Share News

Interview with Solomon Vijay Kumar: గొగోల్‌ని కలిస్తే కథ చెప్పించుకుంటాను

ABN , Publish Date - Sep 29 , 2025 | 05:32 AM

అమెరికన్ రచయిత జేమ్స్ ఫ్రే రాసిన ‘ది ఫైనల్ టెస్టమెంట్ ఆఫ్ ది హోలీ బైబిల్’ అనే నవల ఇటీవల చదివాను. జీసస్ మెస్సయ్యగా వచ్చి పాపులందరికీ తీర్పు చెబుతాడని క్రైస్తవుల నమ్మకం. అయితే ఈ నవలలో...

Interview with Solomon Vijay Kumar: గొగోల్‌ని కలిస్తే కథ చెప్పించుకుంటాను

రీసెంట్‌గా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు?

అమెరికన్ రచయిత జేమ్స్ ఫ్రే రాసిన ‘ది ఫైనల్ టెస్టమెంట్ ఆఫ్ ది హోలీ బైబిల్’ అనే నవల ఇటీవల చదివాను. జీసస్ మెస్సయ్యగా వచ్చి పాపులందరికీ తీర్పు చెబుతాడని క్రైస్తవుల నమ్మకం. అయితే ఈ నవలలో జీసస్ మత సంబంధమైన మెస్సయ్యగా కాకుండా నేటి ఆధునిక ప్రపంచం హీనంగా చూసే కొన్ని జన సమూహాలను, నానా రకాల వ్యసనపరులను అర్థం చేసుకొని ఆదరించే మెస్సయ్యగా వస్తాడు. ‘ప్రేమ, హాస్య చతురత, సంభోగం, బతుకుని మెరుగు పరుస్తాయి’ అంటాడు ఓ చోట రచయిత. వీటన్నిటి వలన ఈ నవల చర్చ్ ఆగ్రహానికి, విమర్శలకు గురయ్యింది. ఐతే మతపు మూసల్ని దాటి జీసస్ ప్రేమ స్వరూపాన్ని, God is love అనే బైబిల్ సందేశాన్ని ఆవిష్కరించే విషయంలో రచయిత కళాత్మక అభివ్యక్తి గొప్పగా ఉంది. అందుకే ఈ నవల బాగా నచ్చింది.

మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?

ఆర్మీనియన్ కథల తెలుగు అనువాదం ‘కొండగాలి కొత్తజీవితం’ ఇంటర్మీడియట్ రోజుల్లో చదివాను. అందులో పిండిమర పనివాడు గెగామ్, మూగ చెవిటి అమ్మాయి తుతీ మధ్య ప్రేమ గురించి రాసిన ‘చరమ దశ’ అనే కథ నా ఆల్ టైం ఫేవరేట్. ‘కడవ భుజానపెట్టి నీటికెళ్లెను పడతి’, ‘గరుడ పర్వతంపైన’, ‘ఆకుపచ్చని లోయ’, ‘గుడ్ మార్నింగ్ జాక్’, ‘ఒంటెలు వెళ్లిపోతాయి పర్వతాలు ఉండిపోతాయి’... ఇట్లా ఆ సంకలనం లోని కథలన్నీ గొప్పవి. చిన్న పుస్తకమే అయినా ఆర్మీనియా ఆత్మనంతటినీ పొందు పరచిన విశిష్టమైన సంకలనం అది.

మీ నమ్మకాలనూ, దృక్పథాన్నీ ప్రభావితం చేసిన రచయిత?

అలా ఎవరూ లేరు కానీ సత్యం పక్షాన నిలబడిన మంటో, తమవైన మూలాలను తవ్వితీసిన అలెక్స్ హేలీ, చినువా అచెబె, నాలుగే నాలుగు లైన్లలో కథ రాసి ముగించిన హంగేరియన్ రచయిత ఓర్కనీ, తెలుగులో తమ తమ మాండలికాలకు పట్టం కట్టి రాసిన గోరటి వెంకన్న, శిష్ట్లా ఉమామహేశ్వరరావు, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు వీళ్లంటే నాకు గౌరవం. వీళ్ల రచనలు నా దృష్టికి విలువైనవి.


సాహిత్యంలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది, ఎందుకు?

జమీల్యా! ఎందుకంటే కుసుమ కోమల కావ్య నాయికల్లాగా తీర్చి దిద్దిన శృంగార దేవత కాదు జమీల్యా. పెళ్లైన వెంటనే యుద్ధంలో మాయమైన భర్త, ఊరిలో పోకిరీల వెకిలి చేష్టలు, ఇంట్లో కఠినమైన సాంప్రదాయాలు, ఎవరితో ఏమీ చెప్పుకోలేని ఒంటరితనం, వీటితోపాటు పగలు రాత్రి తేడా లేకుండా ఎండా వానల్లో వ్యవసాయ క్షేత్రపు గొడ్డుచాకిరీకి అంకితమైన బతుకు. అయితే వీటన్నిటి మధ్యనా పాటలు పరవశాలు కలలు తాదాత్మ్యాలతో కూడిన మనోహరమైన ఆత్మలోకం జమీల్యాది. దనియార్ కూడా తనవంటి మనస్తత్వం కలవాడేనని గ్రహించాక వాడు బికారి, అవిటివాడు అనేది లెక్కచేయకుండా అతడితో వెళ్లిపోయింది. నవల ఆఖరి పేజీ చివరి అక్షరం వరకూ ఆ ఇద్దరి మధ్యనా కించిత్తు ప్రేమ కలాపం కనపడదు. చదువుతున్న మనల్ని మాత్రం ప్రతి పుటలోనూ ప్రేమ జల్లులు తడుపుతుంటాయి. చిత్రకారుడు కాబోతున్న కుర్రాడి దృక్కోణం నుంచి నవల నడుస్తుంది కనుక రచయిత చింగిజ్ ఐత్మాతోవ్ జమీల్యాని పాఠకుడి గుండెలమీద శాశ్వతమైన రంగులతో చిత్రించాడు.

ఏ గత కాలం రచయితనైనా కలిసి మాట్లాడగలిగితే ఏం మాట్లాడతారు?

ఈ ప్రశ్నకు నాకు కలిగే వింతైన ఆలోచనల్లోంచి జవాబు చెబుతాను. మార్క్వెజ్‌ ‘వందేళ్ల ఏకాంతం’ నవలలో ‘అందాల రెమెడియాస్’తో కలిసి ఆకాశానికి ఎగిరిపోయినట్టు, ఆర్కాదియో శవ యాత్రలో ఆకాశం కురిపించిన పసుపు పూల వానలో తడిసినట్టు అనిపిస్తుంది. చనిపోయిన గొగోల్‌ని కలిసి ఎందుకయ్యా పిచ్చి ముదిరి ‘మృత జీవులు’ రెండో భాగం ప్రతుల్ని కాల్చేసి మాకు కాకుండా చేశావు, కనీసం వినిపించవా అని అడగాలనుంది. కాఫ్కా గురించి జమ్జా (మెటామార్ఫసిస్ కథలో పురుగుగా మారే వ్యక్తి) నోట వినాలనుంది. మహాశ్వేతాదేవి ‘బషాయి టుడు’ కోసం అడవుల్లో వెతుకుతున్నట్టు, ‘అంటరాని వసంతం’ పాత్రలన్నీ కళ్లముందు మెదిలినట్టు, ‘మోటర్ సైకిల్ డైరీస్’ లో లాటిన్ అమెరికా దేశాలన్నీ తిరుగుతున్నట్టు ఉంటుంది. ఈ అమేజింగ్ అనుభూతులన్నీ ఆయా రచయితలతోనూ వారు సృష్టించిన పాత్రలతోనూ జరుపుతున్న మానసికమైన సంభాషణలే కదా!


రచన విషయంలో మీకు దొరికిన మంచి సలహా?

సాహిత్యం అంటూ నీ జీవితానికి మించినది బైట ఎక్కడో ప్రత్యేకంగా లేదు. నీ అనుభవాలను, నీ తప్పొప్పులను, నువ్వు ప్రేమించేవాళ్ల జీవితాలను నిజాయితీగా నిర్భయంగా రాయగలిగితే అదే గొప్ప సాహిత్యం అవుతుంది అన్నారు ఓసారి కె. శ్రీకాంత్. లోతుగా నాటుకున్న ఆ మాటలే నేనేది రాస్తున్నా గీటురాళ్లుగా పని చేస్తుంటాయి.

సొలోమోన్ విజయ్ కుమార్

83413 36828

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 05:32 AM