాల ఏర్పాటును సమర్థించిన మేధావులెందరో ఇప్పుడది సాధ్యంకాదనే భావనకు వస్తున్నారు. వెస్ట్‌బ్యాంకులో ఇప్పటికే 5 లక్షలకు పైగా యూదులు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు ప్రాణాధారమైన నీరు అక్కడ నుంచే వస్తుంది. అక్కడి యూదు కాలనీలన్నిటినీ ఖాళీచేసి పాలస్తీనాకు అప్పగించటానికి ఇజ్రాయెల్ సిద్ధంగానూ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గాజా, వెస్ట్‌బ్యాంక్ కలిసి ప్రత్యేక దేశంగా ఏర్పాటుచేసినా ఆర్థికంగా మనగలిగే పరిస్థితులు ఉండవనే వాదన కూడా బలంగానే ఉంది. కొందరు ప్రతిపాదిస్తున్నట్లుగా పాలస్తీనా ప్రజలతో కూడిన అఖండ ఇజ్రాయెల్ ఏర్పడితే బలాబలాలు తలకిందులు అవుతాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ జనాభాలో 21శాతం మంది పాలస్తీనా అరబ్బులు ఉన్నారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లు ఇజ్రాయెల్‌లో విలీనమైతే మొత్తం అరబ్బుల జనాభా 7.6 మిలియన్లు అవుతుంది. అప్పుడు యూదులు (7.2 మిలియన్లు) మైనారిటీలు అవుతారు. ఇక పాలస్తీనా శరణార్థులు 4.4 మిలియన్లు ఉన్నారు. వీరు కూడా అఖండ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తే అరబ్బుల జనాభా 12.2 మిలియన్లకు చేరుతుంది. సొంత మతానికి చెందిన ప్రజల కోసం ప్రత్యేక రాజ్యం కావాలని తహతహలాడిన యూదు జాతీయవాదులకు అటువంటి ఊహే భయానకంగా ఉంటుంది. కానీ కొన్ని భయంకర వాస్తవాలను తప్పించుకోలేని పరిస్థితులూ వస్తాయి. మనం ఆశించని రీతిలో చరిత్ర టక్కరి మలుపులు తిరుగుతుంది! గురజాడ ఎప్పుడో అన్నట్లుగా మతములన్నీ మాసిపోయి జ్ఞానమొక్కటే నిలిచివెలిగితే మెజారిటీ, మైనారిటీ భావనలు అంతరించక తప్పదు. సమష్టిజీవనానికి సమభావనను సమకూర్చుకోకా తప్పదు!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News