Farmers First or Trump First: రైతు క్షేమమా ట్రంప్ స్నేహమా ఏది ముఖ్యం
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:17 AM
అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు, వాటికి సంబంధించిన సంస్థలు అన్నీ సంపన్న దేశాల ప్రయోజనాల కోసమే ఉన్నాయన్నది కాదనలేని నిజం. కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు పేద, వర్ధమాన దేశాల మీద...
అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు, వాటికి సంబంధించిన సంస్థలు అన్నీ సంపన్న దేశాల ప్రయోజనాల కోసమే ఉన్నాయన్నది కాదనలేని నిజం. కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు పేద, వర్ధమాన దేశాల మీద అభివృద్ధి చెందిన దేశాల పెత్తనాన్ని బలోపేతం చేయడానికే అవి అవతరించాయి. అప్పటికీ సంతృప్తి చెందని అమెరికా ఈ ఒప్పందాలు నిర్దేశించిన నియమాలను కూడా కాలరాస్తున్నది.
అమెరికా తన రైతులకు భారీ సబ్సిడీలు ఇస్తూ, వారు పండించిన పంటలను తక్కువ ధరలకు ఎగుమతి చేసుకొని లాభపడేలా చూస్తున్నది. ఇది వర్ధమాన దేశాల్లో వ్యవసాయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. ఇంకా జన్యుమార్పిడి పంటల భారీ ఎగుమతి, వాణిజ్య పంటల సాగును మితి మించి ప్రోత్సహించడం వంటి చర్యలతో అమెరికా వంటి సంపన్న దేశాలు పేద దేశాల సాగు వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆహారభద్రతకు హాని తెస్తున్నాయి.
అంతర్జాతీయ ఒప్పందాలు ఎంతగా సంపన్న దేశాలకు, బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు దాస్యం చేస్తున్నప్పటికీ వర్ధమాన దేశాల మేలు కోరి ఒకటీ అరా నియమాలను చేర్చకపోలేదు. 1995లో ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) సభ్యదేశాలు పరిమిత సుంకాలకు కట్టుబడాలనే నియమాన్ని విధించింది. ఈ సుంకాలను దాటాలంటే చర్చలు తప్పనిసరి అనే నిబంధననూ చేర్చింది. ఈ ‘tariff bindings’ ప్రకారం అమెరికా అన్ని రకాల విదేశీ సామగ్రి పైన సగటున 3.4 శాతానికి మించి సుంకాలను విధించకూడదు. అయితే చివరకు ఈ నిబంధనలన్నీ ఏనుగును పురికొస తాళ్ళతో బంధించినట్లే అయ్యింది. అమెరికా విశృంఖలత్వాన్ని ఆపే శక్తి వీటికి కొరవడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ఇండియా తదితర వర్ధమాన, పేద దేశాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వాటినే ప్రత్యేక వెసులుబాట్లు (special differential treatment – STD)గా పరిగణిస్తారు. విదేశీ వస్తువుల మీద తాము విధించే అధిక సుంకాలను క్రమక్రమంగా తగ్గించే అవకాశాన్ని ఈ నిబంధన అభివృద్ధి చెందుతున్న దేశాలకు కల్పించింది. దేశీయ కీలక రంగాలను సంపన్న దేశాల సరకుల దాడి నుంచి కాపాడుకోవడంలో ఇండియాకు ఈ ఎస్‌టీడీ ఉపయోగపడుతున్నది. ఆర్థిక బలహీన దేశాలు తమ వ్యవసాయాది రంగాలను కాపాడుకోడానికి సంపన్న దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేయడానికి ఈ వెసులుబాటు అవకాశమిస్తున్నది. ఇండియా భారీ సుంకాలు విధిస్తున్నదని ట్రంప్ గగ్గోలు పెట్టడానికి ఇదే కారణం. ఇవి నియమబద్ధ సుంకాలు. ఇండియాతో వాణిజ్య లోటు తగ్గించుకోడానికి స్టీల్ దిగుమతుల మీద 25శాతం, అల్యూమినియం మీద 10 శాతం సుంకాలను అమెరికా విధించి ఉంది. అమెరికా వాణిజ్య చట్టం 232 సెక్షన్ కింద జాతీయ భద్రతావసరాల కోసం వీటిని విధించినట్టు చెప్పుకున్నది. వాణిజ్య ఒప్పందాలను జాతీయ భద్రత పేరుతో ఉల్లంఘించడం అక్రమమని ప్రపంచ వాణిజ్య సంస్థ తీర్పు ఇచ్చింది. అయినా అమెరికా దూకుడు ఆగలేదు.
వాణిజ్య రంగంలో ఇండియాను బూటు కాళ్ళతో తొక్కిపట్టి తన షరతులకు అంగీకరింపజేయాలని ట్రంప్ తెగబడుతున్నాడు. ప్రధాని మోదీ తన సన్నిహిత మిత్రుడు అంటూనే భారతీయ సరకులపై 25శాతం సుంకంతోబాటు రష్యా నుంచి క్రూడాయిల్‌ను కొంటున్నందుకు అదనంగా మరి 25శాతం, మొత్తంగా 50 శాతం సుంకాలను విధించాడు. ట్రంప్ విధించిన ఈ 50శాతం సుంకాలు అమెరికాకు భారతీయ ఎగుమతులను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఆగస్టు 6 వరకు 10 శాతం సుంకాలనే భరించిన ఇండియా ఆ నెల 27 వరకు 25 శాతం, ఆ తర్వాత నుంచి 50 శాతం సుంకాలను చెల్లిస్తున్నది. ఈ విధంగా అధిక సుంకాల భారం ఆగస్టులో పరిమితమే అయినప్పటికీ ఆ కొద్ది రోజుల్లోనే ఇండియా నుంచి అమెరికాకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 58శాతం తగ్గిపోయాయి, మందుల ఎగుమతులు 13.3శాతం పతనమయ్యాయి. అల్యూమినియం 19శాతం; ఇనుము, స్టీలు 13.1 శాతం; రాగి 10.2 శాతం పడిపోయాయి. రొయ్యల వంటి సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతులు 43.8శాతం దెబ్బతిన్నాయి. ఈ అన్ని రంగాల్లోను దేశంలో ఉద్యోగాలు గణనీయంగా మాయమయ్యాయి. నిరుద్యోగం ప్రబలుతున్నది.
వాస్తవానికి ఇండియాపై ట్రంప్ కోపానికి కారణం మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ఒక్కటే కాదని, అమెరికా నుంచి జన్యు మార్పిడి మొక్కలను (మొక్కజొన్న) కొనుగోలు చేయకపోడమేనని స్పష్టపడిపోయింది. ‘140 కోట్ల జనాభా గల ఇండియా అమెరికా నుంచి ఒక బషేల్ (27.2 కిలోలు) మొక్కజొన్న కొనలేదా?’ అని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూత్నిక్ హుంకరించాడు. ‘ఇండియా మెడలు వంచి అమెరికా మొక్కజొన్నను కొనిపిస్తాం చూడండి’ అని గాండ్రించాడు. ప్రపంచంలోని అత్యధిక మొక్కజొన్న ఉత్పత్తిదార్లలో ఇండియా ఐదవ స్థానంలో ఉంది. దాని పంటే దానికి ఎక్కువైపోతున్నప్పుడు దానిని దిగుమతి చేసుకోవలసిన అవసరం ఇండియాకు లేదు. ఇండియాలో 50 కోట్లమంది వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటప్పుడు అధిక సబ్సిడీల చౌక వ్యవసాయోత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకొని దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసుకోడం అంటే తానెక్కిన కొమ్మను నరుక్కోడమే అవుతుంది.
ట్రంప్ ప్రకటించిన ఏకపక్ష టారిఫ్ యుద్ధం అమెరికాకు మేలు చేయకపోగా తీవ్ర సంక్షోభాన్ని దాని మెడకు చుడుతున్నది. ధరలు పెరిగిపోయి అమెరికా పౌరుల జేబులు గుల్ల అయ్యే పరిస్థితి తలెత్తింది. చైనా మీద సుంకాలు పెంచడంతో అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం అది మానుకున్నది. ప్రపంచంలో పండే సోయాబీన్ పంటలో 60శాతాన్ని చైనా దిగుమతి చేసుకుంటున్నది. ఇందులో సగం అమెరికా నుంచే కొనేది. ఇప్పుడు అది అమెరికా నుంచి కొనడం మానేసింది. ఆ మేరకు సొయాబీన్‌ను బ్రెజిల్ నుంచి కొంటున్నది. దీనితో అమెరికా రైతు నష్టాల్లో కూరుకుపోయాడు. ముఖ్యంగా ట్రంప్ మద్దతుదార్లు, మితవాద రైతులు అత్యధికంగా ఉన్న మధ్య అమెరికా రాష్ట్రాల (లోవా, నెబ్రెస్కా, కన్సాస్ తదితర రాష్ట్రాలు) సోయాబీన్, మొక్క జొన్న పంటలకు ఎగుమతి ద్వారాలు మూసుకుపోయాయి. దీనితో ఇండియాను భయపెట్టి తన జన్యు మార్పిడి మొక్కజొన్నను కొనుగోలు చేసేలా ఒప్పించాలని అమెరికా అన్ని ఉపాయాలను ప్రయోగిస్తున్నది. అమెరికా రైతు వర్గం చాలా బలమైనది. ఒక్కొక్క రైతుకీ కనీసపక్షం 500 నుంచి 10,000 ఎకరాల భూమి ఉంటుంది. వీరి లాభాల కోసం ఒకటి, అర ఎకరాల కమతాలు మాత్రమే ఉండే భారతీయ బక్క రైతు రక్తాన్ని మరింతగా పీల్చుకోవాలని అమెరికా చూస్తున్నది.
అమెరికన్ల అసంతృప్తి పెరిగి ఉప్పొంగితే తప్ప ట్రంప్ తలకు ఎక్కిన ఉన్మాదం తగ్గుముఖం పట్టదు. ట్రంప్‌తో దోస్తీనా, దేశీయ రైతు క్షేమమా... ఈ రెండిటిలో ఏది ముఖ్యమో తేల్చుకోలేక ప్రధాని మోదీ గుంజాటన పడుతున్నారు. ఇప్పటికే అమెరికా పత్తి దిగుమతులపై సుంకాలను మనం తాత్కాలికంగా తొలగించి దానిని పొడిగిస్తూ ఉన్నాం. చైనా మాదిరిగా అమెరికా సరకులపై ప్రతిసుంకాలను విధించి సవాలు చేయడానికి ఇంకా భయపడుతున్నాం. ఇది మోదీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నది. అమెరికా కపట మైత్రి, దాని భారీ సుంకాల వాస్తవికత ఎంతగా గాయపరుస్తున్నా, వాణిజ్య చర్చల్లో ఏదో ఒక సానుకూలత లభిస్తే మళ్ళీ దాని పంచన చేరవచ్చని బహుశా మోదీ ఎదురు చూస్తుండవచ్చు.
రక్తం చవి చూడనిదే పులి వదిలిపెట్టదనే సంగతి అందరికీ తెలిసిందే. భారత సువిశాల మార్కెట్‌పై అమెరికా కన్నేసింది. మన రైతుల ప్రయోజనాలపై పడగ నీడ పరిచింది. చవకగా లభిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయడం ఇండియా చేస్తున్న నేరంగా అమెరికా చూపిస్తున్నది. ఈ అమెరికా వైఖరి వల్ల రష్యా, చైనాలకు ఇండియా చేరువ కాక తప్పటం లేదు. మున్ముందు సైతం ఈ సాన్నిహిత్యాన్ని బలోపేతం చేసుకుని చైనాతో సరిహద్దు వివాదాన్ని కూడా ఉభయహితంగా పరిష్కరించుకోగలిగితే ఇండియాకు గణనీయమైన మేలు జరుగుతుంది.
గార శ్రీరామమూర్తి
సీనియర్ పాత్రికేయులు
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News